వ్యాపార ఉద్యోగ సేవా రంగాల్లోని మధ్యతరగతి విద్యావంతులే పేదలను వివక్షతకు గురి చేస్తున్నారు.
పెట్టుబడి దారి భూస్వామ్య సంపన్న వర్గాలకు పేదవాళ్లంటే అసలే ఇష్టముండదు.* ఇక పాలకులు కేవలం అధికార లబ్ధి కోసమే పేదలను వాడుకుంటారు.* మరి అట్టడుగు వర్గాలకు ఎవరు మిత్రులు ?
----వడ్డేపల్లి మల్లేశం.
ఏ వర్గానికి నచ్చని వాళ్లంటే ఈ దేశంలో పేద వర్గాలే అని బల్ల గుద్దినట్లు చెప్పక తప్పదు. నిజమైన సేవా రంగంతో పాటు ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్నటువంటి సామాన్య పేద అట్టడుగు ఆదివాసి భిన్న వర్గాలు చదువుకు దూరమైనా, సంస్కృతికి చేరువ కాలేకపోయినా, మానవతా విలువల నేపథ్యంలో తోటి మనిషిని సాటి మనిషిగా చూసే సహనం సంస్కారం ఉన్న కారణంగా తాను కాలుతూ కూడా కాలుతున్న ఇతరులను కాపాడే పెద్ద మనసున్న వాళ్లు పేద వర్గాలు అని చెప్పక తప్పదు. అయితే నేమి ఉత్పత్తిలో భాగస్వాములు కావడమే కాదు మొత్తం వ్యవస్థకే మూల స్తంభాలైనటువంటి పేద వర్గాలు కార్మిక కర్షక వీధి వ్యాపారులు చిరు వ్యాపారులు సంచార జీవులు వలస కార్మికులు మెజారిటీగా ఉన్న ఈ వర్గాలను మాత్రం ఎవరూ ఆదరించకపోవడం విడ్డూరం.
సంపన్న వర్గాలు, భూస్వాములు, పెట్టుబడిదారులు, ఆధిపత్య కులాలు ఎలాగూ అట్టడుగు స్థాయిలో జీవించే వాళ్ళంటే అసహ్యించుకుంటారు. కనీసం వారితో పలకరించడానికి చూడడానికి కలిసి మాట్లాడడానికి కూడా మనసొ ప్పదు అది వాళ్ళ యొక్క కుసంస్కారం కాదా! సంపద సృష్టిస్తూ, ఈ వ్యవస్థకు తిండి పెట్టడానికి ,సేవ చేయడానికి తమ జీవితాలను ధారబోస్తున్నటువంటి పేద వర్గాల యొక్క సహనం సంస్కారంగా చెప్పక తప్పదు. ఆ వర్గాలతో సేవ చేయించుకుంటారు, బస్తాలు మోయించు కుంటారు, చాకిరీ, ఇల్లు శుద్ధి చేయించుకుంటారు కానీ ఇంట్లో నిలబడితే మాత్రం అంగీకరించరు. మైలబడిపోయిందని మాసిపోయిందని అవమానమని, తమ గౌరవం కోల్పోయినమని బాధపడే ఈ వర్గాలు ఆ పేద వర్గాలను గౌరవించే కాలం వస్తుందంటారా?
ఇక చదువుకున్న కుటుంబాలు మధ్యతరగతి జీవితాలు గడుపుతూ ఉద్యోగ వ్యాపార వాణిజ్య ఉపాధి రంగాలలో పనిచేస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో భిన్న వృత్తులలో పనిచేస్తున్న వాళ్లు కూడా దినసరి కూలీలు అనే కార్మికులు వృత్తి పనివాళ్ళు పేద వర్గాలు తలకు మాసిన వాళ్ళు చింపిరి వేషాలతో మాసిన బట్టలతో శ్రమను నమ్ముకునీ బతుకే వాళ్లను పలకరించడానికి సిద్ధపడతారా? కనీసం వారి బాగోగులను గురించి అయ్యో అని సానుభూతి వ్యక్తం చేసిన రోజు కూడా లేకపోవడం విచారకరం, కానీ ఇప్పటికీ విద్యావంతులు చదువుకున్నవాళ్లు ఉపాధ్యాయులు ఉద్యోగులు మధ్యతరగతి వ్యాపారులు కూలీలు కార్మికులు సంచార జీవులు అట్టడుగు వర్గాలలో పేదవాళ్లు ఉన్నారా? ఈ దేశంలో ఇంకా పేదరికం ఉందా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారంటే వీరి ఆలోచన పరిధి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. తన కడుపు నిండితే ప్రపంచం ఆకలి తీరినట్లు తనకు బంగ్లాలు పిల్లలు ఆస్తిపాస్తులు ఇంట్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడితే లోకమందరికి ఉపాధి దొరికినట్లు భావించే కొద్ది కుటుంబాల దృశ్చర్య దురాలోచన కారణంగా పేదరికం పెరుగుతూ ఉంటే పేదవాళ్ల పట్ల వివక్షత రోజురోజుకు మరింత పెరగడం ఆందోళన కలిగిo చే విషయము . "అన్నార్తులు అనాధలు ఉండని ఆ నవయుగ మదె 0త దూరమో" అని దాశరథి ఆవేదనను కవులు కళాకారులు రచయితలు మేధావులుగా మరొకవైపు బుద్ధి జీవులు విద్యావంతులుగా పేద వర్గాల గురించి పట్టించుకోవాల్సిన స్థాయి తగ్గుతున్నది. ఎవరికి గిట్టని ఎవరికీ నచ్చని ఏ వర్గానికి చెందిన వాళ్లుగా కాకుండా అనాధలుగా అభాగ్యులుగా పేద వర్గాలు మిగిలిపోవడం విచారకరం కాదా ?రైతన్న పనిచేయకపోయినా, కార్మికుడు కార్ఖానాల్లో ఉత్పత్తిలో భాగస్వామి కాకపోయినా, వలస జీవులు చిరు వ్యాపారులు పేద వర్గాలు శ్రమను చేసి ఉత్పత్తులు పెంచే కోట్లాది ప్రజానీకం ఒక్కరోజు తమ పని మానుకుంటే అప్పుడు తెలుస్తుంది ఈ ఉన్నత వర్గాలు ఉద్యోగులు వ్యాపారులు మధ్యతరగతి భూస్వాములు పాలకవర్గాల యొక్క పసలేనితనం ఆధారపడిన తత్వం.
పాలకవర్గాల ఆలోచన మరీ దారుణం :-
సుమారు 80% గా ఉన్నటువంటి సామాన్య ప్రజల కోసం ఈ దేశ బడ్జెట్లో కానీ ప్రణాళికల్లో కానీ కేటాయించబడుతున్నటువంటి నిధులు అత్యంత ఆల్ఫా స్థాయిలో ఉంటే వారి గురించిన ఆలోచన కనీసం మనుషులుగా పరిగణించే స్పృహ పాలకవర్గాలు చే యకపోవడం సిగ్గుచేటు . ఎన్నికల సందర్భంలో మాత్రం పేద వర్గాల కడప దాటి ఇస్త్రీ చేయడం, చాయ్ పో యడం, కూరగాయల అమ్మడం, మిషన్ కుట్టడం, బట్టలు నేయడం వంటి వృత్తి పనులను ప్రచారం కోసం ఆర్భాటాల కోసం ప్రదర్శించి తమ కుటిల ప్రేమను పేదల పట్ల చాటుకుని తాత్కాలిక ప్రయోజనం కోసం ప్రలోభాలు వాగ్దానాలతో కడుపు నింపుతారు. " ఓటరు నిజమైనటువంటి పాలకుడు ప్రభువు" ఈ వాస్తవాన్ని నమ్మని రాజకీయ నాయకులు ఆచరించనటువంటి భూస్వామ్య పెట్టుబడిదారీ అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ యాచకులుగానే ఉంచే ప్రయత్నం చేస్తున్న కారణంగా శ్రమకు మినహాయించి పోరాటానికి అవకాశం లేకపోవడం ప్రశ్నించడానికి సిద్ధపడితే అనేక రూపాలలో అణచివేసి నిర్బంధాలకు గురి చేయడం వలన ఐక్యత సాధ్యం కాక ఆర్థిక పరిస్థితులు అండదండలు సహకరించక ఉద్యమాలకు దూరమై ఇక మా జీవితం ఇంతే అనే ఆందోళన నిర్వేదంతో కొట్టుమిట్టాడు తున్నారు కోట్ల జనం. ఓటు బ్యాంకుగా వాడుకునే సందర్భంలో ఇచ్చిన హామీలను వాగ్దానాలను సామాన్య ప్రజలు కేంద్రంగా ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఈ దేశంలో 15% దారిద్రరేఖ దిగువన ఉంటే వలస కార్మికులు సంచార జీవులు పేదవర్గాలు, నిరుపేదలు కోట్ల మంది కనీస అవసరాలకు నోచక మానవ అభివృద్ధికి అత్యంత దూరంలో జీవిస్తున్న దగా పడిన వర్గాల గురించి విద్యావంతులు ఉపాధ్యాయులు మేధావులు ఎవరూ ఆలోచించకపోతే వాళ్లు అనాధలుగా మిగలాల్సిందేనా? లేదు ఇప్పటికే ప్రజా సంఘాలు అఖిలపక్షాలు మానవ పౌర హక్కుల కార్యకర్తలు బుద్ధి జీవులు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు నిరంతరం ఉద్యమాలలో లీనమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్బంధాలు అణచివేతకు గురై జైల్లో ఊచలు లెక్కబెడుతూ చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ విచారణ ఖైదీలుగా జీవిస్తూ ఇటీవల సుమారు పది సంవత్సరాలు అకారణంగా శిక్ష అనుభవించిన ప్రొఫెసర్ జిఎన్ సాయి బాబా చివరకు నిర్దోషి అని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటిస్తే ఆ శిక్ష అనుభవించిన ఆవేదనకు ఎవరు సమాధానమిస్తారో చెప్పలేని దుర్మార్గ వ్యవస్థ ఈ దేశంలో కొనసాగుతున్నది. అంటే బుద్ధి జీవులు పేదవర్గాలు మాత్రమే ఈ దేశంలో ఇబ్బంది పడుతున్నారు ఆలోచిస్తున్నారు ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్నారు తపన పడుతున్నారు. కనుక ఇక దేశం గురించి ప్రజల గురించి ఆలోచించకుండా తమ గురించి మాత్రమే ఆలోచిస్తున్నటువంటి సంపన్న వర్గాలు పెట్టుబడిదారులు భూస్వామ్య వర్గాలు రాజకీయ నాయకులు పాలకవర్గాలకు ఏనాడు కూడా మానసిక అశాంతి అనే సమస్య లేదు ఎందుకంటే వాళ్లు ఏ వర్గం గురించి ఆలోచించిన సందర్భం లేదు పేద వర్గాల గురించి తపన పడ్డ రోజు లేదు కనుక ఇప్పటికైనా పరిష్కారాన్ని వెతకాలి సంఘజీవిగా నాగరిక పౌరులుగా ఈ దేశంలో బతకాలంటే కచ్చితంగా తోటి మనిషిని సాటి మనిషిగా గుర్తించే సంస్కారాన్ని అలవర్చుకోవాలి విజ్ఞానం చదువు సమాజాభివృద్ధి కోసమని గట్టిగా చెబుతున్నప్పటికీ నేర్చిన చదువు ఉపయోగపడనప్పుడు ప్రశ్నించ లేనప్పుడు పేదరిక నిర్మూలనకు తోడ్పడనప్పుడు ఆ చదువు ఎందుకు అని విద్యావంతులు తమకు తాము ప్రశ్న వేసుకోవలసిన అనివార్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. పాలకులు కూడా నినాదాలు వాగ్దానాలతో జీవించడం సాధ్యం కాదని పాలించడం అంతకు వీలుపడదని సామాన్యులు కళ్ళు తెరిస్తే ప్రశ్నించడం ప్రారంభిస్తే ప్రతిఘటించి ఉద్యమించడానికి ఉప్పెనలా కదలివస్తే తాము చెబుతున్న సాకులు పారవని ఇప్పటికైనా గుర్తించడం చాలా అవసరం. అక్కడక్కడ అనివార్య పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలు ఎంతోమంది తలరాతలు మార్చిన సందర్భాలు ఉన్నాయి.
పోరాటాలు తీవ్ర రూపం థా ల్చకముందే ప్రతిఘటన అసహనం విశ్వవ్యాప్తం కాకుండా చూసుకోవలసిన బాధ్యత పాలకవర్గాల పైన ఉన్నది. అంతేకాదు ఈ పేద వర్గాల యొక్క చెమటను వేతనం, సంపద, ఆహారం అనేక రకాలుగా అనుభవిస్తున్నటువంటి సబ్బండ వర్గాలకు పేద వర్గాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది అనే కనీస సంస్కారాన్ని ఇప్పటికైనా తెలుసుకోవడం చాలా అవసరం. లేకుంటే పేదల ఆగ్రహ జ్వాలల్లో రంగు మారాల్సిందే నలుపు రంగు పులుముకోవాల్సిందే .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)