ఎన్డీఏ పాలనతో విసిగిన ప్రజలు
ప్రత్యామ్నాయ ఇండియా కూటమి వైపు ప్రజల చూపు
అయితే నేమి బాధ్యత మరిచిన ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో ప్రజల ఆకాంక్షలను నిజం చేయగలమా.?
ఇకనైనా ప్రతిపక్ష కూటమి కళ్ళు తెరిచి సోయి తెచ్చుకొని బాధ్యత గుర్తెరిగితే దేశానికి అదే రక్ష.
---- వడ్డేపల్లి మల్లేశం
రెండు ప్రధాన పక్షాల విధానం రాజకీయ రంగంలో ప్రజల ఆకాంక్షలను కాపాడే క్రమంలో ఎంతో తోడ్పదుతుంది. ప్రస్తుతం 2014లో యూపీఏ ఓటమి తర్వాత దశాబ్ద కాలంగా ఎన్డీఏ కూటమి వరుసగా అధికారాన్ని చలాయిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రతిపక్షాలను ప్రతిపక్ష కూటమిని నిర్వీర్య పరచడాన్ని మనం గమనించవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పజెప్పి, దర్యాప్తు సంస్థలు కేంద్ర పెత్తనంతో ప్రతిపక్ష సభ్యులే టార్గెట్ గా పనిచేస్తున్నాయి అన్న అపవాదు ఎదుర్కొంటున్న సందర్భంలో నిజమైన ప్రజల సమస్యలను దాటవేసే ధోరణిలో ప్రజల విశ్వాసాల పునాదుల పైన కేంద్రం అనేక నిర్ణయాలు తీసుకోవడం వలన వాస్తవ విషయాలు వెలుగు చూడడం లేదు. పేదరికం తగ్గిందని రైతు రాజ్యం అని ఎన్నో కబుర్లు చెప్పినప్పటికీ 2021 లో రైతు వ్యతిరేక చట్టాలను చేసి తిరిగి క్షమాపణ కోరి ఉపసంహరించుకున్న విషయం మనందరికీ తెలిసిందే .అయినప్పటికీ తిరిగి ప్రస్తుతం రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసినవి అంటే రైతు సమస్యలను ప్రభుత్వం పక్కదారి పట్టించినట్లే కదా! .ఈ సందర్భంలో గత సంవత్సరం 28 పార్టీలతో ప్రతిపక్ష ఇండియా కూటమిగా ఏర్పడి ఐక్య కార్యాచరణ ద్వారా కేంద్రాన్ని డి కొనాలని ఎత్తు వేసినప్పటికీ ఇటీవలి కాలంలో ఆ కూటమి విచ్ఛిన్నం కావడాన్ని మనం గమనిస్తే ఆ రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏమో కానీ ఈ దేశ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నదనే ఆందోళన కలుగకమానదు.
ఇండియా కూటమి విచ్ఛిన్నం :-
త్వరలో పార్లమెంట్ తో పాటు మరో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇండియా కూటమి కుమ్ములాటలతో చతికిలబడి సొమ్మసిల్లిపోవడం విచారకరం. ఇటీవల మహారాష్ట్ర బీహార్ రాష్ట్రాలలో నాయకులు పార్టీలు మారడం ఇండియా కూటమి నుండి పార్టీలే వెళ్లిపోవడం వంటి పరిణామాలు ఆశావహులకు పెనుసవాల్. కొన్ని రోజుల క్రితం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇండియా కూటమి నుండి ఎన్డీఏ గూటికి చేరి తిరిగి ముఖ్యమంత్రి కావడం వ్యక్తుల యొక్క అవకాశవాదాన్ని తెలియజేస్తుంటే నిబద్ధత కలిగిన రాజకీయ నాయకులని నమ్ముకున్న ఇండియా కూటమి సమర్థులైన నాయకులను పార్టీలను కోల్పోయి పేలవంగా మారుతున్నది. మహారాష్ట్రలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీని విడిచి బిజెపిలో చేరడం తో ఎన్నికలు రాకముందే ఇండియా కూటమి బలహీనం కావడాన్నీ మనం గమనించవచ్చు ఈ దుస్థితికి కారణాలను పరిశీలిస్తే కూటమిలోని రాజకీయ పార్టీల ఒంటెద్దు పోకడ ,స్వార్ధము, సమన్వయ లోపం ప్రధాన లోపం కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ బిరుదులతో పాటు భారతరత్న వంటి పురస్కారాలను ప్రతిపక్షాలకు సంబంధించిన వారికి కూడా కట్టబెట్టి ఇతర రాజకీయ పార్టీలను కూడా లొంగదీసుకోవడం మరొక్క కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .అంతేకాదు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ ఇడి దాడులు ప్రధాన ప్రతిపక్ష పార్టీలను టార్గెట్గా చేసుకొని కొనసాగుతున్న సందర్భంలో వాటి నుండి తప్పించుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడానికి, పదవిని నిలబెట్టుకోవడానికి కూడా కొందరు రాజకీయ పార్టీలను కూటములను మారడాన్ని మనం గమనించవచ్చు . 38 సంవత్సరాల అనుబంధాన్ని కూడా వదిలిపెట్టిన అశోక్ జవాన్ కాంగ్రెస్ పార్టీని వీడి కమలం పార్టీలో చేరగానే రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైనాడంటే ఎవరు ఎటువైపు వుంటారో తిరిగి ఎక్కడికి వస్తారో తెలియక రాజకీయాలు అగమ్య గోచరంగా మారుతుంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రత్యామ్నాయ శక్తి అని నమ్ముకున్న ప్రజలకు మాత్రం ఆందోళన కలిగించే విషయం.
ఇండియా కూటమి ప్రధాన నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పాత్ర కీలకం :-
ఒకవైపు బిజెపి పార్టీ కొత్త కూటములను ఏర్పాటు చేయడంలో కానీ పాత దోస్తులను వది వదిలించుకోవడంతోపాటు ప్రజా బలాన్ని పెంచుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంటే కాంగ్రెస్ మాత్రం కనీసం ఎన్నికల్లో పోటీకి సీట్ల పంపిణీలో సైతం అడుగులు ముందుకు వేయలేక, ఇతర పక్షాలకు సీట్ల పంపిణీలో సరైన నాయకత్వం వహించలేక , కూటమిలోని ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని ముందు జాగ్రత్తగా వ్యవహరింకాకపోవడం సిగ్గుచేటు. అప్పట్లో ఇండియా కూటమి ఎన్నికల్లో గెలిస్తే మల్లికార్జున ఖర్గే తమ ప్రధాని అభ్యర్థి అని కూటమి ప్రకటించినప్పటికీ ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పార్టీ క్రమంగా పక్కదారి పట్టడంతో ఆ ఆశలు అడియాసలై నట్లుగా భావించవలసి వస్తున్నది . గత కొన్ని రోజుల క్రితం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ మమతా బెనర్జీ, పంజాబ్,దిల్లీలలో ఆప్ అధినేత అన్ని సీట్లకు ఏకపక్షంగా పోటీ చేస్తామని ప్రకటించినా రంటే ఏమనుకోవాలి? ఢిల్లీలో కాంగ్రెస్కు ఒకే ఒక్క సీటు మాత్రమే ఇస్తామని ప్రకటించినది అంటే ఇండియా కూటమిలో సయోధ్య లేనట్లే కదా!
పార్టీల మధ్యన నాయకుల వలసలు కొనసాగుతూ ఉంటే కూటమిలోని రాజకీయ పార్టీల మధ్యన ప్రజాసానిక వాతావరణంలో చర్చలు కరువై భవిష్యత్తులో ఎన్డీఏ కూటమిని ఢీకొనగలిగే శక్తి లేక కునారిల్లిపోవడం విషాదకరం కాదా ! ఒక్కసారి ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటును చివరికి న్యాయవ్యవస్థను కూడా ధిక్కరించిన సందర్భాలను గమనిస్తే ఇదే ప్రభుత్వం తిరిగి మూడవసారి గనుక అధికారానికి వస్తే ప్రజాస్వామ్యం కుప్పకూలి పోతుందని సామాజిక రాజకీయ విశ్లేషకులు ఒకవైపు హెచ్చరికలు చేస్తున్న సందర్భంలో బుద్ధి జీవులు మేధావులు రాజకీయ పండితులు సీరియస్ గా ఆలోచించవలసిన తరుణమిది .అదే సందర్భంలో సామాజిక బాధ్యత కలిగిన ఇండియా కూటమిలోని సభ్య పార్టీలు ఇప్పటికీ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఫల వంతమైన చర్చలు చేసి సమన్వయాన్ని సాధించడం ద్వారా నమ్ముకున్న ప్రజానీకానికి భరోసా కల్పించవలసిన అవసరం చాలా ఉన్నది. ఒంటెద్దు పోకడతో ఏ రాజకీయ పార్టీ వెళ్లినా అది ప్రజలకు చేసిన ధ్రోహమే అవుతుంది. తద్వారా ఆ రాజకీయ పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంటుందని గుర్తిస్తే మంచిది . ఇప్పటివరకు కొనసాగినటువంటి 17వ లోక్సభలో చివరిదాకా డిప్యూటీ స్పీకర్ నియామకమే జరగలేదంటే అధికార పార్టీ ప్రతిపక్షాలకు ఏ పాటి విలువ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో ప్రతిపక్షాలను ఖాతరు చేయలేదనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ కాగా గత రెండు నెలల క్రితం ప్రధాన సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భంలో ప్రతిపక్ష సభ్యులను 146 మందిని సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే .అంటే ప్రతిపక్ష ఎంపీలలో 70 శాతానికి పైగా సస్పెన్షన్ లో ఉండగానే కీలకమైనటువంటి నేర సంస్కరణ చట్టం వంటి అనేక చట్టాలు ఆమోదం పొందడంతో పాటు చట్టసభలలోను చట్టసభల బయట కూడా ప్రతిపక్షాలను ఖాతరు చేయని స్థితికి ప్రభుత్వం చేరడంతో ఈ దుస్థితిని ఇండియా కూటమి ప్రజల ముంగిట్లోకి తీసుకురావలసిన బదులు చేష్టలు ఉడిగి చిన్నా భిన్నమై బలహీనం కావడం చూస్తే ప్రత్యామ్నాయ వ్యవస్థ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుంది.
ఉన్నంతలో ప్రస్తుత కర్తవ్యం:-
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజా ప్రభుత్వాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన రాజ్యాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన కూడా ఎంతో ఉన్నది . అందుకు అనుగుణమైనటువంటి వ్యవస్థను నిర్మించుకునే క్రమంలో ఇండియా కూటమిని కూటమిలోని పార్టీల పట్ల ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు బుద్ధి జీవులు బాధ్యతను మోపడమే కాదు హెచ్చరికలు చేసి కూడా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో దారి తప్పితే చేదు పరిణామాలను చవి చూడవలసి ఉంటుందని ఇండియా కూటమికి హెచ్చరిక చేయడం కూడా మన ముందున్న కర్తవ్యం. ఇటీవల అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రతిష్ట ఇతర అంశాలలో ప్రజల అభిమానాన్ని చూర కొనడం ద్వారా ప్రధానమంత్రి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా అందరివాడుగా మారడం వలన కూడా ఇండియా కూటమి మరింత డీలా పడిపోయే ప్రమాదం ఉన్నది . అయితే ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాస్టీకాలు గత నాలుగేళ్ల క్రితం రైతులపై చేసిన దాడులు ప్రస్తుతం తమ డిమాండ్లను పరిష్కరించాలని చేస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమం పైన బుల్లెట్లు టిఆర్ గ్యాస్ ప్రయోగంతో రైతుల విశ్వాసాన్ని కోల్పోయిన విషయాన్ని ఇండియా కూటమి సానుకూలంగా చేసుకోవడం చాలా అవసరం. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు క్రమంగా పక్కదారి పట్టి సుమారు 14 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సంపన్న వర్గాలకు ఎగవేత దారులకు ప్రభుత్వం మాఫీ చేసిన విషయం కూడా ఇండియా కూటమి పబ్లిక్ లో నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్నా, ప్రజల ఆశలను ఆకాంక్షలను నిజం చేయాలన్న, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి అధికారంలోకి రావలసిన అవసరం ఎంతగానో ఉన్నది . అందుకు కూటమిలోని రాజకీయ పార్టీలు నాయకులు తమ తప్పులను తెలుసుకోవాలి, కళ్ళు తెరవాలి, పొరపాట్లను సవరించుకొని సమన్వయముతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును మలుచుకోవడ మే ప్రస్తుతం కూటములోనీ పార్టీల ముందున్న ప్రధాన బాధ్యత. అన్ని రాజకీయ పార్టీలు ఎవరి దారిన వాళ్లు వెళ్తుంటే కేవలం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం భారత్ జోడోయాత్ర ద్వారా ప్రజాభిప్రాయాన్ని గెలుచుకునే అవకాశం అంతగా కనిపించడం లేదు . అది మాత్రమే సరిపోదు అంతకుమించిన శక్తిని కాంగ్రెస్ పార్టీ, కూటమిలోని రాజకీయ పార్టీలు ఉమ్మ డి గా ఆలోచించి ఐక్యం కావాల్సిన అవసరం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భంలో నిర్లక్ష్యం చేస్తే చేదు ఫలితాలను ఈ దేశం చవిచూడక తప్పదు . ఉన్న రెండు మాసాల గడువు నైనా సద్వినియోగం చేసుకోగలిగితే ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడం ద్వారా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ద్వారా ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలను చైతన్యం చేయగలిగితే ఆ అసమ్మతి ప్రభుత్వ వ్యతిరేక ఓటు రూపంలో ప్రత్యామ్నాయ శక్తిని గెలిపించే అవకాశం ఉంటుంది . బుద్ధి జీవులు మేధావులు ఈ దేశంలో నూతన ప్రభుత్వం రావాలని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్న సందర్భంలో ఇండియా కూటమికీ మరింత బాధ్యత పెరిగిందని గుర్తిస్తే మంచిది.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)