సామాన్యుల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం పాలకులు సైతం త్యాగాలు చేయాలి
పొదుపు చర్యలు చేపట్టి గత ప్రభుత్వానికి భిన్నంగా నడుచుకుంటే ప్రజల్లో ఆదరణ లభిస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వo సామాజిక స్పృహను, ప్రజాస్వామిక వైఖరిని ప్రదర్శించుకోవడానికి ఇదే అదునైన సమయం.దుబారా తగ్గిస్తే మరీ మంచిది.
వాస్తవంగా పాలకులు ప్రజలకు సేవకులు, ప్రజాధనానికి కాపలాదారులు, సామాన్య ప్రజానీకం యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి భరోసా ఇవ్వాల్సిన వారు . కానీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రజలను విస్మరించి, ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ప్రజల ఆస్తులను అప్పనంగా కట్టబెట్టి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు దోచిపెట్టి , తమ అనుయా యులకు భూములను చౌకగా అమ్మి అధికారాన్ని కట్టబెట్టినటువంటి ప్రజలకు ఓటర్లకు మాత్రం మొండి చేయి చూపడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారింది . పాలనలో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలలో పొదుపు పాటించకుండా ఇష్టం ఉన్నట్లుగా వ్యవహరిస్తూ వ్యక్తిగత రక్షణ కోసం, అలంకారం కోసం, ఆడంబరం కోసం, సభలు సమావేశాల నిర్వహణ కోసం ప్రజాధనాన్ని కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ కొల్లగొడుతున్న తీరు గర్హించ తగినది . ఈ పద్ధతి తెలంగాణలోనైతే గత 10ఏళ్లుగా బారా స పాలనలో మనం స్పష్టంగా చూడవచ్చు. తమ వేతనాలను తామే పెంచుకునే అవకాశం ఉన్నటువంటి చట్టసభలు ముఖ్యంగా ( శ్రమ ద్వారా చెమట చుక్కలు చిందించడం ద్వారా పండించిన పంటలకు కష్టాన్ని నమ్ముకొని ఉత్పత్తులు చేసిన కార్మికులకు మాత్రం తమ ఉత్పత్తుల కు ధరనిర్ణయించే అధికారం లేకుండా కొల్లగొట్టి) తెలంగాణ చట్టసభలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంత వేతనాలను పెంచుకొని హక్కుల కోసం పోరాడిన ఉద్యోగులు విభిన్న వర్గాలను మాత్రం ఉక్కు పాదంతో అణచివేసిన విషయాన్ని మనం గమనించవచ్చు .
బారాస ప్రభుత్వం చివరి దశలో అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు ఇతర ఉద్యోగులు విభిన్న వర్గాల వారు తమ హక్కుల కోసం పోరాడి విసిగి పోయిన సందర్భంలో అన్ని రంగాలలో నెలకొన్న అసంతృప్తి, ఆగ్రహము, ఉప్పెనలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి బారాసాను ఓడించడానికి కారణమైన విషయం మనమందరం గమనించాలి. అయితే గత పాలకుల అధికార దుర్వినియోగం అనుత్పాదక రంగాల మీద పెట్టుబడులు పెట్టి అప్పుల కుప్పగా మార్చి భూస్వాములకు పండని పంటలకు రైతుబంధును కట్టబెట్టి ప్రజాధనాన్ని సంపన్నులకు తాకట్టు పెట్టిన దుర్మార్గ చరిత్రను మలిపివేయవలసిన అవసరం ఉన్నది. ఆ వైపుగా కాంగ్రెస్ ప్రభుత్వం కఠినమైన త్యాగాలతో కూడుకున్న నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే బారాస చేదు చరిత్రను ప్రజలు చీత్క రిస్తారు, శాశ్వతంగా ఆ పార్టీని నిరాకరిస్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సిన ఆర్థిక పరమైన కఠిన చర్యలు:-
__రైతుబంధు పేరుతో గతంలో పండని భూములకు గుట్టలు పుట్టలు ఇండ్ల స్థలాలకు కూడా డబ్బును మంజూరు చేసిన ద్రోహం పై విచారణ జరిపించి అప్పనంగా కట్టబెట్టిన సొమ్మును తిరిగి రాబట్టాలి.
-- ప్రస్తుత ముఖ్యమంత్రి శాసనకర్తలం కాదు ప్రజలకు సేవకులం అని ఎలిగెత్తి చాటినoదున ప్రజాధనాన్ని వేతన రూపంలో తీసుకోవడానికి కాకుండా ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాలలో కొనసాగే విధంగా తన ప్రభుత్వ ప్రజాప్రతినిధు లను సంసిద్ధులు చేయాలి. అంతేకాకుండా గతంలో అక్రమంగా పెంచిన వేతనాలను సగానికి సగం తగ్గించడం ద్వారా ఆదర్శాన్ని నిలబెట్టుకొని త్యాగానికి సిద్ధపడాలి."" వేతనం కోసమే కాదు ప్రజల కోసం తమ కృషి అని చాటి చెప్పాలి".
-- కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మంత్రులు వారి ఆస్తులను పరిగణలోకి తీసుకొని ఐదేళ్ల తర్వాత అక్రమ ఆస్తులు కూడా పెడితే కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రకటన చేయాలి . ఇది బారాస కంటిలో కారం చల్లినట్లుగా భావిస్తే మంచిది.
-- సుమారు 56 కార్పొరేషన్లతో పాటు ఇతర సంస్థలకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్న సందర్భంలో వారికి ఇస్తున్నటువంటి భారీ వేతనాలను కనీస స్థాయికి తగ్గించాలి. వేతనం లేకుంటే బతకలేని పరిస్థితిలో ఉన్న వాళ్లను నియమించడం లేదు కదా ! అదే సామాన్యులను గనుక నియమిస్తే పూర్తి వేతనాలు ఇచ్చినా తప్పులేదు. కానీ పెట్టుబడిదారులు సంపన్న వర్గాలకు ఆ పదవులు కట్టబెడితే వారి వేతనాలను పూర్తిస్థాయిలో రద్దు చేయాలి.
--- మంత్రులు శాసనసభ్యులకు ముఖ్యమంత్రి కి కూడా కేటాయిస్తున్నటువంటి రక్షణ వలయంలో భారీ ఖర్చును తగ్గించి ప్రజల విశ్వాసాన్ని చూర గొనడం ద్వారా పొదుపు చర్యలు చేపట్టాల్సిన అవసరం చాలా ఉన్నది. ఆడంబరాలకు విలాసాలకు ఇది సమయం కాదు. గతంలో దాచి పెట్టింది లేదు కనుక దొంగలుగా అక్రమార్జన చేసిన భూ కబ్జాదారులు, భూ అమ్మకాలకు పాల్పడిన వారు, అవినీతిలో కూరుకుపోయిన వాళ్లు, ముఖ్యమంత్రి మంత్రులు శాసనసభ్యులు అందరిని కూడా నిఘా వేసి దోషులుగా నిర్ధారించి నష్టపరిహారాన్ని నిర్బంధంగా వసూలు చేయడంతో పాటు కటకటాల్లోకి తోయాలి .అప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజారాజ్యం నిజమైన ప్రజా పరిపాలన సాధించినట్లు సాక్షాత్కారం చేసినట్లు. .
--క్రీడాకారులు ఇతర ప్రముఖులు అవార్డులు పొందిన సందర్భంలో గత ప్రభుత్వం కూడా ఎకరాల కొద్ది స్థలాన్ని లక్షల రూపాయలను అప్పనంగా కట్టబెట్టి ప్రజా ద్రోహానికి తలపడిన విషయం తెలిసిందే. ఇటీవల పద్మ అవార్డు గ్రహీతలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి 25 లక్షల నజరానా ప్రకటించడంతోపాటు ప్రతినెల 25 వేల రూపాయల పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు సగర్వంగా ప్రకటించడం వెనుక ప్రజాధనం పొదుపు, ప్రజల శ్రేయస్సును ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఎంపికైన వివిధ రంగాల కళాకారులు పేద వర్గాల వారికి నెల నెల పెన్షన్ ఇస్తే అభ్యంతరం లేదు 25 లక్షలకు బదులుగా 10 లక్షలు ఇచ్చిన సరిపోతుంది. కాకపోతే వారికి నివాస స్థలం ఉపాధి అవకాశాలు కల్పించి మేలు చేయవచ్చు. కానీ సంపన్న వర్గాలకు చెందిన వారు అవార్డు గ్రహీతలైతే 25 లక్షల నజరానా ఏమిటి? ప్రతి నెల 25 వేల పెన్షన్ ఏమిటి? దీనిని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అవార్డు గ్రహీతలను అభినందిస్తే, గౌరవిస్తే, ప్రోత్సహిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజల సొమ్మే కనుక ప్రజా ధ నాన్ని కొన్ని వర్గాలకే కొంతమందికే ఇష్టారాజ్యంగా ఖర్చు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి ఉండదు . ఈ విషయంలో పునరాలోచన చేయాలి. "ప్రతిష్ట కోసం కాదు చేసే ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసం.
ప్రతిపక్షంలో ఉన్న బారాస నాయకులు తమ ఉనికి ప్రశ్నార్ధకమవుతున్న వేళ గగ్గోలు పెట్టి నోటి దురుసుతనంతో చట్టసభల్లోనూ బయట గెలవడానికి ప్రయత్నిస్తున్న తీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతతో, పొదుపు చర్యలను పాటిస్తూ, గత ప్రభుత్వ ద్రోహాన్ని ప్రజలకు ఎక్కడికక్కడ తెలియచేయడం ద్వారా తన మనుగడకు ప్రజల విశ్వాసాన్ని పొందడం అవసరం. ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దలను నిందించిన ప్రతిపక్ష సభ్యులను చట్ట పరిధిలో కఠినంగా శిక్షించాలి. క్రమశిక్షణకు మారుపేరుగా పాలక పక్షం కూడా సంస్కారంగా వ్యవహరించి బారాస నాయకులలో కనువిప్పు కలిగించాలి. చట్టం తన పని తాను చేసుకుపోతూ నేరస్తులను కఠినంగా శిక్షించడమే ప్రజల అభిమతం.
--- వడ్డేపల్లి మల్లేశం
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌట పల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)