ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా మానవాభివృద్ధి ని సాధించాలి
పేదరిక నిర్మూలన ద్వారా అసమానతలు అంతరాలు లేని వ్యవస్థ ఏర్పాటు పాలకుల బాధ్యత.* అవినీతి,భూకబ్జాలు అక్రమాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు పొదుపు చర్యలతో లక్ష్యాన్ని చేరుకోవాలి .*
*************
---వడ్డేపల్లి మల్లేశం
మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా ఉంటుంది ప్రభుత్వాల ధోరణి, ఉద్యోగాలు ఉపాధి లేక తిండి దొరకక పని కోసం వలస
జీవులుగా దేశమంతా తిరుగుతూ , చిరు వ్యాపారులు వీధుల్లో అష్ట కష్టాలు పడుతూ ప్రభుత్వ ఆసరా లేకుండా జీవిస్తున్న తరుణంలో ఇలాంటి వారి గురించి పాలకులు పట్టించుకోరు. కానీ నదుల ప్రక్షాళన, రైతుల గురించి భారీ నజరాణాలు,క్రీడాకారులు,పురస్కార గ్రహీతలకు కోట్లు, పెట్టుబడిదారులకు బ్యాంకు బకాయిలను మాఫీ చేయడం, పాలకుల ప్రకటనలు పర్యటనలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, సభలు సమావేశాలలో లక్షల రూపాయలతో అలంకరించడం ఎవరి ప్రయోజనం కోసం? పాలకులు ఒకసారి సమీక్షించుకోవాలి. త క్షణ అవసరాలను పక్కనపెట్టి దీర్ఘకాలిక అంశాల పైన దృష్టి సారించడం అంటే పేద వర్గాలను అవమానించడమే .కేంద్రం నుండి రాష్ట్రాల వరకు అన్నిచోట్ల ఇదే తంతు కొనసాగుతున్నది . ఒకవైపు కనీస జీవన అవసరాలను తీర్చుకోగలిగే స్థాయిని కనీసం ప్రజలు అందుకోవాలని, ఆ వైపుగా పాలకులు దృష్టి సారించాలని, దానినే మానవాభివృద్ధి అని అంటారని భారత ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ హెచ్చరించినప్పటికీ కనీస స్థాయికి నోచని కోట్లాదిమంది పేదలు దయనీయ పరిస్థితుల్లో జీవిస్తుంటే పాలకులకు అసమానతలు అంతరాలు, సంపన్న వర్గాల భోగాలు, భూస్వాములు పెట్టుబడిదారుల అక్రమాలు ఆర్థిక అరాచకత్వాలు భూ కబ్జాలు కనిపించడం లేదా ?ఇంటికో ఉద్యోగం అని గత బిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇస్తే కేంద్ర ప్రభుత్వం గతంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎగనామం పెట్టిన విషయం ఎవరికీ తెలియదు. ఇక దేశవ్యాప్తంగా భూకబ్జాలకు అంతే లేదు టిఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములను యి ష్టారాజ్యంగా అమ్మడమే కాకుండా శాసనసభ్యులు పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ మరియు పేద వర్గాలకు చెందిన భూములను అక్రమంగా కబ్జా చేసినట్లు అనేక ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భం మన అందరికీ తెలుసు. దేశంలో నెలకొన్న అవినీతి అక్రమాలు భూకబ్జాలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంఘటనలు కేవలం ఉదాహరణ మాత్రమే. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిచోట ఈ కబ్జాలు అవినీతి అక్రమాలు పోటా పోటీగా కొనసాగుతున్నట్లు సమాచారం ప్రతిరోజు పత్రికల్లో గమనిస్తూనే ఉన్నాం . కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్న ప్రజల దీనస్థితిని దారిద్రరేఖ దిగువన అనీ సాంకేతికంగా అంటారు అలాంటి ప్రజలు ఈ దేశంలో ఇప్పటికి సుమారు 15% పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతుంటే వలస కార్మికులు సుమారు 15 కోట్ల మంది ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి . వీరి జీవితాలకు పాలకుల యొక్క భరోసా లేకపోవడం పెట్టుబడిదారీ సంపన్న భూస్వామ్య వర్గాలకు మాత్రమే పాలకుల అండ కొనసాగుతున్న కారణంగా పేదరిక నిర్మూలన అనేది కేవలం యాంత్రిక ప్రకటన మాత్రమే తప్ప ఆచరణలో కనిపించదు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే అన్ని రాష్ట్రాలలోనూ దేశవ్యాప్తంగా ఆర్థిక సమగ్ర స్థితిగతుల పైన సర్వే జరిపించి దారిద్రరేఖ దివన గల వారు, కనీస అవకాశాలను అవసరాలను అనుభవిస్తున్న వారు, సంపన్న వర్గాల వారి జాబితాను సిద్ధం చేయడం ద్వారా ఈ దేశంలో అసమానతలు అంతరాలు ఎలా ఉన్నాయో దేశ ప్రజలకు ప్రదర్శించవలసిన అవసరం ఉన్నది . 40 శాతం సంపద ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో కేంద్రీకృతం కావడానికి ప్రధాన కారణమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
పేద వర్గాల కడుపు నింపడానికి మాత్రం 81 కోట్ల మందికి దొడ్డు బియ్యం ఉచితంగా ఇస్తూ ఇదే మా త్యాగం అని ప్రకటిస్తే అంతటితో పేదవర్గాలు తృప్తి పడవలసిందేనా? కలుషిత ఆహారం, నీరు, గాలి , భూమి వేడెక్కడం, ఉపద్రవాలు చోటు చేసుకోవడం, ప్రకృతి విపత్తులు కారణాలేవైనా అనేక పేద వర్గాలు అడుగంటుతున్న సందర్భాలను గమనించవచ్చు . గృహవసతిలేని వాళ్లు కోట్లాదిమంది ఇప్పటికి ఉంటే ప్రతిరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గృహవసతి కల్పిస్తున్నట్లు కోట్ల గృహాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంలో ఉన్న వాస్తవం ఎంత ?ఉపాధి అవకాశాలు కల్పించరు ,ఉద్యోగాలపైన చిత్తశుద్ధి ప్రదర్శించరు, ఎన్నికల్లో మాత్రం మేనిఫెస్టోలో పొందుపరిచి యువతను ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు ఆ తరువాత పాలకుల స్వప్రయోజనాల కోసం యువతను మహిళలను ప్రజలను మరిచి ముఖ్యంగా పేదవర్గాలపైన స్వా రీ చేస్తా రు. ఒక అంచనా ప్రకారం గా సంపన్న వర్గాలు చెల్లించే జీఎస్టీ కంటే పేద వర్గాలు చెల్లించే జీఎస్టీ ఎక్కువ పరిమాణంలో ఉందని తెలుస్తుంటే కార్పొరేట్ సంస్థలు చెల్లించే పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించి ఊరట కల్పించడం ఎవరి ప్రయోజనం కోసం? .
కఠిన నిర్ణయాలు తప్పనిసరి :-
******
ఏ ప్రభుత్వమైనా సాధారణ మధ్యతరగతి పేద వర్గాల కోసమే ప్రధానంగా శ్రద్ధ వహించాలి. వారి ప్రాథమిక అవసరాలను థీ ర్చడంతో పాటు పెట్టుబడిదారీ వర్గాల పైన అధిక పన్నులను విధించడం ద్వారా అసమానతలు అంతరాలను తగ్గించే ప్రయత్నం చేయడానికి పేదవర్గాలను పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి . ప్రభుత్వం తన ఖర్చులను తగ్గించుకోవడం, దుబారాను
అడ్డుకోవడం, అనవసరపు విషయాల జోలికి పోకుండా అత్యవసర అవసరాల పైన దృష్టి సారించడంతోపాటు కొన్ని శాశ్వత ప్రణాళికలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా పేదరికం నిర్మూలించడానికి, సమానత్వాన్ని సాధించడానికి , అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్లో కేటాయింపులు భారీగా ఉన్న అమ లు మాత్రం నిండు సున్న అని అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు విమర్శించడాన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి ఉప ప్రణాళికలను అమలు చేయడం ద్వారా ఆ వర్గాల యొక్క ఆర్థిక అవసరాలను తీర్చడంతోపాటు ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది .కానీ గత కొంతకాలంగా ఆ విషయంలో పాలకులు మిన్నకున్నట్లు తెలుస్తుంది .అలాగే రాజకీయ అధికారం పార్టీల బాధ్యతలు ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్న కారణంగా రాజకీయాలలో చట్టసభల్లో రిజర్వేషన్ లేనటువంటి బీసీ వర్గాలకు తీరని ద్రోహం జరుగుతున్నది ఆ వర్గాల ఓట్ల కోసం ఆరాటపడే పాలకులు వారి ప్రయోజనాలను మాత్రం పట్టించుకోకపోవడం దారుణం. సర్వోన్నత న్యాయస్థానం విధించిన 50 శాతం పరిమితిని పక్కనపెట్టి జనాభాలో ఎవరి వాటా ఎంతో వారికి ఆ మేరకు ప్రతిఫలం దక్కే విధంగా విద్యా ఉద్యోగ చట్టసభల్లో అవకాశాలను కల్పిస్తూ రాజ్యాంగ సవరణ ద్వారా పేదవర్గాల తలుపు తట్టాలి . ఇక అక్రమాలు అవినీతిపైన ఉక్కుపాదం మోపడం దోషులను శిక్షించడం, వారి నుండి వసూలు చేసిన సొమ్మును పేద వర్గాలకు వివిధ రూపాలలో అందించడం , ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడం, విద్యా వైద్యం సామాజిక న్యాయం పారిశ్రామిక ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు విద్యా వైద్యాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం ద్వారా పేద వర్గాల కొనుగోలు శక్తిని భారీగా పెo చడానికి పాలకులు కృషి చేయాలి. నామినేటెడ్ పోస్టులతో పాటు ప్రజా ప్రతినిధుల వేతనాలను తగ్గించుకోవడం ద్వారా తమ చిత్తశుద్ధిని ప్రదర్శించి లోటు బడ్జెట్ను నిధుల సమీకరణను ప్రజా దృక్పథంతో సవరించుకున్నప్పుడు సామాజిక న్యాయం, సమానత్వం ,మానవాభివృద్ధి , పేదరిక నిర్మూలన కొంతవరకైనా సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ దేశానికి కావలసింది అదే! ఆ తర్వాతనే విలాసాలు, ప్రకటనలు, భవిష్యత్ కార్యాచరణ, పాలకుల ప్రయోజనాలు .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)