2047 నాటి  పురోగతికి   కేంద్రం వద్ద ప్రణాళికలు ఉంటే సరే !

Aug 4, 2024 - 19:39
Aug 26, 2024 - 17:42
 0  9
2047 నాటి  పురోగతికి   కేంద్రం వద్ద ప్రణాళికలు ఉంటే సరే !

ముందు దేశ ప్రజలను దోమ కాటు నుండి   రక్షించడం అవసరం కదా  .వెయేండ్ల ప్రణాళిక  కంటే ముందు  దేశం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం కీలకం . అసమానత, అంతరాలు  ఉంటే  అంతర్జాతీయ గుర్తింపు ఎలా అవుతుంది ?


-- వడ్డేపల్లి మల్లేశం
ఆకలితో అలమటించే వాడికి  కడుపు కోతతో అల్లాడే  వారికి  కావలసింది  ఆహారం ,చేతిలో ఖర్చుకు డబ్బులు.  తీయటి మాటలు  సానుభూతి వచనాలు పనిచేయవు కదా ? పేదలు ఒకవైపు కడుపు మాడి  దయనీయ స్థితిలో బతుకుతూ ఉంటే  మరొకవైపు ఆకాశాన్ని తాకే మేడలతో  సంపన్నులు కులుకుతూ ఉంటే  ఈ దేశం  అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నదంటే ఎలా నమ్ముతాం?.  ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో 5వ ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నదని త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వం బిజెపి పెద్దలు ఇటీవల ఎన్నికల సందర్భంలో పదే పదే వక్కాణించినారు . అంతేకాదు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని  2047 చేరుకోవడం టార్గెట్గా పనిచేస్తామని  తమ వద్ద 1000ఏళ్ల బృహత్ ప్రణాళిక ఉన్నదని  చేసిన ప్రకటనలు అందరికీ తెలిసే ఉంటుంది . సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు హెచ్చరిస్తుంటే  సామ్యవాద దేశంగా  తీర్చి దిద్దుతామని రాజ్యాంగ పీఠికలో మనకు మనమే రాసుకుంటే  దానికి భిన్నంగా సమానత్వము లేదు, సామ్యవాదము లేదు,  అన్నింట అంతరాలు అసమానతలే. కాగా  40 శాతం సంపద కేవలం 1 శాతం ఉన్న సంపన్న వర్గాల చేతిలో ఉన్నది అనే చేదు వాస్తవం  ఈ పాలకులను  ఆలోచింప చేయలేకపోవడం విడ్డూరమే కాదు  పేదల పట్ల వివక్షత,  బాధ్యతారాహిత్యం,  యాచకులుగా చూడడం,  సంపన్నులకు దోచుపెట్టడం  వంటి భ్రమల్లో పాలకులు  లీనమై పోవడమే కారణం అని విశ్లేషకులు రాజనీతిజ్ఞులు అభిప్రాయపడుతున్నారు .
కళ్ళజోడు పెడితే కానీ కనిపించని దోమల  కాటుతో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది  రోగగ్రస్తులై  మృత్యువాత పడుతుంటే  ఆ వైపుగా పాలకులు తీసుకున్న చర్యలేమిటి  చూపిన పరిష్కార మార్గాలు ఏమిటి ? చట్టసభల్లో ప్రజల ధనంతో  విమర్శించుకోవడం,  వ్యక్తిగత దూషణలకు పాల్పడడం,  చర్చ లేకుండానే బిల్లులను ఆమోదించడం,  అవసరమైన చట్టాలను చేయడానికి ప్రజలు డిమాండ్ చేసినా నిరాకరించడం తప్ప  ఈ దేశంలో పరిపాలనలో వచ్చినటువంటి మార్పులు  చూపగలరా?  రైతు ఉద్యమంలో  కనీస  మద్దతు ధరకు చట్టబద్ధత కావాలని డిమాండ్ చేస్తూ  నెలలు సంవత్సరాల తరబడి పోరాటం చేస్తే  రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చిన బిజెపి కేంద్ర ప్రభుత్వం  రైతుల మీద బుల్లెట్ల వర్షం కురిపించినది నిజం కాదా?  ఇక రైతు సంఘాలతో చర్చలు లేకుండా  రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించినట్టు  తెలిసిన  రైతు ఖర్చుకు ఏ మూలకు సరిపోవని రైతు సంఘాలు రైతులు ఆవేదన చెందుతున్న సందర్భం  అప్పులు  అవస్థలతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటే  వాటికి పరిష్కార మార్గం  దశాబ్దాలుగా వెతకలేదేందుకు  ?
         
           పలు సందర్భాలలో  కేంద్రం ప్రకటించినటువంటి హామీలు వాగ్దానాలను పరిశీలించినప్పుడు  ప్రజల ఆకాంక్షలు ప్రయోజనాలు  నిరాకరించబడి విస్మరించబడి  ఆడంబరాలకు మాత్రమే పరిమితమైనటువంటి  ప్రకటన  పేదల కన్నీటిని తుడిచిందా?  అసమానతలు అంతరాలను  అంతం చేసినదా?  సమానత్వాన్ని సాధించి పెట్టినవా?  ఉన్న రాజ్యాంగాన్ని అమలు చేయడం ద్వారా ప్రజలకు రాజ్యాంగబద్ధమైన హక్కులను సాధించుకునే అవకాశం మెండుగా ఉన్నప్పటికీ  మరింత మెరుగైన  జీవన ప్రమాణాలు సాధించాలంటే రాజ్యాంగాన్ని మార్చాలని పదేపదే  ప్రకటించడం,  పోయిన ఎన్నికల సందర్భంలో 400 సీట్లు దాటితే  కచ్చితంగా రాజ్యాంగాన్ని  తిరిగి రాస్తామని చేసిన భాసలు  పుండు ఒకచోట ఉంటే మందు ఒకచోట పెట్టినట్టుగా ఉన్నది.  56 శాతానికి పైగా  ఉన్న బిసి వర్గాలు  ఈ దేశంలో  ఎందరున్నారో ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర  గనా0 కాలు లేవు  1931 లో ఆంగ్లేయులు చేసినదే తప్ప  స్వతంత్ర భారతదేశంలో  బీసీ వర్గాల  జనాభా లెక్కలు  కుల గణన చేయకపోవడం  మెజారిటీ ప్రజానీకాన్ని నిర్లక్ష్యం చేయడమే కదా ! ఆ వర్గాలకు చెందిన ప్రజలు కోరిన చట్టబద్ధంగా కోర్టుకు వెళ్లిన  పోరాట రూపాలను ఎంచుకున్న  కేంద్రం దిగిరా లేదంటే  ఇది మొండి వైఖరి కాదా ? ఇప్పటికీ ఆ వర్గాలకు చట్టసభల్లో కానీ ఉద్యోగ విద్య వివిధ రంగాలలో కానీ స్థానం లేకపోవడం , రిజర్వేషన్లు లేని కారణంగా చట్టసభల్లోకి కాలు పెట్టే అవకాశం రాకపోవడం,  అన్ని పార్టీల నాయకత్వం ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్న కారణంగా  అధికారానికి నోచుకోకపోవడం  కళ్ళ ముందు జరుగుతుంటే  బీసీల పట్ల చూపుతున్న వివక్షత  శత్రు పూరిత వైఖరి  పెను ప్రమాదం కాదా! . శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన మార్పు  సాధించినామని ప్రకటించినప్పటికీ రోగాల బారిన పడి  ఎందరో చనిపోతున్న ఇప్పటికీ సరైనటువంటి ఆరోగ్య వైద్య సౌకర్యాలు లేకపోవడం అటు ఉంచితే  మామూలు దోమకాటుకు బలవుతున్న వారు ఎందరో!  ఆ చిన్న అంశం మీద ప్రభుత్వం దృష్టి సారించని కారణంగా   ఎంతో సౌకర్యాలు ఉన్న పట్టణాలు గ్రామాలలో  ప్రత్యామ్నాయలతో దోమలను అరికట్టడానికి ప్రయత్నిస్తుంటే  ఆటవిక ప్రాంతాల్లో ఉండే ఆదివాసి  కుటుంబాలు సంచార జాతులు  ఎంత దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్నారు...  అనేక కీటకాలు  దోమలు పాములు లాంటి విష  క్రిమికీటకాల బారిన పడి  మృత్యువాత పడుచుంటే  కనీస రవాణా, వైద్య సౌకర్యం కూడా అందుబాటులో లేక  డోలీలలో  నలుగురు మో సుకుని పోయే   పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతుంటే    1000ఏళ్ల ప్రణాళిక మూగబోయినదా?  2047 లక్ష్యంగా  ప్రకటించిన ప్రణాళికలు ఏమైనవి. ?ఉద్యోగ,ఉపాధి అవకాశాలేవీ?
        రైతులు పేద వర్గాలు చిరు వ్యాపారులు  తీసుకున్న రుణం చెల్లించలేని పరిస్థితిలో నిర్బంధంగా వసూలు చేయడమే కాదు నడి బజార్లో అవమానించి  ఆత్మహత్యలకు పురికోలిపిన సందర్భాలు ఎన్నో .కానీ   సంపన్న వర్గాలు  బాకీ పడినటువంటి   రుణాలను మాఫీ చేసి  సుమారు 15 లక్షల కోట్ల   ప్రజాధనాన్ని అప్పనంగా  కట్టబెట్టిన కేంద్ర  ప్రభుత్వం  ఇదే ధోరణితో  పేద వర్గాలను అణచివేస్తూ  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ తమ హక్కుల కోసం పోరాడే వారిని  నిర్బంధించడాన్నీ గమనిస్తే ఈ దేశంలో  దోమలకు ఉన్న స్వేచ్ఛ కూడా  పౌర సమాజానికి లేదు అని  తేలిపోతున్నది.  కాటు వేసే దోమలు తదితర కీటకాలను  అణచివేయడం మానీ  ప్రజల కోసం పనిచేసే  ఉద్యమకారులు మేధావులు ప్రజా సంఘాల పైన ఉక్కు పాదం మోపడం  దేశద్రోహ  కేసులు నమోదు చేయడం అంటే  ఇదే నా  ప్రణాళిక అని  ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు . తాము ఆశించిన ఆశయాలు , ఎంచుకున్న ఆకాంక్షలు  రాజ్యాంగము ద్వారా సంక్రమించకుంటే  ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఈ దేశంలో  అనేక ప్రాంతాలలో వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాలను బట్టి తెలుస్తున్నది. " ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచే చర్యలకు  పాలకులు రాజ్యాంగాన్ని ఉపయోగించకపోతే  ఉన్న రాజకీయ వ్యవస్థను  చిదిమి వేసి కొత్త వ్యవస్థను ప్రజలు ఆవిష్కరించుకుంటారు ఇది చారిత్రక సత్యం" అని ఆనాడే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హెచ్చరించిన నేపథ్యంలో  ఇప్పటికైనా ప్రజలను ప్రభువులు గా చూడాలి,  పాలకులు సేవకులుగా మారాలి,  ప్రజల హక్కులను కాలరాచే ధోరణి మానుకోవాలి,.  యాచకులుగా బానిసలుగా చూస్తే  సహించే పరిస్థితి లేదు  అని తెలుసుకుంటే మంచిది . అప్పుడే దోమల నిర్మూలనతోపాటు ప్రజాస్వామ్య పరిరక్షణ  సా కారం అవుతుంది.  పాలకుల నిర్లక్ష్యానికి దోమకాటు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే . ఇలాంటి  ఆకృత్యాలు పాలకుల సాక్షిగా జరుగుతుంటే  భారతదేశంలో న్యాయవ్యవస్థ మూగబోతున్నది..,  న్యాయ వ్యవస్థ ఆధిపత్యం కొనసాగాలి...,  పాలకులు సేవకులుగా మారాలి..., ఆ వైపుగా ప్రజా ఉద్యమాలు   రావాలి.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు  అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333