యువత భారత్లో  ప్రపంచ దేశాల కంటే ఎక్కువ ఉన్నదంటే సరిపోదు

Nov 1, 2024 - 19:19
Nov 7, 2024 - 20:51
 0  10
యువత భారత్లో  ప్రపంచ దేశాల కంటే ఎక్కువ ఉన్నదంటే సరిపోదు

తమను తాము సంస్కరించుకున్న యువత సామాజిక రుగ్మతలకు అతీతంగా నీతివంతమైన రాజకీయాల్లోకి రావాలి.

రౌడీ పోకిరి  చేష్టలు మానుకుంటే  మరింత ప్రగతి సాధ్యం.

---  వడ్డేపల్లి మల్లేశం

ప్రపంచ జనాభాలో 5వ వంతు  భారాన్ని మోస్తున్న భారత దేశంలో  2022 అంచనాల ప్రకారంగా  దేశ జనాభా  140,75,6 3,8 42  కాగా  20 ఏళ్ల లోపు  యువత 50 శాతం జనాభా కంటే  ఎక్కువగా ఉంటే 35 ఏళ్ల లోపు  యువత 65 శాతం కంటే ఎక్కువగా ఉన్న  దేశంగా ప్రపంచ దేశాలలో గుర్తింపు ఉన్నది. అంటే ప్రపంచంలో ఏ దేశంలో లేనంత యువత మనదేశంలో ఉన్నది.  శక్తియుతులు, యుక్తిపరులు,  సాహసోపేతమైన నిర్ణయం తీసుకోగలిగిన  సామాజిక బాధ్యత కలిగిన యువతగా థీ ర్చిదిద్దడంలోనే  దేశ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది.  ఆ బాధ్యత కుటుంబంలో తల్లిదండ్రుల నుండి మొదలుకుంటే సమాజంతో పాటు  ప్రభుత్వాలపైన ఎంతో ఉన్నది అని  గుర్తించడం చాలా అవసరం.  ముఖ్యంగా  యువతకు ఆధార భూతమైనటువంటి బాల్య దశలో  పిల్లలు ఎదుర్కొంటున్న అనేక గడ్డు పరిస్థితుల నుండి  సంరక్షించుకున్నప్పుడు మాత్రమే  సమర్థవంతమైన యువతను చూడగలము . ఈ క్రమంలో  బాల్య వివాహాలు,  బాల కార్మికులు,  పోషకాహార లోపం కలిగిన పిల్లలు,  పేదరికంలో కొట్టుముట్టాడుతున్న  వాళ్లు,  శిశు మరణాలు ఎక్కువగా ఉన్నటువంటి భారతదేశంలో  దృఢమైన సమర్థవంతమైన యువతను  చూడాలంటే అనేక సంస్కరణలు చాలా అవసరం . 6 నుండి 23 మాసాల  పిల్లలలో  77% పోషకాహార లోప ముతో బాధపడుతున్నట్లు తెలుస్తుంటే  బలమైన యువత ఎలా సాధ్యమవుతుంది?  కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేని కారణంగా బాల కార్మికులుగా  మగ్గిపోతున్నటువంటి బాలలు    యువజనులు ఎలా అవుతారు?  ఇక  బాల్యవివాహాల కారణంగా  బాల బాలికలు  బలహీనత, అనారోగ్యము,  పోషకలోపo కారణాలు ఏమైతేనేమి  బక్క చిక్కిన యువతగా ఈ దేశానికి  పనిచేయడానికి ఏ రకంగా  అర్హులవుతారు ఆలోచించుకోవాలి.  పురిట్లో ,5-10 ఏళ్ల లోపు  లక్షలాది మంది శిశువులు  వివిధ రోగాల బారిన పడి నిరోధక శక్తి తగ్గి  మరణిస్తూ ఉంటే  మనం అంచనా వేసిన  యువత శాతం  తగ్గడమే కాదు  ఏ రకంగానూ ఈ దేశ  ప్రగతికి దోహదపడే ఆస్కారం లేదు. యిన్ని రకాలుగా  యువతకు ఆధార భూతమైనటువంటి  బాల్య దశలో ఎదుర్కొంటున్న పరిణామాలను పాలకులు,  తల్లిదండ్రులు, సమాజం చొరవతో  దిద్ది  ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేసి  ఆరోగ్య బాల భారతాన్ని నిర్మిస్తేనే కదా!  ఉత్తమ యువ లోకం  వెలుగు చూసేది. పోషకాహార లోపానికి  వ్యవసాయ రంగాన్ని సంస్కరించడంతోపాటు  పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇతర  దినుసులను ప్రజలందరికీ  నామమాత్రపు రేటులో ఉచితంగా అందించగలిగినప్పుడు మాత్రమే  వారి పిల్లలను యువతను  ఆరోగ్యంగా పెంచే అవకాశం ఉంటుంది.  ఆరోగ్యవంతమైన యువతలో  చురుకుదనంతో కూడిన ఆలోచనలు తద్వారా దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి . అంతెందుకు తరగతి గదిలో దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది అని డాక్టర్ డి ఎస్ కొటారి అన్న మాటలో అర్థం అదే కదా! బాల్య దశలో ఎదురవుతున్నటువంటి ఆటంకాలను  అధిగమించే క్రమంలో  ప్రభుత్వాలు  ఉచిత రీతిన  బడ్జెట్ ను కేటాయించడం ద్వారా  ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించవలసిన అవసరం ఉంటుంది.  ఆ పరిణామ క్రమంలో ఎదిగినటువంటి యువత  దేశ భవిష్యత్తుకు,  భవిష్యత్తు సవాళ్లను అధిగమించడానికి ఎంతో తోడ్పడుతుంది.

యువత రాజకీయాల్లో క్రియాశీలకంగా  పనిచేయాలి:-

  ప్రస్తుత రాజకీయాలు తొలినాళ్లకు భిన్నంగా  స్వార్థపూరిత,  అవకాశవాద , అనాగరిక , ఆక్రమణ విధానాల  బారిన పడి  శిథిలమైనoదున నీతివంతమైన రాజకీయాలను  దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్న తరుణంలో  ప్రస్తుత రాజకీయ నాయకులకు భిన్నంగా యువత పెద్ద మొత్తంలో రాజకీయాల్లోకి తద్వారా ఎన్నికల ద్వారా చట్టసభలకు ఎంపికై  పాలనా వ్యవస్థలో క్రియాశీలక భూమిక పోషించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది . ఈ క్రమంలో యువత తనలో ఉన్నటువంటి   లోపాలను,  కుసంస్కారాన్ని , అవినీతి  పద్ధతులు ఏవైనా ఉంటే వాటిని సంస్కరించుకొని  దేశ భవిష్యత్తును సవాల్గా తీసుకోవడం ద్వారా  నీతివంతమైన పాలన కోసం ఆరాటపడినప్పుడు  తప్పకుండా సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు చక్కబడతాయి.  అప్పుడు మాత్రమే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ప్రపంచ దేశాలలో  అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఆస్కారం ఉంటుంది.  చురుకైన రాజకీయాలు  అవినీతికి ఆస్కారం లేని సేవా దృక్పథంతో కూడినటువంటి సుపరిపాలన అందించడానికి  తమ శక్తి యుక్తులను కార్యాచరణను  దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించడానికి  తగిన సమయం కేటాయించగలిగిన  యువత  ఈ రకమైనటువంటి రాజకీయాలకు  అర్హత కలిగి ఉంటుంది.  మూస రాజకీయాలను కాదని  అభివృద్ధి సంక్షేమం, అసమానతలు అంతరాలు లేని  సమ సమాజం,  వివక్షత దోపిడీ పీడన వంచన  కానరాని  మరో ప్రపంచాన్ని సాధించుకోవడానికి  ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా  నూతన విలువలతో కూడుకున్న రాజకీయాలు  యువత చేతికి వస్తే  రాజ్యాంగము, రాజ్యాంగబద్ధ సంస్థలు, పాలనా వ్యవస్థ, చట్టసభలు పది లంగా ఉంటాయని దేశం  భావిస్తున్నది . దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా  మెరుగైన పాలన యువత అందిస్తుందని కోరుకోవడం తప్పులేదు కానీ  యువత ఆ వైపుగా  తమను తాను ప్రక్షాళన చేసుకుని  తమపై దేశం మోపిన బాధ్యతను  సవాలుగా స్వీకరిస్తామని  ప్రతిజ్ఞ చేసి వస్తే  దేశం యొక్క రూపురేఖలు మారుతాయి అనడంలో సందేహం ఏమాత్రం లేదు .

రౌడీ, కొంటెతనాన్ని  దృఢ హస్తముతో అణచివేయాలి:-

యువత పైన పెద్ద బాధ్యతను మోపుతున్న తరుణంలో  నేడు దేశవ్యాప్తంగా  కొనసాగుతున్నటువంటి రౌడీయిజం కొంటె పోకిరి చేష్టలు యువతలో  ఎక్కువగా ఉన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం . మద్యం మత్తు పదార్థాలు డ్రగ్స్  క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు  అశ్లీల  అసభ్యకర సన్నివేశాలలో పాల్గొనడం,  మద్యం మత్తులో అరాచక కార్యక్రమాలకు పూనుకోవడం  వంటి చేష్టల వలన యువత  నిర్వీర్యం అయిపోతున్న విషయం అందరికీ తెలుసు.  ఈ అవకాశాలన్నింటినీ అందుబాటులో ఉంచి చట్టబద్ధం చేసి  ప్రభుత్వాలు  యువతను నిర్వీర్యం చేసే ప్రయత్నం  కుట్రపూరితంగా జరుగుతున్నదని ఆరోపణచేస్తే తప్పేమిటి ? యువత, దేశ ప్రజలు బాగుండాలని గనుక ప్రభుత్వాలకు ఆలోచన ఉంటే  ఇలాంటి సామాజిక రుగ్మతలకు దారి తీసే సన్నివేశాలు సందర్భాలు అవకాశాలు  మద్యం మత్తు పదార్థాలను డ్రగ్స్ను  నిషేధించి ఉక్కు పాదం మోపవచ్చు కదా!  ప్రభుత్వాలు  నిత్యం కట్టడి చేస్తున్నట్లు  ప్రచారం చేసుకోవడమే కానీ అవకాశాలను అన్నింటినీ చట్టబద్ధంగా కల్పించి  యువత మారాలంటే ఏ లా సాధ్యపడుతుంది ? వీటన్నింటిని రద్దు చేయడంతో పాటు కౌన్సిలింగ్ కేంద్రాలను నైపుణ్య కేంద్రాలను  విరివిగా స్థాపించడం ద్వారా యువతలో ఉన్నటువంటి శక్తియుక్తులకు అనుగుణమైనటువంటి  కోర్సులు ఆలోచనలు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది . ప్రతిభావ0 తమైన రాజకీయ యంత్రాంగం తో పాటు  స్ఫూర్తి కలిగినటువంటి ఉన్నతాధికారులు కూడా పాలనకు అవసరమే కదా!  ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఈ ఎస్ ఐఎఫ్ఎస్  తో పాటు  ఉన్నతాధికారులుగా ఈ దేశ పాలనలో ప్రధాన పాత్ర పోషించడానికి  నేటి యువత నుండి ఎంపిక చేసుకుంటున్నప్పుడు  యువతను నిర్వీర్యం కాకుండా చూడవలసిన బాధ్యత పాలకులకు లేదా ? మత్తులో ఊరేగుతూ అత్యాచారాలు హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడి అభద్రతా వాతావరణాన్ని సృష్టించడానికి యువత పెద్ద మొత్తంలో ప్రయత్నం చేస్తూ ఉంటే  దేశం యువత పైన ఆశలు పెట్టుకుంటే  ఈ సంఘర్షణ నుండి  ఎలా బయటపడగలుగుతాం?  ఆరోగ్య సంస్కారవంతమైన  ప్రగతి  చోదక శక్తులుగా యువతను
రూపుదిద్దే క్రమంలో   రౌడీయిజం గూండాయిజం కొంటెతనంతో  కాలయాపన చేస్తూ  అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారి పైన పోలీసులు అధికారులు ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణచివేసి  కౌన్సిలింగ్ కేంద్రాల ద్వారా సంస్కరించి  దేశానికి అందించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.

ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే ఎక్కువగా యువత ఉందని  సంబరపడితే  ప్రయోజనం ఏమున్నది?  ఆ యువత అన్ని రంగాలలో  ముఖ్యంగా పాలనా రంగంలో  క్రియాశీల భూమిక పోషిస్తే  మెరుగైన ఫలితాలను ఆశించడంలో తప్పులేదు . ఆ వైపుగా దేశ యువతను అన్ని రకాల ఆటంకాలు , వ్యవస్థాగత లోపాలు,  పాలనాపరమైన డొల్లతనం నుండి  కాపాడుకోగలిగితే  ప్రపంచ దేశాలకు భారతదేశం ఆదర్శంగా ఉంటుందని  ఆశించడం అతిశయోక్తి కాదు.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333