హమాలీ కార్మికుల 3వ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి

జోగులాంబ గద్వాల 26 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:-
హమాలీ కార్మికుల మూడవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షులు ఏ. వెంకటస్వామి కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో మహాసభలకు సంబందించిన కరపత్రాన్ని కార్మికుల తో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం) జోగులాంబ గద్వాల జిల్లా మూడవ మహాసభలు ఈనెల 22న అనగ బుధవారం జరగనున్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక వాల్మీకి కమ్యూనిటీ హల్ లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు హజరు కానున్నారని తెలిపారు. గ్రామీణ,పట్టణ ప్రాంతాల ప్రజలకు వస్తు, సేవలను అందించడంలో, ఎగుమతి, దిగుమతులలో ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పట్టికి హమాలీల భద్రత కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా, కార్మిక చట్టాలకు సవరణ ద్వారా కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తున్నారని విమర్శించారు.కార్మికులు సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు లేకుండా, బేరసారాలు ఆడే హక్కు లేకుండా,కార్మిక వర్గాన్ని శ్రమ దోపిడీ చేసే విధానాలకు పాల్పడుతున్నదని విమర్శించారు.హమాలీ కార్మికుల ఉపాధికి భద్రత కల్పించకపోవడం వల్ల, కార్మికులు అభద్రత భావంతో జీవనాన్ని నెట్టుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల కాలంలో పని చేస్తున్న హమాలీ కార్మికులు అనేక మంది తీవ్రంగా గాయపడి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.మహాసభలలో గత మూడు సంవత్సరాలలో హమాలీల కోసం చేసిన పోరాటాలు చర్చించి, భవిష్యత్ ఉద్యమాలకు ప్రణాళికలు రూపకల్పన చేస్తామని అన్నారు.కావున జిల్లా లోని బజారు,ట్రాన్స్ ఫోర్ట్, సివిల్ సప్లై, దాన ఫ్యాక్టరీ, రైస్ మిల్స్ తో పాటు గ్రామీణ హమాలీలు పాల్గొని మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పేర్ నరసింహ, హమాలీలు,విష్ణు,నరేష్,తిరుపతన్న, నరసింహ,వెంకటరాజ,పవన్ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.