ప్రత్యక్ష ప్రసారాల ద్వారా పాలక ప్రతిపక్ష సభ్యుల చేష్టలను ప్రజలు గమనిస్తారు జాగ్రత్త!
పరస్పర విమర్శల ద్వారా వాస్తవాలే మిటో? తెలంగాణ ద్రోహులు ఎవరో? తేలిపోతుంది.* పిల్లి పాలు తాగినట్లు ఎవరూ చూస్తలేర నుకోవడం మూ ర్కత్వమే.* తప్పులను అంగీకరించడం, మెరుగైన సూచనలు ఇవ్వడమవసరం.
************
----వడ్డేపల్లి మల్లేశం 90142 06412
----24--07...2024*******
పార్లమెంట్ తో పాటు రాష్ట్రాల శాసనసభల కార్యకలాపాలను టీవీలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షిస్తున్న సందర్భంలో పాలకవర్గాల నిజాయితీ,దురుషుతనం, ప్రతిపక్షాల ఎత్తుగడలు వికృత చేష్టలు పరస్పర ఆరోపణలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు అన్నీ కూడా బయటపడే ఆస్కారం ఉంటుంది. చర్యకు ప్రతిచర్య లాగా విమర్శకు ప్రతి విమర్శ ప్రశ్నకు సమాధానం లో కూడా ప్రశ్నించిన వారి యొక్క లోపాలను ఎత్తి చూపడం ఒకవైపు ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున మంత్రులు ఇచ్చే సమాధానాలలో దృష్టికి రాని అనేక అంశాలు కూడా ప్రస్తావనకు రావడం అనేది క్రియాశీలకమైన అంశం . ప్రజల్లో రాజకీయ ఆత్రుత, స్ఫూర్తి, చొరవ, జిజ్ఞాస పెరిగిన కొద్దీ పార్లమెంటు అసెంబ్లీల కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడానికి అవకాశం కుదిరింది. అయితే ఎవరు నిజాయితీగా వ్యవహరిస్తున్నారు? ఎవరు దుందుడు కు చర్యలకు పాల్పడుతున్నారు? అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారు? అనే విషయాలను రాజకీయ పార్టీల యొక్క వాదనల ద్వారా తెలుసుకోవడానికి ఇది పెద్ద వేదిక ? అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా వ్యవహరిస్తూ హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనిచేసి ప్రతిపక్షంలోకి రాగానే ప్రభుత్వం యొక్క నియంత్రణ నిర్బంధము అణచివేతను విమర్శించడం ద్వంద వైఖరి కాదా? .తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 23-7-24 నుండి జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు టిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సభకు హాజరవుతానని క్రియాశీలక పాత్ర పోషిస్తానని ప్రకటించడం జరిగింది కానీ గత రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న హాజరు కాలేదు పైగా ముఖ్యమంత్రి బాధ్యత గల ప్రతిపక్ష నాయకునిగా సభకు హాజరు కాకపోవడాన్ని తప్పు పట్టిన సందర్భంలో మాజీ మంత్రి టిఆర్ఎస్ తరఫున మాట్లాడుతున్న కేటీఆర్ గారు " మీ ప్రభుత్వాన్ని తట్టుకోవడానికి మేము చాలు మా నాయకుడు అవసరం లేదు మాతోని గెలవండి" అనే ధోరణిలో వ్యవహరించడం విచారకరం . మా నాయకుడు అవసరం లేదు మేమున్నాము కదా అని అనడం అంటే ఆదిపత్యాన్ని ,అహంభావాన్ని, అహంకారాన్ని ప్రదర్శించడమే అవుతుంది. ప్రతిపక్ష నాయకుడు లేనప్పుడు మాత్రమే ఇతరులు బాధ్యత వహించాలి కానీ ప్రతిపక్ష నాయకుడు అందుబాటులో ఉండి కూడా తొలిసారి సమావేశాలు నిర్వహించినప్పుడు రాకపోవడాన్ని తప్పు పట్టిన జనం ఈసారి రాకపోతే ప్రజలు ఏమనుకుంటారో అనే ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వానికి దురుసుగా సమాధానం ఇవ్వడం బాధ్యత రాహిత్యమే! అంటే తమ అనుభవము తమ ముందు ప్రభుత్వం ఎంత అనే ధోరణి మంచిది కాదు . అయితే ప్రభుత్వం నిజాయితీగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ప్రజాస్వామ్య బద్దంగా అన్ని పార్టీలకు అవకాశాలను కల్పించాలి, ఆ రకమైనటువంటి చర్యలు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లేవు .ప్రభుత్వ పెద్దలు ఎక్కువ సమయం తీసుకుని ప్రతిపక్షాలకు అవకాశం లేకపోగా బయటికి గెంటివేసిన సందర్భాలు అనేకం .ఇదేమిటి అని ప్రశ్నిస్తే మీ హయాంలో కూడా మీరు బహిష్కరించలేదా ? అని సమాధానం ఇచ్చినారే తప్ప ప్రతిపక్షాల యొక్క హక్కులను కాపాడిన సందర్భం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా స్పీకర్ను కోరుతూ "ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వండి, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ నిర్ణయాన్ని మరింత బలోపేతం చేద్దాం" అని కోరడం అంటే ప్రజాస్వామిక విలువలను కాపాడినట్లే .
ఇక టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో 50 రోజుల పాటు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కోణం లో ఆలోచిస్తూ సుమారు 50 మంది ఆత్మహత్య లేదా గుండెపోటుతో మరణించడాన్నీ మనం గమనించి ఉన్నాం. అంతేకాదు బదిలీలు 317 జీవో ప్రకారంగా నిర్బంధం చేసినప్పుడు కూడా కనీసం 30 మంది ఉద్యోగులు ఆత్మహత్యల పాలై న విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు గత పాలనలో ఏనాడు జరగలేదు అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ఆ తప్పిదాలను అంగీకరించకపోగా ఎప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారు? ఆర్టీసీ యూనియన్లను ఎప్పుడు తిరిగి పునరుద్ధరిస్తారని ప్రశ్నించడం అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్ర0 చేయదు కానీ నిన్న మొన్న అధికారానికి వచ్చిన కాంగ్రెస్ మాత్రం వెంటనే అమలు చేయాలని కోరడం అంటే బాధ్యతను విస్మరించడం, తప్పులను ఇతరుల మీద నెట్టడమే అవుతుంది . ప్రజాస్వామ్యానికి ప్రతీక అని చెప్పుకున్న టిఆర్ఎస్ ఆర్టిసి యూనియన్ లను రద్దుచేసి నిర్బంధంగా నాయకత్వాన్ని తొలగించి కేవలం ఒక పూట భోజనం పెట్టి ఆహ్వానించినటువంటి ఆర్టీసీ కార్మికులతో సంతోషంగా గడిపి చేతులు దులుపుకోవడం ఎవరికీ తెలియదు ? ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సంబంధించి బిల్లును ఆమోదించి గవర్నర్ గారికి పంపినప్పుడు పూర్వాపరాలను వేతన విధానం అనేక అంశాలను గవర్నర్ ప్రస్తావించినప్పుడు తర్వాత ఆలోచిస్తామని మొదలు బిల్లును ఆమోదించమని ఒత్తిడి చేసిన సందర్భంలో అది అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే తిరిగి ప్రస్తుతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి సందర్భం రాకుండా ఉండాలంటే సున్నితంగా పరిశీలించి కమిటీని వేసి కచ్చితంగా విలీనం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సమాధానం ఇచ్చినప్పటికీ మాజీ మంత్రి హరీష్ రావు గారు తొందరపాటులో ప్రభుత్వాన్ని విమర్శించడం అవమానించడం వంటి దుష్టచేష్టలను ప్రజలు గమనిస్తున్నారు మీకు ఒకనీతి మరొకరికి ఒకనీతియా? అని ముక్కున వేలు వేసుకునే ప్రమాదం లేకపోలేదు జాగ్రత్త !
పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరూ చూస్తలేరని అనుకుంటుంది అనేది ఒక సామెత అదే మాదిరిగా టిఆర్ఎస్ నాయకుడు కూడా తాము అధికారంలో ఉన్న నాడు అనేక తప్పులు చేసి ప్రస్తుతము మేము నిజాయితీగా ఉన్నామని చెప్పుకుంటే గతంలో చేసిన పాపాలు జరిగిన లోపాలు ప్రజలు ప్రజాస్వామికవాదులు గుర్తించకుండా ఉంటారా? ఒకవేళ దృష్టికి రాకపోతే టిఆర్ఎస్ పాపాలను కడిగి వారి లోపాలను సభ దృష్టి తీసుకురావడానికి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్య మంత్రితో సహా అందరూ నిర్మోహమాటంగా ప్రకటించిన తీరు తోనైనా టిఆర్ఎస్ నాయకులు తమ యొక్క వేగాన్ని తగ్గించుకుంటే మంచిది .తాము అధికారంలో ఉo టేనే ప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే చులకనగా చూడడం, అవమానించడం ముఖ్యమంత్రికి గతంలో మంత్రి పదవి కూడా చేసిన అనుభవం లేదని హేళన చేయడం వంటి సంస్కృతిని ప్రతిపక్షం మానుకోకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఆర్థికంగా అప్పుల పాలు చేసి, అరాచకత్వానికి పాల్పడి, పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గానికి వంతపాడి, రైతుబంధు పేరుతో 80 వేల కోట్లలో సుమారు 26 వేల కోట్ల రూపాయలను అప్పనంగా కట్టబెట్టినటువంటి విధానం పేద వర్గాలకు చేసిన ద్రోహం బహుశా ప్రజలందరికీ తెలిసే ఉంటుంది . అంతేకాదు అమలు చేసిన ప్రతి పథకంలోనూ గొర్రెల పంపకము ప్రాజెక్టుల నిర్మాణము చేక్ డాముల నాణ్యత లో అనేక లోపాలు దొర్లి ప్రస్తుతము బో ను లో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది .అంతేకాదు ఫోన్ టాపింగ్ తో పాటు జరిగిన అన్ని రకాల అవినీతిపైన విచారణకు ప్రభుత్వం ఆదేశించి ఉన్న సందర్భంలో కూడా ప్రభుత్వాన్ని ఖాతరు చేయకుండా వ్యవహరించడం అది కూడా చట్టసభలో ప్రజలందరూ చూడంగా దురుసుగా మాట్లాడడం అవివేకమే అవుతుంది . ప్రభుత్వమైనా ప్రతిపక్షమైన ప్రజలకు సమానమే బాధ్యతను విస్మరించి ఇష్టారాజ్యంగా వ్యవహరించి హక్కులను కాలరాస్తే ఏ వర్గాన్ని అయినా ప్రజలు ప్రజాస్వామికవాదులు సహించరని ప్రభుత్వం ప్రతిపక్షాలు గుర్తిస్తే మంచిది . ఉచి తాలు తాయిలాలను ప్రకటించడమే నిజంగా పెద్ద పొరపాటు అయినప్పటికీ టిఆర్ఎస్ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించిన పాపానికి అమలు చేయడంలో కొంత ఇబ్బంది అవుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ ఖాళీ ఖజానాతో బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా రైతు రుణమాఫీ ని ఆగస్టు 15లోగా పూర్తి చేయడానికి ప్రారంభించి ఒక దఫా జమ చేసిన సందర్భంలో కూడా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రతిపక్షం ఇతర రాజకీయ పార్టీలు అంగీకరించకపోవడం విచారకరం. టిఆర్ఎస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండానే దాటవేసి , ప్రజాధనాన్ని దుర్వినియో గం చేసి, సుమారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చడమే కాదు గ్రామపంచాయతీలకు ఇతర ఉద్యోగులకు సిబ్బందికి కాంట్రాక్టర్లకు ఇవ్వవలసినటువంటి కోట్లాది రూపాయలను బకాయి పెట్టిo ది నిజం కాదా? థా ము చేయని పనులన్నింటినీ కూడా వెంటనే చేయాలని పెండింగ్ నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం అంటే నేల విడిచి సాము చేయడమే .నేల విడిచి సాము చేస్తే ఏమవుతుందో ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ తెలుసుకుంటే మంచిది అతిగా పోకుండా ఆలోచనతో పరస్పర చర్చలు విలువైన సూచనలతో ప్రతిపక్షం తన పాత్రను పోషిస్తే ప్రజలు ఆదరిస్తారు, గౌరవిస్తారు, కానీ ప్రభుత్వాన్ని బెదిరించే ధోరణితో వ్యవహరిస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గుర్తిస్తే మంచిది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ )