సమాజ వ్యతిరేక టీవీ ప్రసారాలను  ఖండించరు ఎందుకు?

Aug 4, 2024 - 12:50
Aug 26, 2024 - 17:44
 0  4
సమాజ వ్యతిరేక టీవీ ప్రసారాలను  ఖండించరు ఎందుకు?

నిర్లిప్తత  బాధ్యతారాహిత్యం  ఇంకెంతకాలం?*
విద్యావంతులు, బుద్ధి జీవులు,  మహిళలు,  ప్రజాస్వామిక వాదులు  ప్రతిఘటించాలి  కదా.*  జరుగుతున్న అకృత్యాలు, అరాచకాలు, అత్యాచారాలు, హత్యలకు  మూలం టీవీ ప్రసారాలలో  లేదంటారా ?*
*************
----వడ్డేపల్లి మల్లేషము 9 0 1 4 2 0 6 4 1 2
----25...06...2024*******
సమాజంలో జరుగుతున్న  అత్యాచారాలు హత్యలు, దోపిడీలు  దగా మోసాలు వంచన వంటి సామాజిక రుగ్మతలకు  పరిష్కారం చూపే విధంగా ఉండాలి కానీ టీవీలలో  వస్తున్న ప్రసారాలు  మనిషిని మరింత అంధకారంలోకి నెట్టి వేయడాన్ని మనమందరము అనునిత్యం గమనిస్తూనే ఉన్నాం . చూసే వాళ్ళు కొందరు,  ఆలోచించే వాళ్ళు కొందరు,  చూడకుండానే వదిలేసేవాళ్ళు, మరికొందరు  ఇలా జరగకుంటే బాగుండేదేమో అని తమలో తామే అనుకొని  మర్చిపోయే వారు మరికొందరు.  మరి అలాంటప్పుడు   నిషేధించవలసినవి,  ప్రసారం చేయకూడనివి,  ప్రదర్శించకూడనివి , నిక్కచ్చిగా నిర్మోహమాటంగా యాజమాన్యానికి ప్రభుత్వానికి  నిషేదించాలని చెప్పేవారు ఎవరు?  .సమాజం ఎదుర్కొంటున్న   వ్యక్తిగత, సామూహికమైనటువంటి అంశాలకు పరిష్కారాన్ని చూపీ,  దురలవాట్ల జోలికి పోకుండా  మరింత సంస్కారంగా బాధ్యతాయుతంగా  వ్యవహారికంగా  మనిషిని నిర్మాణం చేయవలసిన స్థానంలో ఉన్నటువంటి టీవీ ప్రసారాలు  యాజమాన్యం  ఆలోచన,  రచయితల  అనాలోచిత  వ్యాఖ్యలు,  వ్యాపార ధోరణి , సానుకూల దృక్పథం నుండి వ్యతిరేక దృక్పథం వైపు నెట్టే  అసంబద్ధమైన ప్రసారాలు ఈనాడు  క్షణకాలం టీవీ ప్రసారాలను చూసే వారి కోసం  కొంత ఆనందాన్ని లేదా  టైం పాస్ ను కలిగించవచ్చునేమో కానీ  ఆ సన్నివేశాలు సమాజం మీద చూపుతున్నటువంటి దుష్ప్రభావం అంతా ఇంతా కాదు.  మంచి కంటే చెడు ఆలోచనలే బలంగా ఉన్నటువంటి ఈనాటి సమాజంలో  ఇప్పటికే యువత పే డదారిన పోతూ,  ఉపాధి ఉద్యోగ అవకాశాలు కరువై, ప్రభుత్వాల విధాన లోపంతో  తల్లిదండ్రులకు బరువై , నిర్వేదం  ఆత్మ న్యూనతకు గురై  దు రలవాట్ల బారిన పడుతూ ఉంటే  అలాంటి సన్నివేశాలను సందర్భాలను ప్రసారాలలో చూపించకుండా ఉండాల్సినది పోయి  మద్యపానం  సేవించే సందర్భాన్ని తెరమీద చూపిస్తూనే  మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే చిన్న ప్రకటన ఓ మూలన దర్శనమిస్తుంది . పొగ తాగడం వలన  క్యాన్సర్ ఇతర భయంకరమైనటువంటి రోగాల బారిన పడుతూ  లక్షలాదిమంది ఏటా చనిపోతూ ఉంటే  సిగరెట్లు బీడీలు ఇతర ఉత్పత్తులకు సంబంధించి  పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు అనుమతిస్తూ  వాటి వల్ల జరిగే అనర్థాలను ఆలోచించకుండా కేవలం లాభాపేక్షతోనే యజమానులు ప్రవర్తిస్తే  సామాజిక బాధ్యత విస్మరించే ప్రభుత్వాలు  మంచి చెడులను ఆలోచించకపోవడంతో  అకాల మరణం పాలై మానవ వనరులు ఈ దేశంలో  కొల్లగొట్టబడుచున్నవి.  తద్వారా అనేక కుటుంబాలు  కన్నవాళ్లను కొన్నవాళ్లను కోల్పోయి వీధిపాలు కావడం  మన అనుభవంలోనిదే కానీ ప్రభుత్వానికి , అధికారులు, పోలీసు వ్యవస్థ  దృష్టికి ఈ అనాలోచితం చర్యలు ఎందుకు
       రావడం లేదు? పొగ త్రాగే సన్నివేశాన్ని తెరమీద చూపిస్తూ  పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం క్యాన్సర్కు కారకం అని  పరోక్షంగా నొక్కి చెప్పడం   వంటి అనాలోచిత చర్యలు  ఎవరి ప్రయోజనం కొరకు ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు.  కొద్దిమంది నటీనటుల ఉపాధి,  నిర్మాతలు దర్శకల యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు లాభాలు,  సంభాషణలు కథ  కు సంబంధించి రచయితల యొక్క ఆరాటము గుర్తింపు తప్ప  చూస్తున్న ప్రేక్షకులు అందరికీ కూడా  ప్రత్యక్షంగా పరోక్షంగా అన్యాయమే జరుగుతున్నది . ప్రదర్శించేటువంటి సన్నివేశాల ద్వారా క్రూరత్వం,  మోసం, కపటం, కుట్ర , అసూయ ద్వేషాలు , అమానవీయ సంఘటనలు,  మానవ సంబంధాల విచ్ఛిన్నం  సమాజం నిండా విస్తరిల్లి  కలుషిత మనస్తత్వాలతో  సమాజం  కల్లోలం అవుతుంటే చూస్తూ ఆనందించడానికా ఈ టీవీ ప్రసారాలను అనుమతించేది ? మహిళలను అంగడి    సరుకుగా, ఆట బొమ్మగా,  ప్రచార వస్తువుగా  చూపించడంతోపాటు  వికృత పద్ధతిలో అంగంగా ప్రదర్శన  అర్ధ నగ్న ప్రదర్శనకు  ఆదేశించే వాళ్ళు ఆదేశిస్తే నటించే వాళ్లకు ఎందుకు  అభిమానం లేదో అర్థం కావడం లేదు.  ఇలాంటి సందర్భాలను సన్నివేశాలను నటనను  సినిమాలతో పాటు టీవీ ప్రసారాలలో వస్తున్నటువంటి అన్ని అశ్లీల సందర్భాలను  మహిళలు,  మహిళా సంఘాలు,  రచయితలు, మహిళా రచయితలు,  బుద్ధి జీవులు,  మేధావులు,  విద్యావంతులు,  స్పృహ చొరవ కలిగిన వాళ్లు  ఎవరు కూడా ఖండించకపోవడానికి కారణం ఏమిటి?  ప్రశ్నించకపోవడం ప్రతిఘటించకపోవడం అంటే దాన్ని చట్టబద్ధంగా సామాజికంగా ఆమోదించినట్లేనా?  మహిళా  దినోత్సవం సందర్భంగా  సాధికారత కోసం  గుర్తింపు గౌరవము పరస్పర సహకారము  స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం  పోరాడే మహిళలు  వెన్నుదన్నుగా నిలిచే రచయితలు సామాజిక కార్యకర్తలు బుద్ధి జీవులు  ఇంత  అశ్లీలంగా చూపిస్తూ ఉంటే  మహిళల ఉనికి కోసం మాట్లాడరెందుకు ? అవమానాన్ని  అణచివేయడానికి ప్రయత్నించరు   గుర్తింపు కోసం పాకులాడరెందుకు?  బానిసలుగా చూస్తే  వాస్తవాన్ని మరిచి భ్రమల్లో మునిగిపోతారెందుకు?
           నడుస్తున్న దృశ్చరిత్రకు  టీవీ ప్రసారాలు కారణమే :-
********
నిజజీవితంలో  మధ్యము మత్తు పదార్థాలు క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు  అశ్లీల అర్థనగ్న ప్రదర్శనలు  తద్వారా జరుగుతున్నటువంటి ఆకృత్యాలు అరాచకాలకు  టీవీ ప్రసారాలలో మూలం ఉంటే  టీవీ ప్రసారాలలో  ఉన్న అసంబద్ధమైన విధానాలు కొనసాగించడం వలన  నిజజీవితంలో మరిన్ని  ఆకృత్యాలు ఎక్కువ మొత్తంలో జరగడానికి ఆస్కారం ఉంది.
 అంటే నిజజీవితం-  టీవీ ప్రసారాల ప్రదర్శన  పరోక్షంగా ప్రత్యక్షంగా పరస్పరం ప్రభావితం చేసుకుంటున్నవి.  అయితే వీటన్నింటికీ బాధ్యులం మనమే అనీ అంగీకరించాలి . టీవీ ప్రసారాలలోని కొన్ని అంశాలను చూస్తే  అసహ్యము  సిగ్గుచేటు అనిపించక మానదు . పెళ్లయిన ఒక జంటకు  తొలిరాత్రి కావడానికి ఒక సంవత్సరం  పట్టినట్లుగా కథలో చూపిస్తూ  ఊహ జీవితంలో ఊరేగుతుంటే , ఆ సంవత్సరంలోపైన వారికి ఆ సౌఖ్యం లభించకూడదని  తోటి కోడలు ప్లాన్ వేసి  తనకు లేకపోయినా ఆ అనుభూతి తోటి కోడలుకు  అందకూడదని చేసే విష ప్రయోగాలు మనము కళ్ళారా   సీరియల్లో చూస్తూనే ఉన్నాం . ఇక మరికొన్ని సందర్భాలలో  తన కొడుకుకు పెళ్లి చేసినటువంటి తల్లి  కోడలు మీద అయీష్టంతో అక్కస్సుతో  మీ   శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తా అనే కుట్రలు  కూడా మనం గమనించవచ్చు.  కనీసం నిజజీవితంలో కూడా తారసపడని అనేక సన్నివేశాలను చెడు ఆలోచనలను ప్రేరేపించి   మంచిగా బ్రతికే వాళ్ళ జీవితంలో మంట పెట్టే దుశ్చర్యలకు  టీవీ ప్రసారాలు  కేంద్రం కావడం సిగ్గుచేటు.  అలాంటి కథలను సంభాషణలను సన్నివేశాలను రాస్తున్న రచయితలకు  సామాజిక స్పృహ లేకనా?  సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనే దురాలోచనా?  లేక  ఉపాధి కోసమా?  తమను తాము ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది . ముఖ్యంగా  ప్రభుత్వం  ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అకృత్యాలు అత్యాచారాలు, హత్యలకు  సీరియళ్లు కథాంశాలు  రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అనేక సందర్భాలలో మనం విని ఉన్నాము.  పోలీసుల వాంగ్మూలం లో కూడా  ఆ సందర్భాలు  దృష్టికి వచ్చిన  తర్వాత పోలీసులు విచారించడం , మేధావులు ఆలోచించడం,  మానసిక వేత్తలు కారణాలు చెప్పడం,  ప్రభుత్వాలు కమిటీలు వేసి దాకా వేచిచూచే ధోరణి   ఇకనైనా మానుకొని  పొరపాటు జరగకముందే  చెడును ప్రేరేపించే సందర్భాలు సన్నివేశాలు కతాంశాలను రద్దు చేయడమే కాదు అలాంటి వాటికి పూనుకున్న వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా  సమాజాన్ని గాడిలో పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది.  గుడ్డిగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయoటీ పరోక్షంగా  ఈ సమాజ విచ్చిన్నానికి తోడ్పడినట్లే  .!
విజ్ఞప్తి :-
            సామాజిక రుగ్మతలను తరిమికొట్టి  మరింత మెరుగైన స్థితిలో ఈ సమాజాన్ని చూడాలని బాధ్యతాయుతంగా కోరుకునే  భారతదేశ పౌరులారా?  నిత్యం అడుగడుగునా అవమానానికి గురవుతున్న  మహిళల్లారా ! ఆలోచించి తమ శక్తి యుక్తులను దేశానికి ధారబోసే వయస్సులో ఉన్న యువకుల్లారా! యువతుల్లారా!  స్వచ్ఛందంగా మీరే బహిష్కరించండి . ప్రభుత్వం మీద  నిరసన తెలపండి.  మీ కుటుంబ సభ్యులకు  తల్లిదండ్రులకు  ఈ వైపుగా చైతన్యం కలిగేలా ఆలోచన  కలిగించండి.  కోటి కారణాలతో విచ్ఛిన్నమవుతున్న ఈ సమాజాన్ని  రక్షించుకోవడానికి, మానవ సంబంధాలను మరింత  ఉన్నతంగా పునరుద్ధరించుకోవడానికి  100% ఆటంకం అవుతున్న టీవీ ప్రసారాలు సీరియల్ లను  ప్రక్షాళన చేయడానికి , వ్యతిరేక అంశాలను  తిప్పి కొట్టడానికి అందరం ఒక్కటవుదాం  !ఐక్యంగా ఉద్యమిద్దాం ! మహిళామూర్తులకు  అండగా ఉందాం!  వారి ఆత్మ గౌరవాన్ని పరిరక్షిద్దాం.!
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రక్షితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  రాష్ట్రం (చౌటపల్లి)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333