కేంద్ర నిపుణుల బృందం  సిఫారసులను  రాష్ట్ర ప్రభుత్వం  సీరియస్ గా తీసుకోవాలి

Apr 7, 2024 - 18:13
 0  6

విద్యార్థులకు ఇచ్చే మధ్యాహ్న భోజనం  కడుపు నింపిల్ కాతే సరిపోదు పోషకాహారం  అందించాలి.

ఆడంబర ప్రకటనలకు పరిమితం కాకుండా  అమలు చేసి చూపాలి.

-- వడ్డేపల్లి మల్లేశం 

ఇటీవల మధ్యన భోజనంలో  రాగి జావా  ఇతర పోషకాహార పదార్థాలను అందిస్తున్నట్లు  ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రం ప్రకటించినప్పటికీ  ఆచరణలో పోషకాల  డొల్లతనం బయటపడినట్లు కేంద్ర నిపుణుల బృందం సర్వే ద్వారా తెలుస్తున్నది . కడుపు నింపడానికి కంటి తుడుపు చర్యగా మధ్యాహ్న భోజనం ఉండకూడదు.  విద్యార్థులందరూ భోజనం చేసే విధంగా ప్రోత్సహించడంతోపాటు అందుకు అనువైనటువంటి ఆహారాన్ని అందించినప్పుడు మాత్రమే  పిల్లలు ఇష్టపడి తింటారు  దా నికి సార్థకత చేకూరుతుంది.  పాలకులు మారినా   పిల్లల పట్ల విద్యారంగం పట్ల ప్రభుత్వానికి శాస్త్రీయ దృక్పథం లేకుంటే  ఎన్ని ప్రభుత్వాలు మారినా  ఆచరణలో  నిండు సున్నా . యాదాద్రి, ఖమ్మం జిల్లాల్లో గత నవంబర్21___28వరకు  పర్యటించిన కేంద్ర బృందం ఆధారంగా,  భోజనము తింటున్న విద్యార్థుల  సంఖ్యను అంచనా వేసినప్పుడు  2017- 18 నుండి 2023 నవంబర్ నాటి వరకు చూస్తే కూడా  ఒకటి నుండి 5వ తరగతిలో విద్యార్థులు  సరాసరిగా 85%  మంది విద్యార్థులు భోజనం చేస్తుంటే  6 నుండి 8 తరగతి విద్యార్థులు  80 శాతం మంది మాత్రమే భోజనం చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే  మిగతా విద్యార్థులు భోజనం చేయకపోవడానికి  గల కారణాలను అన్వేషించడంతోపాటు  పథకం యొక్క లక్ష్యo విద్యార్థులకు చేరాలంటే  పోషకాల గనిగా  మధ్యాహ్న భోజనం ఉండవలసిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే భావి భారత పౌరులు  ఆరోగ్యంగా,  భవిష్యత్తు  ఆరోగ్యభారతంగా  వెలుగొందే అవకాశం ఉంటుంది.

 నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా ఏటా మూడు నాలుగు రోజులపాటు  ఆయా ప్రాంతాలను కేంద్ర  జాయింట్ రివ్యూ మిషన్  పేరిట మధ్యాహ్న భోజన పథకము  థీ రును పరిశీలించడంతోపాటు  ఆయా రాష్ట్రాలకు తగిన సిఫారసులు చేయడం ఈ కమిషన్ యొక్క ఉద్దేశం.   భువనగిరి యాదాద్రి ఖమ్మం జిల్లాలో  కేంద్ర రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో పాటు హైదరాబాదులోని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తలతో కలిసి  పర్యటించిన అంశాలను  పరిశీలించిన విషయాలను  నమోదు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఘాటైన సూచనలు చేయడం జరిగింది.

   కేంద్ర బృందం పరిశీలనలో తేలిన చేదు వాస్తవాలు:-

   యాదాద్రి  భువనగిరి ఖమ్మం జిల్లాలో తనిఖీ చేసిన 78 పాఠశాలల్లో  పది రోజుల భోజన పట్టికను పరిశీలించిన ఆధారంగా  మధ్యాహ్న భోజనం తింటున్న వారి శాతాన్ని గమనించినప్పుడు  74 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది.  అంతేకాదు  యాదాద్రిలో 20 శాతం ఖమ్మంలో 22 శాతం మంది విద్యార్థులు  పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు  గమనించిన బృందం  ప్రాథమిక తరగతి విద్యార్థులు 100 గ్రాములకు గాను  67 గ్రాములు మాత్రమే  బియ్యం తీసుకుంటున్నట్లు  ప్రాథమిక ఉన్నత తరగతుల వారు  150 గ్రాములకు బదులు  92 గ్రాములు మాత్రమే తింటున్నట్లు  తేల్చింది.  ఇక కూరగాయలు 75 గ్రాములకు బదులు 49 గ్రాములు మాత్రమే అందిస్తున్నట్లుగుర్తించిన కేంద్ర బృందం  బడులలో పప్పు ధాన్యాలు లేకుండానే వండిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం నిధులు ఇచ్చిన కొత్త వంట పాత్రలను రాష్ట్ర ప్రభుత్వం  ఏజెన్సీలకు సమకూర్చలేదని, బియ్యం కూరగాయలు వంటివి దాచుకోవడానికి స్టోరేజ్ పాత్రలు లేకపోవడం,  మధ్యాహ్న భోజన పోషక విలువలపై తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం వంటి అంశాలను  కమిటీ సీరియస్ గా పరిగనించినట్లు తెలుస్తోంది.  అంతేకాదు పథకం అమలు పైన కూడా  సోషల్ ఆడిట్ నిర్వహించకపోవడంతో  అటు ప్రభుత్వం ఇటువంటి ఏజెన్సీలు  విద్యార్థులతో చెలగాటమాడుతున్నట్లు ఈ సంస్థ తేల్చింది. ." సర్కారు పాఠశాల లోపల అమలు చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజనము చిన్నారుల కడుపు  నింపుతున్నది తప్ప  ఆహారం అందించడం లేదు.  ప్రాథమిక  పాఠశాల విద్యార్థులకు రోజుకు 450 కిలో క్యాలరీలు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు 700 కిలో క్యాలరీల శక్తి అందవలసి ఉండగా  పిల్లలకు అందిస్తున్న పోషక ఆహారం  ఆ మేరకు  అందించడం లేదని  కేంద్ర బృందం తప్పు పట్టింది.  పథకంలో ఉద్దేశించిన ప్రకారంగా తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనెలు, కూరగాయలు , ఇతర ఆహార పదార్థాలు  సరిగా లేకుండానే విద్యార్థులకు భోజనం సరఫరా   చేయడం రాజ్యాంగ ఉల్లంఘన"  అనీ కేంద్ర బృందం తప్పు పట్టింది.

  ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులంతా పేద మధ్యతరగతి వర్గాల నుండే వస్తున్నారు కనుక  ఆర్థిక భరోసాతో పాటు ఆరోగ్య పరిరక్షణలోనూ పోషకాహారాన్ని అందించడం ద్వారా వారిని  మిగతా సమాజంతో  పోటీపడే విధంగా తయారు చేయడం బాధ్యతగా భావించినది కేంద్ర ప్రభుత్వం.  రాష్ట్రాల సహకారంతో ప్రారంభించిన మధ్యాహ్న భోజనం
మొక్కుబడి కాకూడదు అని ఎన్ని విమర్శలు చేసినా  గత టిఆర్ఎస్ ప్రభుత్వం  లో ఎన్నో పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం తెలిసిందే.  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన  లోపాలను సవరించి కేంద్ర బృందం సూచించిన సిఫారసులను పరిగణనలోకి తీసుకొని  సంపూర్ణ సమగ్ర పోషకాహారాన్ని  నిపుణుల కమిటీతో గుర్తింపచేసి  అమలు చేయడానికి శ్రద్ధ తీసుకుంటుందని ఆశిద్దాం.  గత పాలకుల మాదిరిగానే మొక్కుబడి మూస ప్రభుత్వంగా కొనసాగితే  ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా లేరు అని ప్రభుత్వం గుర్తిస్తే మంచిది.  రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రుల నుండి  వార్డు సభ్యుని వరకు కూడా అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతూ , అక్రమార్జన, భూకబ్జాలు చేస్తూ సంపన్నులుగా తయారవుతుంటే  చూసి చూడనట్లు వ్యవహరించే ప్రభుత్వ సంస్థలు రాజ్యాంగ సంస్థలు  రాజ్యాంగబద్ధంగా పొందవలసినటువంటి పోషకాహారం  హక్కును చిది మేస్తున్న తీరు  అత్యంత విచారకరం.  ఇలాంటి పరిస్థితులలో న్యాయ వ్యవస్థ కూడా జోక్యం చేసుకొని  ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇవ్వడం  సామాజిక బాధ్యతగా భావించవలసి ఉంది.

 కేంద్ర నిపుణుల బృందం  రాష్ట్రానికి చేసిన సిఫారసులు :-

పై అధ్యయనం కేవలం రెండు జిల్లాలకు మాత్రమే పరిమితమైనది  ఇక రాష్ట్రమంతా పరిశీలించినట్లయితే ఇంతకంటే మరింత అద్వాన్నంగా ఉండే ప్రమాదం కూడా లేకపోలేదు.  అందుకే రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం ద్వారా కలెక్టర్ల ఆధ్వర్యంలో  నిరంతరం పరిశీలింప చేసి  కట్టుదిట్టంగా అమలు చేయడానికి పూనుకుంటే మంచిది.
---  నిబంధనల మేరకు పప్పులు, కూరగాయలు ఇతర పదార్థాలతో భోజనం వండి పెట్టేలా ఒక యంత్రాంగాన్ని నియమించుకోవాలి.  పిల్లలకు నిర్దేశించిన స్థాయిలో  తగిన శక్తిని ఇచ్చే ఆహారం  అందించాలి.
---  అనేక చోట్ల ప్రతిరోజు కోడిగుడ్లు ఇవ్వాలని ప్రజలు కోరినట్లు  తెలిపిన రివ్యూ కమిటీ  పాలు మజ్జిగ కూడా ఇవ్వాలని కోరినట్లు  డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వాటినీ సమకూర్చడానికి సిద్ధపడాలి అని సూచించడం జరిగింది .
--- రాష్ట్రస్థాయిలో సమీక్ష కమిషన్లను నియమించి  మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును తరచూ సమీక్షించి  రాష్ట్ర జిల్లా స్థాయిలో అధికారులు క్రమం తప్పకుండా పాఠశాలలను సందర్శించడంతోపాటు  అమలు తీరును పటిష్టంగా పర్యవేక్షించాలి. దోషులపై చర్యలు తీసుకోవాలి.

---   కట్టెల పొయ్యి బదులు గ్యాస్ సిలిండర్ ల ద్వారా వంట చేయాలని  కమిషన్ సూచించింది  .

--పోషక విలువలు గల తృణధాన్యాలను కనీసం వారానికి ఒక్కరోజైనా  మెనూలో చేర్చాలని సిఫారసు చేసింది .

రాష్ట్ర ప్రభుత్వం ఈ సిఫారసుల  రివ్యూ కమిటీ  గుర్తించిన లోపాల ఆధారంగా  రాష్ట్రస్థాయి విద్యావంతులు నిపుణులు మేధావుల కమిటీని ఏర్పాటు చేసి  ఆ కమిటీ ఆధ్వర్యంలో  మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత బలవత్తరంగా  అమలు చేయడం ద్వారా తన నిబద్ధతను చాటుకోవాలి.  పేద పిల్లలకు  పుష్టికరమైన ఆహారాన్ని  అందించే రాజ్యాంగ విలువలను  కాపాడాలి అని ప్రజలు ప్రజాస్వామి కవాదులు, తల్లిదండ్రులు,  విశ్లేషకులు కోరుతున్నారు. పై పరిస్థితులు  తెలంగాణలోనే కాకుండా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా భారతదేశంలోని అనేక రాష్ట్రాలలోనూ కూడా కొనసాగుతుండవచ్చు.  కనుక కేంద్రమే  మరింత చొరవ తీసుకొని  అధ్యయనం, పరిశీలనతో పాటు పెద్ద మొత్తంలో నిధులను రాష్ట్రాలకు అందించడం ద్వారా  ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పేద విద్యార్థుల పట్ల తమ నిబద్ధతను సామాజిక బాధ్యతను చాటుకుంటే ప్రజలు సంతోషిస్తారు.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333