2024 ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాం

Mar 30, 2024 - 23:14
 0  2

అవినీతిని అసలే సహించం,  ఇండియా టుడే సదస్సులో ప్రధాని మోదీ  వ్యాఖ్యలను ఎలా చూడాలి ?

ఈసారి ఎన్నికల్లో గెలుపు మాదే అంటూ  మూడోసారి చేయాల్సిన పనులు  చాలా ఉన్నాయి

అంటే పదేళ్ల కాలంలో ప్రజల సమస్యలు  పరిష్కారo  కానట్లా?

రాబోయే వెయ్యేండ్ల ప్రణాళిక తమ వద్ద ఉందంటే  అర్థం ఏమిటి.?


----వడ్డేపల్లి మల్లేశం 


 కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో  దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి  ప్రతిపక్ష అధికార పార్టీకి  చెందిన ప్రభుత్వాలు రాష్ట్రాలలో ఉన్నప్పటికీ  మౌలికమైన విషయాలలో సమన్వయముతో పనిచేయవలసి వుంటుంది. అయినా మద్యం, మత్తు, అత్యాచారాలు, అసమానతలను కట్టడి చేసిన దాఖలాలేదు.  అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీల పైన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా  ప్రశ్నించి ప్రతిఘటించి  చట్టసభల్లో నిలదీసినందుకు  ఈడి సిబిఐ దాడులకు పురమాయిస్తున్నది అనే అపవాదు  ఉండనే ఉన్నది . అంతేకాకుండా రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం,  మానవ హక్కుల కమిషన్  వంటి సంస్థలను నిర్వీర్యం చేసినది అనే అపవాదు కూడా మూటగట్టుకున్నది.  అదే సందర్భంలో  పెట్టుబడిదారీ వర్గానికి చెందినటువంటి  ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్లే అందరికీ  ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు  బకాయి పడిన 14 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసినట్లుగా  విమర్శలకు గురవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆ విషయం పైన స్పందించలేదు సమాధానం ఇవ్వలేదు.  అంతేకాకుండా  ఇతర దేశాలలో ఉన్న నల్ల డబ్బును దేశానికి రప్పించి ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలను జమ చేస్తామని ఏటా 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని ఇచ్చిన హామీ హామీగానే మిగిలిపోయినది.  అంతేకాకుండా బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టరాల్ బాండ్లు అంతర్జాతీయ స్థాయి బలవంతపు  రాకెట్ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించడాన్నీ కూడా  దేశ ప్రజలు గమనించి భవిష్యత్తు ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవలసి ఉంది . దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుమారు 300 ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మాణం చేస్తే  క్రమంగా  ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమై ప్రైవేటుకు అప్పజెప్పి  పేద సామాన్య ప్రజలకు అవకాశాలు లేకుండా చేసిన సందర్భాన్ని  ప్రభుత్వం ఏనాడు కూడా వ్యతిరేకించలేదు అంటే  ప్రైవేటీకరణకు పూనుకున్నట్లే కదా !
   . ఈ పరిస్థితులలో మార్చి 16 2024  శనివారం  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజుననే  ఇండియా టుడే సదస్సులో,ఇతరత్రా ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడిన కొన్ని మాటలు చేసిన ప్రకటనలు  దేశ ప్రజలు గుర్తిస్తే మంచిది .
ప్రసంగంలోని కొన్ని అంశాలు
*********
-- హెడ్లైన్లు కాదు డెడ్లైన్ కోసం పనిచేస్తున్నామన్న ప్రధాని
2024 ఎన్నికలు ప్రస్తుతం జరగనున్న నేపథ్యంలో  2029 లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నామని  అంతటితో మాత్రమే ఆగకుండా 2047 ఎన్నికల కోసం కూడా పనిచేస్తున్నట్లు పేర్కొనడం.

 ఈ దేశంలో అధికారాన్ని  ప్రజల కోసం వినియోగించడానికి కాకుండా శాశ్వతం చేసుకోవడానికి  ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నెగ్గీ అధికారాన్ని నిలబెట్టుకొని  దేశ ప్రజలకు నిర్ణయాత్మక విధానాల రుచి చూపించడంతోపాటు కీలకమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయబోతున్నట్లు ప్రధాని ప్రకటించడం  అంటే తమ పదేళ్ల పదవీకాలంలో పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశామని  లబ్ధిదారులపై ఎంతో ప్రభావం చూపగలిగామని   చెప్పి  రాబోయే  కాలంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అంటే అర్థం ఏమిటి .-- కాలం చెల్లిన చట్టాలను నియంత్రణలను తొలగించామని  ప్రధాని గుర్తు చేసినప్పటికీ  ప్రజల ఆమోదం, రైతాంగ ప్రమేయం లేకుండా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి  13 మాసాల రైతు పోరాటం తర్వాత  నల్ల చట్టాలను ఉపసంహరించుకొని నిండు సభలో జాతికి క్షమాపణ చెప్పిన మాట వాస్తవం కాదా? -- దేశమే ముఖ్యం అనే నినాదంతో తాము ముందుకు సాగుతున్నామని కానీ  ప్రతిపక్షాలకు కుటుంబమే  ముఖ్యమని   విమర్శిస్తూనే స్థిరమైన సమర్థవంత
మైన  దేశ   నిర్మాణం  వచ్చే ఐదేళ్ల కాలానికి ప్రపంచానికి ఇవ్వబోతున్న గ్యారెంటీ అని  ప్రకటించడం అంటే  ప్రజలు సందేహించక మానరు.  బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని పదేపదే  వల్లే వేస్తుంటే 400 సీట్లు వస్తే  రాజ్యాంగాన్ని  మార్చి చూపిస్తామని బిజెపి ఎంపీ హెచ్చరించడాన్నీ ఎలా చూడాలి? స్థిరమైన సమర్థవంతమైన ప్రభుత్వం అంటే అధికారాన్ని నిరంతరం కొనసాగించడమేనా?
--  అవినీతి పైన కటినంగా  వ్యవ హారిస్తామని దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛ ఇచ్చామని సహించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన ప్రధాని  కాలేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వానికి ఏటీఎం గా మారిందని అవినీతిపైన చర్య తీసుకుంటామని పదే పదే ప్రకటన చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి.  ఇటీవల ప్రధాని దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుండి విముక్తి అయినట్లు ప్రకటించినప్పటికి మూడవసారి అధికారానికి వచ్చిన తర్వాత పేదరికం అవినీతిపై యుద్ధం వేగవంతం చేస్తామని తేల్చి చెప్పడంలో ఔచిధ్యం ఏమిటి? దేశ ప్రగతి కోసం రాబోయే 1000 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయి అంటే ఇది నమ్మశక్యమా? భ్రమల్లో ముంచెత్తడమే అవుతుంది.
           వివిధ    సందర్భాలలో మాట్లాడుతూ  ప్రధాని  గత 70 ఏళ్లలో ప్రభుత్వాలు సృష్టించిన  అసంబద్ధ విధానాలను  సవరించినామన్న ప్రభుత్వం  ఏ టా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ మాత్రం నెరవేర్చకపోవడాన్ని ప్రజలు  ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి .  దేశం వెలిగిపోతుందని, స్వావలంబన సాధిస్తున్నదని, ఆత్మవిశ్వాసాన్ని ప్రజల్లో పెంచామని ,వికసిత భారత్ అనే లక్ష సాధనకు  కృషి చేస్తున్నట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రకటన లు కాకుండా పేదరిక నిర్మూలన , ఉపాధి అవకాశాల మెరుగుదల, దారిద్రేక దిగున గల వారి శాతాన్ని తగ్గించడం, అసమానతులను నిర్మూలించడం, సంపద కేంద్రీకరణను  ఉక్కు పాదంతో అణిచివేయడం, సమానత్వాన్ని సాధించడం  వంటి కీలక అంశాలను నిస్మరించిన కేంద్రం అంగీకరించితీరాలి.  ఇటీవల రామ మందిరం నిర్మాణం కూడా ప్రజల  ఎజెండాగా మార్చిన తీరు  చర్చ అయితే బాగుంటుంది.  ప్రజా ప్రయోజనాలు ముఖ్యం కానీ ఉత్పత్తిలో భాగస్వాములై క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పేద సామాన్య ప్రజానీకానికి బడ్జెట్ రూపకల్పన లోను  ప్రణాళికలలోనూ  ప్రాధాన్యత ఇవ్వని
 ధోరణిని మార్చుకోవాలి.  రాజ్యసభలో 36% లోక్సభలో 83% నేరస్తులున్న పార్లమెంటు  దేశాన్ని ఎలా వెలిగింప చేస్తుందో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇటీవల చర్చకు పట్టు పట్టినటువంటి  ప్రతిపక్ష  143 మంది పైన బహిష్కరణ వేటు వేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినది నిజం కాదా ? ప్రశ్నించే గొంతులను అణచివేసే  ప్రభుత్వం  మూడవసారి అధికారంలోకి వస్తే ఇక ఏం చేస్తుందో ఆలోచించుకుంటే మంచిది  .ప్రభుత్వం చెప్పే మాటలు వినడం కాదు ప్రజల డిమాండ్లను పరిష్కరించడానికి పాలకులు సేవకులుగా మిగిలి ప్రజలను ప్రభువులు గా చూడగలిగే నూతన వ్యవస్థ ఆవిర్భావం కోసం ఆరాటపడదాం. అందుకు సరైన పోరాటాన్ని ఉద్యమ రూపంలో తీసుకువద్దాం.  లౌకిక సమానత్వ సామ్యవాద సిద్ధాంతాలకు  జీవం పోస్తున్న ప్రత్యామ్నాయ వ్యవస్థను అధికారంలోకి తీసుకురావడమే  సందర్భోచిత మని విశ్లేషకులు విజ్ఞులు అభిప్రాయపడుతున్న వేళ  రాబోయే ఎన్నికల్లో ఒక్కసారి ఆలోచిద్దాం.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు   అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333