సుపరిపాలనo టే మానవాభివృద్ధి ని సాధించడమే

Apr 7, 2024 - 12:21
 0  1

ప్రజల కొనుగోలు శక్తిని పెంచి,  దారిద్రరేఖ దిగువన గల వారిని  పేదరికం నుండి విముక్తి చేయడం  ప్రభుత్వ లక్ష్యం కావాలి.

సంపద సృష్టించి ప్రజలందరికీ పంచి సమసమాజాన్ నిస్థాపించే లక్ష్యం పాలకులకు  ఉన్నదా ?

-- వడ్డేపల్లి మల్లేశం

ఇప్పటికీ 15 శాతానికి పైగా  ప్రజలు దారిద్రరేఖ దిగువన  అద్వాన్న పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే , సుమారు 15 కోట్ల మంది వలస కార్మికులుగా రెక్కాడితే  కానీ డొక్కాడని స్థితిలో  బతుకు నావ  నడిపిస్తూ ఉంటే,  సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం  ఈ దేశ ప్రతిష్టకు గౌరవానికి  మంచిది కాకపోగా అవమానకరం కూడా.  రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్  క్రమంగా ఈ దేశంలో సమ సమాజాన్ని స్థాపించాలనే లక్ష్యంతో  ప్రజలకు రాజ్యాంగబద్ధమైన హక్కులను సాధించిపెట్టే క్రమంలో  అనేక ఏర్పాట్లు చేయగా  సమానత్వం, న్యాయం,  సౌబ్రాతృత్వం ,సామ్యవాదం వంటి  మౌలిక అంశాలు రాజ్యాంగ పీఠికలో  పొందుపరచుకోవడం కూడా పాలకులకు  మార్గాన్ని నిర్దేశించడమే కదా ! ఇప్పటికీ 50 శాతం సంపద పైగా  1 శాతంగా ఉన్న సంపన్న వర్గాల చేతిలో  పోగుపడి ఉంటే  సంపద కేంద్రీకరణను ఆదేశిక సూత్రాలు నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నా సమానత్వాన్ని సాధించడానికి తగిన చర్యలు తీసుకోవడానికి పాలకులకు ఎదురవుతున్న ఆటంకాలు ఏమిటో అర్థం కావడం లేదు.  పైగా పాలకవర్గాలు పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థల కొమ్ము కాయడంతోపాటు  కేంద్ర ప్రభుత్వం 14 లక్షల కోట్ల పైచిలుకు  అత్యంత సంపన్న వర్గాల  బ్యాంకు రుణాలను మాఫీ చేసినది అంటే  పేదల నోట్లో మట్టి కొట్టడానికి కాదా?

మానవాభివృద్ధిని సాధించే దిశగా కృషి జరగాలి:-

  అంతరాలు, వివక్షత, ఆర్థిక అసమానతలకు  వారసత్వం విద్యా అక్షరాస్యతతో పాటు అనేక కారణాలు ఉన్నప్పటికీ  సమానత్వాన్ని సాధించే దిశగా పాలకులు చేయవలసిన కృషిలో చిత్తశుద్ధి లేకపోవడం వలన  ఈ అంతరాలు మరింతగా పెరిగిపోతున్నాయి.  ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు ఉచితాలు,  కూడా  ఒకానొక దశలో పేదవర్గాలతో పాటు సంపన్న వర్గాలకు కూడా వర్తిస్తున్న కారణంగా కూడా  పేదలు మరింతగా  పేదలైతే సంపన్నులు మరింతగా  సంపద పోగు చేసుకుంటున్నారు అంటే అసమానతలను మరింత పెంచి పోషించడమే కదా!  కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు ముఖ్యంగా   ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో గత పాలన అంతా కూడా  సంపన్న వర్గాలకు దొ చిపెట్టిన విధంగా  తీసుకున్న చర్యలు మరింత  పేదరికాన్ని  పెంచి పోషించినట్లే.  ఈ దేశంలో  తమ కనీసమైన అవసరాలను  సంతృప్తికరంగా తీర్చుకోవడానికి,  మౌలిక సౌకర్యాలను అనుభవించడానికి,

విద్యా వైద్యం న్యాయం  ఉపాధి వంటి అవకాశాలను  సంతృప్తికరంగా అనుభవించడానికి  గల అవకాశాలను ఆధారంగా చేసుకుని ప్రముఖ ఆర్థికవేత్త భారతదేశ  నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ అమర్త్యసేన్  సూచించిన "మానవాభివృద్ధిని " ఈ దేశంలో ఇప్పటికీ సాధించకపోవడం  సిగ్గుచేటు కాదా!  "ప్రజలు తమ కనీస అవసరాలను తీర్చుకోలేని గడ్డు పరిస్థితిని  దారిద్ర రేఖ దిగువన గల స్థితి" అని  ఆర్థిక పరిభాషలో అంటే  ఇప్పటికీ ఆ గట్టు పరిస్థితిలో 15% మంది  కొట్టుమిట్టాడుతున్నారంటే ఈ పాలకులు గత 77 ఏళ్లుగా ఎవరి ప్రయోజనం కోసం పని చేసినారో అర్థం చేసుకోవచ్చు.  ప్రజల కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచి,  అంతరాలను సాధ్యమైనంత తగ్గించే ప్రయత్నం చేయడంలో కృతకృత్యులు కావలసిన పాలకలు  విద్యా, వైద్యము,  రవాణా, ఇతర మౌలిక  అవసరాలలో ప్రజలు తమ ఆదాయంలో  60 శాతానికి పైగా  ఖర్చు చేస్తుంటే  కొనుగోలు శక్తిని గణనీయంగా కోల్పోతుంటే  ప్రేక్షక పాత్ర వహిస్తే  సంపద ఎలా  సృష్టించబడుతుంది? పేదలకు ఎలా అందుతుంది?

     ఉచితాలు,  థాయిలాలు, హామీలు, వాగ్దానాలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అనేక రాజకీయ పార్టీలు  అధికారానికి రాగానే  పార్టీ ప్రచార కార్యక్రమాలు  అధికార దుర్వినియోగం  ఆధిపత్యం ముసుగులో  కాలయాపన చేస్తూ  అసమానతులను తగ్గించే కృషి ఏమాత్రం చేయకపోవడం వలన  పైగా ప్రచారం కోసం ఉన్నత వర్గాలకు  తోడ్పడే దుష్ట రాజకీయాలకు పాల్పడడంతో  పేదలు, నిస్సహాయులు, అభాగ్యులు నిరాశతో  నిట్టూర్పు విడుస్తున్నారు . .అదే సందర్భంలో తమ హక్కుల రక్షణ కోసం  పోరాట మార్గం వైపు కూడా ఆలోచిస్తున్నారు.  ఈ స్పృహ పాలకులకు లేకుంటే  ఏనాడో ప్రతిఘటన తప్పదు  ఆ పోరాటంలో  పాలకులకు పరాభవం మరీ తప్పదు.  9న్నర సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో  టిఆర్ఎస్ పాలన  ఉన్నత వర్గాలకు  భూస్వాములకు పెట్టుబడిదారులకు మాత్రమే తోడ్పడగా  పేదవాళ్ళను యాచకులుగానే మిగిల్చిన సందర్భం మనందరికీ తెలుసు.  రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో కొత్తగా వచ్చిన  ప్రభుత్వం  గత పాలనకు భిన్నంగా, ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా, పేదరికం నిరుద్యోగం ఆకలి చావులు ఆత్మహత్యలను  తరిమికొట్టే విధంగా పాలనపై  దృష్టి సారించాలి.  కుటుంబాల ఆదాయాలను పెంచాలి, దారిద్రరేఖ దిగువ నుండి పైకి తీసుకురావాలి, మానవాభివృద్ధిని  సర్వత్రా సాధించాలి,  అసమాన తలను తగ్గించాలి, పెట్టుబడిదారులు సంపన్న వర్గాలపై

సమానత్వ సాధన కోసం పేదరిక నిర్మూలన కోసం భారీగా  పన్నులను విధించడం ద్వారా  ప్రభుత్వ  ఖాతాకు పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చుకోవాలి.  ప్రభుత్వాన్ని ఎన్నుకునేది , మద్దతు ప్రకటించేది,  దేశ ఉత్పత్తిలో భాగస్వాములయ్యేది  కార్మిక కర్షక  పేద వర్గాలే అనీ ప్రభుత్వం మర్చిపోకూడదు.  ఉత్పత్తిలో భాగస్వాములై సంపదను సృష్టించే  సామాన్య ప్రజానీకం పట్ల పాలకులకు ఇంత నిర్లక్ష్యం తగదు.  77 సంవత్సరాల

సుదీర్ఘ పాలనలో కూడా  ప్రణాళిక, వ్యూహాలు, ఎత్తుగడలు, చిత్తశుద్ధి, పేదల పట్ల  అనురక్తి లేని కారణంగా  అంతరాలు మరీ పెరిగిపోవడం  పాలకుల యొక్క నిర్లక్ష్యానికి  నిలువుటద్దం.  అంతేకాదు  మద్యపానం ,ధూమపానం, మత్తు పదార్థాలు,  కల్తీ ఆహార పదార్థాలు,  క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లు,దాబాలు, అశ్లీల నృత్యాలు,  అరాచక కార్యక్రమాలు, అత్యాచారాలకు  మూలమైనటువంటి దుష్ట సంస్కృతిని పెంచి పోషిస్తున్నది కూడా ప్రభుత్వ వర్గాలే అనేది నగ్న సత్యం.  ఈ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకొని  పాలకులను కట్టడి చేసి  ప్రజల పక్షాన పోరాడి  పేదరికం తరిమికొట్టే విధంగా ప్రభుత్వానికి మార్గ నిర్దేశం చేయాల్సిన అవసరం ఉన్నది.  న్యాయ వ్యవస్థ కూడా ఇందులో విజయం సాధించకపోతే  ఇక మిగిలింది ప్రజా పోరాటమే.  ప్రజల పక్షాన  మద్దతు అందిస్తున్న మేధావులు, బుద్ధి జీవులు, మానవ హక్కుల కార్యకర్తలనపై  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  ఉపా దేశ ద్రోహ చట్టాలు మోపి  నిర్బంధం పేరుతో అణచివేస్తుంటే  తాత్కాలికంగా ప్రభుత్వాలు సేద తీరవచ్చు కానీ  శాశ్వతంగా ఓటమిపాలు కాక తప్పదని గుర్తించడం  ప్రజా ఉద్యమాల పైన అవగాహన ఉన్న ఏ ప్రభుత్వానికైనా  తప్పదు.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333