విద్యార్థి సంఘాలు నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలి
డీఎస్సీ, గ్రూప్2 వాయిదా వేయాలని అంశంపై సంఘ బాధ్యులు మేధావులు విద్యావేత్తలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి .
ఉద్యమాలు లేకుండా సమస్యలు పరిష్కారం కావు,అయితే ప్రభుత్వం అప్రతిష్ట పాలు కాకుండా చూసుకోవాలి.
--- వడ్డేపల్లి మల్లేశం
గత బారా సా పదేళ్ల పరిపాలనా కాలంలో విద్యా వైద్య సామాజిక రంగాలు బ్రష్టు పట్టిన విషయం మనందరికీ తెలుసు .అంతేకాదు ముఖ్యంగా రైతు బంధు పేరుతో అప్పనంగా కోట్లాది రూపాయలను భూస్వాములకు కట్టబెడితే భూమిలేని నిరుపేదలు కూలీలకు ఒరిగింది ఏమీ లేదు అనే వివక్షత అప్రతె ష్ట ఆనాటి ప్రభుత్వం మూటగట్టుకోక తప్పలేదు . అంటే పాలకులు ప్రజలు విభిన్న వర్గాలు నిరుద్యోగులు యువత రైతులు అన్ని వర్గాల ఆమోదముతో పరిపాలన చేసినప్పుడు మాత్రమే అది జనరంజకమైన పాలన కానీ ఏ వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా సమస్యలు వచ్చినప్పుడు ఆ వర్గాలతో చర్చించకుండా ఒంటెద్దు పోకడతో నిరంకుశంగా వ్యవహరిస్తే అది ఏ ప్రభుత్వానికైనా ప్రమాదకరమే . గత ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలకు పైగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలకు సంబంధించి సుమారు 6 వేలకోట్ల నిధులు మంజూరు చేయని కారణంగా అనేక విద్యాసంస్థలు సంబంధిత విద్యార్థులకు ద్రువ పత్రాలు ఇవ్వడం లేదని అనేక రకాలుగా ఇబ్బందుల గురి చేస్తున్నారని గతంలో అనేకసార్లు పోరాటం చేసిన గత ప్రభుత్వం వాయిదా వేసి తిరుగు ముఖం పట్టినది అందరికీ తెలుసు . ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి కూడా గత బకాయిలతో పాటు ప్రస్తుత నిధులను కూడా మంజూరు చేయాలని విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు, యువత దృష్టికి తీసుకు వచ్చినట్లు అయితే గతాన్ని పక్కనపెట్టి ప్రస్తుత నిధులను ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కొందరు విద్యార్థి నాయకులు ఆరోపించడాన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గత బకాయిలను చెల్లించకుండా ప్రస్తుత సంవత్సరానికి చెల్లించడం సమంజసం కాదు .అందులో అనేక కష్టనష్టాల ఓ ర్చి పేద వర్గాల నుండి వచ్చిన వేలాది మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులు ఆ ప్పో సప్పో చేసి తమ పిల్లల చదివిస్తే వస్తాయనుకున్న డబ్బులు రాకపోవడంతో వీధిపాలవుతున్న విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది .
ముఖ్యంగా ఉపకార వేతనాలు బోధనా రుసుము బకాయిలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్తో 15 జులై 2024 సోమవారం రోజున బి ఆర్ కే భవన్ నుంచి ఏఐఎస్ఎఫ్ కు చెందిన విద్యార్థులు,నిరుద్యోగులు తెలుగు తల్లి విగ్రహము సచివాలయం వద్ద తమ డిమాండ్ల సాధనకై నినదిస్తూ ప్లే కార్డులు ధరించి నిరసన వ్యక్తం చేసిన వారిని ఎక్కడికక్కడ పట్టుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లుగా తెలుస్తున్నది. ఇందులో ఏఐ ఎస్ ఎఫ్ నాయకులతో పాటు బీసీ జనసభ బి ఆర్ ఎస్ వి నాయకుల అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది .ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ గత కొన్నేళ్లుగా చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లుగా తెలుస్తున్నది పైగా ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు ఏఐ ఎస్ఎఫ్ బాధ్యులు మాట్లాడుతూ గత కెసిఆర్ ప్రభుత్వం బోధనా రుసుములు ఉపకార వేతనాలను విద్యార్థులకు చెల్లించని కారణంగా ఎన్నికల్లో ఓడిపోయారని వారి ఓటమికి విద్యార్థుల యొక్క అసంతృప్తి ప్రధాన కారణమని నొక్కి చెప్పడాన్ని ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించకుంటే అసెంబ్లీ సమావేశాలను ముట్టడిస్తామని హెచ్చరించడం ఈ సందర్భంగా మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది.
గ్రూప్ 2 డీఎస్సీ వాయిదాకు డిమాండ్ :-
ఇక త్వరలో నిర్వహించే గ్రూప్ టు పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్ 2 పోస్టులను పెంచాలని,డీఎస్సీ వాయిదావేయాలని బీసీ జన సభ, టిఆర్ఎస్వి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 15 జూలై 2024 రోజున హైదరాబాదులో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం కూడా ఆలోచించదగినది . ముఖ్యంగా గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీలో జాప్యంతో పాటు లీకేజీకి పాల్పడి నిరుద్యోగులకు మోసం చేసిన విషయం తెలుసు .కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎంతో కొంత శాకచక్యంతో నోటిఫికేషన్లు జారీ చేయడంతో పాటు గతంలో సెలెక్ట్ అయిన వారికి నియామక ఉత్తరాలు వేతనాలు ఇవ్వడం కొనసాగుతూ డీఎస్సీ కూడా ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు డీఎస్సీ ని వాయిదా వేయాలని గ్రూప్-2ను వాయిదా వేయడంతో పాటు పోస్టులను పెంచాలని డిమాండ్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది . ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొందరి విద్యార్థులను చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో మరికొందరు నిరుద్యోగులు విద్యార్థి నాయకులను అరెస్టు చేసినట్లుగా తెలుస్తున్నది సచివాలయం ముట్టడికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో హాస్టల్లో చొరబడి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు బారాస విద్యార్థి విభాగంతో పాటు ఇతర విద్యార్థి నాయకులను నిరుద్యోగులను అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది .ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడంతో పాటు నిరసన వ్యక్తం చేయడం పోలీసులతో ఘర్షణకు దిగడం వంటి చర్యల తో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంటే కీలకమైనటువంటి డిఎస్సీ గ్రూప్ టు సంబంధించిన అంశాల పైన పోరాటం నిరసనలు ప్రధానం కాకుండా ఆ విభాగాల విద్యార్థి సంఘాల నాయకులను మేధావులను విద్యా విభాగం ప్రొఫెసర్లతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎదురయ్యే సాధకబాధకాలను చర్చించడం ద్వారా విద్యార్థులకు అందరికీ ఆమోదయోగ్యమయ్యే నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత . విద్యార్థులు అదే పనిగా నిరసనలు వ్యక్తం చేయడం డిమాండ్ చేయడం ప్రభుత్వం నిధుల మంజూరీకి గాని పరీక్షల వాయిదా గాని నిర్ణయం తీసుకోకుండా పోలీసులతో అరెస్టు చేయించడం గందరగోళానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. ప్రజాస్వామిక ప్రభుత్వమని మానవ హక్కు లను కాపాడుతామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పైన లాఠీచార్జి అరెస్టులు దాడులకు పాల్పడకుండా గౌరవప్రదంగా ఆయా వర్గాల ప్రతినిధులతో చర్చించడం ద్వారా పరిష్కారాన్ని కనిపెట్టడం ప్రభుత్వ ప్రతిష్టకు ఇచ్చిన హామీకి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఎంతో తోడ్పడుతుంది. ఆ విషయంలో విద్యార్థి నాయకులు నిరుద్యోగులు కూడా సానుకూల వైఖరిని అవలంబించి చర్చల ద్వారా పరిష్కరించుకోవడం చాలా అవసరం
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )