పేరుకే కిరాణం ...అమ్మేది మధ్యమే...

తిరుమలగిరి 29 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:
కిరాణ దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో తెల్లవారే వరకు బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. దాంతో చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంకా గ్రామం లోపలికి వెళ్తే కిరాణ దుకాణాల్లో, సొంత ఇళ్లల్లో పెద్ద పెద్ద ఫ్రీజర్లు పెట్టుకొని మరీ విక్రయిస్తున్నారు. మద్యం మత్తులో అక్కడే ఇళ్ల మధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తిరుమలగిరి మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కిరాణ దుకాణాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తూ జనాల దగ్గర బాగానే డబ్బులు సంపాదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో కల్తీ మద్యం తెప్పించి అమ్ముతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ విక్రయించరాదని ఆదేశాలున్నాయి. అయినా నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంది.తిరుమలగిరి మండలం లో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులు చిచ్చు పెడుతోంది. ఊరూరా బెల్టు షాప్ లు అందుబాటులో ఉండడంతో పొద్దంతా కష్టపడి పనిచేసి సంపాదించిన కూలీ డబ్బులు షాపులకు పెట్టాల్సి వస్తుంది. బెల్ట్ షాప్ లు గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీంతో సామాన్యులు పొద్దంతా పని చేసి డబ్బులతో మద్యం తాగుతూ సంసారాలను పాడు చేసుకుంటున్నారు. సంపాదన సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. మద్యానికి ఖర్చు చేస్తుండడంతో వారి కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితులు. మద్యానికి బానిసలైన కొందరు ఏ పని చేయకుండా ఉదయాన్నే వివిధ ప్రాంతాలలో బెల్టు షాపులకు చేరుకొని ఉద్దెర పెట్టి అప్పుల పాలవుతున్నారు. ఇంచుమించు ప్రతి గ్రామంలో మద్యం దుకాణాలు వెలిసి ఊరంతా ఏరులై పారుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు.పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు బెల్టు షాపులను అరికట్టాల్సిన ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో ఎన్ని బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు అనే పూర్తి సమాచారం ఎక్సైజ్ అధికారుల వద్ద ఉన్నా ఇప్పటివరకు ఏ బెల్టు షాపు పై దాడులు చేసిన దాఖలాలు లేవు. బెల్టు షాపుల నిర్వాహకుల దగ్గర మామూళ్లు తీసుకోవడంతోనే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తిరుమలగిరి మండల పరిధిలో వెలుస్తున్న బెల్టు షాపులను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు."