బి ఆర్ ఎస్ దూకుడుకు కళ్లెం వేయకపోవడం  కాంగ్రెస్ బలహీనథా?

Apr 25, 2024 - 22:46
Jun 27, 2024 - 20:39
 0  1
బి ఆర్ ఎస్ దూకుడుకు కళ్లెం వేయకపోవడం  కాంగ్రెస్ బలహీనథా?

వ్యూహాత్మక ఎత్తుగడనా? అబద్ధాన్ని నిజం చేస్తూ

పదేళ్ల పాలన గొప్పగా చెప్పుకుంటుంటే  

జరిగిన ద్రోహం ప్రజల తిరస్కారం  కాంగ్రెస్ వినియోగించుకోకపోతే ఎలా ?

కాంగ్రెస్ పార్టీ కోసం కాదు ఈ గోల ..

ఓట్లేసి గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని కాపాడాలనే ఆవేదన.

--- వడ్డేపల్లి మల్లేశం 

ప్రస్తుతం దేశంలో జరగబోతున్న  పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా  అనేక రాజకీయ పార్టీలతో పాటు స్వచ్ఛంద  ప్రజాస్వామిక సంస్థలు  రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే  ఉద్దేశంతో  ఎన్డీఏ ప్రభుత్వాన్ని  మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని  ప్రయత్నం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే . గత నవంబర్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  జాగో తెలంగాణ  నిరుద్యోగ తెలంగాణ జేఏసీ మేధావుల సంఘాలు  పెద్ద ఎత్తున  పదేళ్లుగా ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన బిఆర్ఎస్ పార్టీని ఓడించాలి అని ప్రజలకు పిలిపించిన విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి . బుద్ధి జీవులు మేధావులు ప్రజాసంఘాలు నిరుద్యోగులు ఈ రకంగా ప్రజల కోసం ఆరాటపడుతుంటే  అదే సందర్భంలో ప్రజలు కూడా  వాస్తవాలను గుర్తిస్తేనే  బుద్ధి జీవుల కృషికి నిజమైన న్యాయం దక్కుతుంది.  

 ఐదేళ్ల పరిపాలనను అంచనా వేయడానికి  ప్రజలకు ఎంతో అవకాశం ఉంటుంది కానీ  రాజకీయ పార్టీలు ప్రజలను బానిసలుగా యాచకులుగా మార్చిన కారణంగా  ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, తీసుకుంటున్న నిర్ణయాలు,  వైఫల్యాల పైన ప్రజలు స్పష్టమైన వైఖరిని అవలంబించడం లేదు. దానివల్ల  కొన్ని రాజకీయ పార్టీలు లబ్ధి పొందే అవకాశం ఉంది. కానీ నిజంగా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఇక్కడ నష్టపోతున్న విషయాన్ని మనం గమనించాలి  అందుకోసమే ఈ వాస్తవాన్ని ప్రజలకు విప్పి చెప్పడానికే మేధావులు బుద్ధి జీవులు ప్రజాసంఘాలు, కవులు రచయితలు, కళాకారులు రాజకీయ విషయాలలో ఎన్నికల సమయంలో ప్రజల పక్షాన నిలబడి  ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడానికి  ధైర్యంగా ముందుకు రావడాన్నీ సమాజం స్వాగతించాలి. లేకుంటే రాబోయే కాలంలో  ప్రజల  ఆకాంక్షలు గల్లంతయ్యే ప్రమాదం ఉంటుంది. దానికి గత పదేళ్ల  ఎన్డీఏ పాలన, తెలంగాణ రాష్ట్రంలో  పదేళ్ల టిఆర్ఎస్ పాలన,  పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఐదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైనది అనే ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో  ప్రజా సంఘాలది మేధావులది కీలక పాత్ర ఉంటుంది అని అంగీకరించాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం పై టీఆర్ఎస్ విమర్శ  కాంగ్రెస్ లో ఎందుకు ఈ స్తబ్దత?

  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తొలి ప్రభుత్వం టిఆర్ఎస్  మాత్రమే ఏర్పాటు చేసినది తదనంతర కాలంలో దేశవ్యాప్తంగా  జాతీయ పార్టీగా అవతరించడం కోసం బి ఆర్ఎస్ గా ఎప్పుడైతే పేరు మారిందో అప్పటినుండి ఆ ప్రభుత్వము పార్టీ యొక్క  ప్రతిష్ట గల్లంతు కావడాన్నీ గమనించవచ్చు. అంటే కేవలం తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా పనిచేసిన ఆ ప్రభుత్వం  ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి జాతీయస్థాయి కోసం ఆరాటపడిన క్రమంలో  పార్టీ పేరు కూడా  అపరిచితంగా  ప్రజలకు కనబడిన విషయం కాదనలేము.  ఇక తొలిదశ మలిదశ  రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ  ఇచ్చిన అనేక వాగ్దానాలను తుంగలో తొక్కి  ప్రజలకు ఇచ్చిన హామీలకు ఎలాంటి  గడువు విధించకుండా   అప్పులతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం మనందరికీ తెలుసు కనుకనే గత నవంబర్లో టిఆర్ఎస్ ఓటమిపాలైనది.  ప్రత్యామ్నాయంగా ప్రజల ఆకాంక్షలు మేధావుల  మద్దతు  రాష్ట్రంలో ఉన్న సంక్లిష్ట పరిస్థితి కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ  ప్రకటించినటువంటి  గ్యారెంటీలకు  గడువు విధించిన కారణంగా  ముఖ్యంగా టిఆర్ఎస్ బిజెపి  కూడా ప్రభుత్వాన్ని పదేపదే విమర్శించడం, నిలదీయడం, బెదిరించడం, లొంగదీసుకునే ప్రయత్నం చేయడం చులకనగా మాట్లాడడాన్ని మనం ఇటీవల గమనించవచ్చు.

 భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షం  ఇంతకాలం అధికారంలో ఉండి తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో  వైపల్యము చెంది హామీలను విస్మరించినటువంటి పార్టీ  బెదిరించడం అంటే  ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి  ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్టే లెక్క.  వందలాది హామీలను విస్మరించి,  కొన్ని నిర్ణయాలతో మాత్రమే ప్రజలను మభ్యపెట్టి,  పెన్షన్లు ఇతర ఆర్థికపరమైనటువంటి అవకాశాలను అందించి అదే ప్రభుత్వమని నమ్మబలికి  పరిపాలన చేసి  ఈ రాష్ట్ర పరిస్థితిని  సంక్షోభంలోకి నెట్టిన టిఆర్ఎస్ కు ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించే అధికారం ఎక్కడిది? ఈ విషయాన్ని కాంగ్రెస్, మిగతా పార్టీలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాయి  ?

అసెంబ్లీ ఎన్నికల సమీక్షా సమావేశాలలోనూ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశాలలోను టిఆర్ఎస్ అధినేత, వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి  అందరూ కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం ఏడాది లోపలనే రద్దవుతుందని శాపనార్థాలు పెట్టడం  ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో లేకుంటే మెడలు వంచుతామని  బూతు మాటలు అపరిపక్వ నిర్ణయాలు  బాధ్యతారాహిత్యంతో కూడుకున్నటువంటి ప్రశ్నలను గమనిస్తే  అధికార కాంగ్రెస్ ప్రభుత్వము తో పాటు మేధావులు కూడా స్పందించవలసిన అవసరం ఉన్నది అని అనిపిస్తున్నది.  ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషించాలి కానీ చిన్నపిల్లవాడి లాగా  వెకిలి చేష్టలు చేస్తే సహించే పరిస్థితులు ఉండవు.  అదిపత్య ధోరణితో అహంభావముతో  ప్రజలు తిరస్కరించినా కూడా brs  పట్ల కాంగ్రెస్  పార్టీ ఎందుకు స్తబ్దంగా ఉంటున్నది? అని  ప్రజలు ఆసక్తితో గమనిస్తున్నారు . ఇది తటస్థ వైఖరియా?  పట్టించుకోకపోవడమా?  అసమర్థతనా?  లేక వ్యూహాత్మక ఎత్తుగడనా?  కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరిని ప్రకటించవలసిన అవసరం ఉంది.  

 .ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చిన మాట తెలుసు  అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం జరిగింది  ఇంతవరకు రెండు పార్టీలలో ఏమీ తేడా లేదు. కానీ  కొంత గడువును ప్రకటించి  ఆ గడువు లోపల ఇవ్వకపోవడాన్ని నేరంగా చిత్రీకరించే  అనైతిక పద్ధతులకు ఇప్పటికైనా టిఆర్ఎస్ స్వస్తి పలకాలి.  గతంలో టిఆర్ఎస్ పాలనలో బిజెపిని  ముప్పు తిప్పలు పెట్టినటువంటి  టిఆర్ఎస్ పార్టీకి బిజెపి ఎందుకు మద్దతిస్తున్నదొ అర్థం కావడం లేదు. పైగా  ఆ రకంగా మద్దతు ఇవ్వడం అంటే తమ ఆస్తిత్థాన్ని కోల్పోవడానికి కారణం అవుతుందని బిజెపి తెలుసుకుంటే మంచిది.  టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో  ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల పరిస్థితులను అంచనా వేయడానికి బీజేపీ పార్టీ ఆనాటి అధ్యక్షుడు బండి సంజయ్ గారు  క్షేత్ర పర్యటనలు చేసినప్పుడు ప్రభుత్వ పక్షాన ఆ టంకాలు కల్పించి అడ్డుకొన్న  విషయం తెలిసిందే.  మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల కోసమని అనేక యాత్రలు కరువు యాత్రలు, పంటపొలాలను సందర్శిస్తున్నా  ప్రభుత్వం ఎక్కడైనా అడ్డుకున్న విషయం కనబడుతున్నదా,? ఇదే కదా పౌర హక్కులను ప్రజాస్వామ్య విలువలను కాపాడే విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. ఈ విషయాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులతో పాటు బిజెపి కచ్చితంగా గమనించాలి  అదే సందర్భంగా బిజెపి టిఆర్ఎస్ ను కచ్చితంగా  నిలదీయాల్సిన అవసరం ఉంది.  కానీ తోడు దొంగల్లాగా వ్యవహరించి  ప్రభుత్వాన్ని నిలదీసి ఎప్పుడూ అమలు చేస్తారని  పిచ్చోడి చేతిలో రాయి లాగా విసరడం  అవగాహన లేని మూర్ఖత్వమే అవుతుంది.

  ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్కడక్కడ కొంతమంది మంత్రులు  టిఆర్ఎస్ పార్టీని బిజెపిని వ్యతిరేక శక్తులను అడ్డుకుంటున్నప్పటికీ  అధికారంలో ఉండి కొన్ని ప్రయత్నాలలో సఫలమై కొన్ని వ్యవస్థలను  నిర్మాణం చేసి ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కేవలం గడువు ఇచ్చిన మాత్రాన తన వైఫల్యాన్ని  ఒప్పుకున్నట్లుగా స్తబ్దంగా ఉండడం  ప్రజాస్వామిక వాదులకు నచ్చడం లేదు.  వాస్తవ విషయాలతో పాటు ఆర్థిక పరిస్థితులు  శ్వేత పత్రాలు గతంలోనే ప్రజలకు తెలియ జెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఉన్న పరిస్థితులను ప్రజలకు నిర్బంధంగా తెలియజేయడం ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎత్తిచూపుతూ తమ ప్రభుత్వ హయాములో కచ్చితంగా అమలు చేస్తామని ఒక సుదీర్ఘమైనటువంటి  భరోసా ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది.

 అది ముఖ్య మంత్రి,   కాంగ్రెస్ అధినాయకత్వం,  రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు కూడా ఎక్కడికక్కడ టిఆర్ఎస్ను  కట్టడి చేయడమే కాదు  చేసిన తప్పులకు  జరిగిన వైఫల్యాలకు  మాట తప్పిన మోసాలకు  వాత పెట్టాల్సిన అవసరం కచ్చితంగా ఉన్నది దానికి ఎన్నికల సమయమే  గీటు రాయి . అధికారం కోల్పోయి నాలుగు మాసాలయిందో కాలేదో వెంటనే అధికారంలోకి వస్తామని సంవత్సరం కూడా నిలవదని పార్టీ నాయకులు మాట్లాడుతుంటే  అధికారకాంక్ష కోసం ప్రయత్నం చేస్తున్నారా? ప్రజల కోసమా? అని మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రజల కోసమే అయితే గత 10ఏళ్లలో ఎందుకు ప్రజలను విస్మరించినారు అని అడగడానికి కాంగ్రెస్కు ఎందుకు మనసొప్పడం లేదు?  గడిచిన పదేళ్ల అబద్దాల పాలనను నిజం చేసుకుంటూ నటిస్తూ ఉంటే ఆ నటనను  ఖండించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున తన అధికార యంత్రాంగాన్ని శాసనసభ్యులను పార్టీ శ్రేణులను ప్రజాక్షేత్రంలోకి దించాల్సిన అవసరం ఉన్నది.  వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో అడ్డుకోకపోతే  ఆదిపత్య భావముతో అదే మాదిరిగా    ప్రభుత్వాన్ని ధిక్కరించే దుష్ట సంస్కృతి బలపడినట్లయితే  ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు అని  ప్రజలు గుర్తించాలి  కాంగ్రెస్ తన శక్తిని పుంజు కోవాల్సిన అవసరం కూడా ఉన్నది . కాంగ్రెస్ పార్టీ యొక్క మౌనం  ఎత్తుగడ అని కొందరు  చెబుతున్నప్పటికీ  యుద్ధ భూమిలో కచ్చితంగా తన శక్తియుక్తులను  వినియోగించి పోరాడి శత్రుపక్షాన్ని ఓడించడమే లక్ష్యంగా యుద్ధనీతి చెబుతున్నప్పుడు  ప్రజలతో తిరస్కారానికి గురి అయినటువంటి టిఆర్ఎస్ పార్టీని వంచించడానికి ప్రభుత్వం ఇంత కష్టపడవలసిన అవసరం లేదు.  ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం కాదు ఈ గోలంతా ప్రజల కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం, తిరిగి అబద్ధాల ప్రభుత్వం రాకుండా అడ్డుకోవడం కోసమే అని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తే మంచిది.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333