పరిపాలనకు నిర్వచనం నిర్మాణాత్మక అభివృద్ధి సంక్షేమం
ఉచిత పథకాల పేరుతో మెజారిటీగా లబ్ధి పొందేది
రాజకీయ పార్టీలే .విద్యా, వైద్యం, మౌలిక సౌకర్యాలు,
ఉపాధి కల్పిస్తే ప్రజలు ఇక దేనికి ఆశించరు .
రాయితీల ద్వారా ప్రజలను నిరంతరం
యాచకులుగా చూడాలనుకోవడం అవివేకం.
అమాయకత్వం, వెనుకబాటుతనం బద్దలైతే
ఇక మిగిలేది ప్రతిఘటనే .
---వడ్డేపల్లి మల్లేశం
ఈ దేశంలో సంపన్న వర్గాలు ఉద్యోగులు వ్యాపారులు ఆర్థికంగా అన్ని హంగులతో ఉండవచ్చు కానీ పేద వర్గాలకు రాయితీలు ఇస్తేనే దేశం నష్టపోతుందా ?అని ప్రశ్నించే వాళ్లు కూడా లేకపోలేదు. ఇందులో కూడా కొంత వాస్తవం ఉంది కానీ వికలాంగులు, మతిస్థిమితం లేని వాళ్ళు , అనాధలు , వృద్దులు, నిరాదరణకు గురైన వారికి ప్రస్తుతం కొనసాగిస్తున్న పెన్షన్లు ఇవ్వడం పెద్ద అభ్యంతరం ఏమీ కాదు. కానీ రాయితీలు, ఉచితాలు, ప్రలోభాల పేరుతో ప్రభుత్వాలు పూర్తిగా పరిపాలనను విస్మరించడం అత్యంత శోచనీయం తద్వారా పరిపాలన యొక్క నిర్వచన మే మారిపోవడం భవిష్యత్తు తరాలకు ప్రమాదకరం. "మనం ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటాం అని ఒకసారి ఆలోచించుకుంటే ప్రజల ఉమ్మడి అవసరాలు రోడ్లు భవనాలు, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు, భద్రత ,విద్య వైద్యం, నీటిపారుదల సౌకర్యాలు, సామాజిక న్యాయం,
త్రాగునీరు, ప్రజలకు ఉపాధి అవకాశాలు ఉద్యోగాల భర్తీ తద్వారా నిర్మాణాత్మకమైన అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమాన్ని సాధించడం కోసమే అని అటు పాలకులు ఇటు ప్రజలు గుర్తించాలి" .కానీ ప్రజలను మభ్య పెట్టే చర్యలకు పాలకులు పాల్పడితే అలవాటు పడితే తాత్కాలిక ప్రయోజనాల కోసమే ప్రజలు ఎన్నికలు ఇతరత్రా పాలకుల మీద ఆధారపడడం వలన రాజ్యాంగబద్ధమైన తమ హక్కులను ప్రజలు కోల్పోయి యాచకులుగా మారుతున్నారు . ఈ ఉమ్మడి అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ప్రజల దగ్గర వివిధ రూపాలలో పన్నులు వసూలు చేస్తున్న క్రమంలో ఉమ్మడి అభివృద్ధికి కాకుండా కొద్ది మందికి ప్రయోజనం కోసం అందులో పెట్టుబడిదారులు భూస్వాములు సంపన్న వర్గాలకు దోచిపెట్టే కొన్ని ప్రభుత్వ పథకాలకు కోట్లాదినిధులు కేటాయించడం అభ్యంతరం కాక మరేమిటి? గతంలో తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పేరుతో సంపన్నులకు రైతుబంధు లోను భూస్వామ్య వర్గాలకు అప్పనంగా కట్టబెట్టిన విధానం నేరమే కదా.!కేంద్రం 14 లక్షల కోట్లు రుణమాఫీచేయడం సంపన్నులకు దోచిపెట్టడం కాదా! అలాంటి చర్యలపై న్యాయవ్యవస్థ ఉక్కుపాదం మోపాలి.
దేశ పరిస్థితులను ఒక్కసారి పరిశీలిస్తే:-
పేదవారున్న ధనిక దేశం భారత్ అని కొందరు ప్రవచిస్తే మరికొందరు సంపన్న వర్గాలు ఉన్నటువంటి పేద దేశం అని ప్రస్తావించడం రెండింటి అర్థం కూడా ఒక్కటే సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరించబడిన కారణంగా అత్యంత దయనీయ స్థితిలో కోట్లాది ప్రజానీకం కుమిలిపోవడం నిజం కాదా ! సంపద ఈ దేశంలో విచ్చలవిడిగా పెరుగుతున్నది కానీ ఉత్పత్తికి మూలమైనటువంటి సామాన్య ప్రజలు కార్మికులు కర్షకులు చిరు వ్యాపారులు చేతివృత్తుల వాళ్ళు వీది వ్యాపారులు ఆ సంపదను అనుభవించే విషయంలో మాత్రం వెనుకబడి పోతున్నారు. వారిని ప్రభుత్వం నిరంతరం పేదరికములో కొనసాగేలా ఒకరిపై ఆధారపడే విధంగా తయారు చేయడానికి ఈ ప్రలోభాలు రాయితీలు ఉచితాలు దోహదం చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. 40 శాతం సంపద ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో ఉన్నదంటే ఈ దేశంలో ఏ రకంగా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైనదో ఎవరి ప్రయోజనాల కోసం పాలకులు పనిచేస్తున్నారో తెలుసుకోవచ్చు. అందుకే ప్రభుత్వాలపైన పాలకుల పైన రాజకీయ పార్టీల పైన ప్రజలకు విశ్వాసం లేని పరిస్థితులలో గుడ్డిలో మెల్ల లాగా ప్రత్యామ్నాయ పార్టీలను ఎన్నుకోవడం తప్ప ప్రజల కోసం పనిచేసే పార్టీలు లేకపోవడం భారత రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న పెద్ద సవాల్.
డాక్టర్ అమర్త్యసేన్ ప్రకారంగా కనీస అవసరాలను తీర్చుకునే విధంగా పేదరికాన్ని తొలగించడానికి తోడ్పడే ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు ఆర్థికంగా దోహదం చేసే పథకాలను ప్రవేశపెట్టి ఉత్పత్తిలో భాగస్వాములను చేయడం ద్వారా మానవాభివృద్ధిని సాధించాలి. కానీ డబ్బును పంచడమే ప్రభుత్వ బాధ్యత అని అనుకుంటే ప్రజలు రేపటి గురించి మరిచి నేటి కోసమే ఆలోచించే దుస్థితి రావచ్చు . నిరుద్యోగాన్ని నిర్మూలించడం పేదరికాన్ని పారదోలడం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థికంగా నిలచుకోవడానికి భరోసా కల్పించడం ద్వారా మాత్రమే ప్రభుత్వ పథకాలు చేయూతనివ్వగలగాలి. ప్రభుత్వం చేసిన సహాయం ఉత్పత్తికి దోహదపడ్డప్పుడు సంపద సృష్టించబడుతుంది ఆ రకంగా వచ్చినది నిజమై న అభివృద్ధి . డబ్బులు పంపిణీ చేస్తే మద్యం షాపుల్లోకి క్లబ్బులు పబ్బుల్లో ఖర్చు పెట్టి పూ టగడుపుకోవడం ఏ రకంగా అభివృద్ధి అని ప్రభుత్వాలు అనుకుంటున్నాయో ఒకసారి గమనించాలి.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే క్రమంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణను ముమ్మరం చేయడం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించడం ద్వారా నాణ్యమైన ఉచిత విద్యను నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని భారీగా పెంచవచ్చు . తద్వారా ప్రజలు పొందే ఆదాయం ద్వారా వారి అవసరాలను స్వతంత్రంగా తీర్చుకునే స్వావలంబన శక్తి ఏర్పడుతుంది . చిన్న పెద్ద పరిశ్రమలను ప్రైవేటు రంగంలో ప్రోత్సహించడంతోపాటు అంతే స్థాయిలో సమాంతరంగా ప్రభుత్వ రంగంలో పరిశ్రమలను తెరిపించడం ,కొత్త పరిశ్రమలను ప్రారంభించడం, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడం, ప్రైవేటీకరించబడిన వాటిని తిరిగి ప్రభుత్వ యాజమాన్యంలో తీసుకోవడం ద్వారా ఉత్పత్తిని భారీగా పెంచినట్లయితే ధరలను కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. తద్వారా పేద వర్గాలు కూడా అన్ని రకాల అవకాశాలను పొందడానికి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక ప్రధానమైనటువంటి గృహవసతిని దేశంలోని ప్రతి ఒక్క కుటుంబానికి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదే సందర్భంలో మిగులు భూములను భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయడం ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించే ప్రయత్నం జరగాలి . ప్రజలను అమాయకులుగా, యాచకులుగా, బానిసలుగా భావించినంతకాలం పాలకుల ఎత్తుగడలు సాగవచ్చు కానీ పాలకుల కుట్రలను ఛేదించే సమయం ఆసన్నమైన రోజున ప్రజా ప్రతిఘటనకు పాలకులు బలికాక తప్పదు . నమ్మించి మోసగించి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రలోభాలతో పబ్బం గడుపుకోవడానికి అలవాటు పడిన రాజకీయ పార్టీలు జాగ్రత్త! ఆ దుర్మార్గపు లక్షణానికి కాలం చెల్లింది ఉచిత పథకాలు కేవలం నిర్భాగ్యులు అనాధలు అభాగ్యులు కొద్దిమందికి మాత్రమే. అశేష ప్రజానీకానికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ఉత్పత్తిలో భాగస్వాములను చేయడం ద్వారా సంపద సృష్టించే నిర్మాణాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే నిజమైన పరిపాలన అని పాలకులు ఇకనైనా సోయి తెచ్చుకోవాలి .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయి తల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)