డిజిటల్ రికార్డు ద్వారా ఆరోగ్య కార్డుల సరఫరాకు ప్రభుత్వ నిర్ణయ0 సముచితమే
ప్రారంభించడంతో పాటు దీర్ఘకాలికంగా ఎంత ఖర్చైనా ఉచిత వైద్యాన్ని అందించడం అంతే ముఖ్యం.
వ్యాపార దృష్టితో చూడకుండా ప్రజల ఆరోగ్యం సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు గుర్తించాలి.
మూన్నాళ్ళ ముచ్చట కావద్దు మరి!
---- వడ్డేపల్లి మల్లేశం.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల కోసం హెల్త్ కార్డులను ప్రతిపాదించినప్పటికీ అవి మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. ఏ ప్రభుత్వమైతే ప్రజల ఆరోగ్యాన్ని తన సామాజిక బాధ్యతగా గుర్తించి ఎంత ఖరీదైనా ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించగలిగినప్పుడు అదే సందర్భంలో ప్రజల ఆరోగ్య రికార్డు శాశ్వతంగా పొందుపరచగలదొ అదే స్థాయిలో గుర్తింపు పొందుతోంది. భారతదేశంలో ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు అందక లక్షలాది జనం రోజు ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని పత్రికల ద్వారా చూస్తున్నాం. వైద్యం అందక పురిటినొప్పులతో చనిపోయినట్లు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో చనిపోయినట్లు, రోగులను తీసుకెళ్లే వ్యాన్ అందుబాటులో లేక ప్రాణాలు గాలిలో కలిసినట్లు, సరైన దారి లేక వాహన సౌకర్యం లేక రోగిని గర్భిణిని పిల్లలను అనేక విధాలుగా మో సుకొని పోతే మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు నిత్యం పత్రికల్లో మీడియాలో వార్తలు చూస్తూనే ఉన్నాం . అభివృద్ధి చెందుతున్న భారత దేశమని వెయ్యి ఏండ్ల అభివృద్ధిని నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదని ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి ఇలాంటి దారుణాలకు పాలకులు ఏం సమాధానం చెబుతారు?. చిత్తశుద్ధి, అంకితభావము, సామాజిక బాధ్యత విస్మరించినటువంటి పాలకులు
ప్రైవేట్ రంగం పైన ఆధారపడి ప్రజలను విస్మరించిన కారణంగా ప్రజలు తమ ఆదాయంలో గననీయంగా వైద్యానికి ఖర్చు చేయవలసి రావడంతో కొనుగోలు శక్తి కోల్పోతూ పేదలు మరీ పేదలుగా మారుతున్న విషయాన్ని ముందుగా ప్రభుత్వాలు గుర్తించాలి .
హెల్త్ కార్డు --డిజిటల్ రికార్డుకు తెలంగాణ ప్రభుత్వ ఆలోచన సమగ్రంగా జరగాలి :-
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని రికార్డు చేయడం ద్వారా డిజిటల్ హెల్త్ కార్డులను అందజేయడంతో పాటు ప్రతి వ్యక్తికి ఒక గుర్తింపు నంబర్ ఇస్తామని ప్రకటించడం అభినందించదగినదే. అయితే ఇది మూన్నాళ్ళ ముచ్చట కాకుండా చికిత్స ఎంత ఖర్చుతో కూడుకున్నదైనా ప్రభుత్వ రంగంలో ఉచితంగా నాణ్యమైన సేవలు రకరకాల పరీక్షలు అందించగలిగినప్పుడు మాత్రమే సార్థకత ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రులతో ప్రభుత్వ పెద్దలకు ఉన్న సంబంధాల రీత్యా ప్రస్తుతమైతే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం మొక్కుబడిగానే కొనసాగుతున్నది. దానికి భిన్నంగా కఠిన నిర్ణయం తీసుకోగలిగితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య తెలంగాణ సాధ్యమే. గత బారాస ప్రభుత్వంలో" ఆరోగ్య తెలంగాణ "పేరుతో ప్రతిరోజు ప్రకటనలకే పరిమితమైనప్పటికీ అనేక ఆసుపత్రుల్లో సిబ్బంది లేక , మందులు, టెక్నీషియన్లు, ప్రత్యేక నిపుణులు కానరాక మాటలకే పరిమితమైన విషయం తెలిసినదే.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇవ్వడంతో పాటు ఆరోగ్య పరిస్థితిని రికార్డు చేయడం ద్వారా సమగ్ర సమాచారం అందుబాటులోకి తేవడం దానివల్ల మరింత మెరుగైన అత్యవసరమైన వైద్య సేవలను ఉచితంగా ప్రభుత్వ వైద్యశాల ద్వారా అందించడానికి అవకాశం ఉంటుందని భావించిన నేపథ్యంలో స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించవలసిన అవసరం తప్పకుండా ఉన్నది. అవసరమైన స్థాయిలో నిధుల కేటాయింపు, ఆసుపత్రుల ఆధునీకీకరణ, సిబ్బంది భర్తీ తదితర అంశాల పైన పూర్తిస్థాయిలో కమిటీని వేసి వసతులను కల్పించినప్పుడు ఈ విధానం ద్వారా ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన వైద్యం సాధ్యమే. హెల్త్ కార్డు ద్వారా సంబంధిత వ్యక్తి యొక్క ఆరోగ్యము, అనారోగ్య పరిస్థితులు ,గతంలో తీసుకున్న వైద్యము, చికిత్సకు ఉపయోగిస్తున్న మందులు, డాక్టర్ల అభిప్రాయము వంటి అంశాలన్నీ కూడా డిజిటల్ రికార్డులో పొందుపరిచినట్లయితే పేషంటు ఎక్కడకు వెళ్లినా ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటనే మెరుగైన నాణ్యమైన చికిత్సను అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ హెల్త్ కార్డును ఆధార్ కార్డు తోను , ఉద్యోగుల ఈహెచ్ ఎస్తో, ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు అన్నింటికీ అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వ రంగంలో వైద్య చికిత్స కావాలని కోరుకునే ప్రతి ఒక్కరికి సమగ్రమైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపుగా తగిన ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది .
ఉత్తమ చికిత్స అందించడం ప్రభుత్వ సామాజిక బాధ్యత:-
నాణ్యమైన ఉచిత వైద్యం అందించడానికి ప్రభుత్వం పూనుకున్న సందర్భంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన కొన్ని చర్యలను ప్రస్తావించడం సముచితం .ఇప్పటికీ ఉద్యోగులు, పోలీసులు, జర్నలిస్టులకు సంబంధించి ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లలో అర్హులైన నిపుణులు లేకపోవడం పైన ప్రభుత్వం దృష్టి సారించాలి. అదే స్థాయిలో అన్ని రకాల పరీక్షలు, ఎక్స్రేలు, స్కానింగ్ ,ఎంఆర్ఐ వంటి విలువైన పరీక్షలను అందుబాటులో ఉంచడం ద్వారా మెరుగైన చికిత్సను అందించడానికి ఆస్కారం ఉంటుంది .ప్రతి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బలోపేతం చేసే దిశగా దృష్టి సారించాలి . అన్ని రకాల పరీక్షలు కనీసం కొంతవరకైనా నిపుణులను ఏర్పాటు చేయడం ద్వారా నాణ్యమైన మందులు పరికరాలు సిబ్బందిని నియమించి వైద్య చికిత్స అందించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రిని కచ్చితంగా ఏర్పాటు చేసి అన్ని రకాల నిపుణులను నియమించడం ద్వారా దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల ఖర్చు పెట్టి చికిత్స పొందవలసిన అవసరం లేకుండా ఉచిత వైద్యాన్ని పరీక్షలను అందుబాటులో ఉంచాలి. వెల్నెస్ సెంటర్లలో ఏ రకంగా నైతే ఉద్యోగులు పెన్షనర్లకు కొంతవరకు నాణ్యమైన వైద్యం మందులు అందుతున్నాయో అదే స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నియోజకవర్గ కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రులతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రుల లోపల కూడా ప్రజలకు ఉచిత నాణ్యమైన మందులతో పాటు అన్ని రకాల సర్జరీలను అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వం యొక్క ప్రస్తుత కర్తవ్యం. ఈ అవస్థాపన సౌకర్యాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం తలపెట్టినటువంటి డిజిటల్ రికార్డు హెల్త్ కార్డు అనేదానికి సార్థకత ఉంటుంది. పేరుకు హెల్త్ కార్డు ఇస్తామని ప్రకటించి వాస్తవంగా క్షేత్రస్థాయిలో వైద్యశాలల్లో ఎలాంటి సౌకర్యాలు లేనప్పుడు విధిలేక లక్షలాది రూపాలు ఖర్చుపెట్టి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవలసి వస్తే ఇక హెల్త్ కార్డులతో ఫలితం ఏమున్నది? సిబ్బందికి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిలో అత్యల్ప వేతనాలను ఇవ్వడం కూడా సిబ్బంది సరిగా తృప్తికరంగా పనిచేయకపోవడానికి ప్రధాన కారణమవుతున్నది. విద్యా వైద్యం వంటి ప్రధానమైన మానవ అవసరాలకు సంబంధించిన రంగాలలో కాంట్రాక్టు పద్ధతిని తొలగించి పూర్తిస్థాయిలో రెగ్యులర్ వేతనాలను అమలు చేసినప్పుడు మాత్రమే విద్య ఆరోగ్య రంగాలు పరిపుష్టి చెందుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రెండు రంగాలకు బడ్జెట్లలో పెద్ద మొత్తంలో నిధులను కేటాయించి తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవలసిన అవసరం ఉన్నది . నిరంతరం కొనసాగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకమైన యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సంపన్న కుటుంబాలు ప్రభుత్వ వైద్యశాలల మీద విశ్వాసం లేని వాళ్ళు ప్రైవేట్ రంగానికి వెళ్తే ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ప్రభుత్వ వైద్యశాలల్లో కనీస అవసరాలతో పాటు అత్యుత్తమ స్థాయి పరికరాలు యంత్రాలు సౌకర్యాలను సమకూర్చడం ద్వారా ప్రభుత్వం సామాన్య ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంతో పాటు అధునాతన వైద్య సౌకర్యాలను అందించి ముఖ్యమంత్రి ప్రకటించినట్లు ప్రపంచంతో పోటీపడాలి.1నుండి18 ఏండ్ల వారికి కూడా ఇలాంటి పథకాన్ని అమలుచేయాల్సివుంటుంది. మాటలకు మాత్రమే పరిమితమై చేతల్లో లేకపోతే ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ పథకం నీరు గారి పోయే ప్రమాదం ఉంటుంది .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)