ఉపాధ్యాయ వృత్తి ఉపాధి కాకూడదు,
సామాజిక బాధ్యతగా భావిస్తేనే సార్థకత ఉంటుంది
.వ్యక్తి నిర్మాణం ద్వారా సంఘ శ్రేయస్సు ముడిపడి ఉన్నందున ఉపాధ్యాయుల ప్రతిభ సామాజిక చింతన క్రియాశీలకం. * పాఠ్యప్రణాళికకు తోడుగా ఉపాధ్యాయుల అనుభవాలు, పరిశీలన ప్రధాన భూమిక పోషించాలి.
************
---వడ్డేపల్లి మల్లేశం
వ్యక్తి నిర్మాణం ద్వారా సంఘ శ్రేయస్సును తద్వారా జాతి ప్రయోజనాలను కాపాడి సమ సమాజాన్ని స్థాపించే క్రమంలో విద్యా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది . వ్యక్తిలో దాగి ఉన్న అంతర్గత శక్తులను వెలికి తీసేది విద్య ,వెలికి తీసేవాళ్లు ఉపాధ్యాయులు కనుక ఉపాధ్యాయ వృత్తి అనేది కేవలం ఉపాధి ఉద్యోగంగా మాత్రమే భావిస్తే ఆ పాత్రకు సరైన న్యాయం జరగదు. అది ఒక సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడు ప్రతిభ, అనుభవాలు, సామాజిక చింతన తోడైనప్పుడు విద్యారంగంలో ఉపాధ్యాయులు విద్యార్థుల పరంగా విప్లవాత్మక మార్పులకు ఆస్కారం ఉంటుంది విద్యా లక్ష్యం కూడా అదే .బోధన చేసే వాళ్ళు ఉపాధ్యాయులు అభ్యసించే వాళ్ళు విద్యార్థులు అనుకున్నప్పుడు వినడానికి విద్యార్థులు సిద్ధంగా ఉండాలి బోధించడానికి ఉపాధ్యాయుల వద్ద పాఠ్య ప్రణాళికతో పాటు సమగ్రమైన అనుభవాలు జ్ఞాపకాలు సామాజిక చింతన పరిశీలన అధ్యయన అంశాలు విరివిగా ఉండాలి. అప్పుడు మాత్రమే విద్యార్థులు ఎల్లలు లేని విజ్ఞానాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి నిర్ధారించినటువంటి అర్హతలు కేవలం సాంకేతికత మాత్రమే విద్య ద్వారా సాధించవలసిన ఫలితాలను అంచనా వేసినప్పుడు పాఠ్య ప్రణాళిక సిబ్బంది తదితర సౌకర్యాలతో పాటు ఉపాధ్యాయుల యొక్క భూమిక అసాధారణమైనది అని గుర్తించడం చాలా అవసరం . అనేక సందర్భాలలో విద్యా ఫలితాలు ప్రమాణాలు దిగజారినప్పుడు సౌకర్యాలు బాగా లేకపోవడం సిబ్బంది కొరత తదితర అంశాలు ప్రధానంగా ప్రస్తావించడం జరుగుతుంది అందులో తప్పేమీ లేదు కానీ ప్రాథమిక సౌకర్యాలతో పాటు అన్ని హంగులు సిబ్బంది నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కేవలం యాంత్రికమైన బోధన ద్వారా మార్కులు ర్యాంకులు మాత్రమే సాధించడం జరుగుతున్నది కానీ వ్యక్తి వికాసాన్ని చూడలేకపోతున్నాము. దీనికి ప్రధాన కారణం వనరుల కంటే వ్యక్తిత్వ వికాసాన్ని పెంచి పోషించే క్రమంలో జరుగుతున్న లోపం గా భావించాలి. అది విద్యార్థులది కావచ్చు ఉపాధ్యాయుల సమయస్ఫూర్తి లోపం కూడా దాగి ఉండవచ్చు. ఏ అంశాలను ప్రస్తావించాలి? ఏ రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దాలి? సామాజిక పరిశీలన అంశాలు ఏమిటి? సృష్టిలో ఉన్నటువంటి కార్యకారణ సంబంధాలకు సంబంధించి విస్తృతమైన అవగాహన కల్పించడానికి ఉపాధ్యాయునికి తరగతి గదిలో ఆస్కారం ఉంటుంది. తరగతి గదిని సమాజంలోకి సమాజాన్ని తరగతి గదిలోకి తీసుకురావడానికి అవకాశం ఉన్న అర్హత కలిగిన వాళ్ళు ఉపాధ్యాయులు మాత్రమే . సమాజానికి ప్రతిబింబంగా నిలవాల్సినటువంటి పాఠశాలను ఆ రకంగా సమాజంతోని సత్సంబంధాలను ఉపాధ్యాయులు ఏర్పాటు చేసుకోవడం కూడా లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో తోడ్పడుతుంది. సర్వేలు ఇతర పరిశీలనలు వృత్తిపరమైన అంశాలపైన సమాజంలోకి అనేక సందర్భాలలో వెళ్లాల్సి వచ్చినప్పుడు లేదా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే క్రమంలోపల ప్రజలతో చర్చించడానికి ప్రజల సహకారాన్ని కోరినప్పుడు ప్రజలు ప్రజాస్వామి కవాదులు విభిన్న వర్గాలతో ఉపాధ్యాయులు సంబంధాలను పెంచుకోవడంతో పాటు అనేక అంశాల పైన సుదీర్ఘంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది . ఇన్ని రకాల నైపుణ్యాలను బాధ్యతలను నిర్వర్తించాలంటే కేవలం సాంకేతికంగా అర్హతలు మాత్రమే కలిగి ఉంటే ఉపాధ్యాయునికి సరిపోదు అందుకే సామాజిక చింతన సామాజిక బాధ్యత ముఖ్య మైన అదనపు అర్హతలు అని చెప్పక తప్పదు .
అధ్యయనము, పరిశీలన ద్వారా వచ్చే అనుభవాలు విద్యార్థులకు అందాలి :-
*********
ప్రస్తుతం విద్యా వ్యవస్థ ప్రైవేటు ప్రభుత్వ యాజమాన్యాలలో కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు .ప్రైవేటు యాజమాన్యంలో కేవలం మార్కులు, ర్యాంకులు ఫలితాలు అటు యాజమాన్యం ఇటు విద్యార్థులు తల్లిదండ్రులు ఆశిస్తున్నందున అక్కడ ఉపాధ్యాయుల యొక్క ప్రతిభ పరిశీలన సామాజిక చింతనకు అంతగా స్థానం కనిపించడం లేదు . తల్లిదండ్రులు కేవలం ప్రైవేటు పాఠశాలల్లో మార్కులను ఆశించడం వలన తమ పిల్లల యొక్క సామాజిక చింతన ఎంత నష్టపోతున్నాతో అర్థం చేసుకోవడం లేదు. ఈ విషయంలో ప్రైవేటు యాజమాన్యాలు కూడా తమ ఉపాధ్యాయ సిబ్బందికి వృత్తిపరమైన శిక్షణతో పాటు సామాజిక సంబంధాల మీద కూడా అవగాహన కల్పించడం చాలా అవసరం ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యాల పైన నిర్బంధంగా అమలు చేయాలి .నైతిక విలువలు, మానవ వికాసము ,సజీవ మానవ సంబంధాలు, ప్రేమానురాగాలు, ఆత్మీయత అనుబంధాలు, తోటి మనిషిని సాటి మనిషిగా చూసే సంస్కారం వంటి అనేక అంశాలు పాఠశాలల్లో క్రమంగా నీరుగారి పోతూ వ్యక్తి, కుటుంబము, ఆస్తిపాస్తులు, స్వార్థం వరకే మిగిలిపోయిన కారణంగా విద్య ద్వారా ఆశించిన ఫలితాలు నెరవేరకపోగా పాఠశాలల నుండి బయటికి వస్తున్న విద్యార్థుల లోపల విశాలమైన భావనను నింప లేక పోతున్నాము. ప్రైవేటు పాఠశాలల్లో మరింత ఎక్కువగా ఈ అసౌకర్యం ఉన్నదని చెప్పక తప్పదు .ప్రతి సందర్భంలోనూ వార్షికోత్సవాలు ఇతరత్రా లేదా ఉపాధ్యాయులకు సంబంధించి శిక్షణ లోను ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు మాత్రమే అధికారులు మంత్రులు, ముఖ్యమంత్రి ప్రధాని వంటి హోదాలో ఉన్నవారు విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని చెబుతున్నారు కానీ ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహించే వార్షికోత్సవాలకు మురిసిపోయి అక్కడి ఉపాధ్యాయులకు బాధ్యతలను చెప్పడంలో మర్చిపోతున్నారు . ఈ వివక్షత కొనసాగినంత కాలం అది ప్రైవేటు రంగమైన ఆ o దులో చదువుతున్న విద్యార్థులు సమాజానికి చెందిన వాళ్లే కనుక వాళ్ల లోపల సామాజిక స్పృహ చింతనను నింప లేక పోతున్నాము కాబట్టి అది ఒక రకంగా ఈ సమాజానికి పెద్ద నష్టం. ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రులు కూడా మార్కులు ర్యాంకులతో పాటు తమ పిల్లలు నిజమైన సంఘజీవులుగా ఎదగాలని , కేవలం యంత్రాలుగా మారితే సహించమని, సామాజిక సంబంధాల విషయం లోపల తప్పనిసరిగా శిక్షణ తరగతులు అధ్యయనము ఉపాధ్యాయుల అనుభవాల ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దాలని పాఠశాల యాజమాన్యాలను డిమాండ్ చేయవలసిన అవసరం కూడా చాలా ఉన్నది.
విద్య అనేది కేవలం ప్రభుత్వ యాజమాన్యంలోనే కొనసాగాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు తమ సభలు సమావేశాల సందర్భంగా కొన్ని అభ్యుదయ భావజాలం కలిగిన సంఘాలు ఉపాధ్యాయులకు వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యతను నొక్కి చెబుతూనే ఉన్నవి. ఉపాధ్యాయ వృత్తి అంటే ఉపాధి కాదు అని కూడా హెచ్చరించిన సందర్భాలు లేకపోలేదు . సామాజిక బాధ్యత మరిచిన ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేటుపరం చేసి ఇక మిగిలిన అర్ధ భాగం ప్రభుత్వ యాజమాన్యంలో కొనసాగే పాఠశాలను నిధులు మంజూరు చేయక నిర్లక్ష్యంతో నిర్వీర్యం చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఉపాధ్యాయులు తమ యొక్క సామాజిక బాధ్యతను విస్మరించకుండా హక్కులకై కల బడుతూనే బాధ్యతలకు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది .ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల యొక్క బోధన సామర్థ్యం సామాజిక చింతన ప్రతిభ పరిశీలన దృక్పథం ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఆదర్శం కావాలి ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క బోధన సరళీ సామాజిక చింతన అనుసరించే విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు ఆలోచించాలి ఒకే యాజమాన్యంలో కొనసాగినట్లయితే విద్య ప్రయోజనాలు విద్యార్థుల ప్రతిభ ఆలోచన సరళి ఒకే రకంగా ఉండే ఆస్కారం ఉంటుంది. "ప్రభుత్వ పాఠశాలలది సేవాభావమైతే ప్రైవేటు పాఠశాలలది వాణిజ్య ధోరణి " ఈ రెండు ధోరణుల మధ్యన ఉన్న సంఘర్షణను నిర్మూలించాలంటే ఒకే గొడుగు కిందికి విద్యావ్యవస్థను తీసుకురావడమే ప్రభుత్వము ముందున్న కర్తవమని భావిస్తే సమాజంలోని విద్యార్థులంతా సామాజికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది .
అప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ శక్తి సామర్థ్యాలను మరింతగా ఇనుమడింప చేసుకొని తరగతి గదిలో పిల్లలను తీర్చిదిద్దడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)