బడ్జెట్  అంచనాలు భారీగా పెరుగుతున్న  పేదరిక నిర్మూలన  బహుదూరంలోనే ఎందుకు ఉన్నది

Sep 14, 2024 - 11:14
 0  4

 వ్యవసాయ రంగానికి ప్రభుత్వ వ్యయం భారీగా పెరగడం,  సంపన్న వర్గాలకు దోచిపెట్టడం,  ప్రకృతి విపత్తులు  ప్రధాన కారణం. బడ్జెట్లో   వాటా దక్కక  ప్రలోభాలకు పరిమితమై నష్టపోతున్నది పేదవర్గమే. 
*************
--- వడ్డేపల్లి మల్లేశం 90142 06412
----29...07...2024*******
బడ్జెట్ అంచనాలను భారీగా పెంచుతూ ప్రభుత్వాలు  ఏటేటా  ప్రజల దృష్టిని  మరల్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ 
ప్రజా జీవితంలో మాత్రం అభివృద్ధి స్పష్టంగా కనిపించడం లేదు . అసంఘటిత రంగంలో ఉన్నప్పటికీ  వ్యవసాయ రంగంలో పని చేస్తున్నటువంటి  రైతులు కౌలు రైతులు  సాధారణ స్థాయి నుండి భూస్వాముల వరకు  భూములు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏదో రకంగా లబ్ధి పొందుతూనే ఉన్నారు.  రైతు లోకానికి సహకారం అందడం ప్రభుత్వం సాయం చేయడం పైన  ప్రజానీకానికి వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు కానీ  భూమి లేక  రెక్కల కష్టాన్ని మాత్రమే నమ్ముకుని  ఇలాంటి భరోసా పాలకవర్గాల నుంచి అందక  ప్రకృతి  పైన  అందుబాటులో దొరికే పని పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి కోట్లాది ప్రజానీకం  పరిస్థితులలో మాత్రం మార్పు రావడం లేదు . కారణమేమిటంటే సుమారు 90% గా ఉన్నటువంటి పేద అట్టడుగు ఆదివాసి  బలహీన సామాన్య  కార్మికులు చేతివృత్తుల వాళ్ళు చిరు వ్యాపారులు  మొదలైన వర్గాలకు  బడ్జెట్లో వాళ్ల వాటా ప్రకారంగా 90% దక్కాలి కానీ 10% కూడా దక్కడం లేదని  ఇటీవల లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించిన విషయాన్ని  దృష్టిలో ఉంచుకుంటే ఈ దేశ  ప్రజాధనం ఎవరి ఫాలవుతున్నదో అర్థం చేసుకోవచ్చు.  మెజారిటీ  సొమ్ము పెట్టుబడి దారి పారిశ్రామికవేత్తలు సంపన్న వర్గాలకు అప్పనంగా  రుణమాఫీ లేదా  రాయితీల రూపంలో కట్ట పెడుతుంటే  రైతు లోకంలో ఉన్నటువంటి మెజారిటీ భూస్వామ్య వర్గానికి కూడా ప్రజాధనం  కట్టబెట్టే ప్రభుత్వ  అసంబద్ధ చర్యల కారణంగా  పేద వర్గాలు  కన్నీరు పెట్టే అసమ సమాజం ఏర్పడడానికి కారణం అవుతున్నది  .మరొకవైపు దేశ సంపద  40 శాతం  ఒక్క శాతం గా ఉన్నటువంటి సంపన్న వర్గాల  చేతిలో బందీ అయినప్పుడు  అసమానతలకు  ఇంకా సాక్ష్యం కావాలా ? అందుకే తెలంగాణ రాష్ట్రం సుమారు 3 లక్షల కోట్లు  బడ్జెట్ ప్రతిపాదించినా  కేంద్ర ప్రభుత్వం  50 లక్షల కోట్లకు తన బడ్జెట్ను పెంచినా  పేదరికం మాత్రం ఈ దేశంలో ఇంకా  జడలు విప్పుతోనే ఉన్నది. అయినా ప్రభుత్వాలు మాత్రం 77 సంవత్సరాల స్వాతంత్ర్యం  తర్వాత కూడా పేదరికం నిర్మూలించలేకపోయినామని ఇది తమ వైఫల్యం అని అంగీకరించడానికి ఎవరు  సిద్ధంగా లేరు.  ప్రతిరోజు ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు మంత్రులు  వివిధ ప్రజా వేదికల ద్వారా కోటానుకోట్ల రూపాయలు అప్పటికప్పుడే స్థానిక డిమాండ్ మేరకు మంజూరు చేస్తున్నట్లు ప్రణాళికలో భాగంగా  ఆయా వర్గాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ  నిర్మాణాత్మకమైన అభివృద్ధి సాధ్యం కావడం లేకపోగా  ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన  సబ్ ప్లాన్ నిధుల ద్వారా  ఆయా వర్గాలకు చెందిన  పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న యువతకు ఉపాధి కల్పించే విషయం లోపల కూడా సరైనటువంటి నిధులు అందడం లేదు  .దాని కారణంగా అనేకమంది స్వయం  ఉపాధితో కనీస ఆదాయం సంపాదించుకొని పొట్ట పోసుకోవడానికి తమ పిల్లలను చదివించుకోవడానికి కుటుంబ ఆరోగ్య అవసరాలను చేర్చుకోవడానికి అనివార్యంగా  వడ్డీ వ్యాపారస్తుల దగ్గర లక్షల రూపాయలు అప్పు చేస్తూ  మిత్తి కట్టలేక గందరగోళానికి గురై అక్కడ బలవన్ మరణాలకు పాల్పడుతున్న సందర్భాలను కూడా గమనించినప్పుడు  ఈ దుస్థితికి తామే కా
రణమని పాలకులు ఎప్పుడైనా అంగీకరించినారా?  ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం సంపన్న వర్గాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తల రుణాల  కాయిలా పడిన బకాయిలకు 16 లక్షల కోట్లను  కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిన విషయాన్ని గమనించినప్పుడు ఎవరి ప్రయోజనం కోసం పాలకులు పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు .
బడ్జెట్ ప్రతిపాదనలు - నిధుల మళ్లింపు  - దుర్వినియోగం:-
**********

  వ్యవసాయ రంగానికి సంబంధించి  రాష్ట్ర ప్రభుత్వాలతో సహా కేంద్రం కూడా రైతులకు ఆసరా పథకాలను ప్రవేశపెట్టిన విషయం గమనించాలి  అదే సందర్భంలో  తెలంగాణలో ఇటీవల కాలంలో పెద్దగా ప్రచారంలో ఉన్న రైతు బంధు లేదా రుణమాఫీ వంటి పథకాలు  దేశవ్యాప్తంగా  కొనసాగుతున్న కారణంగా కూడా  ఏటా బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  అంతేకాకుండా వరదలు పంట నష్టాల కారణంగా కూడా  ఉదాహరణకు  ఇటీవల వరదల్లో సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు  ఎకరానికి 10 నుండి 15 వేల వరకు చెల్లించడానికి హామీ ఇవ్వడం జరిగింది ఆ రకంగా కూడా  కోట్ల నిధులు వ్యవసాయ రంగానికి అనివార్యంగా ఖర్చు చేయవలసి వస్తున్నది . అయితే ఈ క్రమంలో  ముఖ్యంగా భూమి ఉన్నటువంటి సన్న కారు చిన్న కారు రైతులతో పాటు భూ స్వామ్య వర్గం కూడా  లబ్ధి పొందడాన్నీ గమనించాలి  ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే  గత ఏడు సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన 70 వేల కోట్ల రూపాయల రైతుబంధులో సుమారు 30 వేల కోట్ల రూపాయలు అప్పనంగా భూస్వామ్య వర్గానికి  సాగు చేయని భూములకు మీద ఖర్చు చేసినట్లు  గణాంకాలు చెబుతుంటే  సోయి లేని ప్రభుత్వాలు  నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేయవచ్చునా?  మరొకవైపు ఏమాత్రం భూమి లేకుండా రెక్కల కష్టం మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్న వర్గాలకు  వృద్ధులకు పెన్షన్ లాంటిది తప్ప ఏ రకమైన సాయం ఈ తెలంగాణ రాష్ట్రంలో అందలేదు. కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే  కాదు సుమారుగా భారతదేశ వ్యాప్తంగా కూడా  భూమి ఉన్న రైతులకు మాత్రమే అంతో ఇంతో అప్పజెప్తున్న ప్రభుత్వాలు భూమిలేని పేదలు  భూమి లేక ఇతరుల భూమిని కౌలు చేస్తున్న రైతులకు ఏమాత్రం  సాయం చేయకపోవడం కూడా పాలకుల యొక్క  విద్రోహంగా భావించవలసిన అవసరం ఉంది
  ఏది ఏమైనా  ఒత్తిళ్ళ కారణంగా వ్యవసాయ  రంగం పెద్ద మొత్తంలో  బడ్జెట్ నుండి తన వాటాను పొందుతున్న విషయాన్ని అందరం గమనించాలి.   బడ్జెట్లో కేటాయించబడినప్పటికీ పేద వర్గాలకు అందకపోవడం, ప్ర కృతి విపత్తులతో అనివార్యంగా వ్యవసాయ రంగం మీద అధిక భారం పడడం , సంపన్న భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గాలకు  పరిశ్రమల ఏర్పాటు ఇతరత్రా రుణమాఫీ పేరున కోట్లాది రూపాయలు ప్రభుత్వం భరించడం వంటి  ఆకృత్యాల కారణంగా  పెద్ద మొత్తంలో బడ్జెట్ నిధులు   25% కూడా లేనటువంటి వర్గాలకే అందడంతో  సుమారు 75 శాతం ప్రజానీకం  తమ రెక్కల కష్టం మీద  స్వయం ఉపాధి,  వృత్తులు,  వీధి, చిరు వ్యాపారాల మీద ఆధారపడవలసి వస్తున్నది . అయినా వీరికి బడ్జెట్ ద్వారా లభిస్తున్నది నిండు సున్నా  ఇక కొంతమందికి మాత్రం అనేక ప్రలోభాలు వాగ్దానాల పేరుతో రాయితీలను ప్రకటించినప్పటికీ  ఆ వర్గాలు  ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్య మీద ఆధారపడడమే తప్ప చట్టబద్ధంగా తమ వాటాను పొందడం లేదు.  అలాంటప్పుడు ప్రజలందరి ఆస్తిని  కొంతమందికి అప్పనంగా కట్టబెడితే  చూస్తూ ఊరుకునే కాలం కాదు.  కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే రాజకీయ ఆర్థిక  ఉద్యోగ వ్యాపార రంగాలలో గద్దెనెక్కితే  అడుగంటిన సామాజిక వర్గాలు ఇప్పటికీ  అభివృద్ధికి ఆమడ దూరంలో ,చట్టసభలకు కిలోమీటర్ల దూరంలో,  ఉద్యోగ వ్యాపారాలకు కూడా అంతే దూరంలో  ఎదురుచూస్తూ  నిరాశ తో గడుపుతున్న జీవితం  మనందరికీ రోజు కనపడడం లేదా ? ఇక మరొకవైపు పాలకులు  పరిపాలనలో భాగంగా పార్టీ ప్రచారాల కోసం పర్యటనల కోసం  అధికార వాహనాలు విమానాలు హెలికాప్టర్లలో ప్రభుత్వ ఖర్చుతోనే  ఊరేగి  బడ్జెట్లో పెద్ద మొత్తము నిధులను నిర్వహణకే ఖర్చవుతుంటే  ఇక ప్రజలకు చేరేది ఎంత  ?చెరువులు కుంటలు నాలాలను ఆక్రమించుకొని  ప్రభుత్వ భూమిని పార్కులను  దుర్మార్గంగా  సొంతం చేసుకుంటున్నా వర్గాల కారణంగా కూడా  అనేక ప్రకృతి విపత్తులు  వరదలు ముంచెత్తుతున్న విషయం ఇటీవల కాలంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చూడవచ్చు.  దాని నివారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో ఆక్రమణలను తొలగించే పని చురుకుగా సాగుతున్నది  అంతే స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడంతోపాటు ప్రభుత్వ భూములను పార్కులను  చెరువులను  తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా  పేద వర్గాలకు వీలైన మేరకు  60 గజాల జాగను అప్పగించి సొంత ఇల్లు కలను సా కారం చేయడానికి అయినా కృషి చేస్తే కొంతవరకైనా పేద వర్గాలకు ప్రయోజనం అందుతుంది.  నిధుల మళ్లింపు, అక్రమార్కులకు చెల్లించిన  ప్రభుత్వ డబ్బు , అనర్హులకు రుణమాఫీ  ప్రభుత్వ దూర్వినియోగం వంటి అవ లక్షణాలను  రూపుమాపి  ప్రజాధనాన్ని  ప్రజలందరికీ సమానంగా పంచడానికి న్యాయవ్యవస్థ  చురుకుగా సుమోటోగా తీసుకొని  ప్రభుత్వాలను  హెచ్చరించగలిగే స్థాయిలో  తీర్పులను అందించినప్పుడు  మాత్రమే పేదరికం నిర్మూలించడానికి ,ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి,  చట్టసభలు ఉద్యోగాలు పాలనా సంస్థలలోకి ప్రవేశించడానికి  దయనీయ స్థితిలో ఉన్న వారికి కూడా అవకాశం వస్తుంది.  భూ సంస్కరణల కోసం భూ పోరాటాలు,  తమ వాటా కోసం అన్ని వర్గాల ప్రజా ఆందోళనలు,  చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం  అన్ని సామాజిక వర్గాల ప్రతిఘటానోద్యమాలు ముక్తకంఠంతో కొనసాగినప్పుడు మాత్రమే  ఏకపక్షంగా  వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాలకు  గుణపాఠం వచ్చి  కనువిప్పు కలుగుతుంది.  పేదల హక్కులు రక్షించబడే అవకాశం కొంతైనా                    చిక్కుతుంది  .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333