గణతంత్ర ఉత్సవాలు భలే జోరులే!
గణతంత్ర ఉత్సవాలు భలే జోరులే!
అయితే నేమి రాజ్యాంగ పీఠిక లోని అంశాలు కూడా అమలు కాకపోవడం దేనికి సంకేతం.?.
రాజ్యాంగం అమలులోకి వచ్చిందని సంబరపడితే సరిపోతుందా.?
అవినీతిపరులే పాలకులు చట్ట సభల్లో సభ్యులైతే ఎంత అవమానం ?
----వడ్డేపల్లి మల్లేషము
చట్టసభల సభ్యులు అవినీతిపరులు, బడా నేరగాళ్లు, సామాన్య ప్రజల దోచుకునే దోపిడీ దొంగలు ఉన్నప్పుడు ఆ దేశంలో జరిగే పాలన అమలయ్యే కార్యాచరణ సామాన్య ప్రజలకు అందే హక్కులు సంక్షేమ ఫలాలు ఏ రకంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం తెలిసి నిద్రపోకుమా" అంటూ శ్రీశ్రీ రాసిన సినీగీతం 50 ఏళ్లకు ముందే దేశంలోని సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుంటే ఇప్పటికి కూడా ఎ లాంటి మార్పులు జరగకుండానే 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న మనం దేశ రాజధానిలో పరేడ్ గ్రౌండ్లో జరిగే విన్యాసాలు విమానాలు రకరకాల పోటీలను చూసి సంబరపడదామా? లేక ప్రజా సమస్యల పరిష్కారం గురించి ఆలోచిద్దామా? ప్రశ్నించుకోవాల్సిన తరణం ఆసన్నమైనది. దేశవ్యాప్తంగా వీధి వీధిలో వాడ వాడలో ప్రతి ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల పైన సంస్థలు ఇండ్లపైన మూడు రంగుల జెండా ఎగరేసి ముద్దుగా అలంకరించి తీపి పంపిణీ చేసుకుని గతం గురించి మాట్లాడి మురిసిపోదామా? జరిగిన పరిణామాలు, నేరాలు, ఘోరాలు, దాస్టికాల గురించి ఆలోచిద్దామా? అర్థం కాని అయోమయ పరిస్థితిలో ప్రజలు ఉంటే పాలకులు మాత్రం సైనికుల విన్యాసాల మధ్య, గౌరవ వందనం తీసుకొని ఈ దేశంలోని ప్రజలంతా గౌరవంగా బతుకుతున్నారని అనుకుంటే అది నిజమవుతుందా? దారులు లేని పల్లెటూర్లు, రోడ్లు లేని జనావాసాలు, ఇప్పటికే కరెంటు సౌకర్యం లేని చీకటి గ్రామాలు, నివాసాలు లేకుండా వీధిలో మురికి కూపాల మధ్యన మూలుగుతున్న పేద ప్రజలు, చదువుకు దూరమై బాల కార్మికులుగా బతుకులేడుస్తూ తల్లిదండ్రులకు ఆసరా లేకుంటే పొట్ట గడవని దుస్థితులు, పల్లె పేదరికం పట్టణ పేదరికం మధ్యన కొట్టుమిట్టాడుతున్న జనం, తమ పిల్లలకు కనీసమైన చదువును చెప్పించుకోలేక అవసరమైన వైద్యాన్ని అందుకోలేక పెట్టుబడిదారీ సమాజం పోకడలో విద్య వైద్యం ప్రైవేటీకరించబడి ప్రభుత్వ రంగ0 నామమాత్రంగా మారుతుంటే అరకొర ఆదాయాల మధ్యన పేదలు తమ ఆదాయంలో పెద్ద మొత్తము ఖర్చు చేసి అప్పుల పాలై ఆత్మహత్యల పాలవుతుంటే పట్టించుకోని పాలకులకు స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం మాత్రం చాలా గుర్తుండిపోతుంది. 2047 వరకు దేశాన్ని ముందుకు నడిపించే సత్తా మాకు ఉందని ఒక రాజకీయ పార్టీ అంటే,1000 ఏళ్ల ప్రణాళిక మా వద్ద ఉన్నదని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గొప్పగా ప్రకటిస్తూ ఉంటే శాస్త్రీయ విజ్ఞానము సమాలోచన హేతుబద్ధత లేనటువంటి విద్యా విధానందేశంలో కొనసాగుతుంటే మత విద్వేషాలను కుల తత్వాలను రెచ్చగొట్టే రాజకీయ నాయకుల మధ్యన సామాజిక రాజకీయ ప్రజా జీవితం ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ నామమాత్రంగా కొనసాగుతూ అన్ని ప్రభుత్వం యొక్క కను సన్నల్లో పనిచేస్తూ ఉంటే రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి సిబిఐ ఈడి వంటి అనేక సంస్థలు చివరికి న్యాయవ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయిన సంగతి పాలకులకు తెలియదా? ప్రభుత్వాలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తులకు ఆ తర్వాత రాజకీయ పార్టీలు పదవులు కట్టబెట్టిన తీరు దేనికి సంకేతం ?
సంబరపడితే సరిపోతుందా :
రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులపాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఏడుగురు సభ్యుల బృందం తయారుచేసినటువంటి రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదం పొంది 1950 జనవరి 26 నుండి అమలులోనికి వచ్చిన సందర్భంగా దానిని గణతంత్ర దినోత్సవం గా జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. ప్రపంచంలోని అనేక దేశాలలో దేశాధినేత వారసత్వంగానో లేక నామినేటెడ్ ద్వారానో ఎన్నిక కాబడుతున్నా అందుకు భిన్నంగా దేశాదినేత ప్రజలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నికయ్యే విధానం ద్వారా ఎన్నుకోబడే విధానం రిపబ్లిక్ దినోత్సవం అని ఘనంగా చెప్పుకున్నాం.అయితేనేమి ప్రభుత్వాలు ఆలోచించి అమలు చేసే విధానంలోనే ప్రజల యొక్క ఆకాంక్షలు, పాలనలోని ప్రత్యేకత ఆధారపడి ఉన్నది. రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఆలోచనలు, పీటికలో ఉన్నటువంటి అంశాలు, ప్రజల ఆకాంక్షలు అమలు కాకుండా పాలకులు పెట్టుబడి దారి విధానానికి వంత పాడినంత కాలం సామాన్యులు పేదలు అ ట్టడుగు వర్గాలు ఆదివాసీలు యాచకులుగా బానిసలుగా బతుకుతూనే ఉంటారు. అదేనా రిపబ్లిక్ దినోత్సవం యొక్క గొప్పతనం? అందుకే గతంలో భారత రాష్ట్రపతిగా పనిచేసిన జ్ఞాని జైల్ సింగ్ ఒక దశలో సామాన్యులు అట్టడుగు వర్గాలకు ఈ దేశ ఫలాలు రాజ్యాంగబద్ధమైన హక్కులు లభించనంత కాలం దేశానికి స్వాతంత్రం రానట్లే అని గొప్పగా చెప్పిన విషయం ఇప్పటికైనా పాలకులకు గుర్తుంటే మంచిది. "ఆకాశమునంటుకునే ధరలోక వైపు అంతులేని నిరుద్యోగ0 ఇంకొక వైపు అవినీతి బంధుప్రీతి చీకటి బజారు ఆలముకున్న ఈ దేశం ఎటు దిగజారు" అని 50 ఏళ్ల క్రితమే సినిమా పాట రాసుకుంటే ఈనాటికి అవే పరిస్థితులు ఈ దేశంలో తాండవిస్తుంటే పాలకులు ప్రజల ముందుకు ఎలా ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తున్నారో అర్థం కావడం లేదు. "తల వంపులు తెచ్చే పని చేసినప్పుడు, ప్రజల ఆకాంక్షలు అమలు కానప్పుడు ప్రజలకు నిండు మనసుతో పాలకులు క్షమాపణ చెప్పాలి. విద్యా వైద్యం సామాజిక న్యాయాన్ని ప్రజలకు రాజ్యాంగబద్ధంగా ఉచితంగా నిండు మనసుతో ఇవ్వడానికి సిద్ధమని ప్రమాణం చేయాలి. అలాంటి రాజకీయ పార్టీలు ఈ దేశాన్ని పాలించాలి." కానీ ఉచితాలు తాయిలాలు, ప్రలోభాలు వాగ్దానాలు హామీలతో ప్రజలను మోసపుచ్చే రాజకీయ పార్టీలకు ఈ దేశంలో స్థానం లేదు అలాంటి రాజకీయ పార్టీలను తరిమికొట్టవలసిన సమయం ఆసన్నమైనది. దేశమంతా జెండాలతో అలంకరిస్తే పేద ప్రజల దారిద్రం తొలగిపోతుందా? దేశమంతా అలుముకున్న అవినీతి అంతమవుతుందా? సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమైన వ్యవస్థ నాశనం అవుతుందా? విద్య వైద్యం సామాజిక న్యాయం సకల మానవాళికి అందుబాటులోకి వస్తుందా? కావలసినవి ఇవి కానీ సంబరాలు, ఆడంబరాలు,ఖర్చులు, అలంకరణలు కాదు అని పాలకులు తెలుసుకుంటే మంచిది. అంతెందుకు మామూలు సభలు, సమావేశము సందర్భంలోనూ మంత్రులు ముఖ్యమంత్రులు, ప్రధాని ఇతరులు మాట్లాడే ప్రతి చోట కూడా వేదిక అంతా వేల లక్షల రూపాయల ఖర్చుతో అలంకరించడం జరుగుతుంది అది అవసరమా? ప్రజాధనాన్ని కొల్లగొట్టే అధికారం పాలకులకు ఎక్కడిది?
రాజ్యాంగ పీఠికలోని అంశాల అమలు ఏది?*
భారతదేశ ప్రజలమైన మేము న్యాయము, సౌబ్రాతృత్వము, స్వేచ్ఛ, సామ్యవాద, గణతంత్ర, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగ ఈ దేశాన్ని ప్రకటిస్తూ ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకున్నాము. అని పీటికలో రాయబడినప్పటికీ న్యాయం మొత్తం అన్యాయానికి బా నిసయ్యింది న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులకే రక్షణ లేని దిక్కుతోచని పరిస్థితి దాపురించింది. మహిళా న్యాయమూర్తులు తోటి సిబ్బంది లైంగిక వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకునే అవకాశం ఇవ్వమని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినదంటే ఈ దేశంలో న్యాయం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీసు వ్యవస్థ కొన్నిచోట్ల కీచకులుగా మారి తోటి మహిళా సిబ్బందిని మహిళలను వేధిస్తూ అక్రమాలకు అత్యాచారాలకు ఒడిగడుతుంటే మరి కొంతమంది పోలీసులు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యల పాలవుతున్న దేశం మనది. .రాజకీయ అవినీతి సర్వవ్యాప్తమైన వేల ఉద్యోగ వర్గంలో అవినీతి మరింత పెచ్చరిల్లిపోవడం ఆందోళన కలిగించే విషయం. లక్షలు కాదు కోట్లను లంచాల రూపంలో తీసుకున్నటువంటి ఘన చరిత్ర గల దేశం మనదే. దేశ సంపద ప్రజలందరికీ సమానంగా పంచబడాలని సామ్యవాదం ముసుగులో రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచితే సంపద కొద్ది మంది చేతుల్లో పోగుపడి పేదవాళ్లను వెక్కిరిస్తున్న విషయం తెలియదా? సౌబ్రాతృత్వం సార్వభౌమాధికారం కావాలని ని0డు మనసుతో ఆలోచిస్తే ఈ దేశం పైన పెట్టుబడి దారి సమాజం సామ్రాజ్యవాద వర్గాలు ప్రపంచ బ్యాంకు ఆధిపత్యం కొనసాగుతుంటే పాలకులు నామ మాత్రమే కావడం విచారించదగ్గ విషయం. ఆదేశిక సూత్రాలలో సంపద కొద్ది మంది చేతుల్లో ఉండకూడదని నిర్దేశించినప్పటికీ 40 శాతం సంపద ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో బందీ అయినట్లు తెలుస్తుంటే ఇది 75 ఏళ్ల గణతంత్ర రాజ్యానికి 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశా నికి ఆనవాలు అంటే ఎవరైనా నమ్ముతారా ?చట్టసభల సభ్యులే అవినీతిపరులు నేరస్తులు నేర చరిత్ర కలిగిన వాళ్లు మహిళల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి కేసుల్లో ఉండి కూడా చట్టసభల సభ్యులుగా కొనసాగుతున్నారంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఆచరణలో ఎంత విఫలమైందో అర్థం చేసుకోవచ్చు. నేరస్తులు ఉండవలసినటువంటి జైల్ల లో సామాన్యులు పౌరహక్కుల కార్యకర్తలు మేధావులు బుద్ధి జీవులు పేదవర్గాలు చిన్నాచితక నేరాల పైన ఆరోపించబడిన వాళ్లు విచారణ ఖైదీలుగా కొనసాగుతుంటే మేధావులు బుద్ధి జీవులు విజ్ఞానవంతులు న్యాయ కోవిదులు రాజకీయ వేత్తలు ఉండాల్సినటువంటి చట్టసభల్లో నేరగాళ్లు కొనసాగడం ఈ దేశపు అవివేకం కాదా? తమ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి హక్కులకై పోరాడే వాళ్లను, అవినీతిని ప్రశ్నించే వాళ్లను, మనుగడ కోసం ఆరాటపడే వాళ్లను అక్రమ నిర్బంధాలు ఏజెంట్లకు గురి చేస్తూ కేసులతో జైలు పాలు చేస్తూ రాజ్య హింసకు పాల్పడుతున్నది నిజం కాదా? ఆ రకంగా ఎంత మంది బుద్ధి జీవులు మేధావులు అర్ధాంతరంగా తనువు చాలించినారు? సామాజిక వేత్తలు శాస్త్రవేత్తలు పండితులు సామాజిక సంస్కరణ కోసం పనిచేసిన వాళ్లను పక్కనపెట్టి క్రీడాకారులు సినిమా కళాకారులకు పద్మశ్రీలు పద్మ విభూషన్లో భారతరత్న అభ్యర్థులు ఇస్తున్నారంటే ఈ దేశంలో ఎంత తప్పటడుగుల ప్రయాణం కొనసాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. సెంచరీలు కొట్టినటువంటి సచిన్ టెండూల్కర్ కు రాజ్యాంగాన్ని సవరించి భారతరత్న ఇచ్చినారంటేఎంత సిగ్గుచేటు! శాస్త్రవేత్తలు న్యాయ కోవిదులు మేధావులు మానవ హక్కుల కార్యకర్తలు ప్రజల కోసం నిరంతరము దశాబ్దాల తరబడి తపిస్తున్న వాళ్లను పక్కనపెట్టి సినిమా, క్రీడాకారులకు అవార్డులు ఇవ్వడం అంటే అదే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ఆన వాళ్లు అని సిగ్గుపడాల్సిన తరుణమిది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసినది ఆశించినది ఈ ప్రజాస్వామ్యం కాదు "అవసరమైతే పాలకులు నిర్లక్ష్యం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినప్పుడు ప్రజలు పోరాటం చేసే ప్రతిఘటించి రాజకీయ ముఖచిత్రాన్ని మార్చుకుంటారు. పోరాడి తమకు నచ్చినటువంటి వ్యవస్థను ఆవిష్కరించుకుంటారు." అని కూడా గర్వంగా చెప్పడం ప్రజాస్వామ్యానికున్న కొసమెరుపుగా భావించాలి. ప్రస్తుతం అదే సందర్భంలో ఈ దేశం ఉన్నదంటే అతిశయోక్తి కాకపోవచ్చు పాలకులు ప్రజలకు అనుకూలంగా మారని నాడు ప్రజలే తమకు అనుకూలమైన పాలనను కొనితెచ్చుకుంటారు అనేది చరిత్ర చెప్పిన సత్యం అదే అంబేద్కర్ ఆలోచన కూడా.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)