చేనేత రంగాన్నిపాలకులు పౌర సమాజం ఆదుకోవాలి.

May 11, 2024 - 22:27
Jun 6, 2024 - 17:20
 0  30
చేనేత రంగాన్నిపాలకులు పౌర సమాజం ఆదుకోవాలి.

యంత్రాలకు ధీ టుగా చేనేతను ప్రోత్సహిస్తే

 లక్షలాది మందికి ఉపాధి  దొరుకుతుంది .

ఆకలి చావులు ఆత్మహత్యలు  ఇంకానా?  

ఇకపై వద్దని నినదిద్దాం.

 

---వడ్డేపల్లి మల్లేశం

ప్రతి ఏటా ఆగస్టు 7వ తేదీన  జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పటికీ  చేనేత రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న కార్మికుల స్థితి గతులలో మాత్రం ఎలాంటి మార్పులు లేకపోవడం విచారకరం.  ఈ రంగాన్ని పరిరక్షించవలసిన  బాధ్యత కలిగిన పాలకవర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం,  పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ  పవర్ లూమ్స్ పైన శ్రద్ధ చూపడం,  చేనేత పైన చిన్నచూపు కారణంగా ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయి. అదే సందర్భంలో  చేనేత వస్త్రాల పట్ల ప్రజలకు  సానుకూల వైఖరి  కొంత తగ్గడం,  మిల్లు వస్త్రాల పట్ల మోజు,  కనీస అవసరాలను కూడా చేనేత వస్త్రాల ద్వారా తీర్చుకోవడానికి సిద్ధపడకపోవడం వలన  దేశవ్యాప్తంగా చేనేత రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది .

 ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో చేనేతకు పేరుగాంచిన అనేక ప్రాంతాలు  ఇప్పటికీ చేనేతను నమ్ముకుని  వేలాది కుటుంబాలు  జీవిస్తున్న సందర్భాన్ని గమనించవచ్చు అంతేకాదు అనేక రకాలైనటువంటి కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ  వివిధ రకాల ప్రాధాన్యతలను  చేనేత ద్వారా  కళాఖండాలను అందిస్తూ  ఉన్నటువంటి కార్మికులు మాత్రం నిత్యం దయనీయ పరిస్థితుల్లో  జీవితం గడపడాన్ని మనం గమనించవచ్చు.  ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్లలో,A P లోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా  కార్మికుల ఆత్మహత్యలు  ఆకలి చావులు అనారోగ్యం బారిన పడి  ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా  చర్చించవలసిన అవసరం ఉంది. అదే సందర్భంలో  అన్ని రాష్ట్రాల్లోనూ చేనేత రంగాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో  కుటీర పరిశ్రమగా ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని ఉపాధి కల్పించడంతోపాటు ప్రత్యేక అవకాశాలను కల్పిస్తే  కచ్చితంగా చేనేత రంగం  వస్త్ర ఉత్పత్తిలో ఆర్థిక   రంగంలో తన వాటాను తను  విజయవంతంగా నిర్వహిస్తుంది అనడంలో సందేహం లేదు .

వృత్తి యొక్క స్వభావం  శ్రామికతత్వం  :-

ముఖ్యంగా చేనేత పై ఆధారపడినటువంటి కార్మికులు  ఇతరత్రా నైపుణ్యం లేకపోవడం,  వారసత్వంగా వృత్తిని నమ్ముకోవడం,  అంకిత భావంతో పనిచేయడంతో పాటు శ్రమను గౌరవించి శ్రామిక మనస్తత్వంతో  శ్రమకు తగిన ఫలితాన్ని ఆశించి  తన కుటుంబాన్ని పోషించుకుంటూ  బ్రతకాలని కోరుకునే మామూలు  జీవన విధానంపై ఆధారపడే వాళ్ళు ఎక్కువ.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో గతంలో మగ్గాలు  పెద్ద మొత్తంలో ఉండేవి కానీ  ప్రపంచీకరణ ప్రైవేటీకరణ కారణంగా  వృత్తులు కుప్పకూలిన నేపథ్యంలో  కొన్ని ముఖ్యమైన కేంద్రాలలో  మాత్రమే చేనేత మగ్గాల  అందుబాటు మనం గమనించవచ్చు.  ఇప్పటికీ అనేక చోట్ల  ముఖ్యంగా వెంకటగిరి పోచంపల్లి  వంటి ప్రాంతాలలో స్త్రీలు కూడా  మగవాళ్లకు తీసిపోకుండా  వస్త్ర ఉత్పత్తిలో  పాల్గొనడం అభినందనీయం . కాయకష్టం చేసి బ్రతికే వాళ్లకు కనీస జీవితం గురించి బాగా తెలుసు కానీ అక్రమార్జనకు  అధిక సంపాదన గురించి ఆలోచించేవాళ్లు శ్రమను శ్రమైక తత్వాన్ని గుర్తించరు గౌరవించరు అనేది సత్యం.  

 ఈ రకమైన తేడాను పెట్టుబడిదారీ వ్యవస్థ చేనేత రంగం మధ్యన మనం స్పష్టంగా చూడవచ్చు.  గతంలో  చేనేత పనుల కోసం నెలల తరబడిగా వలసలు పోయి  కుటుంబాలను ఆలు పిల్లలను వదిలి బ్రతుకుతెరువు కోసం కష్టపడి పనిచేసిన సందర్భాలు ఉండేవి కానీ ఇటీవల కాలంలో రవాణా సౌకర్యాలు పెరిగిపోవడం ,కొన్ని అవకాశాల కారణంగా  సుదూర ప్రాంతాలకు బదులు దగ్గర ప్రాంతాలలో కూడా ఇలాంటి చేనేత కేంద్రాలు ఏర్పాటు కావడం  సంతోషమే కానీ  సరిపోయే స్థాయిలో పని లేకపోవడం ,పనికి తగిన వేతనం గిట్టుబాటు కాకపోవడం , చేనేత వస్త్రాలను గౌరవించక ఆదరించకపోవడం, ఉత్పత్తి చేస్తున్నటువంటి చేనేత సహకార సంఘాలకు కూడా ప్రభుత్వపరంగా సమాజపరంగా ప్రోత్సహం లేకపోవడం వంటి అనేక కారణాల వలన చేనేతరంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా ఈ వ్యవస్థను జాతీయస్థాయిలో  కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం ద్వారా చేనేత విధానాన్ని రూపకల్పన చేసినప్పుడు మాత్రమే ఈ పరిశ్రమపై ఆధారపడిన కుటుంబాలు  చేతినిండా పని,  ఆరోగ్యము, ఆదాయంతో  బ్రతికే అవకాశాలు ముమ్మరంగా ఉంటాయి .

చేపట్టదగిన కొన్ని చర్యలు :-

వస్త్ర ఉత్పత్తిలో చేనేత రంగము  పవర్ లూమ్స్ ను విడివిడిగా చూసినప్పుడు మాత్రమే  ఈ రంగం బతికి బట్ట కడుతుంది కానీ  రెండింటినీ ఒకే చోట కట్టి చూడడం వలన అనేక రకాల  సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కొన్ని అనుభవాల ద్వారా తెలుస్తున్నది.  రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఇతరత్రా అన్ని రకాల  విద్యా సంస్థలలో విద్యార్థుల యొక్క  డ్రెస్ మెటీరియల్ తో పాటు  హాస్టల్లో వినియోగించేటువంటి బెడ్ షీట్స్  టవల్స్ దుప్పట్లు ఇతరత్రా అన్నింటిని కూడా  పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడం ద్వారా అటు పని కల్పించవచ్చు. తక్కువ ధరకే ప్రభుత్వం కొనుగోలు చేసి  వినియోగించడం ద్వారా చేనేత రంగాన్ని ఆదుకునే అవకాశం ఏర్పడుతుంది.  ముఖ్యంగా చేనేత సహకార సంఘాలు  ఆధునిక ధోరణి అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది అంతే స్థాయిలో ప్రభుత్వము కూడా  మూలకు పడినటువంటి సంఘాలను పునరుద్ధరించడంతోపాటు పని కల్పించి వస్త్ర ఉత్పత్తిని  పెంచే విధంగా  రంగు, నూలు, ఇతర  ముడి సరుకుల యొక్క ధరలను భారీగా తగ్గించడంతోపాటు  కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి జీఎస్టీ ని పూర్తిగా  రద్దు చేయడం ద్వారా   చౌకగా చేనేత వస్త్రాలను అందించే అవకాశం ఉంటుంది

  తద్వారా వీటి యొక్క వాడకం ముమ్మరంగా పెరిగే అవకాశం ఉంటుంది.  ఇప్పటికీ చాలా చోట్ల చేనేత సహకార సంఘాల లో ఉత్పత్తి అయినటువంటి చేనేత వస్త్రాలను  వ్యాన్లు ట్రక్కులతో ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి ఖర్చులు భరించి అమ్మకాలు జరుపుతున్నప్పటికీ సరిపోయే స్థాయిలో  గిరాకీ లేకపోవడం, ఖర్చులు భారీగా పెరగడంతో సంస్థలు నష్టాల్లో ఉన్నట్లు నిర్వాహకులు  ఆందోళన వ్యక్తం చేయడాన్నీ మనం గమనించవచ్చు.  కాబట్టి ప్రభుత్వం  వాణిజ్య ధోరణితో కాకుండా సేవా దృక్పథంతో ప్రతి రంగాన్ని కాపాడవలసి ఉంటుంది కనుక  చేనేత సహకార సంఘాలకు  వాహనాలను  ఉచితంగా సరఫరా చేయడంతో పాటు  చేనేత కార్మికులు తిరిగి అమ్ముకోవడానికి కూడా వాహనాలను  కారు చౌకగా అందించడం ద్వారా ఈ రంగాన్ని పెంచి పోషించే అవకాశం ఎంతో ఉంటుంది.  దుకాణాలు పెట్టుకోవడానికి,  చేనేత వస్త్ర ఉత్పత్తి కేంద్రాలను నిర్మించుకోవడానికి  ముందుకు వచ్చినటువంటి వారికి  పెద్ద మొత్తంలో రుణాన్ని  వడ్డీ లేకుండా సరఫరా చేయడం ద్వారా  ఆ రంగం బాగుపడుతుంది. నమ్ముకున్న కార్మికులకు ఉపాధి దొరుకుతుంది తద్వారా ప్రజలకు కూడా చౌక ధరలకే లభించే అవకాశం ఉంటుంది.

  ఉభయ తెలుగు రాష్ట్రాలలో  పత్తి ఉత్పత్తి గణనీయంగా  ఉంటుంది కనుక అందుకు తగినటువంటి మిల్లులను  ప్రారంభించడంతోపాటు వస్త్ర ఉత్పత్తికి సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాలను  పరిశోధన కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం ద్వారా చేనేత రంగాన్ని అధునాతనంగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది . విద్యావంతులైనటువంటి వాళ్లు కూడా ఉపాధి లేక స్వయం ఉపాధిలో భాగంగా వస్త్ర ఉత్పత్తిని తమ వృత్తిగా చేపడుతున్న సందర్భంలో  ఆధునిక అవసరాలకు సరిపోయే స్థాయిలో వేతనాలు గిట్టుబాటు అయ్యే విధంగా ప్రభుత్వం ఈ విధానాన్ని రూపకల్పన చేస్తే అనేకమంది యువత కూడా  వస్త్ర ఉత్పత్తిలో ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.

  ప్రధానమంత్రి స్వయంగా  ఈ రంగం కొట్టుమిట్టాడుతున్న సంక్షోభ పరిస్థితిని అర్థం చేసుకొని జిఎస్టిని  రద్దు చేయడంతో పాటు  ముడి సరుకుల ధరలను భారీగా తగ్గించడంతోపాటు సబ్సిడీని పెద్ద మొత్తంలో ఇవ్వడం, నష్టాన్ని ప్రభుత్వం భరించడం , ప్రోత్సహించడానికి  స్వచ్ఛంద సంస్థలు  ప్రైవేట్ సంస్థలు  ప్రభుత్వ కార్యాలయాలు ముందుకు రావడం ద్వారా  వస్త్ర ఉత్పత్తిని అమ్మకాలను వినియోగాన్ని కూడా భారీ ఎత్తున పెంచడానికి అవకాశం ఉంటుంది  .ఇప్పటికీ చేనేత వస్త్ర ఉత్పత్తిలో పనిచేస్తున్న వాళ్లు కేవలం రోజుకు 100 - 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు అని ఆందోళన నిర్వేదంతో పనిచేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని కేంద్రాలలో ఆ మాత్రం పని కూడా లేకపోవడంతో  వెను తిరిగి  వెళుతున్నట్లు  వృద్ధాప్యంలో తమకు ఈ పని తప్ప వేరే  రాణి గత్యంతరం లేని పరిస్థితిలో  వృత్తిని నమ్ముకున్న లక్షలాది కుటుంబాలకు  ఊ తం అందించడానికి ప్రభుత్వం తన సామాజిక బాధ్యతగా చేనేత రంగాన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. అందుకు సంబంధించి నిపుణులతో కమిటీని వేసి చేనేత విధానాన్ని ప్రకటించి దేశవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా ఆయా ప్రాంతాలలో చేనేత ప్రాధాన్యత  సందర్భాలను బట్టి  ప్రభుత్వ చర్యలను ముమ్మరం చేయవలసిన అవసరం ఉంది.

  ఇదే సందర్భంలో పౌర సమాజం కూడా చేనేత వస్త్రాలను వినియోగించడం  బాధ్యతగా గౌరవంగా భావించినప్పుడు  చౌక ధరలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే వాటిని స్వీకరించడానికి సిద్ధపడ్డప్పుడు చేనేత రంగం మరింత  అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.  కానీ చేనేతను చేనేత రంగంలో పనిచేస్తున్న కార్మికులను చిన్న చూపు చూసే దయనీయమైన పరిస్థితులు ఇప్పటికీ ఈ దేశంలో దాపురించడం ఆందోళన కలిగించే విషయం .శ్రమను గౌరవించని, తోటి మనిషిని సాటి మనిషిగా చూడని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నంతకాలం చేనేత తో పాటు ఇతరత్రా కాయ కష్టంతో కూడిన ఏ రంగమైనా సంక్షోభంలో  కూరుకు పోవాల్సిందే.  నిబద్ధత అంకితభావం సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడే ప్రతి రంగం బతికి బట్ట కడుతుంది.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333