రైతు భరోసా పై కాంగ్రెస్ ప్రభుత్వం సొంత విధానాన్ని ప్రకటించాలి.
గత ప్రభుత్వ విధానంతో పోల్చుకోవలసిన అవసరం లేదు.
ఎందుకంటే గతమంతా విధ్వంసమే కదా!
అతిగా రాయితీలు ప్రకటిస్తే ఎంత ముప్పో ప్రభుత్వం మీద ఒత్తిడిని బట్టి తెలుస్తున్నది కదా!
చౌకబారు ప్రకటనలకు ఇక ముందు స్వస్తి పలకాలి .*
--వడ్డేపల్లి మల్లేశం
ఇటీవల మంత్రివర్గ సమావేశంలో రైతు రుణమాఫీని అమలు చేయడంతో పాటు రైతు భరోసా పైన మార్గదర్శకాలను నిబంధనలను రూపొందించడానికి జిల్లాస్థాయిలో రైతు సంఘాలతో సమావేశాలు మంత్రుల కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతుల అభిప్రాయాన్ని తీసుకోవడానికి విస్తృత ప్రాతిపదిక మీద చేసిన నిర్ణయం సరైనదే. అయితే ఇప్పటివరకు 2016 నుండి ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి రైతుబంధు బారాస ప్రభుత్వం అనేకమంది సూచనలకు భిన్నంగా ఏకపక్షంగా వ్యవహరించిన కారణంగా పంటలు పండని అడవులు చెట్లు, గుట్టలు, చివరికి ఇండ్ల స్థలాల కూడా రైతుబంధు నిధులు ఇవ్వడం ఎలాంటి పరిమితి లేకుండా వందల ఎకరాలకు ఇచ్చిన కారణంగా వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రజానీకం కోల్పోవలసి వచ్చింది . ఈ విషయాన్ని 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ జాగో సంస్థ మాజీ కలెక్టర్ ఆకునూరు మురళి గారు స్పష్టంగా ప్రజలకు చెప్పడం జరిగింది .దేశ సంపదను ప్రజలందరికీ సమానంగా పంచే క్రమములో అన్ని వర్గాలకు బడ్జెట్లో ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉంది కానీ దానికి భిన్నంగా భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి 90% సామాన్య ప్రజానీకానికి కనీసం 10% బడ్జెట్లో నిధులు కూడా అందడం లేదు అని మేధావుల రిపోర్టును గనుక పరిశీలిస్తే ఎంత దారుణం జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. అందుకోసమే రాయితీలు ప్రలోభాలు వాగ్దానాలు ఇష్టమున్నట్లుగా ప్రకటించడం వల్ల కొన్ని వర్గాలు లాభ పడితే మెజారిటీ ప్రజానీకం నష్టపోతున్న విషయాన్ని కూడా కొత్త ప్రభుత్వం గమనించి తగినటువంటి నిబంధనలు రూపొందించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది .
రైతుబంధు లేదా రైతు భరోసా అంటేనే పేద వర్గాలకు సంబంధించిన రైతులు పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారాస్తులపైన ఆధారపడకుండా కార్య క్షేత్రంలో ఎవరైతే పంటలు పండిస్తున్నారో వాళ్లకు మాత్రమే ఈ నిధులు అందాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. కానీ గత ప్రభుత్వంలో భూమి యజమాని అమెరికాలో ఉంటే అతని జేబులో డబ్బులు పడితే క్షేత్రస్థాయిలో పని చేసినటువంటి కౌలు రైతుకు ఎలాంటి ఫలితం దక్కకపోగా అభివృద్ధి అనావృష్టి కారణంగా అప్పుల పాలై యజమానికి చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లను గమనించవచ్చు మెజారిటీగా రాష్ట్రంలో 10 ఏళ్లలో 8,000 మంది రైతులు చనిపోతే ఆనాటి లెక్కల ప్రకారం 40 శాతం మంది రైతులు కౌలు రైతులే అని తేలింది.
సమావేశాలు సభలు సమీక్షల లో కఠిన నిర్ణయాలు తీసుకోవాలి :-
_ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసాను పరిమితం చేయాలి అది కూడా పంటలు పండించే భూములకు మాత్రమే వర్తింప చేయాలి కానీ బీడు భూములకు ఇవ్వడం అంటే గత బారాస ప్రభుత్వం చేసిన వి ద్రోహాన్ని తలపించడమే అవుతుంది .
అడవులు, పుట్టలు, గుట్టలు, ఇళ్ల స్థలాలకు ఇవ్వడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగమైన విషయాన్ని కూడా మంత్రివర్గ ఉప సంఘం సమావేశాలు రైతులతో జరిగే సమావేశాలలో విధిగా చర్చించి గత లోపాలను ప్రజలకు ఎత్తిచూపి ప్రజలకు అవగాహన చేయించాలి. కొందరు రైతులు ఎక్కువ భూమికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది కానీ రైతుల మాదిరిగా భిన్న వర్గాలు కూడా ఉన్నాయి వాళ్లందరికీ కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి కనుక పరిమితం చేయాలి అని నిష్కర్షగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది .
--నిజంగా భూ యజమానులు వ్యవసాయం చేసే వాళ్ళు చాలా తక్కువ ఇటీవల కాలంలో కౌలు రైతుల సంఖ్య సుమారుగా 50 శాతానికి చేరుకుంటున్న సందర్భంలో ఆర్థిక భారాన్ని బాధ్యతను పంటలు పండించడంలో ఎదురయ్యే కష్టసుఖాలను ఎదుర్కొనేది కౌలు రైతులే కనుక ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా వారికి చెందే విధంగా కఠినమైన నిబంధనలు రూపొందించాలి . అయితే భూ యజమానులు అగ్రిమెంటు చేయకపోవచ్చు అని అక్కడక్కడ అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారుల నుండి నివేదికలు తెప్పించుకొని యజమాని చేస్తున్నాడా కౌలు రైతు చేస్తున్నాడా అని నిర్ధారణకు వచ్చి ప్రభుత్వం గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు రైతు భరోసా అందించడం ద్వారా వాళ్లను కూడా ఈ రాష్ట్ర రైతులుగా భావించాలి. అదే సందర్భంలో కౌలు రైతులలో జరుగుతున్న ఆత్మహత్యలను కూడా నివారించాలి
రుణమాఫీ కి సంబంధించి నిర్దేశిత పీరియడ్ లో తీసుకున్న వాళ్లకు ప్రభుత్వం ప్రకటించినటువంటి రాయితీని అమలు చేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉండవు అని స్పష్టంగా చెప్పాలి ఇష్టం ఉన్నట్టుగా అప్పులను చేస్తూ ప్రభుత్వం మీద భారం మోపడానికి రైతులు సిద్ధపడుతున్న సందర్భాలను కూడా ప్రభుత్వం గమనించాలి .
--రైతు భరోసా చెల్లించే సందర్భంలో ఆర్థికంగా ఎదిగిన ,ఆదాయం ఎక్కువగా కలిగిన వాళ్లు, ఉద్యోగులు, వ్యాపారులు ఐదు ఎకరాల లోపు భూమి కలిగి ఉండవచ్చు. అలాంటి సందర్భంలో వాళ్ల ఆదాయాన్ని బట్టి ఐదు ఎకరాల లోపు వ్యవసాయ ఉన్నప్పటికీ వారికి ప్రభుత్వ రాయితీని రద్దు చేయడం ద్వారా నిధులను పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది .
_గత ప్రభుత్వం మాదిరిగానే అమలు చేయాలని రైతు సంఘాలు రైతుల నుండి డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ గత ప్రభుత్వ విధానాల వలన ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయిన పరిస్థితిని రైతులకు విప్పి చెప్పి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన స్వతంత్ర స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తేనే ఆర్థికంగా నిలదొక్కు కోవడానికి అవకాశం ఉంటుంది. మన ప్రభుత్వం అవలంబించే శాస్త్రీయ విధానం ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు మార్గదర్శకంగా ఉండాలి కానీ విచ్చలవిడి ఆర్థిక అరాచకత్వానికి దారి తీయకూడదు.
ఏది ఏమైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్న సందర్భంలో ప్రజలు ప్రజాస్వామికవాదులు, మేధావులు, రైతులు రైతు సంఘాలతో విస్తృతంగా చర్చ జరపాలని భావించడం చాలా అభినందనీయం. అందులో వచ్చే భిన్నాభిప్రాయాలను ప్రభుత్వం తన ఆర్థిక పరిస్థితిని ఆధారంగా చేసుకొని ప్రజలను ఒప్పించే విధంగా కృషి చేయడం ద్వారా ప్రభుత్వం మీద అధిక భారం పడకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే ప్రయోజనం చేకూరే విధంగా ఈ పథకాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే అది నిజమైన రైతు భరోసా అవుతుంది. లేకుంటే పెట్టుబడిదారులకు వంత పాడినట్లుగానే మిగిలిపోతే కేంద్ర ప్రభుత్వం గత బారాస ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి తేడా ఉండదు .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )