ప్రతిపక్షాలు పోరాడాల్సింది పేదరిక నిర్మూలన, ఉపాధి ఉద్యోగ, సమానత్వ సాధన,ఉచిత విద్య వైద్యం కోసం.
ప్రతిపక్షాలు పోరాడాల్సింది పేదరిక నిర్మూలన,
ఉపాధి ఉద్యోగ, సమానత్వ సాధన,ఉచిత విద్య వైద్యం కోసం.
ఏ రాజకీయ పార్టీ నోట ఈ డిమాండ్లు విన్నామా?*
పాలకపక్షాలకైతే ఆ స్పృహ అసలే లేదు.*
బూటకపు నినాదాల పేరున కొనసాగే రాజకీయ పార్టీల తీరిది.*
----వడ్డేపల్లి మల్లేశం
"రాజకీయ పార్టీల మౌలిక లక్ష్యాలు రాజనీతివేత్తల ఆశలు ఆకాంక్షలు ప్రజల మౌలిక సమస్యల పరిష్కారంలో ప్రజాస్వామిక భావనను విస్తరింప చేయడం ద్వారా నిర్బంధము అణచివేత ఒత్తిడి వాక్ స్వాతంత్రం మీద అదుపు లేనటువంటి స్వేచ్ఛగా జీవించగలిగే విధంగా ప్రజలను చూడగలిగినటువంటి ప్రజాస్వామిక సిద్ధాంతo ప్రాతిపదికన పని చేసే ప్రజల సమూహమే రాజకీయ పార్టీ "అయినప్పుడు అందుకు భిన్నంగా ఎన్నో పార్టీలు బూటకపు నినాదాలతో నేడు రాజ్యమేలుతున్నాయి. కాలయాపన, మొక్కుబడి పరిపాలన, ప్రజా సంబంధము లేని కార్యకలాపాల నిర్వహణ, పేదలు ప్రజలకు ఉపయోగపడని పెట్టుబడిదారుల కోసం మాత్రమే పనిచేసే ఒంటెద్దు పోకడ, ఆధిపత్యం అహంభావం అణచివేతతో ప్రజలను వంచించే పాలన దానికి ప్రతినిధులుగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు కొనసాగుతున్న సందర్భంలో ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడమే కానీ ఆచరణలో నిజాం కాకపోవడం మన పరువు ప్రతిష్టలను మనమే దిగజార్చుకోవడమే అవుతున్నది. వాస్తవంగా మెజారిటీ ఓటర్లు ఎన్నికల్లో పాల్గొని చట్టసభలో ఉన్నటువంటి సీట్లలో సగానికి పైగా తెచ్చుకున్నటువంటి పార్టీ అధికారానికి రావాలి కానీ 50 శాతం మంది ఓటర్లు కూడా పాల్గొన నటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో 30 శాతం మంది ఓటర్లు ప్రభుత్వాన్ని నిర్ణయిస్తున్నటువంటి సందర్భంలో మనం ప్రజాస్వామ్యానికి ఇచ్చిన నిర్వచనం నీరు గారి పోయినట్లే కదా! ప్రజాస్వామ్యం అంటేనే ఓటు హక్కు అని తెలిసి కూడా ఓటు వేయడానికి అంత నిర్లక్ష్యము బాధ్యతారాహిత్యం కనబరుస్తున్నటువంటి ప్రజా సమూహము ఒకవైపు ఎంత వీలైతే అంత తక్కువ మంది ఓట్లు వేయడం వలన లబ్ధి పొందవచ్చునని రాజకీయ పార్టీల ఆలోచన మరోవైపు రెండింటి కారణంగా పూర్తి మెజారిటీతో కూడుకున్నటువంటి ప్రజా ప్రభుత్వాలను ఇంతవరకు మనం చూడలేకపోవడం విచారకరం.
కీలక అంశాలను విస్మరిస్తున్న పార్టీలు:-
అధికారంలో కొనసాగుతున్న రాజకీయ పార్టీలు ఏనాడు పేదరిక నిర్మూలన, ఉద్యోగ ఉపాధి అవకాశాల మెరుగుదలకు సంబంధించిన కార్యాచరణ, మిగులు భూముల పంపిణీ, అసమానతలు అంతరాలు లేని సమానత్వం సాధన, సమసమాజ స్థాపన కోసం చేసిన కృషి ఎక్కడా కనిపించదు. ఇక నాణ్యమైన ఉచిత విద్య వైద్యం తమ మేనిఫెస్టోలో ప్రధాన ఎజెండాగా లేకపోవడం సిగ్గుచేటు. ఉచితాలు ప్రలోభాల కంటే విద్యా వైద్యానికే ప్రాధాన్యత ఇస్తామని ఈ రెండు ఉచితంగా అందినట్లయితే ప్రజల కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచవచ్చునని, పేదరికాన్ని తొలగించవచ్చునని, ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చునని సోయి ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీకి లేని కారణంగా ప్రతిపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ఎజెండాలో ఉచిత విద్య వైద్యాన్ని ఎక్కడ నమోదు చేయలేదు.,ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు .ఇదొక్కటి చాలు భారతదేశంలోని రాజకీయ పార్టీల యొక్క డొల్లతనానికి కీలక అంశాలను విస్మరించినవి అనడానికి. ఆర్థిక వేత్త డాక్టర్ అమర్త్యసేన్ సూచించినట్లుగా కనీస అవసరాలను తీర్చుకోగలిగిన స్థితిని మానవాభివృద్ధి అని చెప్పినట్లు ఆ అవసరాలను తీర్చుకోగలిగిన స్థాయిలో ఈ దేశంలో ఎందరు ఉన్నారు అంటే ప్రశ్నార్ధకమే? ఇక దారిద్రరేఖ దిగువన జీవిస్తున్నటువంటి వారి శాతం ఇప్పటికీ 15 నుండి 20% ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారంటే దేశంలోని వందల రాజకీయ పార్టీల యొక్క లక్ష్యం ఏమైనట్లు? మేనిఫెస్టోలో ఎందుకు చేర్చనట్లు? 77 ఏళ్ల పాలనలో సాధించినది ఏమిటి? అని పాలక ప్రతిపక్షాలు తమను తాము విమర్శించుకోవాలి,ప్రక్షాళన చేసుకోవాలి, సంస్కరించుకోవాలి, అవసరమైతే సిగ్గుపడాలి కూడా .కొండలు గుట్టలు ఆదివాసి ప్రాంతాలలోని ప్రజలకు కనీస రవాణా సౌకర్యాలు లేక అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్స కోసం డోలీలలో మంచాల పైన నలుగురు మో సుకొని పోయి అవసరాలు తీ ర్చుకుంటున్నారంటే ఈ దేశంలో ప్రభుత్వాలు ఉండి ఎవరికోసం ఇలాంటి అనేక ప్రాంతాలు ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లు అక్కడి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల ద్వారా తెలుస్తున్నది. అలాంటి ప్రయాణ సౌకర్యాలు లేని ప్రాంతాలు వందలు వేల సంఖ్యలో ఉండి ఉండవచ్చు కూడా. "ఆదాయ మార్గాలను పెంచకుండా, ఉపాధి అవకాశాలను చూపకుండా, స్వయం ఉపాధి పథకాలకు ప్రోత్సాహం కల్పించకుండా, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా, నిరుద్యోగులకు మరింత ద్రోహం చేసే విధంగా ఉద్యోగంలో ఉన్న వారి పదవీ కాలాన్ని మరింతగా పెంచే దుర్మార్గపు అలవాటు బి ఆర్ఎస్ హయాంలో మూడేళ్లు కొనసాగితే మళ్ళీ ప్రస్తుత కాంగ్రెస్ కూడా మూడేళ్లు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. అలాగే భారతదేశంలోని ఇతర రాష్ట్రాల లోపల కూడా ఉద్యోగంలో ఉన్న వారి పదవీ కాలాన్ని మరింత పొడిగించడం అత్యంత దుర్మార్గం అది నిరుద్యోగ యువతకు ద్రోహం చేయడమే ఇవన్నీ కూడా పాలక ప్రతిపక్షాలకు కనిపించడం లేదా" ."గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని నిరుపేదలు రేక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో బతుకుతున్నటువంటి అభాగ్యులు చదువు వైద్యం కోసమే అరకొర ఆదాయంలో 60 నుంచి 70% దాకా ఖర్చు చేస్తుంటే పూట గడవలేక కనీస అవసరాలు తీరలేక సొంత ఇల్లు లేక ఇంటి కిరాయి చెల్లించలేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ పాలకులకు రైతులు మాత్రమే కనపడుతున్నారు రైతుల యొక్క అవసరాలు రుణమాఫీ జీవిత బీమా రైతుబంధు పేరుతో సహాయం చేయడం రైతుల వరకే పరిమితమైతే విభిన్న పనులు చేసుకుంటూ చాలీచాలని అర్ధాకలితో జీవిస్తున్న వారి గురించి ఏనాడైనా చట్టసభలో పాలక పక్షాలు మాట్లాడినాయా?
అయితే ప్రతిపక్షాలు ఏం చేస్తున్నట్లు " ఎంతసేపు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎదురించడానికి,విమర్శించడానికి, వెంట పడతామని హెచ్చరికలు చేయడానికి కాదు నిర్మాణాత్మక సూచనలు చేయాలి, పేదరిక నిర్మూలనకు సంబంధించి సంపదను సృష్టించే మార్గాలను తెలియచేయాలి, ఆదాయ సంపదలలో అసమానతలు అంతరాలను తొలగించడానికి నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వాలి, ప్రణాళికల ప్రభుత్వాల యొక్క లక్ష్యం సమ సమాజ స్థాపన అయినప్పుడు రాజకీయ పార్టీలకు ఆ సమసమాజ స్థాపన బహుశా ఇష్టం లేక కాబోలు అందుకే అసమానతలు అంతరాలను అలాగే కొనసాగనివ్వడానికి పెత్త o దారి వర్గాలకు ఊడిగం చేస్తూ సంపద కొద్దిమంది చేతుల్లోనే నిక్షిప్తమయ్యేలాగా ప్రోత్సహిస్తున్న మాట నిజం కాదా !
రాజకీయ పార్టీల బూటకపు నినాదాలను తిప్పి కొట్టాలి :-
పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలను ఒక పార్టీ అంటే తులం బంగారం అదనంగా ఇస్తామని మరొక పార్టీ మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చిన పార్టీ ఒక్కరికి ఇవ్వకుండానే ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఇక దళిత బంధు పేరుతో సంపన్నులకు కూడా 10 లక్షలు ఇస్తామని ఆశ చూపి లంచాలు తీసుకొని కొందరికి ఇచ్చిన అక్కడ పేద వాళ్లకు ఒరిగింది లేదు సంపన్నులకు తప్ప. ఇక రైతుబంధు పేరుతో తెలంగాణ రాష్ట్రంలో నైతే ఇచ్చిన పండని భూములు గుట్టలు అడవులు, వాగులు, వంకలు, రోడ్లకు ఇచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు ఇది నిజమైన పరిపాలనేనా? ?ఇప్పటికీ దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు రేషన్ కార్డు ద్వారా ఉచిత బియ్యాన్ని కేంద్రం ఇస్తున్నట్లుగా ప్రకటించింది అయితే ఇవ్వాలా ప్రజలకు కావలసింది పోషకాహారం కానీ ఉచిత బియ్యం కాదు ఆ విషయాన్ని కరోనా సమయంలో ఆనాటి పరిస్థితులలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే పౌష్టికాహారం పేద ప్రజలకు మరీ తప్పనిసరి అని హెచ్చరించిన విషయం అందరికీ తెలుసు. ఒకవైపు పేదరికం తగ్గింది అని స్వయంగా చెప్పిన ప్రధాన మంత్రి గారు రేషన్ బియ్యాన్ని కొనసాగిస్తూ కనీస సౌకర్యాలు లేక నిలువ నీడ లేక రోడ్లపైన అడవుల లోపల మురికి కూ పాల మధ్యన జీవిస్తున్న కోట్ల మంది ప్రజల సంగతి ఏమిటి ?"ప్రజలలో శ్రమ శక్తిని పెంచాలి, ఆత్మస్థైర్యాన్ని నింపాలి, ఆదాయాన్ని పెంపొందించాలి, తమ కాళ్ళ మీద తామే నిలబడే విధంగా తీ ర్చిదిద్దాలి.కానీ ప్రస్తుతము ప్రభుత్వ నినాదాలు, ఉచితాలు, తాయిలాలు, ప్రలోభాలు వాగ్దానాలు అని వేర్వేరు రూపాలలో ప్రజలను, సోమరిపోతులుగా బానిసలుగా యాచకులుగా మార్చుతూ ఉంటే ఆమాత్రపు హామీలనైనా అమలు చేయలేదని ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ఎదురుదాడి చేయడం బాధ్యత రాహిత్యమే, అవగాహన లేకపోవడమే. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చేటువంటి హామీలన్నీ కూడా ప్రజలను నిర్వీర్యం చేసేటివే అని అన్ని రాజకీయ పార్టీలు ముందు గమనించాలి. "అన్ని రాజకీయ పార్టీలు ఉచితలను నివారిస్తామని,ప్రజలను స్వతంత్రంగా జీవించే విధంగా తయారు చేస్తామని,వారి ఆదాయ మార్గాలను పెంచుతామని, శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధికి పాల్పడతామని ప్రమాణం చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఒకరిని మించి మరొకరు హామీలు ప్రకటిస్తే ఈ దేశం అభివృద్ధి చెందదు, సంపద సృష్టించబడదు, సృష్టించబడని సంపదను ప్రజలకు పంచే ఆస్కారం అంతకు లేదు. శ్రమైక జీవన సౌందర్యాన్ని, సంపదను పెంచే మార్గాలను పెంచడానికి,పాలక ప్రతిపక్షాలు ముందు బాగాన నిలవాలి. ప్రజలను ప్రభువులు గా చూడాలి. యాచకులుగా బానిసలుగా మార్చకుండా ఉండాలి. ఆ రకమైన సోయి ముందుగా రాజకీయ పార్టీలకు వస్తే ప్రజలు కూడా అడుక్కోవడానికి ఎదురు చూడడానికి ఏమిస్తారోనని చేతులు చాచడానికి అలవాటు పడరు అని తెలుసుకుంటే మంచిది." ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంతో సహా మరికొన్ని రాష్ట్రాలలో ప్రతిపక్షాల యొక్క వాదన కేవలం గ్యారంటీలు హామీలను అమలు చేయమని నిలదీయడానికే పరిమితమైనది అది కాదు..... ఉచిత విద్య వైద్యం సామాజిక న్యాయం సమానత్వం అంతరాలు లేని వ్యవస్థ పేదరిక నిర్మూలన ఆదాయ మార్గాలను పెంపొందించడం వంటి కీలక అంశాల పైన దృష్టి సారించి ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. ఆ అంశాలు లేకుండా ఎన్ని మాట్లాడినా ఆ రాజకీయ పార్టీలను ప్రజలు విశ్వసించకపోగా తరిమి కొడతారు జాగ్రత్త !
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)