చూస్తూ ఊరుకోవడమేనా ప్రశ్నించేది ఏమైనా ఉందా?  

Jan 24, 2025 - 20:18
 0  3

సెల్ ఫోన్ లోని అశ్లీల  సన్నివేశాలు  ద్వంద్వార్థాలు  ఎవరి ప్రయోజనం కోసం?*  ప్రజలు చైతన్యవంతులు కాకుండా  అడ్డుకునే కుట్రకాక మరేమిటి? ప్రభుత్వాల ప్రమేయం లేకుండానే  కొనసాగితే,  ప్రజలకు ద్రోహం తలపెడితే  అదుపు చేయలేని పాలకులు ఎందుకు?

---వడ్డేపల్లి మల్లేశం

ప్రజల ప్రయోజనం కోసమైతే   కొన్ని సందర్భాలలో  ప్రభుత్వ స్థానిక సంస్థల ఆమోదం లేకుండా కూడా  కొన్ని కార్యకలాపాలు బహిరంగ  అమ్మకాలు ప్రదర్శన  కొనసాగుతున్న విషయాలను మనం గమనించవచ్చు.  ప్రజలకు ఉపయోగపడే నిత్యవసరాలు లేదా ఫర్నిచర్ లాంటి  ఐటమ్స్ పెద్ద మొత్తంలో  తెచ్చి తాత్కాలికంగా  రోడ్డు పక్కన అమ్ముకొని  సంచార జీవితం గడుపుతున్న వాళ్ళు అనేకం.  కత్తులు, గొడ్డళ్ళు,   ఇతర వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన ఇనుప వస్తువులను  తయారు చేసే వాళ్ళు  సంచార జీవులుగా ఊరురా తిరుగుతూ  ఉపాధి కల్పించుకుంటున్న వాళ్లు అనేకం.  సర్కస్ విన్యాసాలు,  వీధి బాగోతాలు,  కళాకారుల ప్రదర్శనలు,  బుర్రకథలు, హరికథలు, యక్షగానాలు,  ప్రజల చైతన్యం చేసే కళారూపాలు  ఊరురా వాడవాడలా తిరుగుతూ  జానెడు పొట్ట కోసం పడరాని పాట్లు  పడుతున్న సందర్భం  అయినా వాళ్ల కడుపు నిండనటువంటి దురదృష్టం  మనం కల్లారా చూస్తున్నాo.  అయినప్పటికీ ఇలాంటి వాళ్లను స్థానికంగా ఉన్నటువంటి  అధికారులు  అనుమతి లేదని బెదిరించే ప్రయత్నం చేసి  కనీసమైన సహకారం అందించకుండా  నిర్బంధ విధానాలను అమలు చేసిన సందర్భాలను మనం చూడవచ్చు.  సామాజిక మాధ్యమాలలో  సహెతు కం   కానీ శాస్త్రీయబద్ధంగా లేని అంశాల పైన పోస్టులు పెట్టిన మాత్రాన మంత్రులు ముఖ్యమంత్రులు చివరికి ప్రధాని వరకు కూడా  అలాంటి పోస్టులను సహించేది లేదు అని  హెచ్చరిస్తున్నారు. కానీ  సెల్ ఫోన్లో టీవీలలో సినిమాలలో అర్థనగ్నంగా అంద వికారంగా  ప్రచార వస్తువులుగా  అంగడి సరుకుగా ఆడవాళ్లను చూపిస్తున్నటువంటి సన్నివేశాల పైన  మాట్లాడడానికి మాత్రం ప్రభుత్వాలకు ముఖ్యమంత్రులకు ప్రధానులకు నోరు రాకపోవడం విచారకరం.  పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడమే తెలుసు కానీ పాలకులకు  ఏ అంశాలు ప్రజలకు  నష్టదాయకం? ఏ విషయాలను ప్రజలకు అందుబాటులో ఉంచితే  సామాజిక ప్రయోజనము లేదా సంస్కృతి అభివృద్ధి అనే విషయాలు పట్టించుకోని కారణంగా  సెల్ ఫోన్ టీవీ సీరియల్ ప్రభావం దాని పర్యవసానం రోజురోజుకు  ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్లిపోవడ0పై  ప్రజలు గమనిస్తున్నారు కానీ పాలకులు మాత్ర0 ఇప్పటికీ నోరు మెదపడం లేదు .
    ప్రజల మౌనం  మరింత ప్రమాదకరం:-
*****-*****
  నిండా  మునిగితే చలి తెలువదు అన్నట్లు  ఇప్పటికే ప్రజలు మద్యం, మత్తు పదార్థాలు, ధూమపానము,  వ్యభిచారము,  లైంగిక వేధింపులు, క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు,  బెట్టింగులు  వంటి  ముసుగులో  బయటి లోకాన్ని గుర్తించకుండా  అచేతనంగా  కాలం గడుపుతున్న విషయాన్ని గమనిస్తే చాలా బాధ అనిపిస్తుంది.  కుటుంబాలు వీధిపాలవుతుంటే యజమానులు ఈ రకంగా  నిస్తేజంగా పడిపోవడం, అప్పుడప్పుడు అనారోగ్యం పాలై ఆత్మహత్యలకు హత్యలకు దారి తీయడంతో  కుటుంబం అనాధగా మారుతున్న విషయం పాలకులకు తెలియదా?  పైన తెలిపిన అన్ని రకాల అసాంఘిక  వస్తువులు ప్రదర్శనలు మద్యం దుకాణాలు అమ్మకాలు  ప్రభుత్వ అనుమతితోనే కదా నడిచేది?  ఆ రకంగా చలి తెలవకుండా నిండా ముంచినట్లుగా  ప్రజలు కూడా ఆ మత్తులో భ్రమలో పడిపోయి తమ సాంఘిక ధర్మాన్ని కుటుంబాలను  ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ భాగస్వామ్యాన్ని కూడా మరిచిపోతూ  సోమరిపోతులుగా  దోపిడీ దొంగలుగా  చివరికి దేశద్రోహులుగా మిగిలిపోతున్నారు.  చట్టబద్ధంగా కొనసాగుతున్నటువంటి ఈ అనర్థాల వలలో పడి  ప్రజలు బాధ్యతారాహిత్యంగా  జీవిస్తుంటే పాలకులకు చీమకుట్టినట్లు  లేకపోవడం  పాలన వ్యవస్థలోని డొల్లతనాన్ని ప్రశ్నించే  వ్యవస్థలు తమ బాధ్యతను మరిచిపోవడం వలన  ప్రపంచంలోనే బహుశా భారత దేశంలో  అసాంఘిక కార్యకలాపాలకు హద్దు లేకుండా పోయింది అంటే అతిశయోక్తి కాదు
    .  ముఖ్యంగా సెల్ఫోన్ వ్యవస్థలోని   సందర్భాలను, సన్నివేశాలను, ప్రదర్శనలను, ద్వంద్వార్థాలను,  సంభాషణలను, అంగాంగ ప్రదర్శనలను  గమనించినప్పుడు ఇది  నాగరిక భారతదేశము అని చెప్పుకుంటున్న  సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిందే.  ప్రేమ, శృంగారము,  వివాహము,  అందము  ఈ అంశాలన్నీ కూడా వ్యక్తిగత జీవితానికి అవసరమే కానీ  అవసరమైన వస్తువులను అంగట్లో పెట్టి అమ్మినట్లుగా  స్త్రీలను వేదిక చేసుకుని  ప్రదర్శిస్తున్నటువంటి బొమ్మలు  చిత్రాలు వారి నోటి ద్వారా చెప్పిస్తున్న మాటలు  చిత్రాలపైన రాయబడినటువంటి  మాటలు  ఈ సమాజాన్ని మరింత అగాధములోకి నెట్టేసి ప్రమాదం  ఉన్నది. 1)నాకు పెళ్లి కాలేదు  పెళ్లి చేసుకుంటావా లేదా నాకు ఒక అబ్బాయిని చూసి పెడతావా? 2) నా భర్త దుబాయ్ కి పోయిండు  ఎంజాయ్ చేద్దాం వస్తావా?  నా సెల్ ఫోన్ నెంబర్ ఇస్తా.
3)  అసభ్యకరమైన రీతిలో  ఆట వస్తువులుగా  అంగడి బొమ్మలుగా  స్త్రీలను చూపిస్తూ  స్త్రీలు కూడా ఈర్ష పడే స్థాయిలో  అంతకు మించి పురుషులను ఆకర్షించే ధోరణిలో  కొనసాగుతున్నటువంటి ప్రదర్శన లేదా మాటలు నటన  అంగాంగ ప్రదర్శన  అభినయము  తాత్కాలికంగా సంతోషాన్ని అందించవచ్చు. కానీ  వ్యక్తుల మానసిక ప్రవర్తనలో  అలజడి  రేగడానికి,  దురభిప్రాయాలు జనించడానికి, వికృత పరిణామాలకు దారి తీస్తున్న సందర్భాలను మనం గమనించాలి. ఇవాళ సెల్ఫోన్ వ్యవస్థ కేవలం పెద్దల దగ్గరే కాకుండా పిల్లలు కూడా నిరంతరము  ఏదో ఆటపాటల కోసం చూస్తున్న సందర్భంలో  యూట్యూబ్ లో ఫేస్బుక్లో ఇతరత్రా  ఇలాంటి ఆటలు మాటలు పాటలు బొమ్మలు  పిల్లల కంట పడితే  దాని పరిణామం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.  పిల్లలు తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్న తీరు  ప్రశ్నించే ప్రమాదాన్ని కూడా  ఊహించవలసిన అవసరం ఉంది. ఇలాంటి సన్నివేశాలను చూస్తూ  తమ వరకే పరిమితం చేసుకుంటూ,  ఇవి తప్పదు వాటిని వదిలిపెట్టాలి,  ఇది ఏ ప్రభుత్వం చేతుల్లో కూడా ఉండదు అనే మాటలతో కొంతమంది  తమను తాము సరిపుచ్చుకుంటున్నారు. మరికొందరు  ప్రశ్నించడానికి  సిద్ధపడిన అడిగేది ఎవరిని అనే  అనుమానంతో ఆగిపోతున్నారు. నాబోటి రచయితలు అనేకమంది కూడా  సామాజిక బాధ్యతతో ఆవేశంతో  నిలదీయడానికి ప్రయత్నిస్తూ రచన ద్వారా అక్కసు వెలదీసుకుంటున్న అది చేరవలసిన చోటికి చేరడం లేదు, ప్రతిస్పందించవలసిన వాళ్ళు స్పందించడం లేదు.  అదే సందర్భంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి పాలకులు తమ మొ ద్దు నిద్దరను వదలడం లేదు కనుకనే రోజురోజుకు మరింత తారాస్థాయికి ఈ వ్యవహారం  చేరుతుండడంతో  యువత మధ్య వయస్కులు కూడా  తమ విధి నిర్వహణ మరిచి, కర్తవ్యాన్ని విడిచి, డ్యూటీలో భాగంగా కూడా ఈ బొమ్మలను చూడడానికి,  అసభ్య పదజాలాన్ని వినడానికి, ఆనందపడడానికి చూపుతున్న శ్రద్ధ పనిమీద చూపడం లేదు అనే  ఆరోపణలు  కూడా ఉన్నవి 
          ప్రభుత్వాలు అదుపు చేయాలి లేకుంటే తమ నిస్సహాయతను ప్రకటించాలి:-
*********-----
  ప్రజల కష్ట సుఖాలను  బాగోగు  లను  పట్టించుకోవడంతోపాటు  క్రమశిక్షణను పెంచి పోషించి  ప్రయోజకులుగా  దేశ సేవకులుగా తీర్చి దిద్దవలసిన భాద్యత  ప్రభుత్వాలపైన ఉన్నది  కానీ  సినిమాలు సీరియల్లతో మొదలుపెడితే  సెల్ఫోన్ వ్యవస్థలో ఎక్కడ చూసినా కూడా  అశ్లీల మైనటువంటి బొమ్మలు నిరంతరము కనబడుతున్నవి. చివరికి పత్రికల్లో కూడా చివరి పేజీలో  సినిమాల పేరు చెప్పుకొని అర్ధనగ్నమైన బొమ్మలను చూడక తప్పడం లేదు  పత్రికా సంపాదకులకు వేయక తప్పడం లేదు. ఇంత జరుగుతున్న ప్రభుత్వాలు మౌనంగా ఉంటూ దానివల్ల జరిగే పరిణామాలను ఊహించకుండా  బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం అంటే  పెట్టుబడిదారీ చేతిలో పాలకులు  నిస్సహాయులైనట్లా? లేక  ఈ వ్యవస్థను అదుపు చేసే శక్తి సామర్థ్యాలు అధికారం పాలకులకు లేకనా?  ఈ విషయం పైన స్పష్టత రావాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది.  ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే  జాగరుకులైన, చైతన్యవంతులైన, ప్రయోజకులైన, సమర్థులైన ప్రజలను ఆశించిన  ఈ దేశంలో  మత్తులో,  ఉన్మాదంలో,  అశ్లీలమైన  సన్నివేశాల ముసుగులో,   అంగడి సరుకుగా చూపించే ప్రదర్శనలకు  ప్రేక్షకులుగా ప్రజలను పరిమితం చేస్తే  ఆ పర్యవసానం భవిష్యత్తులో ప్రభుత్వాలపైన తప్పక ఉంటుంది.  ప్రజలు చైతన్యవంతులై  తమ నిస్సహాయతకు కారణాలు తెలిసిన రోజున  కచ్చితంగా ప్రశ్నిస్తారు,  పాలకుల  ఎదిరిస్తారు కూడా.  ఇలాంటి సన్నివేశాలను చూస్తూ మౌనంగా ఉండడం  పాలకులకు
అలవాటు కావచ్చు కానీ ప్రజలు  బానిసలుగా ఉండకూడదు. వాటి పర్యవసానాలను అర్థం చేసుకొని వాటి నిర్మూలనకు,  తమ పిల్లల భవిష్యత్తు కోసం  కచ్చితంగా  పాలకులను ప్రశ్నించాలి,  ఈ అనారోగ్యకరమైనటువంటి  అశ్లీల సన్నివేశాల నిర్మూలనకు పోరాడాలి.  ఇప్పటికే అనేక రకాలైనటువంటి సామాజిక రుగ్మతల బారిన పడి  సమాజం విచ్ఛిన్నమై సంక్షోభంలోకి కూరుకుపోతుంటే  మనిషిని నిద్రాణంలోకి మార్చి  మొద్దుబారే  విధంగా చేయగలిగిన  ఈ దుందుడుకు చర్యలను అరికట్టకపోతే....  ఉత్పత్తి ఎక్కడికక్కడే ఆగిపోతుంది,  నీతి నిజాయితీ నైతిక విలువలు పతనమవుతాయి,  వారి వరుసలు మాని  ఆకృత్యాలకు పాల్పడతారు,.  ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేక అనర్థాలు అత్యాచారాలు లైంగిక వేధింపులకు  ఇలాంటి సన్నివేశాలు  ప్రధాన కారణమని అనేక నివేదికలు తెలిపినా,  మానసిక వేత్తలు  మేధావులు హెచ్చరించిన ప్రభుత్వాలు  మౌనంగా ఉండడం తమ సామాజిక బాధ్యతను మరిచిపోవడం  నిజంగా సిగ్గుచేటు. ప్రభుత్వం అదుపులో గనుక ఈ వ్యవస్థ లేకుంటే,  ప్రజల సొమ్ముతో  ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే  అచేతనంగా ఊరుకోవడానికి పాలకులు సిద్ధంగా ఉండకూడదు కదా!  అలాంటప్పుడు ఆ కంపెనీల పైన ఉక్కు పాదం మోపి  ప్రజల సంస్కృతి సంస్కారాన్ని కాపాడడానికి వీలైన మార్గాన్ని అన్వేషించాలి  అంతేకానీ  సినిమాల్లో టీవీ ప్రసారాలలో మాదిరిగా సెల్ ఫోన్ లోనూ  స్త్రీ గౌరవాన్ని నాశనం చేస్తున్న  అన్ని రకాల  చిత్రాలు  వీడియోలు మాటలు చేతలు ప్రదర్శనలు నటనలు  జాతికి ద్రోహం తలపెడతాయి, సంస్కృతికి నాశనం సంస్కృతిక వివాదం కలిగిస్తాయి. ఈ గురుత ర బాధ్యతను ఇప్పటికైనా పాలకులు గుర్తిస్తే మంచిది  లేకుంటే ప్రజలు  కొంత ఆలస్యంగానైనా చైతన్యులు   అవుతారు, తమ మౌనాన్ని విడిచి ప్రశ్నించడం నేర్చుకుంటారు,  ఆ పరిస్థితులు రాకముందే పాలకులు ఆలోచిస్తే మంచిది కదా!
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333