సోమరితనము, బాధ్యతారాహిత్యముతో బానిసలుగా మారితే మనపై స్వారీ చేసేవాళ్లు పోటీ పడతారు
హక్కులకై కలబడుతూ బాధ్యతలకు నిలబడడమే పరిష్కారం.
ఓటును ఆయుదoగా మార్చుకొమ్మని అంబేద్కర్ హెచ్చరించలేదా .?
----వడ్డేపల్లి మల్లేశం
మనుషుల్లో అంతర్గతంగా దాగి ఉన్న శక్తులను వెలికి తీయనంతవరకు, ఆ శక్తులు తనకు తెలియనంత వరకు అందరూ కూడా తమను తాము బలహీనులుగానే భావిస్తారు . అంతేకాదు తాము ఏమి చేయలేమని, తమ వళ్ళ ఈ వ్యవస్థకు ఏమీ జరగదని, తాము సముద్రంలో నీటిబొట్టు లాంటి వారమని తమ ను తాను అంచనా వేసుకోవడం వల్ల కూడా ఈ వ్యవస్థకు భారీ నష్టం జరుగుతున్నది . ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని కూడగట్టుకునే బదులు ఆత్మ న్యూనతకు గురికావడం వలన కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకోవడమే కాదు తనకు తెలియకుండానే బానిస మనస్తత్వంలోకి జారుకుంటున్నారు. మానసిక శాస్త్రవేత్తలు చెప్పినా, సామాజికవేత్తలు హెచ్చరించినా, వ్యవహారిక జ్ఞానముతో ఆలోచించిన వారు అనుభవాలను విప్పి చెప్పిన మనలను మనము మరిచిపోవడం బాధ్యతలు విస్మరించడం సోమరితనంతో పనులను వాయిదా వేయడం వల్లనే అనేక రకాల అనర్థాలు జరుగుతున్నాయని తెలుస్తున్నది . అందుకే ఇటీవలి కాలంలో కౌన్సిలింగ్ ,శిక్షణ కేంద్రాలు , మోటివేషన్ తరగతులు వ్యక్తిగత జీవితాన్ని తీర్చిదిద్దడానికి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి విస్తృత అధ్యయనానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. అయితే ముందుగా మనిషి తను గిరి తీసుకున్న చక్రబంధము నుండి బయటపడితే తప్ప తన శక్తిని ఉన్నతంగా ఊహించలేడు. అనేక సందర్భాల్లో గమనించినప్పుడు గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న వాళ్లు కార్మికులు రైతులు కాయకష్టం చేసి బ్రతికే వాళ్ళలో ఉండే ఆత్మ స్థైర్యాన్ని గమనించినప్పుడు ఆశ్చర్యం కలగక మానదు . ఏ శాస్త్రాలు అభ్యసించలేదు, ఏ శిక్షణ పొందలేదు, విద్యార్హతలు పెద్దగా సాధించలేదు అయినప్పటికీ ఈ ఆత్మస్థైర్యానికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి వారికి ఉన్న ధైర్యం ఎక్కడిది. అని అంచనా వేసుకున్నప్పుడు ప్రకృతి నుండి, పరిస్థితుల నుండి ,సమాజ పరిశీలన నుండి , అనుభవాల నుండి ఈ రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని పొందినట్లుగా మనం భావించవచ్చు .ఈ రకమైన జ్ఞానానికి తోడుగా సాహిత్య అధ్యయనాన్ని సమాజాన్ని లోతుగా పరిశీలించే తత్వాన్ని పెంచుకున్నట్లయితే మరింతగా రాణించే అవకాశం ఉంటుంది . అలాంటి అవకాశం ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు బుద్ధి జీవులు ఆ వైపుగా కృషి జరపకపోవడం కొద్ది మంది మాత్రమే పరిమిత స్థాయిలో సాహిత్య సంస్కృతిక సామాజిక రంగాలలో కృషి చేస్తున్న కారణంగా ఈ వ్యవస్థ ఎదగవలసిన స్థాయిలో ఎదగడం లేదు. వ్యవస్థను పట్టించుకునే వాళ్ళు ఎంత ముఖ్యమో తమ బాధ్యతలను తాము నిర్వహించే వాళ్ళు కూడా అంతే ముఖ్యం .ఈ రెండు సమాంతరంగా కొనసాగినప్పుడు మాత్రమే మరింత ఉన్నతమైన సమాజాన్ని చేరుకోవడానికి ఆశించడానికి ఆవిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది.
పోరాటం మరిచి బాధ్యతలు విస్మరిస్తే బందీలు గానే మిగిలిపోతాం *
**********
రాజ్యాంగబద్ధoగ రా వలసినటువంటి హక్కులను సాధించుకోవడానికి పోరాటం చేయకుండా, అదే సందర్భంలో సమాజం పట్ల బాధ్యతలు నిర్వర్తించకుండా మొక్కుబడిగా వ్యవహ రించడం, బద్దకముతో పనులను వాయిదా వేస్తూ నిస్తేజంగా వ్యవహరిస్తే అంతా చీకటే. అప్పుడు "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూచి మోసపోకుమా నిజం తెలిసింది నిద్రపోకుమా" అన్న శ్రీశ్రీ పాటలోని హెచ్చరిక నీకు రక్షణ అవుతుంది . కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే సమాజం పట్ల సానుకూల దృక్పథాన్ని అవలంబించాలి, ఓటు హక్కును ఆయుధంగా చేసుకొని బానిస మనస్తత్వంతో రాజీ పడకుండా హక్కులను పోరాడి సాధించుకోవాలి. తలవంచి, ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టి , ప్రశ్నించకుండా, ప్రతిఘటించకుండా లొంగిపోతే జీవితమంతా అంధకారమే.... అప్పుడు నీపై స్వారీ చేయడానికి అనేక శక్తులు పోటీ పడతాయి . ఇవాళ రాజకీయ పార్టీల విధానాన్ని గమనించినప్పుడు సామాన్య ప్రజల సంపదను అనేక రూపాలలో దోచుకుంటున్న విషయం తెలిసిందే. గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ప్రతి చోట అవినీతి, భూ కబ్జాలు, అక్రమార్జన , హామీలు వాగ్దానాల రూపంలో మోసం దగా కొనసాగుతూనే ఉన్నది . ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించకుండా పక్కదారి పట్టించే క్రమంలో ఉచితాలు తాయిలాల పేరుతో ప్రభుత్వాలు వరాల జల్లు కురిపిస్తుంటే వాటిని అందుకోవడానికి చేతులు జోడించే హీనమైన పరిస్థితికి ప్రజలు నెట్టబడుతుంటే ఈ దేశంలో పేదరికం బానిసత్వం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఆత్మగౌరవానికి అవకాశం ఎక్కడిది? తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాలు ఏర్పడిన సందర్భంలో అనేక ఆకాంక్షలతోపాటు ఆత్మ గౌరవాన్ని ప్రధానంగా చేసుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ప్రజల ఆత్మగౌరవాన్ని ఖూనీ చేసి అహంకారంతో తమ ఆధిపత్యాన్ని ప్రజల మీద రుద్దిన విషయం మనందరికీ అనుభవంలోనిదే .ఈ విషయాలను ముందుగానే పసిగ ట్టిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ శ్రీశ్రీ పాటలోని హెచ్చరిక లాగానే " ఓటు హక్కును ఆయుధంగా ఉపయోగించుకుని యజమానిగా నిలబడు బానిసగా మారితే నీ మీద రాజ్యం స్వా రీ చేస్తుంది" అని ఏనాడో చేసిన హెచ్చరిక ఇప్పటికీ పేదల పాలిట అమలవుతున్నది అంటే ప్రజలు బాధ్యతారాహిత్యము సోమరితనము బానిస మనస్తత్వం నుండి బయటపడకపోవడమే కదా ప్రధాన కారణం. అనేక చట్టాలు రూపొందడానికి ప్రజా ఉద్యమాలు కారణమైనట్లే ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయించడానికి కూడా ప్రజా ఉద్యమాలు కీలక పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసిందే. గత రెండు సంవత్సరాల క్రితం మూడు రైతు వ్యతిరేక చట్టాల పైన 13 మాసాలు రైతు సంఘాలు పోరాడి ప్రభుత్వం మెడలు వంచి చట్టాలను రద్దు చేయించిన విషయం ..... పైగా ప్రధాని పార్లమెంటులో దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పిన సందర్భం ప్రజా పోరాట స్ఫూర్తి వల్లనే కదా ! స్థానికంగా జీవించినా జాతీయంగా అంతర్జాతీయంగా ఆలోచించే పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలి. ప్రతి అంశం మీద అవగాహన కలిగి ఉండే ప్రయత్నం చేస్తూ అవసరమైన సందర్భంలో చర్చించడం, ప్రశ్నించడం, తమ భావాన్ని వివిధ మీడియాల ద్వారా పంచుకోవడం నేడు ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం కావాలి. బద్దకాన్ని వీడి బాధ్యతను గుర్తించి అపారమైన తన శక్తిని తాను గుర్తించే ఆలోచన ధోరణి ప్రతి వ్యక్తి అవలంబించిన నాడు
రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చేస్తున్న అక్రమ విధానాలకు అడ్డుకట్ట వేయవచ్చు .సుపరిపాలన సాధ్యం చేయవచ్చు. అరాచకాలను ముగింపు పలకవచ్చు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టవచ్చు. ఈ దేశం నాది అనే భావన ఉంటే అన్నీ సాధ్యమే. నాకేమి సంబంధం అనుకుంటే అంతా ఆ శూన్యం . ఆలోచిద్దాం !ఆ వైపుగా మన జ్ఞానాన్ని మేధస్సును విస్తృత పరుచుకుందాం !ఇందుకు చైతన్యంతో కూడిన సామాజిక పరిశీలన, సాహిత్య అధ్యయనం అలవాటు చేసుకుందాం!
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)