గ్యారంటీలు వాగ్దానాలపై   ప్రజా సంఘాలు మేధావుల తో చర్చించాలి.*

Jul 25, 2024 - 09:17
 0  5

 హామీలు ఇచ్చినప్పటికీ  అన్ని వర్గాల ప్రయోజనం రీత్యా  పునరాలోచన చేయాల్సిందే.

ఉచితాల నుండి ప్రజలను  క్రమంగా  రాజ్యాంగబద్ధ హక్కుల వైపు  మళ్ళించాలి


ఆర్థిక విధ్వంసం నుండి   కాపాడాలంటే  సంపద అందరికీ చెందాలంటే  కఠిననిర్ణయాలు తప్పనిసరి .

(తెలంగాణతో పాటు అర్థికరంగంలో అతలాకుతలమైన A.P.కీ కూడా కఠిన నిర్ణయాలు వర్తిస్తాయి.)

---వడ్డేపల్లి మల్లేశం

సబ్బండ వర్గాల  దశాబ్దాల పోరాటాలు త్యాగాలు ఆత్మ బలిదానాల కారణంగా మాత్రమే  సాకారమైన తెలంగాణ రాష్ట్రం  తమ సాధనే అని  గంభీరంగా చెప్పుకొని దశాబ్దం పాలించిన గత బిఆర్ఎస్ ప్రభుత్వ  వికృత పరిపాలన కారణంగా  అన్ని రంగాలలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే అద్వాన్న స్థితిలోకి నెట్టబడింది . పైగా ఎన్నికల్లో గెలవడానికి  అంతులేని వాగ్దానాలు హామీలు ఉచిథాలు ప్రకటించి  అమలు చేయకుండానే  ప్రజలలో ఆశలు రేకెత్తించి  ప్రభువులు గా చూడవలసిన వారిని  యాచకులుగా బానిసలుగా మార్చిన చరిత్ర కూడా గత ప్రభుత్వానిదే  .అంతేకాదు ఎన్నికల సమయంలో  అధికార దుర్వి నియోగంతో మంత్రులను అధికారులను  ఎన్నికల ప్రాంతంలో తిష్ట వేయించి  పనిచేయని కాలానికి కూడా వేతనాలు తీసుకున్న ఘన చరిత్ర  .రైతు బంధు పేరుతో  భూస్వాములు పెట్టుబడిదారులకు వందల ఎకరాలు ఉన్న వారికి పంటలు పండని భూములు అడవులు గుట్టలకు కూడా ప్రజాధనాన్ని  అప్పనంగా  ఒకే వర్గానికి కట్టబెట్టి సామాన్యులకు, భూమిలేని నిస్సహాయులకు, ఏ మాత్రం ప్రతిఫలం అందకుండా చేసిన   దుర్మార్గ పాలనకు   విసిగిన ప్రజానీకం బుద్ధి జీవులు మేధావుల ఆగ్రహం కారణంగా  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది . ఈ చారిత్రక నేపథ్యాన్ని  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వాస్తవాన్ని  పార్టీతో సహా ప్రజలు  అన్ని వర్గాలు  ఏమాత్రం విస్మరించకూడదు.

  అధికారంలోకి వచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటాపోటీగా ఉచితాలు రాయితీలను గ్యారెంటీలను ఎక్కువగా ప్రకటించిన కారణంగా ప్రస్తుతము  రైతులు భిన్న వర్గాలు ప్రతిపక్షాల నుండి కొంత ఒత్తిడిని ఎదుర్కోక తప్పడం లేదు  అయితే ఇవి ఎన్నికల ఎత్తుగడలో భాగమే కనుక స్తవాలను బుద్ధి జీవులు మేధావులు ప్రజాసంఘాలకు విప్పి చెప్పి  ప్రత్యామ్నాయ విధానాల వైపు దృష్టి సారించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం  తక్షణ కర్తవ్యం గా దృష్టి సారించాలి .అది పార్టీ,  ప్రభుత్వ  ప్రతిష్టకు ఎంతో తోడ్పడుతుంది .
  
హామీలు ఇచ్చినా  కొన్ని కఠిన నిర్ణయాలు తప్పనిసరి:-

  ముఖ్యంగా రైతు రుణమాఫీ రైతు భరోసా  పంటల  బోనస్  ఆర్థికంగా ప్రభుత్వం మీద భారం పడే అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం   ప్రకటించిన కారణంగా  పదేండ్లలో చేయని పనులను  పక్కకు పెట్టి  బి ఆర్ ఎస్  కాంగ్రెస్ ప్రభుత్వం  వెంటనే అమలు చేయాలని   డిమాండ్ చేయడం  శాపనార్థాలు పెట్టడం  ప్రభుత్వం కూలిపోతుందని  జోష్యం చెప్పడం  సిగ్గుచేటు . గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి కాలేశ్వరం ప్రాజెక్టుతో సహా అనేక ప్రాజెక్టులు కాలువలు  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు చెక్ డ్యాములు  భవనాలు అన్నీ కూడా నాణ్యత లోపంగా ఉన్న విషయాన్ని  అలాగే విద్యుత్ శక్తి విషయంలో అక్రమ ఒప్పందాలు  ఫోన్ టాపింగ్ వ్యవహారం పైన ఒక వైపు విచారణ కొనసాగుతూ గత ప్రభుత్వం యొక్క లోపాలను  ఏజెన్సీలు బయట పెడుతూనే ఉన్నప్పటికీ కూడా  అతి ఉత్సాహాన్ని ప్రదర్శించడం అంటే  తన గోతుని తానే తప్పుకోవడం  .ఇక రాష్ట్రంలో సంపదని సృష్టించడం సంపదను ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయడం అనేది ప్రభుత్వం యొక్క ఏజెండాగా లక్ష్యంగా ఉండాలి కానీ  ఇటీవల ప్రధానంగా ప్రభుత్వాలు ఇస్తున్న హామీలలో ఎక్కువ భాగం పెట్టుబడిదారులు రైతుల ప్రస్తావన తీసుకురావడం వలన  భూమిలేని నిరుపేదలు, కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు,  దారిద్రరేఖ దిగువన జీవిస్తున్న వాళ్ళు ఎందరో   రాజ్యాంగబద్ధమైన హక్కులకు నోచుకోక  తమ బ్రతుకు ఇంతే అని  తమ కష్టాన్ని చెమటను మాత్రమే నమ్ముకుని బ్రతుకుతున్నారంటే ఎంత వివక్షత వైవిద్యo ఉందో ప్రజల జీవితాల మధ్యన అర్థం చేసుకోవచ్చు.  ఈ అంశం ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు  రైతుల రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ  వర్తింప చేసే క్రమంలో అనేక సంఘర్షణ  వైరుధ్యాలు దృష్టికి వస్తున్న సందర్భంగా  పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు  పాటు  బోనస్ ఇవ్వడం ద్వారా మరింత ఉత్పత్తిని పెంచడానికి,   కష్టపడి పండించిన రైతులకు ప్రతిఫలం దక్కడానికి ఆస్కారం ఉంటుంది అనేది ఇటీ వల కొంత  బహిర్గతం అవుతున్న అంశం . మరొకపక్క పేదవర్గాలు  తమకు విద్య వైద్యాన్ని ఉచితంగా నాణ్యమైన స్థాయిలో  ఎంత ఖర్చైనా  ప్రభుత్వమే భరించే విధంగా  సౌకర్యం కల్పిస్తే తమకు ఏది అవసరం లేదని  సుమారు 60 నుండి 70 శాతం సంపద ఈ రెండింటికే ఖర్చవుతున్న కారణంగా పేదలు మరీ పేదలుగా మారుతున్నారని పూర్తిగా  దారిద్రరేఖ దిగువన కలవాళ్ళు అప్పుల పాలై ఆత్మహత్యల పాలవుతున్నారని   విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని దృష్టికి తీసుకు వస్తున్న సందర్భాలను కూడా ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి . సాధ్యమైనంతవరకు ప్రజాధనాన్ని అందరికీ సమాన స్థాయిలో అర్హత రీత్యా పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది మరొకవైపు సంపదను సృష్టించే క్రమములో దృష్టి సారించవలసిన అవసరం కూడా చాలా ఉన్నది. " సంపదని పెద్ద మొత్తంలో సృష్టిస్తే తప్ప  ప్రజాధనాన్ని ప్రజలకు పంచడం సాధ్యం కాదు అప్పుడు మాత్రమే రాజ్యాంగబద్ధమైన హక్కులను ప్రజలకు అందించడానికి ఆస్కారం ఉంటుంది" .

 ఈ శాస్త్రీయ అవగాహనను మేధావులు ప్రజాసంఘాలు బుద్ధి జీవులతో ప్రస్తుత ప్రభుత్వం చర్చించి  గతంలో ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలను క్రమక్రమంగా  తగ్గించుకుంటూ అందరికీ ప్రయోజనాలు కలిగే రీతిలో ముఖ్యంగా విద్య వైద్యాన్ని ఛాలెంజ్గా తీసుకొని  ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లయితే అన్ని వర్గాలకు కూడా న్యాయం జరిగినట్లు అవుతుంది ప్రజల మధ్యన వివక్షత ఘర్షణను నివారించడానికి కూడా ఆస్కారం ఉంటుంది.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విప్పి చెప్పడంతో పాటు  శాస్త్రీయమైన అభివృద్ధిని సాధించడానికి  ఇచ్చిన హామీల కంటే పెద్ద మొత్తంలో ప్రజల ఆర్థిక స్థితి  మెరుగుపరచడానికి గల  అవకాశాలను  చర్చించడం ద్వారా క్రమంగా రాయితీల నుండి ప్రజలను  దృష్టి మళ్లించవలసినటువంటి అవసరం చాలా ఉన్నది .

 ప్రజలే స్వచ్ఛందంగా తమకు ఈ అరకొర రాయితీలు  అడుక్కునే జీవితం అవసరం లేదని రాజ్యాంగబద్ధంగా  హక్కులు  కావాలని  తమ వాటా ఏందో తమకు తేల్చాలని అడిగే విధంగా ప్రజలను సంసిద్ధులను చేయవలసిన అవసరం కూడా ఉన్నది .ఆ విషయంలో ప్రభుత్వంతో పాటు మేధావులు బుద్ధి జీవులు ప్రజాసంఘాలు గురుతర పాత్ర పోషించి ప్రజానీకంలో చర్చ జరిపి రాయితీల వైపు  మొగ్గుచూపకుండా నిరాకరించే విధంగా సంసిద్ధులను చేయగలిగితే  తెలంగాణ రాష్ట్రంలో  నూతన అన్వేషణల  వలన  ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు  అన్ని వర్గాలకు పని కల్పించడం ద్వారా  ఆదాయ మార్గాలను గణనీయంగా పెంచినట్లయితే  జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి . ఆ పరిస్థితులు చేరుకోవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలను  ప్రభుత్వం తీసుకోవాలి . ఆ నిర్ణయాల వల్ల ప్రజలు తాత్కాలికంగా కొన్ని రాయితీలు కోల్పోయినప్పటికీ  శాశ్వతమైన  అవకాశాలు, రాజ్యాంగబద్ధమైన హక్కులు,  ఉచిత విద్య వైద్యం  సాధించుకోగలిగితే  అంతకు మించిన ఆనందం ఏదీ లేదు.

 ప్రపంచంతో పోటీ పడదాం :-

ఆర్థిక అరాచకత్వానికి బలైన రాష్ట్రం  ఆ స్థితి నుండి క్రమంగా కోల్పోవడానికి  ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తద్వారా  ప్రజల జీవన ప్రమాణాలను  ఉన్నతంగా నిలబెట్టడానికి  ప్రపంచముతో పోటీపడే విధంగా రాష్ట్రం  ముందు వరుసలో  కృషి చేయాలి . ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా  తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతుందని చెప్పడం జరిగింది  అవును నిజమే  విద్య వైద్యాన్ని ఉచితంగా  నాణ్యమైన స్థాయిలో అందించి  అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్నటువంటి కామన్ స్కూల్ విధానాన్ని రాష్ట్రంలో  సాకారం చేసి  కొఠారి సూచించినట్లుగా రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 30 శాతం కేటాయించడం ద్వారా దేశంలో తొలి   స్థానాన్ని సంపాదించాలి  .ఇప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం  విద్యా వైద్యం విషయంలో ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయడం వల్ల ప్రైవేట్ విద్యాసంస్థల నుండి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోకి వస్తున్నారంటే  అంతర్జాతీయ స్థాయి శిక్షణను అక్కడి ఉపాధ్యాయులకు ఇస్తున్నారంటే  ఈ అంశాల లోపల కూడా తెలంగాణ ప్రభుత్వం  ఆచరణకు శ్రీకారం చుట్టడం ద్వారా  ప్రపంచంతో  పోటీ పడదాం అనే నినాదానికి  కార్యరూపం తీసుకురావాలని మనసారా కోరుకుందాం . ఉమ్మడి రాష్ట్రంలోనూ,    తెలంగాణ పాలనలోనూ విధ్వంసమైనటువంటి రాష్ట్ర ఆర్థిక సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిస్థితులను  గాడిలో పెట్టే క్రమంలో  ప్రతి రంగానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించడం , అమలు చేయడం, అవసరమైన రంగాలకు కమిషన్లను నియమించడం ద్వారా  వినూత్న పరిపాలనకు శ్రీకారం చుట్టాలి.  ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చర్యలు పాటించడం,  గతంలో జరిగిన అవినీతిపైన పూర్తి విచారణ జరిపించి దోషులను శిక్షించి నష్టపరిహారాన్ని రాబట్టడం  ద్వారా  ఆర్థిక వ్యవస్థను  అంతే  సమాంతరంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా తనదైన శైలిలో  కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగాలని  అందుకు కఠిన నిర్ణయాలను తీసుకోవాలని నిర్ణయాలు తీసుకునే క్రమంలో ప్రజలకు అవగాహన కల్పించి ఒప్పించాలని  అందుకు ప్రజాసంఘాలు మేధావులు కూడా ప్రభుత్వానికి సహకరించి  అంతిమంగా ప్రజలను ప్రభువులుగా చేయాలని  ఆశిద్దాం .హక్కులకై కలబడడం మాత్రమే కాదు బాధ్యతలకు కూడా ప్రతి ఒక్కరు నిలబడిన నాడు , మద్యం, మత్తు డ్రగ్స్, క్లబ్బులు పబ్బులు  ఇతర సామాజిక రుగ్మతలకు ఆస్కారం లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకుందాం . అందుకే కఠిన చర్యలు తప్పనిసరి.  ఇది నిజంగా పరీక్షాకాలం ప్రభుత్వానికి , పోలీసులకు  ప్రజలకు,ప్రజాస్వామికవాదులకు  కూడా !

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333