విషారానికి ప్రతిరూపం ఆధునిక చిరుతిండ్లు జంక్ ఫుడ్స్

Mar 20, 2024 - 17:05
 0  1

అన్ని వయస్సుల వారిని అనారోగ్యం బారిన పడేస్తున్నా  చోద్యం చూస్తున్న  ప్రభుత్వాలు.

 నోటి రుచికి మరిగి  త మ గోతిని తామే తవ్వుకుంటున్న ప్రజానీకం.

రాజీ పడకుండా నివారించగలరా? అని  ఆలోచనపరుల సూటి ప్రశ్న .

 ప్రజా చైతన్యం, అవగాహన  తుది పరిష్కారం .

---- వడ్డేపల్లి మల్లేశం  

ప్రతి పనిలో శ్రద్ధ  పేదరికంలో ఉన్న తీసుకున్న ఆహారం పోషక విలువలతో కూడుకున్నదై  శరీరానికి వంట పట్టిన  పద్ధతులకు నాడు శ్రీకారం చుడితే,  సంపద పెరిగి  అవగాహన చైతన్య  ఆవిరి అయిపోయి  విజ్ఞానం విశ్వవ్యాప్తమైన నేటి రోజుల్లో  విషా హారానికి నాగరికత ముసుగులో ఎగబడుతున్న ప్రజానీకానికి  అడ్డుకట్ట వేయలేని  పాలకుల నిర్లక్ష్యం  అనారోగ్య భారతానికి  మరింత ఆజ్యం పోస్తున్న విషయం  లోతుగా పరిశీలిస్తే కానీ అర్థం కాదు.  పూర్వకాలంలో పోషక విలువలతో కూడిన  పిండి వంటలు  చిరుతిండ్లు అనే పేరుతో  ప్రాచుర్యము పొందినప్పటికీ  రసాయన ఎ రువులు పురుగుమందుల వాడకం లేని రోజుల్లో  ప్రతిదీ ఔషధ విలువలు కలిగిన ఆణిముత్యమే అని చెప్పక తప్పదు.  శ్రమకు తగిన ఫలితం అంతగా అందకపోయినా  ఉన్నంతలో  కల్మషం లేని మనసుతో మరింత  నిర్మలత్వ ముతో కూడిన చిరుతిళ్లను  చేసుకొని  తృప్తి పొందిన కాలమది.  కానీ నేడు  భిన్నంగా  విశాహారానికి అలవాటు పడి రుచులకు మరిగి  బజారులోనే చిరుతిండ్లను  చట్టబద్ధం చేసిన ధోరణి  ముదిరి పాకాన పడ్డ విషయం గమనిస్తే  మనం ఎటువైపు వెళుతున్నామో అర్థం చేసుకోవచ్చు . పోషక విలువలు లేని అధిక కేలరీలు కలిగిన కొవ్వు పదార్థాలు  ఇతర హానికారక పదార్థాలకు ఉప్పును  అనారోగ్య  కారకాలను ఎక్కువగా దట్టించి  రుచికరంగా తయారుచేసి  నిలువవుంచే పద్ధతిలో  తయారు చేయబడుతున్నటువంటి విశాహారాన్ని నేడు "జంక్ ఫుడ్"  పేరుతో  కడప కడప కు చేర్చినటువంటి  దౌర్భాగ్య సంస్కృతిని ఎంత తొందరగా కట్టడి చేస్తే అంత మంచిది . అధిక మోతాదులో కొవ్వు చక్కెర ఉప్పు కలిగిన ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లను  నిలువవుంచే పద్ధతుల్లో తయారుచేసిన వాటిపైన  హెచ్చరిక  ముద్రించాలని  మద్యపానం మాదిరిగా ఆంక్షలు విధించాలని  వినియోగదారుల సంఘాలు చేస్తున్న డిమాండు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని  ఆహార రంగ నిపుణులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పిల్లలనుంచి పెద్దల దాకా   బానిసలైపోవడంతో  మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్లు  ఇతర అనారోగ్యం బారిన పడుతున్న  జన భారతానికి  హద్దు అదుపు లేకుండా పోవడం భారతదేశ భవిష్యత్తుకు  తీరని ద్రోహాన్ని మనకు మనమే తలపెట్టినట్లు కాదా ?

ప్రపంచవ్యాప్తంగా  విజృంభించిన ఈ జంక్ ఫుడ్  అలవాటు  ఇండియాలో  నమోదవుతున్న మరణాలలో 63 శాతానికి పైగా  కారణమవుతున్నట్లు  ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలి  ఆధునిక పోకడల  ప్రయోజనాలు ప్రమాదాలను ఆలోచించకుండా  మొక్కుబడిగా  బానిసలు కావడం అనేది  దేశంలో  సర్వ మానవాళిని  అనారోగ్యంలోకి నెట్టు వేస్తూ తీరని  ద్రోహాన్ని  వేధనను మిగుల్చు తున్న విషయం  వాస్తవం కాదా?

    జంక్ ఫుడ్-  కొన్ని గణాంకాలు-  వికృత పరిణామాలు

*************

ప్రజలు తెలిసి ఆచరిస్తున్న,  ప్రభుత్వాలు  పరిణామాలు పర్యవసానాలు, ప్రమాదాలను గుర్తించి అనుమతిస్తున్న  ఈ జంక్ ఫుడ్ అలవాటును  మనకు మనమే పెంచుకుంటున్నామంటే  మన గోతిని మనమే తవ్వు కున్నట్లు లెక్క.  బాలల నుండి వృద్ధుల వరకు కొనసాగుతున్న ఈ అలవాటు  కారణంగా  20 ఏళ్లు పైబడిన వారిలో 28.6% స్థూలకాయంతో  11.4% మధుమేహం  35.5% అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు  ఈ   విషపూరితమైన చిరుతిండి కారణంగా  యుక్త వయస్సు నాటికే  ప్రజలు పలు రోగాలతో  ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నట్లు  గణాంకాలు తెలియజేస్తుంటే  శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషిస్తున్న విశ్లేషకుల హెచ్చరికలు బేకాతరు  చేయడం ఎవరి ప్రయోజనం కోసం?  ఈ వికృత  అవాంచిత  పరిణామాల కారణంగా 2030 నాటికి భారతదేశంలోనికుటుంబాలు  అనారోగ్యాన్ని తప్పించుకోవడానికి చేసే ఖర్చు  కొనుగోళ్లకు చేస్తున్న వ్యయం  అన్నీ కలిపి  6 లక్షల కోట్ల డాలర్ల  ఆర్థిక నష్టాన్ని  చవి చూడవలసి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023 జూన్ లో చేసిన హెచ్చరిక  ఇకనైనా  భారతదేశంలో సహా ప్రపంచ దేశాల మొద్దు నిద్రను  వదిలించడానికి  తోడ్పడుతుందని ఆశిద్దాం.

         ఒక్కసారి పరిశీలిస్తే మార్కెట్లో ఆకర్షణగా ప్యాకెట్లతో ఎప్పుడు కావాలంటే అప్పుడు లభ్యమయ్యే రీతిలో రకరకాల చిప్స్, పిజ్జాలు, బర్గర్లు, శీతల పానీయాలు, నిలువ ఆహార పదార్థాలు  మన సాంప్రదాయ ఆరోగ్యకర పిండి వంటలు పోషక  తిండికి ప్రత్యామ్నాయంగా మారిపోయి  మనల్ని వెక్కిరిస్తున్నాయి.  ప్రజల బద్ధకం , జిహ్వచాఫల్యం,  టీవీ ప్రసారాలు  ఇతర మీడియా లోని విస్తృత ప్రచారం కారణంగా  ప్రజలు అనివార్యంగా  ఈ హానికర ఆహారానికి అలవాటు పడుతూ  తమకు తాము దేశానికి తీరని ద్రోహం తలపెడుతున్న విషయం  ఒక్కసారి వెనుతిరిగి చూస్తే కానీ అర్థం కాదు. పెట్టుబడిదారులకు కావాల్సింది లాభమే కనుక  ప్రజల  ఆకాంక్షలు కోరికలకు అనుగుణమైన  ఉత్పత్తుల పైన  పెట్టుబడులు పెట్టి  అధిక మొత్తంలో రాబట్టడానికి  వారికి ఏ న్యాయము సామాజిక బాధ్యత గుర్తు రావడం లేదు.  ప్రధానమైనటువంటి పరిశ్రమల కంటే  జంక్ ఫుడ్ పరిశ్రమ యొక్క పరిమాణం  భారతదేశంలో 2.5 లక్షల కోట్లకు చేరిందంటే  అత్యధిక వినియోగం గల వస్తువుల   ఉత్పత్తి సంస్థల జాబితా లాభాలలో  76% ఈ జంక్ ఫుడ్ ద్వారానే లభిస్తున్నదని చేదు వాస్తవం  పాలకులు ప్రజలు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది.  మద్యపానం ధూమపానం ఇతర అసాంఘిక  అంశాలకు సంబంధించి మీడియాలో టీవీ సినిమా ప్రసారాలలో ఏ రకంగా నైతే  ప్రసారమై  జన జీవితాన్ని చిద్రం చేస్తున్నాయో అదే పద్ధతిలో  ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న జంక్ ఫుడ్ ప్రచారాలను  తెలియజేసే ప్రసారాలను  ప్రకటనలను  ముఖ్యంగా పిల్లల ఛానల్ లో నిషేధిస్తూ 2022 జూన్ లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ  పాలకుల యొక్క  బాధ్యతారాహిత్యము, పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాన్ని ఆశించే  పాక్షిక మనస్తత్వం కారణంగా  ప్రతిరోజు  మరింత రెచ్చిపోయి 6500 ప్రకటనలతో  జంక్ ఫుడ్కు  పిల్లలను  రెచ్చగొడుతున్నట్లు తెలుస్తున్నది.  గ్రామాల నుండి పట్టణాల వరకు  అన్ని హోటల్లు రెస్టారెంట్లు  బార్లు  బజార్లలో  ఈ చిరుతిo డ్లు లభ్యమవుతున్న ప్రతి చోట కూడా  తనిఖీలు చేసి  వాటి ఉత్పత్తిని వాడకాన్ని నిషేధించడానికి ప్రభుత్వాలు  చొరవ చూపకపోతే  రాబోయే  కాలంలో  దేశ ప్రజలు విష ఫలితాలను అనుభవించక తప్పదు.   నిరక్షరాస్యు ల నుండి మేధో సంపన్నుల వరకు కూడా  ఈ జంక్ ఫుడ్  బా రిన పడుతున్నారంటే  పాలకుల కంటే ప్రజలు కూడా  పూర్తి బాధ్యులని గుర్తిస్తే మంచిది. పౌర సమాజం, పాలకులు,  వారికి తోడుగా  ఆలోచన పరు లు బుద్ధి జీవులు  ఉమ్మడి పోరాటం,  ప్రభుత్వం మీద ఒత్తిడి,  పెట్టుబడిదారుల పైన  ఉద్యమాలు లేవదీస్తే తప్ప  చాప కింద నీరులా దేశవ్యాప్తంగా విస్తృతంగా  వ్యాపించిన ఈ  ఆకృత్యానికి అడ్డుకట్ట వేయలేము . 2024 మే నెలలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో  "న్యూట్రిషన్ అడ్వకసి  ఇన్ పబ్లిక్ ఇంటరెస్ట్ "అనే ఆలోచన పరుల  వేదిక  జనారోగ్యాన్ని కబలిస్తున్న  జంక్ ఫుడ్ నిర్మూలనకు  తమ పార్టీల ప్రణాళికలు ఏమిటి? అని అన్ని రాజకీయ పార్టీలను నిలదీస్తున్నట్లు తెలుస్తుంటే  ఇది  ప్రజా ఉద్యమానికి వేదికగా భావించి  ముందు  ప్రజలు  ఇట్టి ఆహారాన్ని బహిష్కరించడం ద్వారా  పోరు బాటలో  పయనించాల్సిన అవసరం  ఎంతగానో కనపడుతున్నది.  ఒళ్ళును, ఇల్లును గుల్ల చేస్తున్న ఈ మహమ్మారిని  తరిమి అందుకు ప్రత్యామ్నాయంగా పోషక విలువలతో కూడినటువంటి  ఆరోగ్యానికి రక్షణ కవచమైన  ఆహారాలను రూపొందించుకొని  గతంలోకి తొంగి చూసి  పిండి వంటలు,పప్పు,  సిరి ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను  చట్టబద్ధం చేయడమే నేడు  అందరి ముందున్న ప్రత్యామ్నాయ తక్షణ కర్తవ్యం.  ఆ వైపుగా ఆలోచన ఆచరణ ఉండాలని  ఆశిద్దాం.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333