పేదరికానికి పెద్ద కారణాలు విద్యా, వైద్యానికి పేదలు చేస్తున్న భారీ ఖర్చులు
ప్రభుత్వ విద్యా వైద్య రంగాలు కునా రిల్లిపోతే 80 శాతం ప్రజలు ప్రైవేట్ రంగాన్ని నమ్ముకుంటున్నారు .
ఈ రంగాలను గాలికి వదిలిన ప్రభుత్వాలు పేదరికం భారీగా తగ్గిందని ప్రకటనలు చేయడం మోసపూరితమే!
---వడ్డేపల్లి మల్లేశం
విద్యా వైద్య రంగాలను ప్రభుత్వాలు నాణ్యమైన ఉచిత రీతిలో ప్రజలకు అందించాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించినా, సామ్యవాదాన్ని రాజ్యాంగ పీఠికలో ఒక హెచ్చరికగా ఆమోదించినా పాలకుల పుణ్యమా అని ఈ రెండు రంగాలను ప్రైవేటు పరం చేసి చేతులు దులుపుకుంటున్న విధానాన్ని గణాంకాలతో సహా మనం అర్థం చేసుకుంటే ప్రభుత్వ ప్రకటనలు మోసపూరితమని ఎన్నికల్లో గెలవడానికి మాత్రమేనని తెలిసిపోతున్నది. అందుకే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ "విద్య వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించవలసి ఉన్నప్పటికీ పాలకులు ఆ వైపుగా చర్యలు తీసుకోవడం లేదు. కారణం ఏమిటంటే ఈ రెండు ఉచితంగా అందినట్లయితే ప్రజలు చైతన్యవంతులై ఆరోగ్యంగా ఉండి పాలకులను ప్రశ్నిస్తారు. అందుకే పాలకులు ఉచితంగా ఇచ్చినట్లు నటిస్తున్నారు తప్ప నిజం కాదు" అని చేసిన హెచ్చరిక ఇప్పటికైనా ప్రజల చైతన్య స్థాయిని పెంచాల్సిన అవసరం ఉన్నది .
కొఠారి కమిషన్ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో విద్యారంగానికి 10 శాతం కేటాయించవలసి ఉండగా నామ మాత్రo కేటాయిస్తూ అదే రకంగా వైద్యానికి కూడా 2 శాతం దాటడం లేదంటే ఇక ప్రజలకు ప్రైవేటు రంగాలే శరణ్యమని చెప్పకనే చెప్పినట్లు అవుతున్నది. అత్యవసరమైన వైద్య చికిత్సలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేని కారణంగా పేదలు తమ జేబులో నుండి కష్టార్జితాన్ని ఖర్చు చేస్తున్న కారణంగా ఏటా సుమారు 6 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అదే సందర్భంలో 50 లక్షలకు పైగా దారిద్రరేఖ దిగువకు పడిపోవడాన్నీ గమనిస్తే పేదరిక నిర్మూలనలో ప్రభుత్వ వైద్యరంగం ఎంత పాత్ర పోషిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక 74 శాతం పేద వర్గాలు ఖర్చు ఎక్కువ అవుతున్నా ప్రభుత్వ రంగంలో వైద్య సౌకర్యాలు అందుబాటులో లేని కారణంగా ప్రైవేటు ఆసుపత్రులపై ఆధార పడవలసిన దుస్థితికి ఈ దేశంలో పాలకవర్గాలు బాధ్యత వహించి తలదించుకోవలసిన పరిస్థితులు ఏర్పడినవి అంటే అతిశయోక్తి కాదు. ఇక దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యతోపాటు విశ్వవిద్యాలయ విద్యను కూడా ప్రైవేటుపరం చేసిన పాలకవర్గాలు పేద వర్గాలకు ఆమాత్రం విద్యను కూడా అందకుండా చేసిన కారణంగా విద్య కోసం కూడా ఖర్చు చేస్తూ ఇల్లు గుల్ల చేసుకుంటూ అప్పుల బారిన పడుతూ పేదరికం కారణంగా అనారోగ్యం పాలవుతున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. .ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే గత ఐదేళ్లలో ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ప్రారంభించి బారాస ప్రభుత్వం ప్రజలకు తీరని ద్రోహం తలపెట్టిన విషయం మరిచిపోలేము కదా ! రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యా,వైద్య రంగాలను ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా బలోపేతం చేస్తే తప్ప ఈ దుర్భర పరిస్థితుల నుండి దేశ ప్రజలను గట్టెక్కించలేము .ఇక తెలంగాణ రాష్ట్రంలో గమనిస్తే 60 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు గాను సుమారు 31 లక్షల మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుతుంటే 29 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదవడాన్నీ బట్టి ప్రభుత్వ విద్యా రంగం ఎంత బ్రష్టు పట్టిపోయిందో ఆ మేరకు పేద ప్రజల జేబులకు ఎలా చిల్లులు పడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు .
మరికొంత లోతుగా ఆలోచిస్తే వాస్తవం బయటపడుతుంది:-
********
ఇటీవల నీతి అయోగ్ 9 ఏళ్ల కాలంలో దాదాపు 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి ప్రభుత్వ చర్యలు విముక్తి చేసినాయని తెలిపిన విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి తమ గొప్పతనంగా ప్రకటించిన విషయం తెలిసినదే . 2013 -14 లో 29.17% గా ఉన్నటువంటి పేదరికం 2022- 23 నాటికి 11.2 8 శాతానికి తగ్గిందని నీథీ ఆయోగ్ తెలిపిన విషయం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కానీ నమ్మలేని నిజం. ఈ గణాంకానికి ప్రాతిపదికగా తీసుకున్న అంశాలు ఏమిటో కానీ దినదినం పేదరికం పెరిగిపోతూ సంపన్నులు కూడా అదే స్థాయిలో మరింత సంపన్నులు కావడాన్నీ గమనించినప్పుడు దీని వెనుక పాలకవర్గాల కుట్ర స్పష్టంగా ఉన్నదని తేలిపోతున్నది . ఇప్పటికీ దారిద్ర రేఖ దిగువన 15% ప్రజలు ఉంటే 15 కోట్ల మంది వలస కార్మికులు దిక్కుమొక్కు లేకుండా అధ్వానమైన జీవితాలు గడుపుతున్న విషయాన్ని పాలకులు దాచి పెడితే ఎలా ?పేదరికం తగ్గిందని చెప్పడానికి ప్రభుత్వం సాహసించినప్పుడు అందుకు తగిన చర్యలు మనకు కనిపించాలి కదా! 81.35 కోట్ల మందికి దేశవ్యాప్తంగా ఉచిత ఆహార ధాన్యాలను పంపిణీ చేయడంతో పేదరికం తగ్గడానికి కారణమైంది అని నీతి ఆయోగ్ ప్రకటించడం వాస్తవం ఎలా అవుతుంది? అనేక రాష్ట్రాలలో బియ్యం కొద్ది రాష్ట్రాల్లో గోధుమలు పంపిణీ చేసినంత మాత్రాన నామ మాత్రపు పోషక విలువలు ఉన్న ఈ ఆహారంతో ప్రజల యొక్క ఆరోగ్య స్థాయి ఏమాత్రం కుదుటపడకపోగా రోగ నిరోధక శక్తిని పెంచిన దాఖలా ఏమాత్రం లేదు. కరోనా సందర్భంలో రోగనిరోధక శక్తి పెంచడం ప్రధానమని శాస్త్రజ్ఞులు వైద్యరంగ నిపుణులు తెలిపినప్పటికీ పప్పులు, నూనెలు, సి రిధాన్యాల వంటి పోషకాహారం జోలికి పోకుండా ప్రభుత్వాలు కేవలం బియ్యాన్ని ఉచితంగా ఇచ్చి చేతులు దులుపుకోవడంతో పేదరికం తగ్గిపోయిందని ప్రకటన చేయడం అత్యాశే అవుతుంది .
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో తాత్కాలిక సంక్షేమ పథకాలు వ్యక్తిగత ప్రయోజనాలు కొంతవరకు అవసరమే కానీ ఇవి మాత్రమే పేదరిక నిర్మూలనకు తోడ్పడవు. ఆరోగ్య స్థాయిని పెంచడం , పోషకాహారాన్ని సరఫరా చేయడం , వైద్య సేవలను భారీ ఎత్తున ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి తేవడం, ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం వంటి ప్రధానమైన చర్యలకు స్వస్తి పలికిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదరికం తగ్గిందని ప్రకటన చేయడం వట్టి మాటలు కాక గట్టి మాటలు ఎలా అవుతాయి ? సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకరించబడి, పెట్టుబడిదారీ విధానానికి ప్రభుత్వాలు వంత పాడుతూ, సుమారు 14 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగవేతకు మద్దతిచ్చిన ప్రభుత్వం నల్ల ధనాన్ని విదేశాల నుండి రప్పిస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చక విస్మరించిన తీరు మన పాలకుల యొక్క బాధ్యతారాహిత్యానికి నిదర్శనం కాదా?. పేద ప్రజలు తమ సంపాదనలో 60 నుండి 70 శాతం విద్యా వైద్య రంగాలకే ఖర్చు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వాలు తమ మేనిఫెస్టోలలో ఏనాడు కూడా ఉచిత విద్య వైద్యం సామాజిక న్యాయం తమ ఎజెండా అని చెప్పలేకపోవడం ప్రజల చైతన్య రాహిత్యానికి నిదర్శనమే అవుతుంది. మౌలిక రంగాలను అభివృద్ధి పరుస్తూనే , అసమానతలు అంతరాలను క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయకుండా , కేవలం సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తే పేదరికం నిర్మూలించడం సాధ్యం కాదు. ప్రధానమైనటువంటి ఆరోగ్య0, విద్యా ప్రజలందరికీ నాణ్యమైన స్థాయిలో అందించినప్పుడు మాత్రమే పేదరికాన్ని కట్టడి చేయవచ్చు. ఉపాధి అవకాశాలను ఆదాయ మార్గాల అన్వేషణను చట్టబద్ధం చేస్తూ, ఆర్థిక అభివృద్ధికి అదే సందర్భంలో అనారోగ్యాన్ని పెంచి పోషిస్తున్న కల్తీ ఆహారాలు జంక్ ఫుడ్ వంటి విశాహారాలను కట్టడి చేయడం ద్వారా, ఆరోగ్య విద్యా రంగాలపైన కఠిన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది . ఈ కృషి ఏమాత్రం జరగకుండా, రెండు రంగాలకు బడ్జెట్లలో అధిక మొత్తము నిధులు కేటాయించకుండా పేదరికం భారీగా తగ్గిందని నీతి ఆయోగ్ ప్రకటించడం ప్రధానమంత్రి సమర్థిoచడం అంటే నిజ జీవితానికి సంబంధం లేని ప్రకటన అని తెలిసిపోతున్నది . ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న కేంద్రం, ఇంటికో ఉద్యోగం అన్న తెలంగాణ టిఆర్ఎస్ రెండు కూడా ప్రజలను వంచించిన ప్రభుత్వాలే. ఉచిత విద్య వైద్యం సామాజిక న్యాయం కోసం మరో స్వతంత్ర పోరాటం లాగా ప్రజా ఉద్యమాలు రావాల్సిందే.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు , అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ)