జీవితం లేని కథలు, సామాన్యులకు సంబంధంలేని  సన్నివేశాల

Mar 20, 2024 - 17:08
 0  1

నీతిని నింపని, పరివర్తన తీసుకురాని  సీరియళ్లు.

సామాజిక చింతనతో  టీవీ రచయితలు  ప్రసారాల సాంద్రతను  ప్రజా జీవితానికి దగ్గర చేయాలి.సామాజిక స్పృహకు  టీవీ ప్రసారాల నాణ్యత, నవ్యత  అవసరమని ప్రభుత్వాలు గుర్తిస్తే మంచిది .

---- వడ్డేపల్లి మల్లేశం

టీవీ ప్రసారాలను లోతుగా పరిశీలిస్తే  జన జీవితానికి సంబంధించిన  సందర్భాలు సన్నివేశాలు  చాలా తక్కువ.  ఒకవేళ ఉంటే కోటీశ్వరులు, సంపన్నులు, పెట్టుబడిదారులు, భూస్వామ్య వర్గాలకు సంబంధించిన సంస్కృతి భావజాలాన్ని మాత్రమే పెంచి పోషిస్తున్న విషయం స్పష్టంగా మనం గమనించవచ్చు . ప్రజా చైతన్యానికి , సామాజిక స్పృహకు,  వ్యవస్థలో  అత్యున్నత స్థాయిలో రావాల్సిన పరివర్తనకు  ఉపయోగపడే సాధనాలలో టీవీ ప్రధానమైనది . అందులో ప్రసారం చేయబడే కార్యక్రమాలు  లక్ష్యాత్మకంగా  జ్ఞానం,  నైపుణ్యం వినియోగం అవగాహన వంటి  సూచికలకు అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే  సమాజం చైతన్యవంతం అవుతుంది . తమ తప్పులను సవరించుకోవడానికి,  ఎదుటి వారి పట్ల  బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి,  కర్తవ్యాన్ని నిర్దేశించుకుని  జాతి లక్ష్యాలను  చేరుకోవడానికి,  సంపూర్ణ మానవునిగా ఎదగడానికి,  అంతిమంగా తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారాన్ని సమాజమంతా నింపి  అంతరాలు అసమానతలు  లేని సమసమాజం ఏర్పడడానికి  వ్యక్తుల్లో సహజంగా ఉండే ఆలోచనలకు తోడుగా టీవీ ప్రసారాలు కూడా  ఉపయోగపడతాయని పడాలని  బుద్ధి జీవులు మేధావులు ఆశించారు. కాని  వాటికి భిన్నమైన దారిలో ప్రసారాలు కొనసాగిస్తూ నిర్వాహకులు   దర్శకులు రచయితలు  లక్ష్యం లేకుండా,  ప్రజల భాషలో కాకుండా,  ప్రజల జీవితానికి సంబంధం లేకుండా,  జీవితం లేని కథలను అల్లి  సమస్యల పరిష్కారానికి బదులు కొత్త సమస్యలను సృష్టిస్తున్నటువంటి టీవీ ప్రసారాలు సీరియల్ లను ఎవరైనా కాదనగలరా?  ఎక్కడైనా ప్రజా జీవితాన్ని చూపించగలరా?  కిలోల కొద్ది బంగారం,    ఊహకు అందని  నిత్యజీవితంలో చూడని రాజభవనాలు,  ఊహలో కూడా ఎదురు కానీ సంఘటనలను కల్పించి  సమయాన్ని  కథను సాగదీస్తూ  సంవత్సరాల తరబడిగా  ప్రసారం చేయబడే సీరియల్లు  ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నాయో  ఆలోచించే క్రమంలో ప్రజలు  తాము ఎలా నష్టపోతున్నామో  సమీక్షించుకుంటే మంచిది.  70% వ్యవసాయ రంగంలో  పనిచేస్తున్నటువంటి పేద వర్గాల రైతులు కార్మికుల జీవితాలు ఎక్కడ మనకు కనపడవు.  నిజ జీవితంలో రోడ్ల పైన, దేవాలయాల దగ్గర, అనువను నా ప్రతి చోట  దుర్భర దారిద్రంతో దుస్థితిలో  వెలివేయబడిన పరిస్థితులలో  యాచకులు మానసిక  వికలాంగులు  మన స్థిమితం లేని వాళ్లను చూస్తుంటే  వీళ్ళ జీవితాలు ఎక్కడైనా కథల్లో కనిపిస్తున్నాయా? కథలు వీళ్ళ జీవితాలకు పరిష్కారాన్ని చూపిస్తున్నాయా?  టీవీ ప్రసారాలు వీళ్లను వీరి జీవితాలను  మనుషులుగా చూస్తున్నాయా? ఒకసారి అందరం ఆలోచిద్దాం.
        జుగుప్సాకరమైన సంఘటనలు- సంభాషణలు:-
*********
    పెళ్లి అయిన స్త్రీ పాత్రధారి తను మరో వ్యక్తితో  స్నేహం కోసం ఆరాటపడుతున్నటువంటి సందర్భాలు,  అదే సందర్భంలో ఆమె భర్త  మరో స్త్రీ కోసం  అర్రులు  చా స్తున్న సన్నివేశాలు,  నచ్చిన వ్యక్తుల మధ్యన పెళ్లిని అడ్డుకోవడానికి అనేక కుట్రలు,  అదే సందర్భంలో పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అనే శాపనార్థాలు ప్రతిజ్ఞలు,  ఒకవేళ పెళ్లి జరిగిన ఎలా శోభనం జరుగుతుందో చూస్తామని చేసే హెచ్చరికలు,  ఆ సందర్భంగా రాస్తున్నటువంటి సంభాషణలు  చిలిపి చేష్టలు వికృత రూపాలు కాదా? ఇలాంటి సన్నివేశాలను సృష్టిస్తున్నటువంటి  నిర్మాతలు దర్శకులు  సంభాషణలు కథను రాస్తున్నటువంటి రచయితలు  ఎవరి కోసం ఈ కథలు రాస్తున్నారు?  ఏ సామాజిక ప్రయోజనాన్ని ఆశిస్తున్నారో  తెలుసుకుంటే మంచిది . సామాజికత  లేకుండా  ఏ రచన  ఏ ప్రక్రియ కూడా కొనసాగడానికి వీలు లేదు  అది మరింత నష్టం చేసే ప్రమాదం కూడా ఉన్నది.  ఇవాళ టీవీ ప్రసారాలలో వస్తున్న అన్ని సన్నివేశాలలో కూడా  మద్యం తాగడాన్ని ప్రోత్సహించడం, ధూమపానాన్ని  కొనసాగించడం,  హత్యలు ఆత్మహత్యలను  చట్టబద్ధం చేయడం,  కుట్రలు కుతంత్రాలు దోపిడీ, పీడన వంచన  ఆధిపత్యం  అహంభావంతో పేద వర్గాలను  లేదా బలహీనులైనటువంటి మహిళలను అవమానించడమే  సీరియల్లకు కథాంశంగా మారిందా?  జీవితం లేకుండా కథలు రాయడానికి రచయితలు  ఎందుకు అంగీకరిస్తున్నారు ? సామాజిక స్పృహ లేకుండా తమ శ్రమను  మరిచిపోవడానికి  రంగుల మాయా లోకం పైన  భ్రమలు పెంచుకున్నటువంటి అశేష పేద ప్రజానీకం  తమకు కనీస మైనటువంటి తృప్తిని ఆనందాన్ని ఇస్తుందని ప్రతి ఇంట్లో పెట్టుకున్న టీవీ  పుణ్యమా అని  కార్పొరేట్ ప్రసారాలను పెట్టుబడిదారీ జీవితాలను  అసాంఘిక కార్యక్రమాలను సామాజిక దోపిడీని చూడక తప్పడం లేదు  .
           తెలంగాణ ఉద్యమ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా  టీవీ ప్రసారాలు సినిమాలు లక్ష్యాత్మకంగా లేకుండా  హింసను అవినీతిని అక్రమాలను కుట్ర కుతంత్రాలను  ప్రేరేపిస్తున్నాయని,  ప్రజల భాషకు దూరంగా పనిచేస్తున్నాయని,  సవరించవలసిన అవసరం చాలా ఉన్నదని  ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే  ప్రభుత్వం దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చిన టిఆర్ఎస్  ఏనాడూ పట్టించుకోకుండా   పెట్టుబడిదారుల ముందు తలవంచక తప్పలేదు . అయితే ఈ అంశాలు కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు.  ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా ఈ అంశాలను వర్తింపజేసి  ప్రజా వ్యతిరేక అంశాలు ఏ ప్రసారాలలో ఉన్న వాటిని  నిషేధించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నప్పుడు మాత్రమే  అంతరాలు, అసమానతలు, అభద్రత , అవమానాలు లేనటువంటి  ఒక నూతన వ్యవస్థను  సాధించడానికి అవకాశం ఉంటుంది.  ఈ ప్రసారాల నుండి హత్యలు ఆత్మహత్యలు  పెరుగుతున్నాయి  అత్యాచారాలకు కూడా నాంది అవుతున్నాయి.  పేదల బతుకులు మరింత చీకట్లోకి వెళ్లిపోతుంటే  పెట్టుబడిదారుల జీవితమే చట్టబద్ధమని అదే  ప్రామాణికమని  టీవీ ప్రసారాలు సినిమాలు   సమాజానికి సంకేతాలు పంపుతున్నప్పుడు  ఈ ప్రసారాలను ఎలా అనుమతిస్తాము?  ఎంతో చైతన్యవంతమైన సమాజం అని  పోరాటాలు ఉద్యమాలు ఆందోళనలకు వేదికైన ఈ భారతదేశంలో అందులో   తెలుగు రాష్ట్రాలలో  ప్రజలు ఎందుకు ప్రజా వ్యతిరేక అంశాలను వ్యతిరేకించడం లేదు.
      ప్రభుత్వాలు  బాధ్యతాయుతంగా వివరించాలి :-
********
సమాజం పైన పెను ప్రభావాన్ని చూపే  ప్రసార మాధ్యమం పైన ప్రభుత్వం  బాధ్యతను పక్కనపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే  దాని పరినామాలను సమాజం రుచి చూడవలసి వస్తుంది.  నిత్యజీవితంలో జరుగుతున్నటువంటి అనేక  సన్నివేశాలు,  ఎదురైనటువంటి సామాజిక రుగ్మతలు,  సమాజాన్ని విచ్చనం చేస్తున్న అనేక  సంఘటనలు  పోలీసు ఇతర డిపార్ట్మెంట్లని ఆందోళనకు గురి చేస్తున్న సందర్భాలను మనం గమనించినప్పుడు,  మేధావులు మానసిక వేత్తలు కూడా  క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు మద్యపానం  ధూమపానం మత్తు పదార్థాల వాడకం  అశ్లీల అసభ్య  సన్నివేశాలు  పదాల వినియోగాన్ని  తగ్గిస్తే మంచిదని  జరుగుతున్న కొన్ని సంఘటనలకు  కారణం అవుతున్నట్లు నివేదికలు ఇచ్చినప్పటికీ  ప్రభుత్వాలు తాత్కాలికంగా ఆవేశపడినా ఆ తర్వాత క్రమంలో చర్యలు ఏమాత్రం తీసుకోవడం లేదు.  ప్రభుత్వాలకు కావలసినటువంటి ఆదాయం కోసం అనేక అక్రమ విధానాలకు అనుమతిస్తున్న సందర్భాలను ఒకవైపు గమనిస్తే  అదే క్రమంలో  ప్రజా జీవితంతో సంబంధం లేకుండా సమాజానికి హాని చేసినప్పటికీ తమ లాభాల కోసం మాత్రమే నిర్మాతలు దర్శకులు, రచయితలు ఇలాంటి సీరియల్  రెచ్చగొట్టే ప్రకటనలతో కూడుకున్న ప్రసారాలను  యధాతథంగా కొనసాగిస్తున్నారు.  ఈ రకంగా బాధ్యత మరిచిన ప్రభుత్వాలతో పాటు  నిర్మాతలు దర్శకులు  ప్రజల బలహీనతలను  సొమ్ము చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే  సమాజం ఏ రకంగా  అభ్యుదయ పథంలో పయనిస్తుంది?  అనేక రుగ్మతలు  అసాంఘిక కార్యక్రమాలు సంఘటనలు సన్నివేశాలకు కారణం అవుతుంటే కల్లారా చూస్తున్న మనం  విద్యావంతులు మేధావులు, సామాన్య ప్రజలు  చైతన్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకు  ప్రశ్నించడం లేదు?  ప్రభుత్వాలు కూడా ప్రజలు ప్రశ్నించి  ఉద్యమాలను లేవదీసినప్పుడు మాత్రమే  కొంచమైనా తోక ఆడిస్తారు తప్ప  ఈ సమాజం మీద ప్రేమతో కాదు అని అనేక సంఘటనల ద్వారా మనకు రూఢీ అయినది.  ముఖ్యంగా మహిళా, యువజన సంఘాలు బుద్ధి జీవులు మేధావులు ప్రజాసంఘాలు  అనేక అంశాల మీద ఉద్యమాలు లేవదీసినట్టే  టీవీ ప్రసారాల యొక్క అసంబద్ధతపై  ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది.  ఆ వైపుగా అడుగులు పడాలని ఆశిద్దాం  .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333