ఇంటి దొంగలను వదిలే ప్రసక్తే లేదు : ఎమ్మెల్యే మందుల సామెల్

Mar 3, 2026 - 07:50
 0  319
ఇంటి దొంగలను వదిలే ప్రసక్తే లేదు : ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 03 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

భారీ ఎత్తున బైక్ ర్యాలీ.. 

తిరుమలగిరి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తా.. 

 గెలుపు ఓటములు సహజం.. 

ఇంటి పార్టీ దొంగల వల్లే ఓడిపోయాం... 

వాళ్లను వదిలి ప్రసక్తే లేదు.. 

పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తా... 

తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు నినాదాల మధ్య మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా 5వ వార్డు నుంచి తిరుమణి యాదగిరి, 6వ వార్డు నుంచి కేసిడి కవిత వెంకటరెడ్డి, 7వ వార్డు నుంచి బత్తుల శ్రీనివాస్, 8వ వార్డు నుంచి చిలుక వెన్నెల, 9వ వార్డు నుంచి కన్నెబోయిన మల్లయ్య యాదవ్ కౌన్సిలర్‌లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా బీఆర్‌ఎస్‌కు చెందిన 4వ వార్డు కౌన్సిలర్ సభ్యురాలు బత్తుల శకుంతల కూడా ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.వీరందరితో మున్సిపల్ కమిషనర్ రామచందర్రావు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయించారు.

రాజకీయ వేడి మధ్య వ్యాఖ్యలు:

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలుపు-ఓటములు సహజమని, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధి కోసం పార్టీ తేడాలు లేకుండా అన్ని వార్డుల ప్రజలు, ఇంచార్జులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అయితే ర్యాలీ సందర్భంగా ఎక్స్‌రోడ్ వద్ద కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “ఇంటి దొంగల వల్లే కాంగ్రెస్ పార్టీ తిరుమలగిరిలో మున్సిపల్ పీఠం కైవసం చేసుకోలేకపోయింది. అలాంటి ద్రోహులను ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు” అని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు .కాంగ్రెస్ చరిత్ర ప్రస్తావన:సుమారు 140 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిందని, దేశానికి సుస్థిర ప్రభుత్వాలు అందించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రజా పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉందని పేర్కొన్నారు.

బైక్ ర్యాలీతో శక్తి ప్రదర్శన:

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ జెండాలతో నినాదాలు చేస్తూ ఆనందోత్సాహాల మధ్య కౌన్సిలర్లను అభినందించారు. పట్టణ రాజకీయాల్లో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం కాంగ్రెస్ శక్తి ప్రదర్శనగా మారగా, ఎమ్మెల్యే వ్యాఖ్యలు స్థానిక రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపనున్నాయన్న చర్చ సాగుతోంది.

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పేరాల వీరేష్ సుంకరి జనార్ధన్ జుమ్మిలాల్ అబ్బాస్ సుధాకర్ వంశీ పార్టీ కార్యకర్తలు వివిధ మండల పార్టీ అధ్యక్షులు అన్ని గ్రామాల సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు భారీ ఎత్తున పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి