రాజీ పడకుండా రాశేవాళ్లే రచయితలు.

May 26, 2024 - 22:11
Jun 6, 2024 - 16:45
 0  19
రాజీ పడకుండా రాశేవాళ్లే రచయితలు.

కర్తవ్యాన్ని  విస్మరించకుండా సామాజిక బాధ్యత మోసే వాళ్లే కవులు.

పాలకులు పెట్టుబడిదారులకు వంత పాడి  ప్రజలకు

 ద్రోహం చేసే వాళ్లంతా నేరస్తులే.

అనివార్యమైతే యుద్ధాన్ని కోరినా  అంతిమ లక్ష్యం శాంతి కావాలని ,

అంతరాలు లేని వ్యవస్థ, సమసమాజ స్థాపన ఆశించని రచనలు,  

రచయితలు   నిష్ప్రయోజనం .!

రచనలు చేస్తూ కవితలల్లుతూ సమాజ ఉద్ధరణ కోసం పాకులాడే వాళ్ళు కొందరైతే  ఆలోచన కలిగి  చర్చలు చేసి  సామాజిక ప్రయోజనాన్ని శాసించి ఆశించి  సామాజిక బాధ్యత నిర్వహించే వాళ్ళు అనేక మంది ఉంటారు.  వీళ్లు రచనలు చేయకపోవచ్చు కానీ సామాజిక మార్పుకు, అంతరాలు లేని వ్యవస్థకు,  సమ సమాజ స్థాపనకు నడుం బిగించిన సందర్భాలు అనేకం.  అంటే రాయగలిగిన వాళ్లు మాత్రమే రచయితలు కాదు  ప్రజల పక్షాన ఆలోచించిన ప్రతివాళ్ళు రచయితలు కవులు కళాకారులు సామాజిక కార్యకర్తలు అని అంగీకరించక తప్పదు.  

 అయితే భిన్న మనస్తత్వాలు కలిగినటువంటి కొంతమంది రచయితలు  ఆలోచనలోనూ, ఆచరణలోనూ, చర్చలోను, సిద్ధాంత ప్రతిపాదనలోనూ, భావజాలాన్ని ప్రచారం చేయడంలోనూ ప్రజా వ్యతిరేక చర్యలకు పాలకవర్గ  మెప్పుకోసం  పెట్టుబడిదారీ వర్గాలకు వంత పాడడాన్నీ కూడా మనం గమనించవచ్చు.  ఇలాంటి వాళ్లు స్వప్రయోజనాల కోసం,  పదవి అధికారం హోదా కోసం  రాజీ పడి  తమ జ్ఞానాన్ని  తాకట్టు పెడుతున్నారు అంటే నిజంగా అలాంటి వాళ్ళు దేశద్రోహులు కాక మరేమవుతారు?  వారెన్ని రచనలు చేస్తేనేమి, ఎంత పేరు గడిస్తే నేమి, ఎన్నో పట్టాలు పొందుతేనేమీ?  ప్రజలకు ఉపయోగపడనీ,  ఆటవిడుపు,  అలంకారప్రాయం,  వర్ణన కోసం మాత్రమే సృష్టించబడిన ఏ సాహిత్యమైన  నిష్ప్రయోజనం మాత్రమే కాదు అది ప్రజా వ్యతిరేకం కూడా.  సమాజాన్ని పరిశీలించి  భిన్న వర్గాలను సమన్వయపరిచి  రావలసిన మార్పులను ఆశించి తద నుగుణంగా శాసించగలిగిన శక్తి కేవలం రచయితలకు మాత్రమే ఉంటుంది.  నిబద్ధత తపన  అంకిత భావం  సామాజిక బాధ్యత  మార్పు కోసం పోరాడే తత్వం ఉన్నవాళ్లు మాత్రమే నిజమైన కవులు రచయితలుగా రాణిస్తారు,  వాళ్లను మాత్రమే సమాజం గుర్తిస్తుంది.

  అయితే  ప్రజల విశ్వాసాల పునాదిగా  మూఢభక్తిని  లేనిపోని అపోహలను వర్ణనలను  ప్రధానం చేసుకొని చేస్తున్న రచనలు రాస్తున్న  కవితలు  కాలయాపనకే తప్ప  సామాజిక పరిణామానికి  ప్రజల సమస్యల పరిష్కారానికి  ఉత్తమ సమాజ నిర్మాణానికి  దోహద పడిన సందర్భాలు చాలా తక్కువ . సాహిత్యానికి సానుకూల దృక్పథం వ్యతిరేక దృక్పథం రెండూ ఉంటాయి.  సాహిత్యం లో నిబిడీకృతమైనటువంటి  వస్తు వైవిద్యముతో పాటు ధోరణులు  దృక్పథాలకు పెద్ద ప్రాధాన్యత ఉంటుంది . కార్యకారణ సంబంధం, శాస్త్రీయ దృక్పథం, హేతువాద ఆలోచన,  అంతిమ లక్ష్యం సుదూరమై  శాశ్వతమై సత్యమైనదిగా   ఉత్తమ రచనకు  ఎంతో తోడ్పడతాయి .

కష్టమైన నిక్కచ్చిగా పాటించవలసిన లక్షణాలు:-

  ఉత్తమ సాహిత్యాన్ని నిర్మించాలంటే ఉత్తమ వ్యక్తిత్వం , ఆలోచన సరళి,  సమాజం పట్ల సానుకూల దృక్పథం,  మార్పు పట్ల గౌరవం,  మానవతా విలువలు,  సామాజిక బాధ్యత ప్రధానమైన పాత్ర పోషిస్తాయి.  తోటి మనిషిని సాటి మనిషిగా చూడలేని అంతరాలు ,  అసమానతలు గల ఈ వ్యవస్థలో  సమ సమాజాన్ని కాంక్షిస్తున్న నేపథ్యంలో  రచయితలు కవులు  ప్రజల పక్షాన నిష్కర్షగా  నిజాయితీగా నిబద్ధతగా  వ్యవహరించవలసి ఉంటుంది.  పేరు, పదవి , స్నేహం , గౌరవం  కోసం  ఆరాటపడే రచయితలు  తమ రచనలను  ప్రజల కోసం  అందించలేరు.   ధిక్కారస్వరంతో ప్రతిఘటన మనస్తత్వంతో  అన్యాయం అక్రమాలు  అసమాన తలపై ఉక్కు పాదం మోపడంలో రచయితలు ముందు వరుసలో ఉండాలి .

 ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఆటుపోట్లు  సహజమైనా  నమ్మిన సిద్ధాంతం కోసం పని చేయగలిగితే  ఆ గుర్తింపు  శాశ్వతం.  రాజ్య హింస  పాలకవర్గాల నిర్బంధం  పెట్టుబడిదారుల  దోపిడీ తత్వం   ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను  గుర్తించి  చేధి0చగలగాలి.  ప్రత్యామ్నాయాలను చూపి  ఒళ్ళు జలద రించేలా  కొరడా జులిపించాలి.  దోపిడీ వ్యవస్థనుండి వచ్చినా,  పీడన వంచనతో రాజీ పడినా,అసమానతలు అంతరాలపైన  నిర్లిప్తంగా వ్యవహరించినా,  ఆదిపత్యం అహంకారాన్ని ప్రశ్నించకుండా వున్న వాళ్లు రచయితలైన కవులు కళాకారులైన  ఈ వ్యవస్థకు మరింత హాని  తలపెట్టినట్లే  .  మార్పు కోసం తలపెట్టిన  పోరాటానికి  ఇలాంటి వారి వల్ల థీ రని ద్రోహం  జరుగుతుంది అనడంలో సందేహం లేదు . పైగా ఈ మనస్తత్వం కలిగిన వాళ్లు గుర్తింపు కోరి  ఆడంబరాలకు పాల్పడి  ఈ వ్యవస్థలో మార్పును అంగీకరించకుండా  పైపై మెరుగుల ద్వారా  తమ ఉనికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు.  

 పైగా  అలాంటి వాళ్ళు  అసమ సమాజాన్ని,  వర్గ విభజనను  ఏర్పాటుచేసి తామేదో ఈ సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్లు  నటిస్తారు  ఇలాంటి వారి వాళ్ళ  ప్రజల నిజ జీవితం   మసకబారిపోతుంది.  అనేకమంది జర్నలిస్టులు కవులు రచయితలు  ప్రజల పక్షాన పోరాటం చేసి వాస్తవాలను వెలికి తీసి ఆగడాలు అకృత్యాలు  మోసాలు  నేరాలు బయట తమ పరిశోధనల ద్వారా బయటపెట్టినప్పుడు  ఎంతోమంది  అక్రమార్కుల చేతిలో బలైన సందర్భాలు అనేకం . ఇప్పటికీ ఈ దేశంలో కవులు రచయితలు, మేధావులు మానవ హక్కుల కార్యకర్తలు విచారణ ఖైదీలుగా  దశాబ్దాల తరబడిగా  తమ జీవితాన్ని కోల్పోతూ ప్రజల కోసం పనిచేసి  రాజ్యహింసకు బలవుతున్న  ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉన్నది.

  పెట్టుబడిదారులు పాలకవర్గాల యొక్క శక్తిని అతిగా ఊహించుకోవడం వల్ల  ఉద్యమాలు నీ రుగారి పోతున్నాయి, ప్రజలను పాలకులు సునాయాసంగా అణచివేయగలుగుతున్నారు.  ఈ లోపాన్ని,  చైతన్య రాహిత్యాన్ని,  ప్రజల అనైక్యతను  విప్పి చెబుతూనే  ఉమ్మడి ప్రజా ఉద్యమాలకు  పిలుపు ఇవ్వవలసిన బాధ్యత కూడా  రచయితలపైన ఎంతగానో ఉన్నది.  వ్యవస్థలో మార్పు కావాలని కోరే వాళ్ళు  5 నుండి 10 శాతం కూడా లేకపోవడం,  మార్పును ఆశించకుండా ఇలాగే నిర్లిప్తంగా ఉండాలని  కోరేవాళ్లు కొందరైతే  అందుకు అంత పాడేవాళ్లు, అణచివేత నిర్బంధాన్ని అమలు చేసేవాళ్లు  పెద్ద మొత్తంలో ఉన్న కారణంగా ఈ వ్యవస్థలో మార్పు రావడం లేదు. అభ్యుదయాన్ని  మానవాభివృద్ధిని సాధించే క్రమంలో  దశాబ్దాలు గడిచిపోయిన పాలకవర్గాల కృషి ఎక్కడా కనిపించక పోవడానికి ప్రధాన కారణం  వాళ్లు పెట్టుబడిదారులకు అంత బాడడం,  పాలకులు ప్రజలను పట్టించుకోకపోవడం,  మేధావులు బుద్ధి చెవులను ఎక్కడికి అక్కడ అణచివేయడం  సమాంతరంగా జరుగుతున్నటువంటి  నేరాలు.  విభిన్న ప్రదర్శనలు సాహిత్య   సాంస్కృతిక ప్రక్రియల ద్వారా  చట్టబద్ధంగా జరుగుతున్న దోపిడీ అవినీతి  అణచివేత  క్రీడలను  ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత  ఉత్తమ సమాజాన్ని కోరే రచయితలదే కదా!

  అంతటి చారిత్రక బాధ్యత కలిగి ఉన్న రచయితలు కవులు  సామాజిక మార్పుకు దోహదపడని రచనలు చేస్తూ  పురస్కారాలుతో మెప్పు పొందుతూ  తమ స్థాయిని పదిల పరుచుకుంటే అది ఎవరి ప్రయోజనం కోసం?  దిక్కారమే మన నినాదం కావాలి అందుకు కవులు రచయితలు ఎక్కడికక్కడ తమ కార్యాచరణ ప్రకటించుకుని  తక్కువ సంఖ్యలో ఉన్న  ఆత్మ న్యూనతకు గురికాకుండా  సామాజిక బాధ్యతగా  ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించి  ఆట పాట మాటల రూపంలో  బరువెక్కిన గుండెలను  తేలిక చేస్తూ  చైతన్యానికి  బాటలు వేసే  రచయితలకు బావ దారిద్రం  స్వార్థ చింతన  లేనప్పుడు మాత్రమే  సాహిత్య లక్ష్యాలు నెరవేరుతాయి . కవి అంటే కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే అని నిర్వచించినటువంటి శ్రీ శ్రీ మాటలకు  నిజమైన అర్థాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం  .చట్టసభల్లో అవినీతి  పరులు  నేరచరిత్ర ఉన్నవాళ్లు  అధికారాన్ని చలాయిస్తూ చట్టం నుండి తప్పించుకుంటున్నారు.  ప్రజలను విస్మరించిన రచయితలు కూడా  పాలకవర్గాలకు తొత్తులుగా వ్యవహరించడానికి  నిరంతరం పాకులాడుతూ ఉంటారు. ఈ రెండు వర్గాలను కూడా ప్రజలు  దృష్టిలో ఉంచుకుంటారు సందర్భం  అవసరం  కలిసి వచ్చిన నాడు  ప్రజల చేతిలో  శిక్షించబడతారు అని తెలుసుకుంటే మంచిది.

--- వడ్డేపల్లి మల్లేశం 

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333