బడి బయట ఉన్న పిల్లలందరూ పాఠశాలల్లో చదువుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలి
కలెక్టర్
జోగులాంబ గద్వాల 18 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల: చదువు మానేసి బడి బయట ఉన్న పిల్లలందరూ పాఠశాలల్లో చదువుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులకు ఆదేశించారు.శనివారం ఐడిఓసిలోని కాన్ఫరెన్స్ హాలులో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు పోలీస్, విద్యాశాఖల అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. జూన్ నెల నుంచి అక్టోబర్ నెల వరకు బడిలో చేరిన విద్యార్థులు కొంతమంది వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో హాజరు శాతం తగ్గుతోందని, ఆ ప్రభావం పదో తరగతి పరీక్ష ఫలితాలపై పడుతున్నట్లు గుర్తించామన్నారు.
అలాగే పిల్లల్లో విద్యా ప్రమాణాలు పడిపోవడమే కాక, వారు చదువులో వెనకబడే అవకాశం ఉందన్నారు. జూన్ 1 నుంచి అంగన్ వాడీ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నందున మూడేళ్లు నిండిన చిన్నారులందరూ అంగన్ వాడీ కేంద్రాల్లో చేరేలా వారి తల్లి తండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కేంద్రాల్లో పిల్లలకు కల్పిస్తున్న సదుపాయాలు, పోషకాహారాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఐసీడీఎస్, ఐసీపీఎస్, పోషణ అభియాన్, ( డీ హెచ్ఈడబ్ల్యూ) డిస్ట్రిక్ట్ హబ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, (ఎన్ హెచ్ టీ ఎస్) న్యూట్రిషన్ & హెల్త్ ట్రాకింగ్ సిస్టం, ( ఎస్ఎస్ఎఫ్ పీ) సూపర్ వైస్ట్ సప్లమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాం, సఖి కేంద్రం పనితీరు, విధులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా విభాగాల అధికారులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించి, జిల్లాలో బాలల హక్కులు కాపాడేందుకు, మహిళా సాధికారతకు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్, దివ్యాంగుల సంక్షేమానికి కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీ.డబ్ల్యూ.ఓ సుధారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి నర్సింహ, ఐసిడిఎస్ సిడిపిఓలు హేమలత, కమలాదేవి, సుజాత, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.