జిల్లాలో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్

స్ట్రాంగ్ రూమ్స్ , కౌంటింగ్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

Feb 11, 2026 - 20:15
Feb 11, 2026 - 21:01
 0  0

జోగులాంబ గద్వాల 11 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జోగుళాంబ గద్వాల జిల్లాలోనీ నాలుగు మున్సిపాలిటీలలో ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు.

 మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గద్వాల జిల్లాలోని పురపాలిక పరిధిలోని దౌదర్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఐజ జెడ్పిహెచ్ఎస్ లో, పర్దిపురం అంగన్వాడి భవనంలో, శాంతినగర్ జెడ్పిహెచ్ఎస్ లో, అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎస్పీ శ్రీనివాసరావు తో కలిసి కలెక్టర్ సందర్శించారు. పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహించే సిబ్బంది, ఓటర్లు సెల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాకూడదని అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమ సంఖ్యను సరిచూసుకొని ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఓటర్లకు బ్యాలెట్ పేపర్ లు ఇచ్చిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లో వేసేంత వరకు ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఆయా వార్డుల పరిధిలోని మొత్తం ఓటర్ల సంఖ్య తెలుసుకునీ పలువురు ఓటర్లతో మాట్లాడారు. ఆయా పోలింగ్ కేంద్రాల వెలుపల అతికించిన పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి గుర్తుల వివరాలను పరిశీలించారు. ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత సమయం ప్రకారం జరిగిన ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు టీ పోల్ యాప్ లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రం ఐదు గంటల లోపల పోలింగ్ కేంద్రాల్లోని క్యూలో నిలుచున్న వారందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ బి. ఎం. సంతోష్ ఐజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, వడ్డేపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ హాల్స్ ను ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూములలో వార్డులు, పోలింగ్ బూతుల వారీగా నిర్దేశిత క్రమ సంఖ్యలో బ్యాలెట్ బాక్స్ లను అమర్చాలని అక్కడి అధికారులకు సూచించారు. కౌంటింగ్ హాల్స్ లో అవసరమైన టేబుల్స్ ఏర్పాటు చేయడమే కాక ఎలాంటి తప్పిదాలకు చోటు లేకుండా లెక్కింపు ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని ఆదేశించారు.

ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేసేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడమే కాక సమస్యత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అక్కడ అదనపు పోలీస్ బలగాలను నియమించామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

ఈ పర్యటనలో అదనపు ఎస్పి శంకర్, డిఎస్పి మొగిలయ్య, ఆయా మున్సిపాలిటీల ఎన్నికల అధికారులు,సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State