పేపర్ లీకేజీ సంఘటనలకు విద్యారంగ ప్రైవేటీకరణ ప్రధాన కారణమా?
గత ఏడేళ్లుగా 70 కి పైగా పరీక్ష పత్రాల లీకేజీ
కోట్లాది యువత భవిష్యత్తుకు తీరని ద్రోహం కాదా?
ఇదేనా వెలుగుతున్న వికసిత భారత్ ?
--- వడ్డేపల్లి మల్లేశం
వెలిగిపోతున్న వికసిత భారతదేశంగా పేరు ఉన్న ఇండియా పేపర్ లీకేజీ లో మాత్రం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందంటే అతిశయోక్తి కాదేమో ! సుమారు 24 లక్షల మంది హాజరైన నీట్ 2024 పరీక్ష పత్రాలు లీకైనట్లు వెల్లడి కావడంతో విద్యార్థి లోకంతో సహా యావత్ భారత సమాజం నివ్వెర పోయిన విషయం మనందరికీ తెలిసిందే . విద్యారంగం పట్ల ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యాన్ని ఈ పరీక్షా పత్రాల లీకేజీ రుజువు చేసినట్లుగా భావించవలసి ఉంటుంది పేపర్ సెట్టింగ్ నుండి మూల్యాంకనం వరకు ప్రతి దశలోనూ అక్రమాలు జరిగినట్లు కనబడుతుంటే విద్యారంగంలో మాఫియాకు * రాజకీయం తోడు కావడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలో జరిగిన పోటీ పరీక్షలలో 70 సార్లు పేపర్ లీక్ అయినట్టు సుమారు కోటి 70 లక్షల మంది అభ్యర్థుల అంధకారంలోకి నెట్టబడినట్లు తెలుస్తుంది.
విద్యార్థుల ఆందోళనతో కుటుంబాలు అస్తవ్యస్తం:-
************
సగటు ఆదాయంతో సహా పేద కుటుంబాలకు చెందిన లక్షలాదిమంది విద్యార్థులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పరీక్షలకు తయారైన తర్వాత పేపర్ లీకేజీ వల్ల ఒత్తిడి ఆందోళనకు గురవుతున్న విషయాన్ని గమనిస్తే ఆత్మహత్యలు బలవన్ మరణాలకు పాల్పడుతున్న తీరు సమాజాన్ని కలవరపరుస్తున్నది. తల్లిదండ్రుల ఆకాంక్షలు పిల్లలపైన ఒత్తిడి కారణo గా ఈ దు: సంఘటనలు జరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి అయితే ఈ దౌర్భాగ్య సంఘటనలు కేవలం పోటీ పరీక్షలకు మాత్రమే పరిమితం కాలేదు ఆయా రాష్ట్రాలలో నిర్వహిస్తున్నటువంటి బోర్డు పరీక్షలకు కూడా ఈ సెగ తగలడం ఆందోళనకరం. గత ఏడేళ్లలో బీహార్ లో పదో తరగతి పరీక్ష పత్రాలు ఆరుసార్లు పశ్చిమ బెంగాల్లో పదిసార్లు లీక్ కా గా తమిళనాడులో 2022లో 10వ తరగతి ఇంటర్ ప్రశ్న పత్రాలు కూడా లీక్ అయినవి. రాజస్థాన్ లో 2015- 23 మధ్య వివిధ పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు 14 సార్లు లీకైనట్లు తెలుస్తుంటే ఉత్తరప్రదేశ్లో తొమ్మిది సార్లు ప్రశ్నపత్రాల లీకు సంచలనం సృష్టించింది . ఒక సర్వే ప్రకారం గా రాజస్థాన్లోని కోటాలో 85 శాతానికి పైగా విద్యార్థులు కోచింగ్ సెంటర్లలో ప్రతిరోజు ఏడు ఎనిమిది గంటల నుండి 10 గంటల పాటు ఉంటారని వెల్లడైంది. వీరికి విశ్రాంతి ఉండకపోగా కోరినప్పటికీ సెంటర్ యాజమాన్యాలు ఇవ్వకపోవడం ఒంటరితనంగా భావించడంతోపాటు అలసట, కోపం, విచారం, నిరాశ, నిస్సృహ, ఆత్మన్యూనతా వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు దాని కారణంగానే పేపర్ లీకేజీ సందర్భంగా మరింత ఒత్తిడికి గురై యువత నిస్సత్తు వలోకి జారుకుంటున్నట్లు మనం గమనించాలి.తెలంగాణాలో brs ప్రభుత్వా హయాములో పోటీ పరీక్షలు ఏరకంగా లీక్ అయినావో అందరికీ తెలిసిందే.
నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు:-
******
ఒత్తిడితో కూడుకున్న శిక్షణ ప్రధాన కారణం కాగా ఇలాంటి పేపర్ లీకేజీలు తోడు కావడంతో మరింత అంధకారంలోకి నెట్టివేయబడుతున్నారు . జాతీయ నేర రికార్డుల సంస్థ ప్రకారం ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలుస్తుంటే పరిష్కారాలను వెతకవలసిన బాధ్యత పాలకుల పైన లేదా? దీనికి తోడు తల్లిదండ్రుల ఆకాంక్షలు, పిల్లల పైన ఒత్తిడి, సందిగ్ధంలో విద్యార్థులు అభ్యర్థులు... పర్యవసానంగా ఇలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటే మానవ వనరులను కోల్పోవడం ఈ జాతికి తగునా? పేపర్ లీకేజీ పైన ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినా లీకేజీలు ఆగడం లేదు ప్రైవేటు యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, అధికారులు, కుమ్మక్కై చేస్తున్న ఈ నేరాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అనచి వేయాలి అదే కాదు తల్లిదండ్రులు మేధావులు, విద్యార్థులు అభ్యర్థులలో దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉన్నది. పాఠశాల విద్యాసంస్థలు పిల్లల తల్లిదండ్రుల మధ్యన బలమైన సంబంధాలను పెంపొందించుకోవాలి . పాఠశాలల్లో విద్యార్థుల మానసిక పరిణతికి సంబంధించిన అవకాశాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలి. కనీసం మూత్రశాలలు మరుగుదొడ్లు లేక పాఠశాలలు చిన్నబోతుంటే ఇక వ్యక్తిత్వ వికాసాన్ని వికసింప చేసే అవకాశం ఎక్కడుంటుంది ? ఈ దుస్థితి పైన పాలకులు సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించినా కూడా పట్టించుకోవడం లేదంటే ఆశ్చర్యకరమే కదా! వ్యక్తిత్వ వికాసానికి పాత్ర లేకుండా కేవలం బట్టి పట్టే పద్ధతిలో పోటీ పరీక్షలను నిర్వహించడం ,అందుకు విద్యార్థులను సిద్ధం చేసే క్రమంలో తల్లిదండ్రులు కూడా చదు వే సర్వస్వమని నమ్మి ఉన్నత ఆకాంక్షలతో వారిపైన మరింత ఒత్తిడి చేయడం కూడా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి . ఏది ఏమైనా సిద్ధమైన పరీక్షలను సకాలంలో నిర్వహించడం ద్వారా వారి వారి వ్యక్తిత్వ వికాసానికి తగిన రీతిలో మూల్యాంకనం జరగాలి కానీ పదేపదే లీకేజీల కారణంగా కూడా విద్యార్థుల యొక్క ప్రతిభ, ఆలోచన సరళి, జ్ఞాపకశక్తి మందగించే ప్రమాదం కూడా లేకపోలేదు. అంతేకాదు డిగ్రీ ఇంటర్ విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులకు అందుబాటులో మానసిక నిపుణులతో కూడినటువంటి కౌన్సిలింగ్ ఇప్పించడం ద్వారా కూడా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి, విశాల ప్రాతిపదికన సమస్యలను ఛాలెంజ్గా తీసుకోవడానికి, మనసు పైన భారం పడకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. ఇష్టంతో చేసిన పని ఫలితాన్ని ఇచ్చినట్లుగా మానసిక ఒత్తిడికి దూరంగా ఉండే విధానాన్ని అందుబాటులో ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వం, సమాజం, తల్లిదండ్రుల పైన ఉమ్మడిగా ఉందని గుర్తిస్తే మంచిది .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయిత ల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )