ద్వంద్వ ప్రమాణాలతో కొద్ది మంది స్త్రీల ఆచరణ మహిళా లోకం అభాసు పాలు కావడానికి కారణమైతే బాధాకరం
కుటుంబ పరువు కే నడక నేర్పే స్త్రీలు సమాజ విచ్చిన్నానికి
కారణమైతే బాధాకరమే కదా! విశ్వ కుటుంబ భావనకు
ప్రతినిధులుగా ఉంటే స్త్రీలు సమాజంలో
మరింత గొప్పగా రాణించగలుగుతారు!
--- వడ్డేపల్లి మల్లేశం
ఆకాశంలో సగం ,సమాజంలో సగం ,సమాజం మను గడకు ఆధారభూతమని, కుటుంబ జీవితానికి పరువు ప్రతిష్ట లకు నడక నేర్పేది స్త్రీలేనని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అదే స్త్రీలు అనేకచోట్ల అవమానాలు, అకృత్యాలు, అత్యాచారాలు, ఆవేదనలకు గురవుతూ ఉంటే మనం సానుభూతి చూపడమే కాదు మద్దతుగా నిలుస్తాం కూడా. ఆగంతకులను అంతం చేయడానికి కూడా వెనుకాడం అప్పుడప్పుడు . ఇక ఇటీవల కాలంలో స్త్రీల పైన జరుగుతున్నటువంటి లైంగిక దోపిడీ , అత్యాచారాలు, హత్యలు , అమానవీయ సంఘటనల పట్ల సమాజానికి భిన్నాభిప్రాయం ఉండవలసిన అవసరం లేదు స్త్రీల ప్రమేయంతో కొన్ని జరుగుతుంటే కొన్ని పరిచయం ఉన్న కుటుంబాల ద్వారా జరుగుతున్నట్లు ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని బలవంతపు కార్యాలకు శ్రీకారం చుడుతున్న వారు కోకొల్లలుగా ఉంటే స్త్రీని ఆట బొమ్మగా అంగడి సరుకుగా మార్కెట్ వస్తువుగా చూస్తున్న విషయంలో భిన్నాభిప్రాయం అసలే లేదు. ఈ విషయంలో మహిళలకు వెన్ను దండగా నిలవాల్సిన బాధ్యత సమాజంలోని బుద్ధి జీవులు ప్రజాస్వామ్యవాదులు మేధావులు మనసున్న వాళ్ళందరి పైన ఉన్నది. కుటుంబ ఇల్లాలు అక్షరాస్యురాలు అయితే ఆ కుటుంబంలో జ్ఞాన కాంతులు వెదజల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది . సమయస్ఫూర్తిగా, సందర్భోచితంగా, మానవీయ కోణంలో కుటుంబాన్ని పరిరక్షించుకోవడానికి స్త్రీలే కీలకమని అనేక సందర్భాలలో మానవతావాదులు ప్రస్తావించిన విషయాన్ని కూడా మరవకూడదు . పౌరాణిక కాలాలలో ఇటీవలి ఆధునిక యుగంలో కూడా స్త్రీలు అన్ని రంగాలలో పురుషులకంటే మించిన స్థాయిలో రాణించడాన్నీ కూడా మనం గౌరవించి గుర్తించి తీరాలి .అయినా ఒక ఆట బొమ్మగా చూసే విధానం పురుషుల దృష్టిలో నీచమైనది దానిని అంతం చేయవలసిన బాధ్యత పురుషులు స్త్రీల పైన ఉన్నది. పై వర్ణన స్త్రీల పట్ల సమాజం యొక్క దృక్కోణాన్ని తెలియజేస్తుంటే స్త్రీలు ప్రధాన భూమిక పోషించే కుటుంబాలు, కుటుంబ బంధుత్వాలు, మానవ సంబంధాల మధ్యన కొన్ని జరగకూడని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం , భార్యాభర్తల మధ్యన యుద్ధ వాతావరణం నెలకొనడం, ఆగ్రహాలు ఆవేశాలతో క్షణకాలంలో తీసుకునే నిర్ణయాలు కొన్ని కుటుంబం విచ్ఛిన్నం కావడానికి కారణమవుతున్న సందర్భాలను గమనిస్తే అందులో పురుషులకంటే స్త్రీల పాత్ర ఎక్కువ అని అది కూడా కొన్ని కుటుంబాలలో మాత్రమేనని తెలుస్తుంది. .ప్రధానంగా మద్యం మత్తు పదార్థాలు ధూమపానం వంటి కారణాల వలన కొంతమంది పురుషులు బలహీనతకు గురై కుటుంబంలో తప్పుడు పనులకు పాల్పడుతున్న విషయాన్ని కూడా కాదనలేము. కానీ మానసికంగా చిత్రవధకు గురిచేసి, తమ ఆధిపత్యాన్ని చలాయించి, ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తూ, తన తల్లి గారి పట్ల ఒక తీరు అత్తగారి పట్ల మరొకతీ రు ప్రవర్తించే ధోరణి వల్ల స్త్రీ ఎంతో ప్రాధాన్యత గల స్థానం నుండి అప్పుడప్పుడు అధమ స్థాయికి దిగజారుతున్న సందర్భాలను కూడా మనం గమనించవచ్చు.
ప్రస్తుతము వృద్ధాప్య దశలో ఉన్నటువంటి స్త్రీలు ఇంటి కోడలుగా చలామణి అయినటువంటి తొలి దశలో ఆనాడు వాళ్ల అత్తమామల చేతిలో కీలుబొమ్మలుగా బ్రతకాల్సినటువంటి దుర్భర పరిస్థితిలో ఉండే వాళ్లని వారి అనుభవాల ద్వారా తెలుస్తున్నది . మరొకవైపు భర్త చేతిలో కూడా అనివార్యమైన పరిస్థితిలో చెప్పింది వినడమే తప్ప ప్రశ్నించే అవకాశం లేని గడ్డు కాలమది . అంతేకాదు కనీసం అత్తతో ఆనాటి కోడలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదని ఎంతోమంది నేడు ఆనాటి తరానికి చెందిన వృద్ధురాన్ల ద్వారా తెలుస్తున్నది. ఆ తర్వాత ప్రస్తుతం మధ్య వయస్సులో ఉన్నటువంటి స్త్రీలు కోడండ్లుగా చలామణి అయిన కాలంలో కొంత చైతన్యం స్వేచ్ఛ స్వాతంత్ర్యల కారణంగా అత్తమామలను అధిగమించడమే కాదు భర్తను కూడా ఒప్పించి మెప్పించి ప్రశ్నించి నిలబెట్టిన సందర్భాలు అనేకంగా ఉండడం నేడు మనం చూస్తున్న సందర్భం. ఈ కాలంలో వీరికి అక్షరాస్యతతో పాటు కొంత సామాజిక సమకాలీన చింతన పరిజ్ఞానం కూడా ఎక్కువ కావడం వలన చైతన్యముతో ప్రశ్నిస్తూ ప్రతిఘటిస్తూ నిలదీస్తున్న సందర్భాలు కొంత ఎక్కువే . అయితే ఈ విషయంలో పెద్దగా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు కానీ తనవరకు ఒక రీతి మరొకరిది మరొకరీతి అనే రెండు నాలుకల ధోరణి కారణంగా తన తల్లిదండ్రులు అన్నదమ్ములు కుటుంబ సభ్యుల పట్ల ఒక రీతిగా వ్యవహరిస్తూ అత్తమామలు ఆడబిడ్డలు భర్త మెట్టినింటి కుటుంబ సభ్యుల పట్ల మరొకరీతిగా వ్యవహరించడం అనేది కొంతమంది స్త్రీలకు వెన్నతో పెట్టిన విద్యగా మారడమే ఆందోళనకరం అంతేకాదు ఆవేదన భరితం కూడా. .వృద్ధులైన తన అత్తమామల పట్ల దురుసుగా నిర్దయగా వ్యవహరిస్తూనే తన తల్లి గారి ఇంటిలో తల్లి తండ్రి పట్ల తన వదినలు మరదలు పోషిస్తున్న పాత్రను విమర్శించడంతోపాటు లేనిపోని చాడీలు చెప్పి ఆరోపణలు చేయడాన్నీ ఏరకంగా సమర్ధించగలము? అని ఒక్కసారి నేటి మహిళా లోకం ప్రశ్నించుకోవలసిన అవసరం చాలా ఉన్నది . ఈ విషయంలో కుటుంబ యజమాని సందిగ్ధ ప రిస్థితిలో కొన్ని సంఘర్షణలకు గురి కావడంతో పాటు అవమానాల పాలైన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. స్త్రీ మాట్లాడినంత చొరవ స్వేచ్ఛగా పురుషుడు మాట్లాడలేకపోవడం ,కుటుంబ పరువు వ్యక్తిగత గౌరవం, భవిష్యత్తు సవాళ్లు సందర్భాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు యజమానికొంత నిశ్శబ్దంగా ఉండక తప్పడం లేదు. కొద్దిమంది మినహాయిస్తే చాలా మంది కూడా ఈ రకమైనటువంటి వర్గ సంఘర్షణకు గురవుతున్న వాళ్లే. తల్లిదండ్రుల పట్ల తన భర్త ప్రేమతో ఆత్మీయంగా పలకరించిన కూడా భార్య దృష్టిలో నేరంగానే పరిణించబడుతున్నటువంటి సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ?. మరియు వృద్ధాప్య దశలో వారి పోషణ భారాన్ని మోస్తున్న సందర్భములో అనేక ఇండ్లలో ఇల్లాలు వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరం . "మాటకు కూడా నోచుకోని దుస్థితిలో , బిక్కుబిక్కుమంటూ ,పిడికెడు మెతుకుల కోసం ఎదురుచూస్తూ, పలకరించడానికి కూడా నోరు రానటువంటి దయనీయ పరిస్థితులలో వృద్ధ తల్లిదండ్రులు కాలం గడుపుతూ ఉంటే సందర్భానుసారంగా ఇదేమిటి అని పలకరించిన పాపానికి భర్త ఇల్లాలు దృష్టిలో నేరస్తునిగా పక్షపాతిగా మిగిలిపోతున్నాడు ". .ఇదే పరిస్థితులు తన తల్లి గారి ఇంటిలో కూడా ఉంటాయని తెలిసినప్పటికీ ఆ పరిస్థితులను మరిచి తన ఇంటికి మాత్రమే వర్తింప చేసుకొని తన ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నం చేస్తూ ద్వంద నీతిని ప్రదర్శించడం అనేది తన వరకే కాదు తన పిల్లలకు కూడా సోకి నట్లయితే రాబోయే తరాలు కూడా ఇబ్బందులకు గురైతాయి అనే ఆలోచన లేకపోతే ఎలా ? కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమైతే సమాజంలో మానవ సంబంధాలు కూడా బలహీనమవుతాయని దానివల్ల మనిషి ఉనికి ప్రశ్నార్థకం కాగా పదిమందిలో చులకనగా చూడబడితే మాత్రం ప్రయోజనం ఏముంది? కుటుంబం వరకు మాత్రమే పరిమితం కానీ అనివార్య పరిస్థితిలో ఈ ఆలోచన ఆచరణ ధోరణి బయట చర్చకు దారి తీసినప్పుడు తోటి స్త్రీలు పురుషులతోపాటు అక్కడక్కడ బుద్ధిమంతులైనటువంటి తల్లిదండ్రులు అన్నదమ్ములు కూడా ఈ ధోరణి సరైనది కాదు అని హెచ్చరిస్తే అంతకుమించినటువంటి దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా ? "ఒకటే జననం ఒకటే మరణం" అని గర్వంగా చెప్పుకునే మానవ మనుగడలో పుట్టుక నుండి చావు మధ్యన మన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వహించడంతో పాటు ప్రేమ ఆత్మీయత ఆప్యాయతలతో ఆదరించడం ద్వారా తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారానికి మించినది ఇంకేమైనా ఉంటుందా ?ఇతరులను చులకనగా చూసి ఆధిపత్యాన్ని చలాయిస్తే గుర్తింపు ఉంటుందని అనుకుంటారేమో! కానీ అంతకుమించిన పరాభవాన్ని చవిచూడక తప్పదు. "పిడికెడు మెతుకులకు, గ్లాసు మంచినీళ్లకు, కప్పు ఛాయకు కూడా చిన్నగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు . అలాంటి ఆచరణ వల్ల తమకు పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని తెలిసికూడా
అదే దారిలో కొనసాగడంతో పాటు తన పుట్టింటికి ఒక రీతిని అన్వయించి తన మెట్టినింట మరొక రకంగా ప్రవర్తించడం స్త్రీ జాతికి తగదు ". స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉన్నటువంటి సభ్య సమాజంలో ఇప్పటికీ అనేకమంది పురుషులు స్త్రీలను గౌరవిస్తూ ఆదరిస్తారు అదే స్థాయిలో స్త్రీలు కూడా వృద్ధులు పురుషులు అత్తవారింటికి చెందిన కుటుంబ సభ్యులందరి పట్ల నిండు మనసుతో వ్యవహరిస్తే అజేయురాలిగా వెలిగిపోతుందనములో ఆశ్చర్యం లేదు . క్షణకాలపు నిర్ణయములో తెగింపుతో మాట కోసం తన గెలుపు కోసం మాత్రమే అల్లాడిపోయే కొద్ది మంది స్త్రీల వల్ల మిగతా మహిళా లోకానికి అప్రతిష్ట తెచ్చిపెట్టే ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇప్పటికీ అలాంటి పరిస్థితుల్లో మగవాళ్ళు సమయమనం పాటిస్తూ, కుటుంబ పరువు బజారున పడకుండా మౌనంగా ఉంటూ, లో లోపల కుమిలిపోతూ కూడా, కుటుంబ గమనాన్ని పోషణను గట్టెక్కిస్తున్నతీరుతో అయినా మహిళాలోకం తన మొండివైఖరి మార్చుకోవాలి.
కుటుంబపరువుకే నడకనేర్పే స్త్రీలు సమాజవిచ్చిన్నానికి కారణం కాకూడదని మానవతావాదులు కోరుకుంటున్నారు.ఈ విశ్లేషణ ఉద్దేశం స్త్రీలను అగౌరవపరచడం కానే కాదు.కానీ గత తరానికి భిన్నంగా వ్యవహరిస్తే అదే చట్టబద్ధమైతె రాబోయే తరాలకు ఈ రుగ్మత సోకితే ఎలా?విశ్వమానవ భావనకు ప్రతినిధులుగా స్త్రీలు ఆచరిస్తే మరింత గుర్తింపు పొందుతారని సమాజమద్దతు అన్నిసంధర్భాలలో అందుతుందని మరింతగా పూజింపబడతారనే ఆకాంక్షయే ఈ వ్యాసం ఉద్దేశం.
(ఈ వ్యాసకర్త సామా,. రాజకీయ విశ్లేషకులు)