నియమబద్ధ జీవనం అంటే  నిబద్ధత గల జీవితమే

Mar 2, 2024 - 16:36
Apr 15, 2024 - 18:15
 0  6
నియమబద్ధ జీవనం అంటే  నిబద్ధత గల జీవితమే

 ప్రజలకు, పాలకులకు  అంకిత భావం ఉన్నప్పుడే  ప్రజా ఆకాంక్షలు నెరవేరుతాయి.

వ్యక్తిత్వం వికసిస్తుంది , సామాజిక చైతన్యం   వెళ్లి విరుస్తుంది.

జీవితాలనే త్యాగం చేసిన కొందరు  త్రి కరణ శుద్ధిగా పనిచేయడం వల్లనే  మహాత్ములు అవుతున్నారు .

అందరూ ఎందుకు  ప్రయత్నించకూడదు  ?

మనసులో పొంగిన భావావేశానికి అనుగుణంగా  మాట్లాడడం,  మాటకు అనుగుణమైన  పద్ధతిలో  ఎలాంటి మార్పు లేకుండా ఆచరణ  ఉన్నప్పుడు  త్రిక రణ శుద్ధి అని అంటూ ఉంటాం.  దీనినే మనసా వాచా కర్మణా అనే మాటగా కూడా  ప్రజలు ఉపయోగిస్తారు . కష్టాలు ఎదురైనా , ఓటమి అంచుకు చేరినా, అవమానాలను భరించినా,  నమ్మిన సిద్ధాంతం కోసం  అనేక ఒడిదుడుకులను ఓర్చుకుని  లక్ష్యాన్ని చేరుకునే క్రమంలోనే  వ్యక్తులు  గొప్పవాళ్లు  అవుతారు.  డబ్బుతోని మాత్రమే గొప్ప వాళ్ళు అవుతారని  అనుకోవడం అత్యాశే.  అందుకు భిన్నంగా అనేకమంది పేద కుటుంబాలలో జన్మించిన వాళ్లు,  పిడికెడు మెతుకులకు నోచుకోని వాళ్లు కూడా  ప్రపంచ వ్యక్తులుగా గుర్తించబడిన విషయాన్ని మనం గమనించవచ్చు . అది కేవలం మాటకు అనుగుణంగా ఆచరణను సుసంపన్నం చేసుకోవడం వల్లనే .
    చేసిన ఏ పని అయినా  సంతృప్తికరంగా జరిగిందని మనసు అంగీకరించినప్పుడు మాత్రమే  మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది.  శాంతము,  దయ,  జ్ఞానము, ప్రేమ, అనురాగము, సత్యమువంటి అంశాలు జీవన వికాసానికి  వ్యక్తి విలువను ఆకాశానికి ఎత్తడానికి  ఎంతో తోడ్పడతాయి . తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే  సంస్కారం పెంచుకోవడంతో పాటు  స్వచ్ఛత, స్పష్టత,  నిర్మలత్వము,
ప్రేమ తత్వాన్ని ప్రదర్శించినట్లయితే  ప్రతి మనిషి మహాత్ముడే.  ఇక్కడ ఎక్కడ కూడా  ఆస్తులు సంపదలు  పెద్ద జ్ఞానము  ఉన్నత చదువులు  అంతగా పాత్ర పోషించినట్టు అనిపించడం లేదు కదా!  అందుకే ఇదంతా మనిషి ఆచరణకు,  ఉనికికి  సంబంధించిన అంశాలుగా మనం భావిస్తే,  సామాజిక చింతన జోడిస్తే  అర్థవంతమైన జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుంది.

బలహీనతలకు దూరంగా ఉండాలి:-

  సహజంగా  ప్రజలు  కొన్ని బలహీనతలకు లోనై  మానసిక రుగ్మతలు కలిగి ఉండి  నిబద్ధతకు దూరంగా  అంకిత భావాన్ని  జీర్లేణించుకోలేక  పెడదారి పడుతున్న విషయాలను కూడా మనం గమనించవచ్చు.  దారి  వెతుక్కోవాల్సింది మనమే,  ఉన్నదారులలో  ఉత్కృష్టమైనది ఎంచుకోవాల్సింది కూడా మనమే.  మన చింతన ,ఆలోచన, పరోపకార తత్వం , సామాజిక స్పృహ, సమాజ పరిశీలన, అవసరం  సేవా తత్పరత  వంటి అంశాల పైన  మనకున్న ప్రగాఢ విశ్వాసం కూడా  మనలను పదిమందిలో నిలబెడుతుంది.  ఆదర్శ సమాజాన్ని రూపొందించే క్రమంలో  మన అవసరాన్ని వినియోగించుకుంటుంది.  పౌర సమాజంతో పాటు పాలకవర్గాలకు కూడా ఈ నిబద్ధత  ఉండాల్సిన అవసరం ఎంతో ఉన్నది .అప్పుడు మాత్రమే  ప్రజా ఆకాంక్షలు నెరవేరి  ఉత్కృష్టమైన పాలన ప్రజలకు అందడానికి  రాజ్యాంగ పలాలను అనుభవించడానికి అవకాశం ఉంటుంది . కానీ అందుకు భిన్నంగా నేటి పాలకులు  సేవకులం అనే పదాన్ని ఎప్పుడో కాలరాచి,  శాసనకర్తలం  అని శాసిస్తూ,  అక్రమ సంపాదన కోసం  అధికారాన్ని వినియోగిస్తూ, ఎంతకైనా దిగజారుతున్న క్రమం మనందరం చూస్తూనే ఉన్నాo . ప్రజా చైతన్యం,  ప్రతిపక్షాల ఉమ్మడి పోరాటం  ,న్యాయ వ్యవస్థ యొక్క చొరవ  సమన్వయంతో ముందుకెళ్లినప్పుడు  పాలకులు తమ  అవలక్షణాలకు కొంతైనా స్వస్తి చెప్పే అవకాశం ఉంటుంది .కానీ  ఈ మాట కేవలం సిద్ధాంతంగానే మిగిలిపోవడంతో  అవినీతి రాజ్యమేలుతున్న విషయాన్ని మనం కాదనలేము.  అధికార యంత్రాంగానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కల్పించి ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దోచుకోమని చెబుతున్న రాజకీయ పార్టీలు  అంతే వేగంతో అందుబాటులో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడానికి భూకబ్జాలు , ఇసుక,  గనులు ప్రజా ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్న విషయాన్ని  పౌర సమాజం సీరియస్ గా ఆలోచించాలి. అంటే  నిబద్ధతగల పౌర సమాజాన్ని ఎదిగించవలసిన అవసరం ఈ దేశంలో చాలా ఉన్నది . నాకేమీ అవసరం అనే బదులు  ఈ దేశంలో జరుగుతున్న ప్రతి సంఘటన  చేస్తున్న ప్రతి మోసం దగా పైన  నిలదీసే హక్కు నాకున్నది అని ప్రజలు  గొంతేత్తి నినదించిన నాడు  మాత్రమే వ్యవస్థ మారుతుంది . అక్కడక్కడ కొందరు నిబద్ధతతో  ప్రజా జీవితంలో  మహాత్ములుగా వెలుగొంది  కొన్ని లక్ష్యాల కోసం పనిచేస్తున్న క్రమంలో పాలకవర్గాల నిరంకుశత్వం అన చివేత నిర్బంధం కారణంగా  దశాబ్దాలుగా కటకటాల్లో  ఉన్న బుద్ధి జీవులను విడిపించుకోవలసిన బాధ్యత కూడా మనదే . అంటే ప్రభుత్వాలు దాచుకోవడం ,దోచుకోవడం, అన చివేతకు గురి చేయడం తప్ప  జ్ఞానాన్ని విస్తరింప చేయడానికి  సమాజాన్ని జాగృతం చేయడానికి  మరింత మెరుగైన సమాజ ఆవిష్కరణకు  పాకులాడడానికి ఎప్పుడు ప్రయత్నం చేయదు.  అది ప్రజా పోరాటాలతో ఒత్తిడితో  అంతిమంగా  ప్రజల ఆగ్రహంతో పాలకవర్గాలను ఓడించి ప్రత్యామ్నాయ శక్తులను తెచ్చుకున్నప్పుడు మాత్రమే కొంతవరకు సాధ్యమవుతున్నది  .అంటే వ్యక్తి నుండి వ్యవస్థకు  అన్ని వర్గాలకు కూడా నియమబద్ధమైన జీవితం కొలమానంగా భావించి ఆచరించగలిగితే  కొంతవరకైనా అభివృద్ధిని చూడగలము. ఫలితాలను  ఆశించగలం.  మాటలు బాగానే ఉన్నా చేతల వద్దకు వచ్చేవరకు  మనసులో ఉన్న దుష్ట స్వభావం బయటపడుతుంది . అలాంటి వారి వల్ల కూడా వ్యవస్థకు ఎనలేని ద్రోహం జరుగుతుంది.  త్రికరణ శుద్ధిగా పనిచేయడానికి ప్రజలు పోటీ పడడం,  సమాజం పట్ల తమ కర్తవ్యాన్ని గుర్తించడం,  తామెందుకు వ్యవస్థ కోసం పనిచేయకూడదు అని ప్రశ్నించుకున్నప్పుడు మాత్రమే  ఉత్తమ సమాజం సాక్షాత్కరిస్తుంది.  చిత్తశుద్ధి ,బాధ్యత , సేవా దృక్పథం  లేనటువంటి  అవినీతిపరులు పెట్టుబడిదారులకు మాత్రమే వంత పాడి  తమ అధికారాన్ని కాపాడుకునే పాలకవర్గాలకు  గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రజా సమూహాలదే  .ఉచితాలు రాయితీలు, వాగ్దానాలు హామీల వర్షంలో  ప్రజలు తడిసి ముద్దవుతున్నారు కానీ  వాటి రహస్యాన్ని కనుగొనలేక పోతున్న కారణంగా  పాలకులను ప్రశ్నించడానికి  సిద్ధపడడం లేదు.  స్వార్థ ప్రయోజనాలను దగ్గరీ దారిలో ప్రలోభాలను  ప్రజలు ఆశించినప్పుడు  శాశ్వతమైనటువంటి అభివృద్ధికి, ఫలాలకు, రాజ్యాంగ హక్కులకు  దూరం కావలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి . రాజ్యాంగ పలాలను అందుకోవడానికి  అంబేద్కర్  చేసిన హెచ్చరిక మేరకు యాచకులుగా కాకుండా  యజమానులుగా ఈ దేశానికి  తమ ఓటు హక్కు ద్వారా చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నది . అదే సందర్భంలో  భూస్వాములు సంపన్న వర్గాలకు మాత్రమే రాజకీయ అధికారం  శాశ్వతం చేయబడిన తరుణంలో  చట్టసభల గడప దక్కని అనేక సామాజిక వర్గాలు  రాజకీయ చైతన్యానికి అంకిత భావాన్ని జోడించుకొని,  నిబద్ధతను రంగరించి,  అక్రమాలకు పాల్పడుతున్న నాయకత్వాన్ని ప్రశ్నించగలిగినప్పుడు  మనం ఊహిస్తున్నటువంటి  ఫలితాలు  కళ్ళ ముందు కనపడే అవకాశం ఉంటుంది.

ఎందరో శాస్త్రవేత్తలు, మరెందరో సామాజికవేత్తలు, వ్యవసాయ  న్యాయ ఇతర రంగాలకు చెందిన నిపుణులు
వైద్యరంగంలో అనేక  పరిశోధనలు సాధించిన    ప్రగతి శీలురు  మనకు ఆదర్శం కావాలి.  వారి త్యాగాలను కృషిని పట్టుదలను అంకిత భావాన్ని ఎంపిక చేసుకున్న రంగాలలో వారు చూపిన చొరవను  మనం నేటితరం అధ్యయనం చేయాలి.  ఆ పరిశోధనలు అంతటితోనే ఆగిపోకూడదు  రాబోయే కాలంలో ఎదుర్కోబోయే సవాళ్లను అధిగమించడానికి నేటి తరాన్ని సమాయత్తం  చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది.  మనకు మనమే నీరసించి,  దిగజారి,  తక్కువగా అంచనా వేసుకుని,  ఆత్మ నూతకు గురి కావలసిన అవసరం లేదు . నిబద్ధత కొనుగోలు చేసే అంశం కాదు.,  అది మన పౌరుషం  ,విశ్వాసం ,  ఆత్మస్థైర్యం, ఆత్మాభిమానం  భవిష్యత్తును సవాలుగా చేసుకుని   ఆటంకాలను అధిగమించి అవాంతరాలను  కులదోసి  మెరుగైన సామాజిక వ్యవస్థ కోసం  పని చేద్దామనే తపన మనలో ఉంటే  మనం కూడా మహాత్ములమే మహానుభావులమే.  తనను తాను చిన్నపుచ్చుకుంటే,  పౌర సమాజం నిర్వీర్యమైతే  భవిష్యత్తుకు రక్షణ ఏది?  పాలకులను సంస్కరించవలసింది,  నేటి తరాన్ని రేపటికి జాగృతం చేయాల్సినది,  పోరాటపటమను  రంగరించవలసిన బాధ్యత బుద్ధి జీవులు మేధావులు సామాజిక అవగాహన కలిగిన ప్రతి ఒక్కరి మీద ఉన్నది.  సామాజిక బాధ్యతను   నిర్వహించడానికి పోటీ పడినప్పుడు మాత్రమే  సమాజం నిండా నిబద్ధతను నింపగలము.  కొంతైనా  మార్పును, అభివృద్ధిని,  ప్రగతిని  సాధించగలం.  వ్యక్తిని కాపాడుకుందాం  శక్తి వంచన లేకుండా  శక్తులుగా ఎదిగిద్దాం.విలువలతో కూడిన జీవితాలకు బాటలు వేద్దాం....


---వడ్డేపల్లి మల్లేశం 
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, అభ్యుదయ రచయి తల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333