ప్రజల తీర్పును గౌరవించని పార్టీలకు మిగిలేది పరాభవమే
కక్షపూరిత రాజకీయాలు చివరికి కార్యకర్తలను కూడా దూరం చేసుకుంటాయి .*దానికి ఆనవాలు పోటీకి అభ్యర్థులు కూడా దొరకకపోవడమే. తమ గోతిని తామే తవ్వుకునే దుష్ట రాజకీయాలకు మాని ప్రజా రాజకీయాల్లో జీవించాలి.
---- వడ్డేపల్లి మల్లేశం
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్సీపి అధికార మత్తులో ఏది చేసినా నడుస్తుందనే వ్యామోహంలో ప్రజలకు దూరమైన సందర్భాలను మనం గమనించాలి. దాని పరిణామం తెలంగాణలో ప్రజల అసంతృప్తి ఆగ్రహానికి టిఆర్ఎస్ ప్రభుత్వం గురికాగా ఆంధ్రప్రదేశ్లో గుండా రాజకీయాల కారణంగా రాబోయే ఎన్నికల్లో వైయస్సార్సీపి కూడా పరాభవాన్ని ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజా రాజకీయాలకు భిన్నంగా చేసే ఏ రాజకీయాలైనా తాత్కాలిక ప్రయోజనాన్ని ఇవ్వవచ్చు కానీ శాశ్వతంగా తమ గోతిని తామే తవ్వుకోవడమే, తమ సమాధిని తామే నిర్మించుకోవడం వంటిదే. ప్రజలు నిరాకరించి, తృణీకరించి, చీత్కరించి, అసహ్యించుకొని ఓటమి పాలు చేసినప్పటికీ కూడా ప్రజా తీర్పును గౌరవించకుండా అహంకారంతో భాష తమ సొంతమే అనే ఆడంబర రాజకీయాలకు పాల్పడిన ఏ రాజకీయ పార్టీలకైనా గతంలో పరాభం తప్పులేదు. ప్రస్తుతం కూడా బారాస పార్టీ గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి నాయకులు అభ్యర్థులు పోటీకి వెనుకంజ వేస్తున్నారంటే పార్టీని కార్యకర్తలు ఎంత అసహ్యించుకుoటున్నారో అర్థం చేసుకుంటే మంచిది . ప్రస్తుతం టిఆర్ఎస్ మాటలు చేష్టలు చట్టసభల్లో బెదిరింపులు శాపనార్థాలు ప్రశ్నలు జుగు బ్సాకరంగా ఉన్న విషయాన్ని ప్రజలంతా గమనించాలి. అది పౌర సమాజం యొక్క బాధ్యత కూడా ఒక ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే విధంగా దారిలో పెట్టుకోవడం ఎంత ముఖ్యమో అంతకు మించిన స్థాయిలో పరిపాలనను అడ్డుకునే పార్టీలను కూడా తరిమికొట్టడం కూడా అదే స్థాయిలో ప్రజల బాధ్యత . ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి బారాస పార్టీ విషమ వికృత ప్రచారం , మాటల గారడి ,సంస్కార రాహిత్యం ప్రజల ఆకాంక్షలను చిదిమి వేసే దిశగా కొనసాగుతున్నది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ద్వారా హక్కులు, ఆకాంక్షలు, రక్షణలు, ఆలోచనలు సాకారం చేసుకోవాలని ఆశిస్తున్న తరుణంలో కాళ్లలో కట్టే పెట్టినట్లుగా ప్రభుత్వం సరిగా పనిచేయకుండా అడ్డుకుంటే
ప్రజలు తమకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించి అడ్డుకున్న పార్టీని తరిమికొట్టే రోజులు వస్తాయి. ఆ స్థితిలో బారాస పార్టీ బాధ్యతారాహిత్యం గా వ్యవహరించడాన్ని వెంటనే విరమించుకుంటే మంచిది అని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారం కోల్పోతే మాకేంటి. చేసిన తప్పులను సవరించుకోవడం నేర్చుకోవాలి :-
*********
9న్నర సంవత్సరాల ఆరు మాసాలపాటు ఏకధాటిగా పరిపాలించిన బి ఆర్ ఎస్ ప్రజా పోరాటాల ద్వారా సాధించిన తెలంగాణను ప్రజల ఆకాంక్షల మేరకు గాడిలో పెట్టాల్సింది పోయి రాష్ట్రాన్ని తమ సొంత ఖజానా లాగా వాడుకున్న తీరు, భిన్న వర్గాల ప్రజలకు చేసిన ద్రోహం, తిరోగమనంలోకి నెట్టిన పాలనా విధానం పైన వెంటనే ప్రజలకు సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. గత పాలనపై అసంతృప్తి, అసమ్మతి, ఆగ్రహము, అవినీతి ప్రభుత్వాన్ని కూలదోయాలనే పట్టుదల, బుద్ధి జీవులు మేధావుల యొక్క చైతన్యం బారాసా ప్రభుత్వాన్ని ఓడించిన విధానాన్ని ఇప్పటికీ అంగీకరిస్తే మంచిది. అప్పుడు మాత్రమే లోపాలను సవరించుకొని ప్రక్షాళన చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతము బారాస పార్టీ చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితులలో ఉండి కూడా తన లోపాన్ని వైకల్యాన్ని సవరించుకునే బదులు ఇచ్చిన హామీలు ఎలా అమలు చే స్తారు? నిధులు ఎక్కడివి? మార్చి 17 వరకు చూస్తాము ఆ తర్వాత ప్రభుత్వ భరతం పడతాము అంటూ పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు బెదిరింపు ధోరణి మాత్రమే కాదు రాజ్యాంగ ద్రోహం కూడా. ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని ప్రజలకు సేవలు చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే క్రమంలో వినియోగించుకోవలసిన విజ్ఞత విభిన్న రాజకీయ పార్టీలకు ఉంటుంది ఆ బాధ్యతను కూడా విస్మరించి ప్రతిపక్ష పార్టీలో ఉన్నామనే భావన నుండి వైదొలిగి ఇంకా అధికారంలోనే కొనసాగుతున్నామనే భ్రమల్లో ఉండి పైగా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే నటిస్తున్నారని విష ప్రచారం చేయడం అంటే తమకు తప్ప ఇతరులకు అధికారం ఉండకూడదనే అహంకారాన్ని రుజువు చేసుకోవడమే . కాలేశ్వరం తో సహా అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలు అవినీతి రాష్ట్రం దేశమంతా కోడై పూసినప్పటికీ ఇప్పటికీ నేరాన్ని అంగీకరించకపోవడం సంస్కారం ఎలా అవుతుంది? పైగా పంటలు ఎండిపోతున్నాయని, ప్రాజెక్టుల్లో నీళ్లు నింపడం లేదని, క్షణం కరెంటు పోతే కాంగ్రెస్ కష్టాలు తిరిగి వచ్చాయని నోరు ఉంది కదా అని మాట్లాడే పద్ధతిని విరమించుకోకుంటే మీ భవిష్యత్తు ఏమిటో ఈ పార్లమెంట్ ఎన్నికలే తెలియచేస్తాయి . ఇప్పటికే మీ పరిస్థితికి ఆనవాలుగా సభ్యులు దొరకకపోవడం, పోటీకి వెనకడుగు వేయడం, అనేకమంది సీనియర్ నాయకులు పార్టీ నుండి వైదొలగి పార్టీ పట్ల విమర్శలు చేయడాన్నీ అధిష్టానం గమనించకపోతే ఖాళీ అయ్యే ప్రమాదం ఉన్నదని ఇతర రాజకీయ పార్టీలు విజ్ఞులు చేస్తున్న హెచ్చరికను ఇప్పటికైనా గుర్తించి లోపాలను సవరించుకొని ప్రక్షాళన చేసుకుని ప్రజల ముందు తమ తప్పులను అంగీకరిస్తే మాత్రమే ప్రజా రాజకీయాల్లో నిలబడగలరు. ఇది ఏ పార్టీకైనా వర్తిస్తుంది.
టిఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలను చివరి వరకు కూడా నెరవేర్చకుండా అక్రమాలు అవినీతి భూకబ్జాలు మద్యం వంటి సామాజిక రుగ్మతలను పెంచి పోషించి ఇదే తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపమని ప్రకటిస్తే అంగీకరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు . ఓటమి ఎక్కడ జరిగిందో అక్కడే విజయాన్ని వెతుక్కోవాలని మీ పార్టీ అధ్యక్షుడు పదేపదే చేస్తున్న ప్రకటన సంస్కారాన్ని పెంచితే బాగుండు. తెలంగాణ లక్ష్యాలు ప్రజల ఆకాంక్షలను పోరాడి ప్రభుత్వం ద్వారా సాధించుకోవాలని చూస్తున్న తరుణంలో ప్రజాస్వామికి విలువలను, మానవహక్కులు పౌర హక్కుల పునరుద్ధరణ పేరుతో ప్రజలకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని
పనులు చేయకుండా అడ్డుకునే హక్కు మీకు లేదు. ఈ శృతి మించితే ప్రజలే అడ్డుకునే వాళ్లను తరిమికొట్టే రోజులు వస్తాయి.
గత చరిత్రలో ప్రజల చేతిలో చిత్కారానికి పరాభవానికి చావు దెబ్బలకు గురైన రాజకీయ పార్టీలను అనేకం చూడవచ్చు. నిధులు ఎలా తె స్తావు? ఇప్పటికే వంద రోజులు దగ్గరికి వచ్చాయి కదా ! హామీలు అమలు చేయకపోతే వెంట పడతాం అంటూ మాట్లాడుతున్న టిఆర్ఎస్ అధికారానికి వచ్చిన నాలుగు సంవత్సరాల వరకు కూడా పౌర సంఘాలు ప్రజాస్వామ్యవాదులు ప్రతిపక్షాలు ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి గమనించాలి. చూసిన తర్వాత మాత్రమే ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని ప్రజలు గత ఎన్నికల్లో ఓడించిన తీరు ముందు అర్థం చేసుకోవాలి. ప్రజలు ప్రశ్నిస్తే నిర్బంధించారు, ప్రతిఘటిస్తే చెరలో బంధించారు, ఎదురు మాట్లాడితే అరెస్టు చేశారు, నిరసన వ్యక్తం చేస్తే ఆ హక్కే లేదని ధర్నా చౌక్ ను ఎత్తివేశారు . అదే ధర్నా చౌక్ ను మీరు వాడుకుంటున్నారంటే ఎంత దిగజారుడు తనము! .
అయినా మేధావులు ఆగ్రహంతో ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని ఒకవైపు హెచ్చరిస్తూనే కాలేశ్వరం ప్రాజెక్టుతో పాటు భూకబ్జాలు ఇతర అవినీతి ఆరోపణలు అన్నింటి పైన విచారణ జరిపించి టిఆర్ఎస్ బాధ్యులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇటీవల సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జన సమితి ఆధ్వర్యంలో జరిగిన సభలో చేసిన తీర్మానo తమ పాలిట ఉక్కు పాదం అవుతుందని గమనిస్తే మంచిది. వేల కోట్ల రూపాయల అవినీతిని, రైతుబంధు పేరుతో సంపన్నులకు చెట్లు గు ట్టలు, అడవులు పంట పoడని భూములకు అప్పజెప్పిన కోట్లాది రూపాయలు నిర్బంధంగా ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తూనే ఆ అక్రమాలకు పాల్పడిన అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రులు ముఖ్యమంత్రి పైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంపదను కాపాడాలని సర్వత్రా రాష్ట్రమంతా పోరుబాట పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి . గత ప్రభుత్వ అవినీతియే ప్రజా ఉద్యమంగా మారే అపురూప సన్నివేశం సా కారం కాకముందే స్వచ్ఛందంగా లొంగిపోయి తమ నేరాలను అంగీకరించి నష్టపరిహారాన్ని ప్రజల ఖాతాకు జమ చేసి బహిరంగ క్షమాపణ కోరాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చట్టసభలో ప్రభుత్వం కూడా టిఆర్ఎస్ పార్టీని హెచ్చరించింది కూడా . ఇక ఇప్పుడు చేయాల్సింది టిఆర్ఎస్ పార్టీ తప్పును తెలుసుకోవడం, సరిదిద్దుకోవడం, ప్రజలకు జవాబుదారీ తనాన్ని ప్రదర్శించడమే తప్ప ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టడం కాదు. ఎలాగూ పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థులు దొరికే అవకాశం లేదు ఒకవేళ బలవంతంగా దొరికినా, బరిలో ఉంచిన మొక్కుబడి మాత్రమే తప్ప ప్రచారానికి కార్యకర్తలు ,ఓట్లు వేయడానికి ఓట్లర్లు సిద్ధంగా లేరని గుర్తించి పార్టీని ప్రక్షాళన చేసుకునే పనిలో పడాలి. ప్రభుత్వాన్ని ఇష్టమున్నట్టు విమర్శించకుండా నిర్మాణాత్మక పాత్ర పోషించి సహకరించాలి . అది విజ్ఞత గల , రాజనీతిజ్ఞత గల రాజకీయ పార్టీలకు ఉండవలసిన సంస్కారం .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)