పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు-- సామాజిక ప్రయోజనాలు.

Mar 20, 2024 - 16:53
 0  72

నడుస్తున్న చరిత్ర పై చర్చిస్తే మరీ మంచిది.  కుటుంబ సభ్యులందరూ పాల్గొంటే మరెoతో లాభం,ఉత్తమ నడవడికి అవకాశం...

---  వడ్డేపల్లి మల్లేశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండున్నర దశాబ్దాలకు పూర్వం  ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలుఇటీవల కాలంలో చాలా విస్తృతంగా తరచుగా జరగడాన్ని మనం గమనించవచ్చు . ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి బ్యాచ్ ఆధారంగా  ఈ సమావేశాలు జరిగితే  యుపిఎస్ పాఠశాలల్లో ఏడవ తరగతి బ్యాచ్ ఆధారంగా కూడా  ఈ సమ్మేళనాలు జరగడాన్ని ఇటీవల కొంత ఆలస్యంగా నైనా గుర్తించవచ్చు .ప్రతి పనికి కార్యక్రమానికి లక్ష్యాలు, అంచనాలు, ఆశయాలు ఉన్నట్లే ఈ సమ్మేళనాలను సమయస్ఫూర్తిగా నిర్వహిస్తే ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం ఉన్నది. ఇది ముఖ్యంగా పూర్వ విద్యార్థులు పూర్వ ఉపాధ్యాయుల మధ్యన సత్సంబంధాలను మరింత బలోపేతం చేయగా రాబోయే తరాలకు ఆదర్శంగా ఉంటుంది  అనడంలో సందేహం లేదు. దాదాపుగా పదవ తరగతి  చదివిన తర్వాత 10, 15, 20 అంతకుమించి సంవత్సరాలు పూర్తయిన సందర్భాల్లో ఈ ఉత్సవాలను నిర్వహించుకోవడాన్నీ గమనిస్తే ఈ మధ్యకాలంలో ఆనాటి విద్యార్థుల యొక్క ఎదుగుదల, కుటుంబ నేపథ్యం, వివాహము ,పిల్లలు, సామాజిక బంధాలు, బంధుత్వాలలో వచ్చిన పరిణామాన్ని కొంత సంక్షిప్తంగా ఆయన చర్చించుకునే అవకాశం ఉంటుంది.  ఇటీవలి కాలంలో ఇది కొంత అనుకరణగా అనిపించినప్పటికీ ప్రైవేటు పాఠశాలల్లో అంతగా కనిపించక కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమా అని ఊహకు తట్టినప్పటికీ అక్కడక్కడ ప్రైవేట్ పాఠశాల లోపల కూడా ఇలాంటి సంబరాలను మనం చూడవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఇది కొంత అనుకరణగా ఉన్నది అనే అపవాదు కూడా లేకపోలేదు. ఆ అపవాదును, విమర్శను తిప్పి కొట్టాలంటే ఇలాంటి సమ్మేళనాలకు సార్థకతను చేకూర్చాలంటే  అర్థవంతమైనటువంటి సమావేశాలను నిర్వహించవలసిన అవసరం ఉంటుంది .విద్యార్థులు చదువుకున్న పూర్వ దశలో తెలిసి తెలియని వయస్సులో ఉపాధ్యాయుల పట్ల గౌరవభావం అంతగాలేని కొంటెతనాన్ని కూడా ప్రదర్శించిన సందర్భాలు లేకపోలేదు. కానీ చిలిపితనంలో తెలియక చేసిన అలాంటి పొరపార్టను యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఈ సమావేశాలు నిర్వహించుకునే సందర్భంలో  అంగీకరించి తప్పులను సమీక్షించుకొని తమ నడవడిని మార్చుకునే అవకాశం కొంత ఉంటుంది. అదే సందర్భంలో తమ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో  ఎదగని అనేక కుటుంబాలకు చెందిన వాళ్లు కూడా ఉన్నత విద్యలు అభ్యసించకపోయినప్పటికీ తమ పిల్లలను మాత్రం ప్రయోజ కులను చేయాలనే సంకల్పంతో పట్టుదలతో ఉండే ఆస్కారం ఇలాంటి సమావేశాల ద్వారా పొందే స్ఫూర్తి ప్రేరణగా పనిచేస్తుంది. అదే సందర్భంలో భార్యా లేదా భర్తలు పిల్లలతో ఈ సమావేశాలకు హాజరు కావడం వలన కొంత సామాజిక చింతన, కలుపుగోలుతనము, మానవ సంబంధాలలో బలోపేతాన్ని, ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అలవర్చుకునే అవకాశం  కూడా దక్కుతుంది.
        పదవ తరగతి పూర్తి చేసుకున్న 10, 20 సంవత్సరాల తర్వాత నిర్వహించుకుంటున్న ఇలాంటి సమ్మేళనాల వలన ఆనాటి విద్యార్థులు నేటి యువత లో పరినతిని మనం చూడవచ్చు. ఉపాధ్యాయులతో మాట్లాడే ధోరణి, గౌరవ మర్యాదల పలకరింపు, పెద్దరికాన్ని గుర్తించడం వంటి విషయాలలో నాటికి నేటికి ఎంతో మార్పును మనం ఈ సందర్భంగా గమనించవచ్చు.  సమావేశము నిర్వహించడానికి నిర్ణయాలు తీసుకున్న తర్వాత పూర్వ ఉపాధ్యాయులను ఆహ్వానించడానికి బృందాలుగా వెళ్లి మర్యాదగా పలకరించి, పెద్దరికాన్ని గుర్తించి, సాదరంగా ఆహ్వానించే ధోరణి లో ఎంతో పరిపక్వత కనపడుతున్నది. అదే సందర్భంలో చిలిపితనానికి బదులు బాధ్యతాయుతమైనటువంటి నడవడిని కూడా   నాటి విద్యార్థుల స్థానంలో నేటి యువతలో చూడవచ్చు  .ఇక సమ్మేళనం జరుగుతున్న సందర్భంలో  యువతి యువకులు తమ పరిచయాన్ని చేసుకొని అనుభవాలు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్న సందర్భంలో ఆనాటి  కొన్ని సంఘటనలను నిర్మో హమాటంగా చెప్పుకోవడాన్ని మనం గమనించవచ్చు. అదే సందర్భంలో ఉపాధ్యాయులు ఏ రకంగా తమ పట్ల వ్యవహరించింది, ఏ రకమైనటువంటి  శిక్షలు ఇచ్చినది నిర్మోహమాటంగా ప్రకటించడాన్నీ మనం గమనించవచ్చు. చిలిపి తనా నికి బదులు పెద్దరికము, అల్లరి కి బదులు వినయ విధేయతలు, కొంటెతనానికి బదులు సామాజిక చింతన సామాజిక బాధ్యతను ఈ 10, 20 ఏళ్ల కాలంలో  మనం అదనంగా గమనించవచ్చు.  అంతేకాకుండా తమ పిల్లలను  నైపుణ్యము సామాజిక బాధ్యత గల పౌరులుగా ఎదిగించడానికి, తమ భర్త లేదా భార్యల పట్ల సానుకూలంగా  మర్యాదగా వ్యవహరించడానికి  నడుస్తున్న చరిత్రను అధ్యయనం చేసి సాహిత్యాన్ని సమాజాన్ని పరిశీలించడం ద్వారా ఆసక్తుల కు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇదే సందర్భంలో ఉపాధ్యాయులు ఇచ్చే ప్రసంగాలు ప్రేరణగా పనిచేయడంతో కొంతమంది యువతి యువకులు తమ లక్ష్యాలను కొత్తగా నిర్ధారించుకునే అవకాశం కూడా లేకపోలేదు .కవులు కళాకారులు క్రీడాకారులు మేధావులు అధ్యాపకులుగా ఆలస్యంగానైనా ఎదగడానికి , అంతేకాదు తమ పిల్లలను లక్ష్యం వైపు   నడిపించడానికి కూడా ఈ సందర్భాలు తోడ్పడతాయి. కొన్నిచోట్ల మొక్కుబడిగా నిర్వహించుకుంటూ వినోదము విందుల కోసం కార్యక్రమాలు  నిర్వహిస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. కానీ మెజారిటీ పాఠశాలలో జరుగుతున్నటువంటి ఈ ఆధునిక సమ్మేళనాలు  గతానికి భిన్నంగా బాధ్యతాయుతంగా వ్యవహ రించడానికి, కర్తవ్యాలను గుర్తించడానికి, తప్పులను సమీక్షించుకోవడానికి, జాతి పట్ల సమాజం పట్ల బాధ్యత గల పౌరులుగా ఎదగడానికి తోడ్పడుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
          ఇక కొన్ని సమ్మేళనాలకు ప్రజాప్రతినిధులు అధికారులు లేదా కొన్ని రంగాలలో ఎదిగిన నిపుణులు, విద్యావేత్తలు, మేధావులను అతిథులుగా పిలుచుకున్న సందర్భంలో వారిచ్చే ప్రసంగాలు, వారి యొక్క జీవిత అనుభవాలు, జీవన గమనం అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యార్థులకు కూడా ఒక దిక్సూచిగా పనిచేస్తుంది. మనిషి సంఘజీవి అనడం ఎంత సహజమో  చివరి రక్తబొట్టు వరకు కూడా ఏదో ఒక రకమైన నైపుణ్యాన్ని అభ్యసించడం విజ్ఞానాన్ని పొందడం చర్చను కొనసాగించడం కూడా  అంతే ముఖ్యం. సోక్రటీస్ జీవితం ద్వారా నేర్చుకున్నటువంటి ఈ  లోతైన అనుభవాన్ని మనందరం కూడా  అన్వ యి0చుకున్నప్పుడు సామాజిక బాధ్యతగా వ్యవహరించి, విద్యుక్త ధర్మాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం ద్వారా ఈ సమాజం మరింత ఉన్నతంగా ఉండే అవకాశం ఉంటుంది .సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతలు, అసమానతలు, అంతరాలు, పీడన, దోపిడీ, పేదరికము వంటి అనేక అసాంఘిక అవాంఛత సందర్భాలను ధిక్కరించి ఒక సమానత్వముతో కూడిన సమాజాన్ని నెలకొల్పు కోవడం అవసరమని గుర్తించడానికి ఇలాంటి సమ్మేళనాలు వేదికలైతే మరింత  బాగుంటుంది. హాజరైనటువంటి అతిథుల ప్రసంగాల ద్వారా ఆనాటి విద్యార్థులు నేటి యువత ప్రేరణ పొందినట్లయితే తమ జీవితంలో కూడా ఏదో ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎవరినో ఒకరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లడానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా గమ్యాన్ని చేరుకోవడానికి మన గమనo కూడా ఆదర్శంగా ఉన్నప్పుడు మాత్రమే ఎంచుకున్న లక్ష్యం నెరవేరుతుంది అని చెప్పడానికి కూడా ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఎంతో తోడ్పడతాయి.  ప్రేమలు, ఆత్మీయతలు అనురాగాలు, మానవ సంబంధాలు, అసూయా ద్వేషాలు లేనటువంటి నిర్మలమైనటువంటి మనస్తత్వాన్ని ఈ అపురూప కలయిక ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది. సందర్భానికి మనస్సు ప్రవర్తన ఆకాంక్ష లక్ష్యం తోడైనట్లయితే ఈ సమ్మేళనాల వల్ల ఒనగూరే ప్రయోజనాలు అంతా ఇ 0తా కాదు.  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులేవరైనా ఈ వ్యవస్థ ద్వారా ప్రయోజనాలను పొందవలసిందే. ప్రైవేటు ప్రభుత్వ రంగం వంటి పరిమిత తేడాను కల్పించి ప్రైవేటు పాఠశాలలకు ఇలాంటి అవకాశం లేకుండా చేయడం సరికాదు. కాబట్టి ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఇలాంటి సమ్మేళనాలను  జరపడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారి లోపల సామాజిక చింతనను ,సంఘ పటిష్టతను,  ఆలోచన సరళిని, నిబద్ధత అంకితభావము కార్యదీక్షను పెంపొందించడానికి కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది.  ఆలోచనను విస్తృత పరుచుకోవడానికి ,విశాల హృదయాన్ని ఆకలింపు చేసుకోవడానికి, అధ్యయనము పరిశీలన వంటి విశాల అవగాహనను పెంపొందించుకోవడానికి, సామాజిక బాధ్యతను ఉన్నతంగా భుజానికి ఎత్తు కోవడానికి,  ఇంటికే పరిమితమై సామాజిక చింతన లేని వారిలో ఆలోచనను బలోపేతం చేయడానికి ఈ సమ్మేళనాలు ఎంతగానో తోడ్పడతాయి. అనేక చోట్ల ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి  ఒకే బ్యాచ్ వాళ్లు తరచుగా నిర్వహించుకోవడాన్నీ కూడా మనం అక్కడక్కడ చూడవచ్చు. ఖర్చుతో కూడుకున్న విషయం కావచ్చు కానీ అంతకుమించినటువంటి ఆత్మీయతను ప్రేమ బంధాన్ని ఉన్నత విలువలను నిక్షిప్తం చేయగలిగే ఈ సమ్మేళనాలు  వృధా అనుకోకుండా ఆర్థిక భారంతో కూడుకున్నవి అనే అపవాదుకు ఆస్కారం ఇవ్వకుండా సుదీర్ఘ లక్ష్యాల వైపు యువతను మళ్లించడానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలను ఒక ఎత్తుగడగా వేదికగా వినియోగించుకోవలసినటువంటి అవసరం ఉపాధ్యాయ రంగం, సమాజం, తల్లిదండ్రుల పైన ఎంతగానో ఉన్నది. ఈ సందర్భాలలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను లేదా భార్యను భర్తలను భర్తలు భార్యలను కూడా అనుమతించడం ద్వారా ఆత్మీయ సమ్మేళనాలకు నిండుతనం తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.  తక్షణమే కనపడకపోవచ్చు, పైకి స్పష్టంగా చూడలేకపోవచ్చు కానీ ఒనగూరే ప్రయోజనాలు దీర్ఘకాలికంగా ఉంటాయి అనే వాస్తవాన్ని గుర్తించినప్పుడు ఇలాంటి సమావేశాలకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు.
(  ఈ వ్యాసకర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కవి, రచయిత హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333