ఎవరి వాట వాళ్లకు దక్కాలనేది సహజ న్యాయ సూత్రం.
ఎవరి వాట వాళ్లకు దక్కాలనేది సహజ న్యాయ సూత్రం.మరో మాటలో దాని అర్థం మేం ఎంతో మాకు అంత.*సంస్థలు, పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఆదిత్య వర్గాల చేతిలో ఉండడoతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు సేవకులుగా మిగిలిపోవడం దారుణం .
--23..11...2024*********************
---వడ్డేపల్లి మల్లేశం 9014206412 **
--------------------------------------------------
సమాజం ఎదుగుతున్న తొలినాళ్లలో ఉనికి కోసం ఎవరి పనిని వాళ్లు ఎంపిక చేసుకొని బ్రతకడం నేర్చిన అసమానతలు అంతరాలు అప్పట్లో స్పష్టంగా కనిపించలేదు. భూమి అడవులు ఇతర ప్రకృతి వనరుల పైన కొన్ని ఆధిపత్య వర్గాలు ఎప్పుడైతే అధికారం కావాలని ఆరాటపడి ఆ వైపుగా పోరాటం చేసి బలహీనులను ఓడించి తమ సొంతం చేసుకోవడం జరిగిందో అప్పుడే పోరాటం కూడా ఉధృతమైనది. " ఉనికిలో ఉన్న మాకు కూడా వాటా దక్కాలని, కొద్ది మంది ఆధిపత్యం కింద బతకడం అన్యాయమని ప్రతిఘటించే వర్గం ప్రారంభం కావడంతో అసమానతలు అంతరాలపైన స్పష్టమైనటువంటి వైఖరి ప్రారంభమైనది. దోపిడి చేసేవాళ్లు దోపిడీ, పీడనకు గురయ్యే వాళ్ళు అంటూ రెండు వర్గాలు ఏర్పడడం వళ్ల వాళ్ల వ్యక్తిగత చొరవ సామాజిక చింతన మానసిక శక్తి సామర్థ్యాలు పునాది ప్రాతిపదికగా ఆదిపత్య వర్గాల ప్రభావం పెరిగినట్టుగా చరిత్ర పరిణామ క్రమాన్ని బట్టి తెలుస్తున్నది. అలవాటులో, ఆచరణలో, ఒక వ్యవస్థ నిర్మాణంలో తొలి నాలో ఉన్నటువంటి పద్ధతులు కార్యాచరణ రివాజుగా మారిపోతే దానిని వ్యతిరేకించడం అనేది తిరుగుబాటుగా ఆలోచించే పరిస్థితులు ఆనాటి నుండి నేటి వరకు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సంపదకు దూరంగా, స్వేచ్ఛ లేకుండా, బానిసత్వంగా ఒకరి చేతిలో బ్రతకడం ఎప్పుడైతే ఆరంభమైనదో అప్పుడే ముఖ్యంగా భారతదేశంలో స్వదేశీయులను ఇతర దేశాల నుండి వచ్చినటువంటి ఆర్యులు ఆక్రమించుకొని బానిసలుగా మలుచుకొని పీడించడం దోపిడీ చేయడం అణచివేయడం అనగీమణిగి ఉండే విధంగా ప్రలోభ పెట్టడం ప్రారంభమైనది. అసమానతలు ఎప్పుడైతే తారాస్థాయికి చేరుకున్నాయో ప్రశ్నించడం ప్రతిఘటించడం నిలదీయడం కూడా ప్రారంభమైనది. ఇదే సందర్భంలో వృత్తులను బట్టి బట్టి కుల వ్యవస్థ ఏర్పడడంతో ఆధి పత్య కులాలు వెనుకబడిన కులాలు అస్పృశతా కులాలు ఒక ప్రాతిపదికన మైనారిటీ వర్గాలు ఏర్పడడంతో సమాజం నిట్టనిలువు న చీలిపోయింది. అయినా ఆధిపత్య వర్గాలు మాత్రం సమాజం పైన తమ అధికారాన్ని చలాయించడంపాటు అధికారం తమకే శాశ్వతం కావాలని అది చట్టబద్ధంగా తమకే చెందాలని ఆలోచించిన సందర్భంగా దాని మూలం ఆనవాళ్లు ఈ కాలంలో మరింత విజృంభించి అగ్రకులాలుగా విస్తరించడంతో అత్యల్ప స్థాయిలో ఉన్నవాళ్లు ఆధిపత్య కులాలుగా చలామణి అవుతుంటే మెజారిటీగా ఉన్నవాళ్లు అనుచర కులాలుగా కొనసాగడం వలన సమాజంలో స్పష్టమైన విభజన రేఖ గీయబడింది. ఆ తర్వాత ఆధిపత్య కులాల వాళ్ళు రాజకీయ, సామాజికంగా అన్ని విధాలుగా కూడా అధికారాన్ని చలాయించడానికి పూనుకున్నప్పుడు మిగతా కులాల వాళ్లు ఐక్యం కాకపోవడం అనేక రకాలుగా వీరిని ప్రలోభ పెట్టడంతో ఆధిపత్య కులాల చేతిలో ఉన్నటువంటి సంఘాలు రాజకీయ పార్టీలు సంస్థలన్నీ కూడా మిగతా వర్గాలతో నిండిపోగా జెండాలు మోసే వాళ్లుగా, సేవకులుగా, యాచకులుగా, పోస్టర్లు అంటించే వాళ్ళుగా మాత్రమే కింది కులాలు మిగిలిపోవడంతో వాళ్ల అధికార దాహానికి అంతులేకుండా పోయి ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో రెడ్లు వెలమల ఆధిపత్యం తారాస్థాయికి చేరుకోవడంతో చట్టసభలలో వారి సంఖ్య పెరగడం జనాభా మాత్రం తక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో 2.4 శాతం ఉన్నటువంటి రెడ్ల ప్రాతినిధ్యం ప్రస్తుతం చట్టసభలో 119 సీట్ల గాను 43 సీట్లతో విరాజిల్లుతుంటే .4 శాతం ఉన్నటువంటి వెలమలు కూడా 13 సీట్లతో రెండవ స్థానంలో నిలబడితే 60 శాతం ఉన్నటువంటి బీసీలకు ఆదరణ లేకపోవడం విచారకరం కాదా! గత కొన్ని దశాబ్దాలుగా బీసీ వర్గాలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలను నిర్వహిస్తూ మేమెంతో మాకంత ఈ దేశ సంపద చెందాలని చట్టసభల్లో జనాభా దామాషా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని పార్టీల నాయకత్వాలు ఉన్నత వర్గాల చేతిలో ఉండడం వలన అభ్యర్థి టిక్కెట్ ఇవ్వడం అనేది వాళ్ల వర్గాలకు డబ్బున్న వాళ్లకే ఇవ్వడం వలన అనుచర గణములోని వాళ్లకు టిక్కెట్టు అందలేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే త మ వర్గం వాళ్లే సహకరించకపోవడం వంటి అవమానాలు జరిగిన సందర్భాలను నెమరు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ పరిస్థితుల్లోనే ఎవరి వాటా వాళ్లకు దక్కాలని సహజ న్యాయ సూత్రాన్ని తీసుకొని పోరాడడం ప్రతిఘటించడం ప్రారంభమైనది. కానీ ఆదిపత్య కులాలకు తెలుసు ఎందుకంటే సబ్బండ వర్గాలు వాళ్ల నాయకత్వం కింద పని చేయడం వాళ్లు అంత తొందరగా విడిపోయి స్వతంత్రంగా వ్యవహరించడం సాధ్యం కాదని. ఇటీవల కాలంలో కొంత దానికి భిన్నంగా తమ ఆత్మ గౌరవం దెబ్బతిన్న సందర్భంలో రాజకీయ పార్టీలో కొనసాగుతున్నటువంటి కార్యకర్తలు రెండవ శ్రేణి నాయకులు కూడా తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైతే పార్టీని దిక్కరించి ప్రతిఘటించి నిలదీసిన సందర్భం పార్టీ ఆదేశానుసారంగా సస్పెండ్ చేసిన పక్షంలో బయటికి రావడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి వర్గాలను మనం చూడవచ్చు. వాస్తవంగా అనాదిగా కుల విభజనలో రెండు అభిప్రాయాలు బలంగా ఉన్నావి 1)ఒకటి బీసీ వర్గాలు ప్రధానంగా అధికారంలోకి రావాలంటే వాళ్ళ ఓట్లు వాళ్లే వేసుకుంటే సరిపోతుంది కదా మీ ఓట్లు మీరు వేసుకోలేక మా మీద ఆడిపోసుకుంటే ప్రయోజనం ఏమిటి? అని వాళ్ళు ప్రశ్నించిన సందర్భాలను మనం గమనించాలి.2) ఇక అదే సందర్భంలో ప్రతి రాజకీయ పార్టీ ప్రజాసంఘాలలో ఉన్న మెజారిటీ ప్రజలంతా అట్టడుగు ఆదివాసీలు బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కనుక ఆధిపత్య వర్గాల చేతిలోని పార్టీల నుండి విడిపోయి తమకంటూ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవడం ద్వారా తమ వ్యక్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవచ్చు కదా! అనే ప్రశ్నలు ఉదయిస్తున్నవి ప్రస్తుతము రాబోయే కాలంలో ముఖ్యంగా బీసీ వర్గాల చేతికి రాజకీయ అధికారం అందాలంటే భవిష్యత్తులో జరగబోయే రెండు పరిణామాలుగా వీటిని మనం చూడవచ్చు. రిజర్వేషన్ కావాలి అని అడిగినప్పుడు అగ్రకుల నాయకులు రిజర్వేషన్ అనేది సరైనది కాదు అని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు కానీ E W S సంగతేమిటి?. దానికి సరైన సమాధానం జనాభా దామాషాలో ఎవరైతే ఎంత శాతం ఉంటే వాళ్లకు రాజ్యాంగ ఫలాలు దేశ సంపద అందాలి అనే సహజ న్యాయ సూత్రాన్ని ఎందుకు ఆమోదించరు అయినా ఒక వర్గం ఆమోదించడం అవసరమా? ఈ దేశ సంపదను అనుభవించడానికి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కును పొందడానికి పోరాటాలు ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తే రాజ్యమే దిగివస్తుంది. తలవంచి మోకరిల్లి అధికారాన్ని కట్టబెడుతుంది ఎందుకంటే రాజ్యాంగంలో స్పష్టమైనటువంటి ఆదేశాలు మనకు ఉండనే ఉన్నావి. సామ్యవాద తరహా ప్రభుత్వ ఏర్పాటు ఈ దేశ లక్ష్యం అని రాజ్యాంగ పీఠికలో రాసుకున్నప్పుడు ఆదేశిక సూత్రాలలో సంపద కేంద్రీకృతం కాకూడదని హెచ్చరించినప్పటికీ ఈ దేశంలో 40 శాతం సంపద ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో బందీ కావడం, గ్రామీణ ప్రాంతాల నుండి కేంద్ర ప్రభుత్వ స్థాయి వరకు ఉత్పత్తితో సంబంధం లేనటువంటి వర్గాల చేతిలో అధికారం కొనసాగడం, ఆ నైజాన్ని మిగతా మెజారిటీ ప్రజానీకం అంగీకరించడం అనాదిగా జరుగుతున్న అసంబద్ధమైన విషయం దాన్ని తిప్పి కొట్టడానికి నీ శాతం ఎంత నీ జనాభా ఎంత అని నిలదీసి ప్రశ్నించినప్పుడు నో రేళ్ల బెట్టక తప్పదు. ఇటీవల రెడ్డి వర్గానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధి ఆధిపత్య కులాల యొక్క అధికార దాహాన్ని ప్రస్తావించి అన్న మాటలు అందర్నీ ఆలోచింపచేసినవి కూడా " ఐదు శాతం లేని రెడ్లకు 50% అధికారం సంపద న్యాయసమతం కాదు ప్రశ్నించే వాళ్ళు ఉంటే మనదే దోపిడీ అవుతుందని" స్పష్టంగా చెప్పిన విషయం మనందరికీ తెలుసు. అంటే దోపిడీతో కూడుకున్న ఆధిపత్య వర్గం తన నైజాన్ని అప్పుడప్పుడు బయటపెడుతున్న సందర్భాన్ని చూచి ఆ వర్గాలకు అధికారం రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ రాజకీయ పార్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బీసీ ఇతర వర్గాలకు కాకుండా ఆదిపత్య వర్గాలకు చెందిన అభ్యర్థికి టికెట్ ఇచ్చి ప్రోత్సహించి తమ పలుకుబడిని ప్రదర్శించాలని చూస్తుంటే కొంతమంది తాబేదారులు మరి కొంతమంది క్రింది కులాలలోని అమ్ముడు పోయిన వాళ్ళు వంత పాడుతున్న కారణంగానే నేడు దేశ సంపద, అధికారం జనాభా దామాషాలో అందడం లేదు. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ ఇతర సంఘాలు జన గణన సందర్భంగా కుల గణన చేయాలని వాళ్ల వాళ్ల దామాషా ప్రకారంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించడం ద్వారా అధికార పలాలు మాకు అందాలని లేకుంటే అంగీకరించే ప్రసక్తి లేదని యుద్ధమే అవుతుందని హెచ్చరించడాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపడుతూ ఢిల్లీలో పోరాట కార్యక్రమాలను తీసుకుంటూ ఉంటే కిందిస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆ వర్గాలకు చెందిన వాళ్ళు స్పందించకుంటే మన ఆకాంక్షలు నెరవేరేది ఎలా? ఇటీవల కాలంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బీసీ ఉద్యమం తీవ్రతరమైంది ఇప్పటికే శాసనసభలో ఆధిపత్య వర్గాలకు ఎక్కువ సీట్లు ఉండి అధికారం చలాయిస్తూ ఉంటే ఒకటి రెండు సీట్లకు పరిమితమైనటువంటి శాసనమండలి సభ్యుల ఎన్నిక సందర్భంగా కూడా ఉన్నత వర్గాలకే టిక్కెట్ ఇచ్చిన అధికార పార్టీల అక్కసును ఊరుకోవడం సమంజసం కాదు .ఆ ఆధిపత్యాన్ని ఆ వర్గ ప్రయోజనాన్ని దెబ్బతీయడానికి సమైక్య ఉద్యమాల ద్వారా తమ ఓటును బలంగా తమ వర్గాలకు వేసుకోవడం ద్వారా స్వతంత్ర అభ్యర్థులైన సరే వారిని గెలిపించుకొని తమ సత్తా చూపెట్టుకుంటే భవిష్యత్తులో ఆదిపత్య వర్గాలు తోక ముడుచుకొని పారిపోయే రోజు తప్పక వస్తుంది. ఈ అంశాన్ని నిర్మోహమాటంగా మాట్లాడుకోకుంటే జీవితాంతం బానిస గా బతకాలి కనక స్పష్టంగా మాట్లాడుకోవడం, బరిగీసి నిలబడడం, అధికారం కోసం పోరాటం, ఆధిపత్య వర్గాలను కూలదోయడం, వరుసగా జరగాలి. ఆ వైపుగా ప్రజా ఉద్యమాలు భవిష్యత్తులో మరిన్ని రావాలని అధికారానికి చేరువ కావాలని కోరుకుందాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )