వంద శాతం ఫలితాలతో జిల్లాకు పేరు తీసుకురావాలి కలెక్టర్
జోగులాంబ గద్వాల 4 మార్చ్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల పదవ తరగతి పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి సమావేశమై మంచి ఫలితాలు సాధించడానికి వివిధ అంశాలను తెలియజేస్తూ ప్రేరణ కలిగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పలువురు విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభ్యాసన స్థాయిని తెలుసుకున్నారు. పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని, ఇందులో మంచి మార్కులు సాధిస్తే భవిష్యత్తులో ఉన్నత చదువులకు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేలా విద్యార్థులు ప్రణాళికతో చదవాలని సూచించారు. ప్రస్తుతం పరీక్షల సమయం దగ్గర పడుతుండడంతో ప్రతి రోజూ సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని చదువుపై పూర్తి దృష్టి పెట్టాలన్నారు. అన్ని సబ్జెక్టుల్లో మంచి ఫలితాలు సాధించాలంటే పాఠాలను అర్థం చేసుకుని చదవాలన్నారు. ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల పదవ తరగతి పబ్లిక్ పరీక్షల పాత ప్రశ్నాపత్రాలను చదివి, వాటికి సమాధానాలను వ్రాయడం ద్వారా మంచి ప్రాక్టీస్ వస్తుందనన్నారు. పరీక్షల్లో చేతివ్రాత స్పష్టంగా ఉండేలా సాధన చేయాలని సూచించారు. క్లిష్టంగా అనిపించే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, పదే పదే చదవడం మరియు వ్రాయడం ద్వారా ఆయా సబ్జెక్టులపై పట్టు సాధించవచ్చని సూచించారు. వేసవికాలం మొదలు కావడంతో విద్యార్థులు ఎక్కువగా నీళ్లు తాగుతూ, మంచి ఆహారం తీసుకోవాలని తెలిపారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి, ఆయా సబ్జెక్టుల ముఖ్యాంశాలను తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు వచ్చే మార్కులను ఏ, బి, సి, డి కేటగిరీలుగా విభజించి ప్రణాళిక బద్ధంగా సాధన చేయించాలన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నా పరీక్షలకు గైర్హాజరు కాకుండా ప్రతి పరీక్షకు హాజరు కావాలని విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. తాను పదవ తరగతిలో ఎలా ప్రిపేర్ అయ్యారో, ప్రతి సబ్జెక్ట్‌ను ఏ విధంగా చదివి మంచి ఫలితాలు సాధించారో ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో పంచుకున్నారు. పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ కలెక్టర్ స్వయంగా రాసిన “విజయోస్తు” లేఖలను పలువురు విద్యార్థులకు అందించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు రేణుక దేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.