ఆడ లేక మద్దెల ఓడినట్లు ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయలేక

Sep 18, 2025 - 08:51
 0  6

ప్రైవేటు ఆసుపత్రులను బ్రతిమిలాడడం పాలకులకు తగునా? ఆరోగ్య శ్రీ సేవలు, హెల్త్ కార్డుల పైన వ్యతిరేకతను ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకోవాలి.* ప్రభుత్వ రంగంలోనే అసాధారణ, అధునాతన సౌకర్యాలకల్పించి సవాల్ విసరడానికి భయమెందుకు?

*******************************************

---వడ్డేపల్లి మల్లేశం 9014206412 

----07....03....2025************************

"ప్రజాస్వామ్య పరిపాలనలో హక్కులు, అంశాలు, చట్టాలు, రాజ్యాంగ నియమాలు చాలా స్పష్టంగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ అంతకుమించిన స్థాయిలోఅవాంతరాలు ఉండడాన్ని గమనించినప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతం చేయడంలో ఏదో ఒక లోపం స్పష్టంగా ఉన్నది అని గుర్తించవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వ రంగాన్ని నీరుగార్చే చర్యలు, ప్రైవేట్ రంగాన్ని పెంచి పోషించే కొన్ని వర్గాలు, పెత్తందారీ వర్గం చేతిలో పాలన సంపద ఉండడం వంటి అనేక అవాంతరాలు కూడా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి .అంతే స్థాయిలో ప్రజల నుండి ప్రజాస్వామ్య పాలకులకు ప్రతిఘటన లేకపోవడం, చట్టసభలలో జరుగుతున్న చర్చలు నామమాత్రంగా మిగిలి పోవడమే కాకుండా ప్రజాధనం కోట్లాది రూపాయలు కొల్లగొట్టబడుతున్న తీరును గమనించినప్పుడు అధికార ప్రతిపక్షాలు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కంటే తమ ఉనికి అధికార కొనసాగింపు కోసమే పని చేసినట్లు మనం స్పష్టంగా చూడవచ్చు. భారత రాజ్యాంగంలో విద్యా వైద్యము సామాజిక న్యాయాన్ని ప్రజలందరికీ ఉచితంగా అందించాలని తద్వారా వెనుకబడినటువంటి వర్గాలు దిక్కు మొ క్కు లేని జనం కూడా ఆ హక్కుల ఆలంబనతో స్వావలంబన దిశగా సాగిపోయే అవకాశం ఉంటుందని రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించినప్పటికీ, పెద్దవాడికి పేదవాడికి ఒకటే ఓటు అనే నినాదాన్ని చట్టబద్ధం చేసి అమలు చేస్తున్నప్పటికీ ఫలితాలు అందుకోవడంలో మాత్రం పెత్తందారీ వర్గమే పై చేయిగా కనపడడం పేదలకు కనీస సౌకర్యాలు కూడా అందకపోవడం విద్యా వైద్యము సామాజిక న్యాయం గాలికి వదిలివేయబడడాన్ని మనం గమనించవచ్చు. ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటు వర్గాలకు అప్పజెపుతారా?

*********************************************

  విద్యా వైద్యాన్ని భారతదేశంలో స్పష్టంగా ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని రాజ్యాంగం ఒక వైపు నినదిస్తుంటే దానికి భిన్నంగా పాలకులు రెండు రంగాలను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నిస్తూ మొక్కుబడిగా ప్రభుత్వ రంగంలో సంస్థలను కొనసాగించిన కారణంగా పూర్తిస్థాయి సౌకర్యాలు ప్రభుత్వ రంగంలో లేకపోవడంతో అనివార్యంగా పేద వర్గాలైనప్పటికీ ప్రైవేటు వైద్యానికి విద్యకు అలవాటు పడక తప్పడం లేదు. ఒకే రంగంలో విద్య వైద్యం గనుక ఉన్నప్పుడు ప్రభుత్వమే పూర్తి బాధ్యతను నిర్వహించినప్పుడు పేద ధనిక తేడా లేకుండా అన్ని వర్గాలకు ప్రయోజనాలు ఒకే రకంగా అందుతాయి. అప్పుడు ప్రతిభ ఉన్నవాడిది శ్రద్ధ చేసిన వాడికి ఫలితాలు ముందంజలో ఉంటాయి అనడంలో సందేహం లేదు. వివక్షతకు తావులేనటువంటి వైద్యం తప్పనిసరి చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రస్తుతం ప్రభుత్వ రంగంలోని వైద్యశాలల ను నామాత్రంగా కొనసాగిస్తూ ప్రైవేటు వైద్యశాలలకు ప్రతి ఏటా కోటానుకోట్ల రూపాయలను దారా దత్తం చేస్తూ ప్రజలకు సేవలు అందించమని హెల్త్ కార్డు పైన లేదా ఆరోగ్యశ్రీ పైన అందించడానికి నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగం ఆ ప్రైవేటు వైద్యశాలలకు సకాలంలో డబ్బులు చెల్లించని కారణంగా అప్పుడప్పుడు ప్రైవేటు సంస్థలు సేవలను నిలిపివేయడంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకొని ఎంతోమంది మృత్యువాత పడినటువంటి సందర్భాలను మనం గమనించవచ్చు.

       ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కోసం ప్రభుత్వాలు ప్రజల నుండి వసూలు చేసినటువంటి సంపదతో పూర్తిస్థాయిలో ఉచితంగా అందించవలసినది పోయి మొక్కుబడిగా ప్రభుత్వ రంగంలో వైద్యశాలలను అనుమతించి ప్రైవేట్ రంగానికి ప్రభుత్వాలు కొమ్ము కాయడం అంటే తమ వర్గ ప్రయోజనాన్ని పెత్తందారీ స్వభావాన్ని ప్రైవేటీకరణను పెంచి పోషించే ప్రభుత్వాలు భవిష్యత్తులో ప్రభుత్వ నిర్వాహన కూడా ప్రైవేటు వర్గాలకు అప్పజెపుతారా? అనే సందేహం రాకమానదు. ప్రైవేటు వైద్యశాలలను బుజ్జగించడం అవసరమా? సొంతంగా ప్రభుత్వ రంగం లో ప్రజా నిధులతో వైద్య సౌకర్యాలను కల్పించుకోలేమా? ఆ చిత్తశుద్ధి లేకపోవడం, ఎన్నికల పైన ఫలితాల పైన ప్రైవేట్ రంగాన్ని పెంచి పోషించడం పైన, అక్రమార్జన పైన మాత్రమే శ్రద్ధ ఉన్న పాలకవర్గాలు కేంద్ర ప్రభుత్వము నుండి దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల వరకు కూడా ఇప్పటికీ వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో నిర్వహించి సవాల్ విసురుతామనే ఆలోచన చేయకపోవడం నిజంగా సిగ్గుచేటు. కొంతవరకు గతంలో ఢిల్లీ ప్రభుత్వం విద్యా వైద్య రంగాలలో ప్రైవేటు వ్యవస్థలను సవాల్ చేసి అంతకు మించిన స్థాయిలో మెరుగైనటువంటి వైద్యాన్ని విద్యను అందించిన దాఖలాలను మనం చరిత్రలో విని ఉన్నాం. ప్రైవేటు స్కూళ్ల నుండి విద్యార్థులు పెట్టుబడిదారీ వర్గం నుండి ప్రభుత్వ వైద్యశాలలకు రోగులు వచ్చినటువంటి సందర్భాన్ని మనం ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వంలో చూసి ఉన్నాం. మరి అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగతా దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ ఈ పరిస్థితిని ఎందుకు చూడలేకపోతున్నాము? కేంద్ర ప్రభుత్వానికి విద్యా వైద్యాన్ని ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని సోయి లేకపోవడానికి కారణం ఏమిటి? ఈ అంశం పైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గతంలో ప్రస్తావన చేసిన సందర్భంలో విద్యా వైద్యాన్ని ప్రభుత్వాలు ఉచితంగా పేద వర్గాలకు అందించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ చేయవు... ఎందుకంటే ఆరోగ్యంగా బలపడి విద్య ద్వారా మెరుగైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వెనుకబడిన పేద అట్టడుగు ఆదివాసి వర్గాలు చైతన్యము పొంది ప్రభుత్వాలనే ప్రతిఘటిస్తాయి. కనుక ప్రభుత్వాల ఉనికికే ప్రమాదం కలిగే పరిస్థితిని పాలకులు తెచ్చుకోరు కదా! అని సర్ది చెప్పిన విషయాన్ని గమనిస్తే నిజమే అనిపిస్తున్నది ప్రభుత్వ రంగంలో విద్యా వైద్యం కావాలంటే పోరాటమే అంతిమ మార్గం. .వైద్యరంగం సమర్ధించుకుంటున్న అంశాలు

***************************************

  ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తున్నటువంటి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు నిధులను చెల్లించని కారణంగా సేవలను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ గారు విజ్ఞప్తి చేయడం అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని, నిధులలేమిని, ప్రభుత్వం యొక్క ఉదాసీనతను, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసే ఆలోచన లేనితనాన్ని మనం గుర్తించినట్లే. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు తెలుపడంతో పాటు ఈ పథకం కింద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించడమే కానీ అమలులో లేకపోవడంతో ప్రజలు పేద వర్గాలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లక, ఆస్తిపాస్తులను అమ్ముకోక తప్పడం లేదు. గతంలో 5 లక్షలు ఉన్న ఉచిత వైద్య పరిమితిని 10 లక్షల పెంచినట్లు,

 ప్రకటించిన ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు చెల్లించినట్లు, గత 21 నెలల లోపల ప్రభుత్వానికి 1779 కోట్లు చెల్లించినట్లు, గత దశాబ్ద కాలంగా పెంచని వైద్య చికిత్సల ప్యాకేజీల చార్జీల సగటును 22 శాతానికి పైగా పెంచినట్టు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ కూడా సేవలు అందుబాటులో లేకపోవడం అప్పుడప్పుడు ప్రైవేటు వర్గాలు నిలుపుదల చేయడం అంటే ప్రైవేట్ రంగాన్ని బలోపేతం చేయడానికి పేద ప్రజల రక్త మాంసాలను పిల్చడానికి తప్ప మరేమీ చిత్తశుద్ధి కనిపించడం లేదు. అదనంగా 163 రకాల ఖరీదైన వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అదనంగా ప్రైవేటు వైద్యశాలలకు 487 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అంగీకరించినప్పటికీ పేద వర్గాలు ప్రైవేటు వైద్యశాలకు వెళ్లక తప్పడం లేదు. ఇల్లు గుల్ల చేసుకుని, అప్పుల పాలై, ఆస్తిపాస్తులను అమ్ముకోక తప్పడం లేదంటే ప్రైవేట్ రంగంలో వైద్య సేవలు అందినట్లా? లేకపోతే ప్రభుత్వ రంగం పూర్తిగా నిస్సత్తువలోకి చేరిందా? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2023 కు ముందు ప్రతినెలకు 57 కోట్లు చెల్లిస్తే 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు నెలకు 75 కోట్లు చెల్లిస్తున్నామని ఆరోగ్యశ్రీ సీఈవో ప్రకటించినప్పటికీ ప్రస్తుతం 95 కోట్లు చెల్లిస్తున్నామని అవసరమైతే 100 కోట్లకు పెంచేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించిందని మాట వరసకు మాట్లాడితే ప్రయోజనం ఏమున్నది?

  "ప్రజా ధనమంతా ప్రైవేటు ఆసుపత్రులకు చేరుతూ ఉంటే అనేక కారణాలతో పేద వర్గాలకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందని ద్రాక్షగా మిగిలిపోయిన సందర్భంలో ప్రభుత్వ వైద్యశాలలో అరకొర సౌకర్యాల మధ్యన పేద వర్గాలు రెంటికి చెడిన రేవన లాగా మారిపోతూ చివరికి అప్పులపాలై ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించక తప్పడం లేదు. ఇదేనా ప్రజా ప్రభుత్వం వైద్యరంగం పైన దృష్టి సారించిన పద్ధతి? పేద వర్గాలకు ఉచితంగా వైద్యాన్ని అందించిన ధోరణి.? ప్రజలు ప్రైవేట్ రంగాన్ని ఆశ్రయించడం లేదు అంగీకరించడం లేదు బాధ్యత గల ప్రభుత్వాలు ప్రభుత్వ రంగంలోనే వైద్యాన్ని సమర్థవంతంగా నాణ్యమైన రీతిలో కొనసాగించడానికి తన శక్తిని నిధులను సమకూర్చుకొని పనిచేయాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. విద్యను వైద్యాన్ని గాలికి వదిలి ఇతర ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తే భవిష్యత్తులో పాలకులకు పుట్టగతులు ఉండవు. కావలసింది విద్యా వైద్యం ఈ రెండింటి పైన దృష్టి సారించే పాలకులకే భవిష్యత్తు ఉంటుంది. ప్రభుత్వాలకు కావలసింది ప్రజలు కానీ పెట్టుబడిదారీ వర్గం కాదు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ల వైద్యశాలలు వాటికి సహకరించడం అవసరమే లేదు. ప్రజలకు ప్రభుత్వానికి ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని నిజమైన పాలకులు అంగీకరించి తీరాలి. ప్రజల కోసము visthrutha స్థాయిలో ఏర్పాట్లు చేయాలి. తద్వారా ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం ద్వారా ఒకే యాజమాన్యంలో వైద్యం అందించగలిగితే పేదవాడికి పెద్దవాడికి సమన్యాయం జరుగుతుంది.ఆ వైపుగా పాలకులు దృష్టి సారించకపోతే ప్రజల అసహనాన్ని చవిచూడవలసి ఉంటుంది."

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333