సంపదను పెంచే  ఆలోచన ఏనాడూ చేయని BRS నగదు పంపిణీకి ఒత్తిడి చేయడం  విడ్డూరం .

Jan 24, 2025 - 16:41
 0  2

ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు  ప్రజల ఆదాయాన్ని పెంచి ఆలోచన మరిచిన BRS.  

హామీలు వాగ్దానాలతో  ప్రలోభ పెడితే  అదే బాటలో నడిచిన కాంగ్రెస్

 కష్టాల పాలైన విషయం  ఆలోచించుకోవాలి.

---  వడ్డేపల్లి మల్లేశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలో  సంపదను సృష్టించడంతోపాటు సంపదను ప్రజలందరికీ పంచడం ద్వారా  ఆదాయాన్ని గణనీయంగా పెంచి  ప్రజలను సంపన్నులను చేయడంతో పాటు మహిళలను పరిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆలోచిస్తున్నట్లుగా అనేక సందర్భాలలో ప్రకటించడం జరిగింది.  ఇక తెలంగాణ రాష్ట్రంలో గత డిసెంబర్  ఏడవ తేదీన ప్రమాణస్వీకారం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో  ప్రపంచముతోనే అన్ని రంగాల్లో పోటీ పడడమే మా లక్ష్యం అని  ప్రకటించిన విషయం మన అందరికీ తెలుసు. ఇక్కడ రెండు  తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా  ప్రత్యక్షంగా పరోక్షంగా సంపదను సృష్టించడము పెంచడం ద్వారా మాత్రమే ఆ సంపదను ప్రజలందరికీ పంచాలని ప్రభుత్వాలు ఆలోచించినట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ  ఈ అంశాలను ఏవి ప్రస్తావించకుండా ప్రధాన ప్రతిపక్షమైన టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం  కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని,  రెండు లక్షల రుణమాఫీ ఇంకా అందరికీ అందలేదని,  రైతు భరోసా 15 వేల రూపాయలు ఇచ్చిన హామీని 12 వేలకు  కుదించడం భావ్యం కాదని,  పెన్షన్లను 4 వేలకు చేస్తామని ఎందుకు చేయడం లేదని,  మహిళలకు 2500 రూపాయలు నగదు హామీ ఏమైందని, రైతు బంధు పథకం లాగా రైతు భరోసా కూడా రాష్ట్రంలోని అన్ని రకాల భూములకు వర్తింప చేయాలని డిమాండ్ చేయడాన్ని మనం ఇటీవల వరుసగా గమనించవచ్చు.  మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు గారలు   ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిరంతరం భయపెడుతూ లొంగదీసుకునే ప్రయత్నం చేస్తూ బెదిరిస్తూ శాపనార్థాలు పెడుతూ  క్రియాశీలక పాత్ర పోషించాల్సిన ప్రతిపక్షం  అశాస్త్రీయ పద్ధతిలో కేవలం నగదు పంపిణీ చేయడం మాత్రమే ప్రభుత్వాల బాధ్యత అన్నట్లుగా ఆలోచించడం నిజంగా విడ్డూరం.  ఇక ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షానికి ప్రతిపక్ష నేత ఎవరు అనేది సందిగ్ధ స్థితిలో ఉన్న సందర్భం  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నప్పటికీ మౌనందాల్చడం, చట్టసభలోకి రాకపోవడం, ఏ అంశం పైన ప్రతిస్పందించకపోవడం  అతిపెద్ద బాధ్యతారాహిత్యం అని చెప్పక తప్పదు.

టిఆర్ఎస్ అధికారంలో ఉన్న నాడు  ఇచ్చిన అనేక హామీలను  అమలు చేయలేదని స్పష్టంగా మనకు తెలుసు. అంతేకాదు సంపదను సృష్టించే విషయంలో, ప్రజల ఆదాయాన్ని గరినీయంగా పెంచే విషయంలో ఏనాడు కూడా పట్టించుకోలేదు కనుకనే    రాష్ట్రం అప్పుల పాలయింది. ప్రజల ఆదాయం పెరగలేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, ఉపాధికి సంబంధించి రుణ సౌకర్యం ఇవ్వలేదు, ఇవన్నీ కూడా టిఆర్ఎస్ హయాంలో జరిగిన లోటుపాట్లు.  అయితే ఏనాడు కూడా సంపదను సృష్టించే ప్రయత్నం చేయకపోగా  ఇష్టారాజ్యంగా హామీలు ఇవ్వడంతో దానిని కాపీ కొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలను అమలు చేస్తామని ఆరు గ్యారెంటీ లతోపాటు ఎన్నో హామీలు ఇచ్చి  అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని టిఆర్ఎస్ ఉపయోగించుకొని ఎంతసేపు ప్రజలకు నగదు పంపిణీ ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారని ప్రశ్నించడమే కానీ  రాష్ట్ర సంపదను పెంచడానికి నిర్మాణాత్మకమైన సూచన చేసింది ఏ ఒక్కనాడు కూడాలేకపోవడం ప్రధాన విమర్శ.

టిఆర్ఎస్ ఇచ్చిన హామీలుఅమలైనవి ఎన్ని?

---  దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హామీ తుంగలో తొక్కింది టిఆర్ఎస్.
---  దళితులకు మూడు ఎకరాలు ఉచితంగా ఇస్తామని ఏ ఒక్కరికి అమలు చేయలేని  అసమర్థ ప్రభుత్వం బీఆర్ఎస్.
--- బంగారు తెలంగాణను సా కారం చేస్తామని కనీసమైన బ్రతుకులు కూడా ఇవ్వలేని  రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం.
--  2018 ఎన్నికల సందర్భంగా కీలకమైన సందర్భంలో అఖిలపక్షాలతో సమావేశం చేస్తానని హామీ ఇచ్చి ఏనాడు కూడా అమలు చేయని ప్రభుత్వం బి.ఆర్.ఎస్.ది.
--- దళిత బంధు పేరుతో పది లక్షల రూపాయలు  నామ మాత్రంగా అమలు చేసినప్పటికీ  సంపన్నులు  ఉద్యోగులు వ్యాపారస్తులకు కూడా కట్టబెట్టిన తీరు  ఏ రకంగా పేదరికాన్ని తరిమి కొడుతుందో అర్థం కాదు.  అది కూడా కేవలం పార్టీ కార్యకర్తలకు మాత్రమే  ఇవ్వడం  రాజ్యాంగ విరుద్ధం.
-- ఇక రైతుబంధు పేరుతో అమలు చేసిన తీరు  పెట్టుబడిదారులు సంపన్నులు భూస్వాములకు  లక్షల రూపాయలను కట్టబెట్టి  గుట్టలు చెరువులు వాగులు, వంకలు అడవులు రోడ్లు  మైనింగ్ భూములకు కూడా  చెల్లించిన తీరు  ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందో అర్థమవుతున్నది.
--  లక్షలాది మంది యువతకు ఉద్యోగాల కల్పన కోసం నిర్వహించినటువంటి అనేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు లీకేజీతో   నోటిఫికేషన్లు ఉద్యోగ కల్పన అభాసు పాలై న విషయం అందరికీ తెలుసు.
-- యువతకు ఉపాధి అవకాశాలు అన్నారు కానీ   కుటుంబ సభ్యులందరికి కూడా ఉపాధి అవకాశాలను పదవులను కట్టబెట్టిన తీరు అందరికీ తెలిసిందే.
--- ప్రజాస్వామ్యానికి మచ్చుతునక అయినా   ఇందిరా చౌక్ ను ఎత్తివేయడంతో పాటు ప్రజాసంఘాల సమావేశాలను  నిషేధించిన తీరు ఏ రకంగా ప్రజాస్వామ్యమో  అందరికీ తెలిసిందే.
---  ఇక ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఫోన్ టాపింగు ఇతర అభివృద్ధి పథకాలు గొర్రెలు మేకల  పంపిణీ  కాలేశ్వరం ప్రాజెక్టులోని అవినీతి అన్ని రకాల ప్రాజెక్టులు కాలువలు కుంటలు చెరువులు, ఇండ్లలో నిర్మాణంలో  నాణ్యత లోపం కొట్ట వచ్చినట్లుగా కనపడుతూ ఉంటే  వాటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి కేవలం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బెదిరింపులతో లొంగదీసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగమే  నగదు పంపిణీ గురించి డిమాండ్ చేయడం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేయవలసిందే. కానీ అంతకుమించి బిఆర్ఎస్ హయాంలో పైన చెప్పినటువంటి హామీలు నెరవేర్చక పోవడాన్ని  ప్రజలు ప్రజాస్వామికవాదులు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రశ్నించవలసి వుండే.  టిఆర్ఎస్ బలవంతంగా  ఒంటెద్దు పోకడతో పరిపాలించిందా అనే విషయం పైన కూడా చర్చ జరగాలి ఆనాటి అవినీతి పనుల పైన తప్పకుండా సమగ్ర విచారణకు ఆదేశించవలసిన అవసరం కూడా ఉన్నదని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిఆర్ఎస్  రాష్ట్ర పరిపాలన గురించి  విభిన్న వర్గాల యొక్క ఆదాయ మార్గాలను పెంపొందించడం, ఉచిత విద్య వైద్యము సామాజిక న్యాయం గురించి ఏ ఒక్కనాడు కూడా చట్టసభల లోపల గాని బయట గాని మాట్లాడిన దాఖలా లేదు.  ఇక బి ఆర్ ఎస్ హయాంలో విద్యారంగం పైన ఏనాడూ సమీక్ష చేసిన దాఖల అసలు లేకపోగా  ప్రైవేట్ రంగంలో ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచిన విషయం మనందరికీ తెలిసిందే.  టిఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఉచిత విద్య వైద్యం సామాజిక న్యాయం కోసం పోరాడాలి ప్రస్తుత ప్రభుత్వాన్ని నిలదీయాలి. విభిన్న వర్గాల యొక్క ఆదాయ మార్గాలను పెంచడానికి సంబంధించి చట్టసభల్లో బయట చర్చ చేయాలి, సంపదను సృష్టించడానికి ఆ సంపదను ప్రజలందరికీ సమానంగా పంచడానికి ఆలోచించాలి. కానీ ఎంతసేపు రైతుబంధు రైతు భరోసా రుణమాఫీ గురించి కేవలం రైతు వర్గాల గురించి మాత్రమే మాట్లాడడం అవివేకం అంతేకాదు పచ్చి స్వార్థం కూడా. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు,  వలస కార్మికులు, చేతీవృత్తుల  వాళ్ళు  దుకాణాలలో పనిచేస్తున్నటువంటి అరకొర వేతనాలతో  కుటుంబాలను వెలదీస్తున్న కార్మికుల గురించి బిఆర్ఎస్ తన పదేళ్ల  కాలంలో ఏనాడు కూడా ఆలోచించిన దాఖలా లేదు. ప్రస్తుతం కనీసం ప్రస్తుత ప్రభుత్వాన్ని అయినా ప్రశ్నించి వాళ్ల గురించి మాట్లాడానికి పూనుకోకపోగా ఎంతసేపు రుణమాఫీ రైతు భరోసా రైతుల గురించి మాత్రమే మాట్లాడడం నిజంగా విడ్డూరం అది అ సందర్భం కూడా.  ఈ రాష్ట్ర సంపదను కేవలం రైతు వర్గాలకు మాత్రమే పంపిణీ చేస్తే మిగతా వర్గాల గురించి ఆలోచించేది ఎవరు? వాళ్లకు ఈ రాష్ట్ర సంపాదన అనుభవించే హక్కు లేదా? టీఆర్ఎస్ కేవలం రైతుల తరఫున మాత్రమే వకాలత పుచ్చుకున్నట్టు మాట్లాడితే ప్రజలు సహించరని తెలుసుకుంటే మంచిది.  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా  రైతులకు ఒకసారి రుణమాఫీ చేసి  దానిని ఇంతటితో ముగించినట్లు ప్రకటించాలి. అంతేకాకుండా రైతు భరోసాను కూడా కేవలం పండించిన భూములకు పండించిన రైతులకు మాత్రమే ఇవ్వడంతో పాటు వందలాది ఎకరాలకు కాకుండా కేవలం 10 ఎకరాలకు మాత్రమే పరిమితం చేయాలి. టిఆర్ఎస్ ఏనాడు కూడా 10 ఎకరాలు ఐదు ఎకరాల గురించి మాట్లాడకుండా భూస్వాముల పక్షాన మాట్లాడి వాళ్లకు ప్రజాధనాన్ని కట్టబెట్టిన తీరు నిజంగా రాజ్యాంగ  వ్యతిరేకం అని చెప్పక తప్పదు. అలాంటి పరిస్థితులలో  టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చర్యల గురించి  విమర్శించే హక్కు లేదని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రజాధనాన్ని దూర్వినియోగం  చేయకుండా సంపాదన సృష్టించే  కీలక అంశాల పైన నిర్మాణాత్మక సూచనలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ ఉపాది  అవకాశాలను మెరుగుపరచడంతో పాటు పేదరిక నిర్మూలన కోసం  కృషి చేయడం, సంపదను ప్రజలందరికీ సమానంగా పంచడం కోసం  నిజమైన ఆలోచన చేసినప్పుడు మాత్రమే టిఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది.లేకుంటే  విమర్శకు మాత్రమే పరిమితం అయితే  ప్రజలు తగిన  విధంగా స్పందిస్తారని తెలుసుకుంటే మంచిది.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడుఅరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333