జైల్లలో కుల వివక్షత కొనసాగడం అభివృద్ధికి నిదర్శనమా?
పాలకులు ఏం జవాబు చెబుతారు?
ఖైదీలపట్ల వివక్షత అమలు చేయడం సిగ్గుచేటు.
రాష్ట్రాల జైలు మాన్యువల్ నిబంధనలు మార్చాలి.
మానవులంతా సమానం అన్న ఆర్టికల్ 17కు ఈ వివక్షత రాజ్యాంగ విరుద్ధం అన్న సుప్రీంకోర్టు.
----వడ్డేపల్లి మల్లేశం
కులం ఆధారంగా భారతదేశంలో మనుషులపట్ల వివక్ష చూపడం అనేది అనాదిగా కొనసాగుతున్నప్పటికీ ఆధునిక యుగంలో ఖైదీలను సంస్కరించడానికి ఉద్దేశించిన జైల్లల్లో కూడా కుల వివక్షత చూపడం సిగ్గుచేటు. కింది కులాల ఖైదీలకు కష్టమైన, పారిశుద్ధ్య, మురుగు కాలువల శుద్ధికి సంబంధించిన పనులు అప్పజెప్పితే పై కులాలకు చెందిన వారికి వేరే పనులు కేటాయించినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు కింది కులాల వారి పైన దాడులు హింస బెదిరింపులకు అంతే లేదని క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తెలుస్తున్నట్లు రాజకీయ పండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకృత్యాలు, అన్యాయాలు, అవినీతి ఏ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎవరో ఒకరు ప్రశ్నించే వాళ్ళు లేదా న్యాయస్థానం దృష్టి తీసుకుపోయే వాళ్ళు లేకపోతే నట్ట నడివీధిలో పట్టపగలు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా న్యాయంగా రుజువు చేసే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్న భారతదేశంలో ఎక్కడో ఏ మూలనో ఎవరో న్యాయస్థానం దృష్టికి తీసుకుపోవడం ద్వారా కొంతమందికైనా న్యాయం జరుగుతున్న విషయాన్ని మనం గమనించాలి.. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో దారుణమైనటువంటి వివక్షత జైలు మాన్యూవల్ లో నిబంధనలతో కులం ఆధారంగా ఖైదీల పై వివక్ష చూపడం నిరసిస్తూ మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందినటువంటి జర్నలిస్టు సుకన్య శాంత సుప్రీంకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయడంతో మేల్కొన్న సుప్రీం ధర్మాసనం ఈ విషయం పైన ఘాటుగా స్పందించి రాష్ట్రాలను ఆదేశించడం స్వాగతించదగిందే.
సర్వోన్నత న్యాయస్థానం తీర్పు పాఠాన్ని పరిశీలిస్తే:-
అత్యంత హీనమైన, కులం పై ఆధారపడిన ఈ వివక్షతను న్యాయస్థానం తీవ్రంగా ఖండిస్తూ కులం ఆధారంగా ఖైదీలపై వివక్షత చూపడం తగదని హెచ్చరించడంతోపాటు రాష్ట్రాలు జైలు మాన్యువల్ నిబంధనలను వెంటనే మార్చాలని మూడు మాసాల సమయం ఇవ్వడం పరిశీలించదగినది. అక్టోబర్ మాసంలో వెలువడిన ఈ తీర్పు నేపథ్యంలో ఆనాటి ప్రధాన న్యాయమూర్తి డివైస్ చంద్ర చూడు గారి నేతృత్వంలోని ధర్మాసనం కులం ఆధారంగా ఖైదీలను విభజించే రాష్ట్రాల మ్యానువల్ లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని ఖైదీల పైన కొనసాగుతున్న వివక్షతను అంతం చేయడానికి అన్ని రాష్ట్రాలు కూడా జైలు మాన్యువల్ నిబంధనలను మార్చాలని ఆదేశిస్తూ కొన్ని జైల్ల లో చోటు చేసుకున్నటువంటి కుల వ్యవస్థ సంఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి తదుపరి పూర్తిస్థాయిలో విచారణ జరపడానికి సిద్ధ సిద్ధపడడం అభినందనీయం.
కారాగారంలో నిర్బంధంలో ఉన్న వారికి సైతం గౌరవంగా జీవించే హక్కు ఉన్నదని lమానవులంతా సమానంగా జన్మించినారని ప్రబోధించే ఆర్టికల్ 17 మేరకు అందరూ ఖైదీలను సమానంగా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
తన దృష్టికి వచ్చిన అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్, ప. బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా,కేరళ,మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రల జైలు మ్యానువల్ నిబంధనలను తక్షణమే మార్చాలని హెచ్చరించింది.
వాస్తవానికి జైలు మాన్యువల్ లో కులం కాలం అవసరం లేకపోయినా కులాన్ని నమోదు చేసి నిమ్న కులాల వారితో మరుగుదొడ్లు కడి గించడం ట్యాంకులు శుభ్రం చేయించడం వంటి పనులు చేయిస్తూ అగ్రవర్ణాలవారికి మాత్రం సులభమైన వంట పనులు అప్పగించడం ముమ్మాటికి వివక్ష అవుతుంది. ఇలాంటి దురాచారం అంటరానితనాన్ని జైల్లో కూడా కొనసాగించడం, కులం ఆధారంగా తక్కువ కులం వాళ్లను వేరే గదులలో ఉంచడం సమంజసం కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆంగ్ల వలసవాద కాలమునాటి అవశేషాల కు గుర్తుగా స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి దయనీయ వివక్షతను కొనసాగించడం నీచమైనదని, పనుల విషయంలో అందరికీ సమానమైన పనులు అప్పజెప్పాలని, కేవలం ఒక కులం వారిని స్వీపర్లుగా ఎంపిక చేయడం సమానత్వ హక్కుకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు సీరియస్ గా మందలించింది. క్రింది కులాల వారికి ఇలాంటి పనులను అప్పగించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమే అవుతుందని రాజ్యాంగాన్ని ధిక్కరించే హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదని తన తీర్పులో హెచ్చరించడాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టులు మందలిస్తే కానీ చర్యలు తీసుకోలేని మొద్దు నిద్రలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉంటే పేదలు అట్టడుగు వర్గాలు ఆదివాసీలు సామాన్య ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది? ఇంతకాలంగా జైల్లో పేద వర్గాలు అంటరాని వారికి అగ్రవర్ణాలకు ఇంత వ్యత్యాసంతో కూడుకున్న పనులను అప్పగిస్తూ వివక్షత చూపిస్తూ అవమానిస్తూ ఉంటే చూసి చూడనట్లు ఊరుకున్న ప్రభుత్వాలు నిజంగా సిగ్గుతో తలవంచుకోవాల్సిందే.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలు, బుద్ధి జీవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ప్రజా సంఘాలు కింది కులాలు కూడా తమకు అన్యాయం జరిగినప్పుడు నోరు మెదపకుండా ప్రశ్నించకుండా ప్రతిఘటించకుండా ఉన్నంతకాలం పాలకుల రాజ్య హింస కొనసాగుతూనే ఉంటుంది, పెత్తందారీ వ్యవస్థ దోపిడీ వర్ధిల్లుతూనే ఉంటుంది. జైలు అధికారులు పోలీసులు ఇతర సిబ్బంది జైలు శిక్షలను అమలు చేసే సందర్భంలో ఇలాంటి వివక్షతకు పాల్పడితే వాళ్లకు యావజ్జీవ, ఉరిశిక్షలను అమలు చేయడం ద్వారా ఈ దేశంలో దుర్మార్గుల యొక్క కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉన్నది. అసలు జైలలో ఖైదీలుగా కొనసాగుతున్న వాళ్లలో లక్షలాదిమంది నిజంగా నేరస్తులు కానే కాదు విచారణ పేరుతో, తాము ఎందుకు అరెస్టు చేయబడినామో తెలియక, తెలుసుకోవడానికి ప్రయత్నించలేక, న్యాయ సహాయం కోసం పోరాడే శక్తి లేక, ఆ మార్గం తెలవక అనేకమంది తమ జీవితాలను కోల్పోతున్న తరుణంలో విచారణ ఖైదీల పైన జరుగుతున్న అమానుషత్వాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని ప్రజల విజ్ఞప్తి.
(ఈవ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)