వైద్యులారా వందనం!!

Jun 30, 2024 - 12:15
Jun 30, 2024 - 12:24
 0  16
వైద్యులారా వందనం!!

'డాక్టర్'.. అందరికీ సుపరిచితమైన, అందరి నాలుకలపై నర్తించే పేరు. ప్రాణం పోసేవాడు దేవుడైతే, ప్రాణం నిలిపేవాడు డాక్టర్ అంటారు. సమాజంలో వైద్యుడికి అపారమైన ఆదరణ, గౌరవం ఉంది. డాక్టరంటే ఒక నమ్మకం.. ఒక భరోసా.. ఒక గురి.. తమ ప్రాణాలను డాక్టర్ చేతిలో పెట్టి నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంటారు ప్రజలు. విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఎన్నోత్యాగాలు చేస్తాడు వైద్యుడు. లోపల ఎన్ని బాధలున్నా బయట పడకుండా నగుమోముతోనే సగం జబ్బు తగ్గించేస్తాడు. మానవీయ స్పదనలు లేనివారు వైద్యవృత్తికి పనికిరారు. జబ్బుతో వచ్చిన పేషెంట్ ను ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానమే. అంకితభావం, బాధ్యతాభావం, చిత్తశుధ్ధి అనేవి డాక్టర్ కు తప్పని సరిగా ఉండవలసిన లక్షణాలు.

కప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవారు. ఎంతో ఆత్మీయంగా కుటుంబ సభ్యులతో కలిసిపొయ్యేవారు. కుటుంబంలో ఎవరికి ఏసమస్య వచ్చినా నిస్సంకోచంగా, ఎలాంటి అరమరికల్లేకుండా వారితో చెప్పుకునేవారు. డాక్టరంటే, ఏదో ప్రత్యేక వ్యక్తిగా కాకుండా ఒక స్నేహితుడిగా ఉండేవాడు. అప్పటి వారు తమకున్న పరిమితమైన పరిజ్ఞానంతో, ప్రత్యేక నైపుణ్యంతో పేషెంట్ నాడిని పసిగట్టి వైద్యం చేసేవారు. ఆరోజుల్లో ఇన్ని రకాల మందులు కూడా లేవు. వ్యాధి కారణాలను కనిపెట్టే సాధనాలు కూడా అందుబాటులో ఉండేవికావు. నాటి ప్రజలు వైద్యుణ్ని నమ్మకమైన స్నేహితుడిగా, ఆత్మీయుడిగా, మార్గదర్శిగా విశ్వసించేవారు. తను కూడా వారి నమ్మకానికి అనుగుణంగా కుటుంబ శ్రేయోభిలాషిగా మసలుకునేవాడు. కాని ఈనాడు ఫ్యామిలీ డాక్టర్‌ అనే ఆలోచన పూర్తిగా మాయమైంది. డాక్టరు తన వృత్తిని బిజినెస్ గా, పేషెంటును కస్టమర్‌ గా భావించే పరిస్థితి ఏర్పడింది. ఎంతో నమ్మకంతో తన దగ్గరికి వచ్చే పేషెంట్ల నమ్మకాన్ని వమ్ము చేస్తూ, నమ్మక ద్రోహానికి పాల్పడే డాక్టర్లు అనేకమంది పోగయ్యారు.

 వైద్యం కార్పోరేటీకరణ దిశగా పరుగులు పెడుతున్న నేటి దశలో ఫ్యామిలీ డాక్టర్ భావన అడుగంటి, సంపాదనకు అది పర్యాయపదంగా మారిపోయింది. రోగి అంటే డబ్బు సృష్టించే మిషన్ అన్న భావన ఏర్పడింది. ప్రజారంగంలో ఆరోగ్య సేవలు, సదుపాయాలు క్రమంగా దిగజారిపోయాయి. ప్రజారోగ్యానికి వెన్నెముకలుగా, వెన్నుదన్నుగా నిలబడాల్సిన, పేద ప్రజల అవసరాలు తీర్చాల్సిన ప్రైమరీ హెల్త్ సెంటర్లు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) సరిగా పని చేయడం లేదు. అందులో కావలసిన పరికరాలు సరిగా వుండడం లేదు. డాక్టర్లు, సిబ్బంది కూడా అంతంత మాత్రమే. మందులు కూడా సరిగాఉండవు. ఉన్నాఅవి ప్రజలకు ఉపయోగపడవు. మంచి సదుపాయాలుండాల్సిన హాస్పిటల్స్ లో బోధనా సిబ్బంది, తగినంతమంది ఉద్యోగులు లేక, ఉన్నా, వారిలో అంకితభావం లేక వెనుకబడి వున్నాయి. ప్రజారోగ్యం పట్ల పాలకుల నిర్లక్ష్యం, ఉదాసీనత దీనికి కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అనివార్యంగా ప్రయివేటు డాక్టర్లను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నది. ఈనేపథ్యంలో క్రమంగా వైద్యం ప్రయివేటుపరం అయిపోయి వ్యాపారీకరణకు దారితీసింది.

 ప్రయివేటు మెడికల్‌ కాలేజీలు, మల్టీస్పెషాలిటీ వైద్యశాలలు పుట్టగొడుగుల్లా పెరిగి, అన్ని రకాల అవినీతి పద్ధతులకు పాల్పడుతున్నాయి. విద్యార్ధులు, వినియోగదారుల నుండి అంతులేని డొనేషన్లు, ఫీజులు వసూలు చేస్తున్నాయి. డొనేషన్లు వసూలు చేయకూడదని చెప్పిన సుప్రీం ధర్మాసనం  ఆదేశాన్నీ ఎవరూ పట్టించుకోవడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్‌ ఆసుపత్రులు పచ్చివ్యాపార సంస్కృతికి తెరతీశాయి. పత్రికల్లో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పిస్తున్నాయి. పీఆర్‌ఓ లను పెట్టుకుని తమ ఆసుపత్రికి కేసులు పంపిన వారికి ఆకర్షణీయమైన ప్రతిఫలాన్ని ఆశ చూపిస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి దొడ్డిదారుల్ని ఆశ్రయిస్తున్నాయి.

దొడ్డిదారులు చాలా వికృతమైన రూపాలు ధరిస్తున్నాయి. అవసరానికి మించి ఎక్కువ ఖరీదైన మందులు రాయడం, అవసరం ఉన్నా లేకపోయినా రకరకాల పరీక్షలు చేయించడం, అవసరంలేని ఆపరేషన్లు చేయడం, ప్రతి రెండో కేసునీ ఐసీయూలో పెట్టడం, వెంటిలేటర్ ఎక్కించడం లాంటి రోగుల జేబులు ఖాళీ చేయించే విధానాలు అవలంబిస్తున్నారు.

  దీంతో సమాజంలోని అన్నిరంగాలకు భిన్నంగా ఉంటుందని ఆశించే వైద్యరంగం కూడా అవినీతి ఊబిలో పీకలదాకా కూరుకుపోయింది. దీనికి తగినట్లుగానే ఔషధ పరిశ్రమలు విపరీతంగా పెరిగిపోయాయి. రకరకాల ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు వాటిని మార్కెటింగ్ చేయటానికి అనేక వక్ర మార్గాలు అవలంభిస్తున్నాయి. డాక్టర్లకు ఖరీదైన నజరానాలు సమర్పించడం, విందులు వినోదాల్లో ముంచడం, విదేశీటూర్లు వేయించడం, మరికొన్ని ఇతర కోరికలు, అవసరాలు తీర్చడం లాంటి నీచపు పనులన్నీ చేస్తుంటాయి. ఈ నేపధ్యంలో సాధారణ ప్రజల్లో వైద్యులు, వైద్య వృత్తి సందేహాస్పదంగా మారిపోయింది. వైద్యరంగంలో అత్యున్నత మానవీయ విలువలు పాటించే వారు ఈనాటికీ కోకొల్లలుగా ఉన్నప్పటికీ, కొందరివల్ల అందరికీ.., మొత్తం వైద్య వ్యవస్థకే చెడ్డ పేరు వస్తున్నది. అందుకని, వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని అత్యున్నత స్థాయిలో నిర్వహించాలి. కేవలం కళ్ళముందు కనిపించే కొన్ని తాయిలాలకే లొంగిపోకూడదు. తమ వద్దకు వచ్చిన పేషెంట్  పట్ల నిజాయితీగా వుండాలి. నిబద్దతతో వ్యవహరించాలి.  రోగిని చూసే పద్ధతి  స్నేహ పూరితంగా, దయగా, వితరణతో కూడినదై వుండాలి. బంధువులకు, పేషెంట్ దగ్గర వుండే వారికి వాస్తవ పరిస్థితిని వివరించి ధైర్యం చెప్పాలి. వైద్యవ్యవస్థ మీకు అండగా ఉందన్న భరోసా కల్పించాలి. వైద్య వృత్తిని అమితంగా  ప్రేమించి, శ్వాసించిన డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ (బీ సీ రాయ్ ) ను ఆదర్శంగా తీసుకొని వృత్తిధర్మాన్ని నిజాయితీగా నిర్వర్తిస్తూ, నిస్వార్ధ ప్రజా సేవకు నడుంబిగించాలి.

 ప్రజల నిత్యజీవితంలో కీలకపాత్ర పోషించే వైద్యుల సేవలను గుర్తించి, వారి గొప్పతనంపట్ల అవగాహన పెంచడంకోసం డా. బీ సీరాయ్ జయంతి, వర్ధంతి రోజు అయిన జులై 1 వ తేదీని ' డాక్టర్స్ డే ' గా నిర్వహించడాన్ని వైద్యమహోదయులు గౌరవంగా, స్పూర్తిగా తీసుకొని ప్రజాసేవకు పునరంకితం కావాలి. కొంతమందివల్ల మొత్తం వైద్య వ్యవస్థకే వస్తున్న చెడ్డపేరును తొలగించడానికి చిత్తశుధ్ధితో కూడిన ప్రయత్నం చెయ్యాలి. తమలో  ఏవైనా లోటుపాట్లు ఉంటే గనక వాటిని సరిదిద్దుకొనే ప్రయత్నం చేయగలిగితే ప్రజల నమ్మకాన్ని, ప్రేమాభిమానాలను మరలా తిరిగి పొందడం అసాధ్యమేమీకాదు. ఏది ఏమైనా డాక్టర్లు గౌరవనీయులు, త్యాగధనులు, ప్రేమమూర్తులు. వ్యాపార దృక్పధాన్ని కాసేపు పక్కనబెట్టి, వారుతమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగంచేసి ప్రజలకు సేవ చేస్తున్నందుకు మనమంతా వారిని మనసారా అభినందిద్దాం. వారి సేవలను స్మరించుకుందాం. 

  - యండి. ఉస్మాన్ ఖాన్

    సీనియర్ జర్నలిస్టు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333