సమ సమాజాన్ని శ్వా సించిన శ్రీశ్రీ నీ రచయితలు ఆదర్శంగా తీసుకోవాలి
తమ రచనల ద్వారా సమకాలిన రాజకీయాలను శాసించగలిగినప్పుడే
శ్రీశ్రీకి ఘనమైన నివాళి అర్పించినట్లు.
20వ శతాబ్ది నేలిన వైతాళికుడు శ్రీశ్రీకి సమాజం రుణపడి ఉంది.
-- వడ్డేపల్లి మల్లేశం
సాహిత్యం ఎప్పుడు కూడా సమకాలీన సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించాలి . ప్రజల పక్షాన రచయితలు నిలబడే క్రమంలో ఆటుపోట్లు ఎన్ని ఎదురైనా, ఆటంకాలు పరిణమించిన, ప్రతిఘటనలు ఎదురైనా తను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయవలసి ఉంటుంది. తన సిద్ధాంతం బలమైనదైనప్పుడు, ప్రజల కోణంలో ఆలోచించినప్పుడు, సమ సమాజాన్ని శాసించినప్పుడు, సమతా వాదాన్ని కోరుకున్నప్పుడు ఏ రచయిత అయిన ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. ఆయా కాలాలలో రాజ్యాలు పాలకులు ప్రజాస్వామికవాదులు రచయితలు మేధావుల పైన నిర్బంధం అణచివేత కొనసాగిస్తూనే ఉన్నాయి అయినప్పటికీ అంతే స్థాయిలో బుద్ధి జీవులు మేధావులు ప్రభుత్వాల మెడలు వంచిన సందర్భాలను మనం గమనించాలి.
ఆ స్ఫూర్తితో చైతన్యంతో రచయితలుగా ముందుకెళ్లాలి ఆ క్రమంలో శ్రీశ్రీ రచన ధోరణిని, సామ్యవాద భావజాలాన్ని పునికి పుచ్చుకొని ప్రజల పక్షాన రాయాల్సిన అవసరం కర్తవ్యం సామాజిక బాధ్యత మనందరి పైన ఉంది. అదే సందర్భంలో రచయితలు సామాజికవేత్తలు అందించినటువంటి సిద్ధాంత ప్రాతిపదికను, భావజాలాన్ని, చైతన్యానికి పౌర సమాజం అంతే స్థాయిలో ప్రతిస్పందించినప్పుడు మాత్రమే పాలకులు తలవంచి ప్రజలకు సేవకులుగా మారుతారు. లేకుంటే అంబేద్కర్ చెప్పినట్లుగా" ప్రజలు చైతన్యవంతులు కాకపోతే ఓటర్ల పైన పాలకులే స్వారీ చేస్తారు" అని హెచ్చరించినది నిజమవుతుంది.
ఈ క్రమంలోనే ప్రజలు ప్రజాస్వామ్యవాదులు రచయితలు బుద్ధి జీవులు ఏకం కావలసిన అవసరం ఉంది. తద్వారా కరుడుగట్టిన ప్రజా ద్రోహులుగా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి పాలకులను ఏకాకులను చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ చారిత్రాత్మక పాత్రను 20వ శతాబ్దంలో పోషించి, సమకాలీన సామాజిక రాజకీయాలను శాసించి, వైతాళికునీ:గా మిగిలిన మన కాలపు మహా కవి శ్రీశ్రీ ఈ సమాజానికి ఎంతటి ఉత్కృష్టమైన సేవ చేసినాడో మనందరికీ తెలిసే ఉంటుంది. వారి సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వారి సామాజిక రాజకీయ పరిస్థితులను భావజాలాన్ని మననం చేసుకోవడంతో మన పరిపక్వతను మరింత పెంచుకుంటే రచయితలు మరింతగా రాణిస్తారు. సమాజ మార్పుకు దోహదపడతారు తద్వారా మనం ఆయన జయంతి వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళి అర్పించడానికి అవకాశం ఉంటుంది. కర్తవ్యాన్ని విస్మరించి, పాలకులకు తొత్తులుగా వ్యవహరించి, ప్రజల పక్షాన నిలబడకుండా, మొక్కుబడి సాహిత్యాన్ని సృష్టించే ఏ రచయితలు కళాకారులైన శ్రీశ్రీ లాంటి సామాజిక చరిత్రకారులకు ద్రోహం చేసినట్లే.
కొన్ని అంశాలను పరిశీలిస్తే:-
బాల్యంలోనే తండ్రి సహవాసంతో అక్షరాజ్ఞానం సాహిత్య పరిచయం ఏర్పడి పద్యాలు రాయడంలో తన ప్రతిభను కనపరిచి రచనల పట్ల ఆసక్తిని పెంచుకున్నప్పటికీ ఆ తర్వాత క్రమంలో మను చరిత్ర, మహాభారతము , అముక్త మాల్యద వంటి గ్రంథాలను అధ్యయనం చేసి మరింత అనుభవాన్ని గడించి ఆ తర్వాత క్రమంలో చందోబద్ధమైనటువంటి సాహిత్యాన్ని పక్కకు తోసి ప్రజా రాజకీయాలను ప్రతిబింబించే ప్రజా సాహిత్యాన్ని సృష్టించడంలో ముందు వరుసలో నిలబడ్డాడు కనుకనే శ్రీ శ్రీ మహాకవి అయినాడు. అనాధలు, అన్నార్తులు, శరణార్త్తులు, ఆకలి కేకలతో అలమటించేవాళ్లు, పేదలు, అట్టడుగు వర్గాలు, దోపిడీ పీడన వంచనకు గురవుతున్నటువంటి ప్రపంచాన్ని తన ఇతివృత్తంగా తీసుకొని సమ సమాజాన్ని శాసించి ఆశించి సామ్యవాద స్థాపన తన సాహిత్య లక్ష్యమని సవాలు విసిరిన కవిగా శ్రీశ్రీని మనం చూడవచ్చు. "నిజానికి కవి అనేవాడు కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే " అనే నిర్వచనాన్ని ఇచ్చింది కూడా శ్రీశ్రీ కావడం మనం గమనించదగిన విషయం. కష్టజీవులు యొక్క చెమటకు వెలగట్టగలిగినటువంటి వారు లేరని, రిక్షా కార్మికుడు చేతివృత్తుల వాళ్ళు కార్మికులు కూలీలు రైతులను పేద వర్గాలను తన కవిత్వంలో స్పృశించి, వారి పట్ల తన కృతజ్ఞతను ప్రకటించుకున్నాడు.
పెట్టుబడి విధానాన్ని ప్రశ్నించే సందర్భంలో సామ్రాజ్యవాదాన్ని విమర్శిస్తూ దానిని ఎదురొడ్డి నిలిచిన సామాన్యుడిని ఆకాశానికి ఎత్తాడు అదే క్రమంలో పల్లకి ఎక్కిన ప్రభువు కాదు ఆ పల్లకిని మోసిన బోయలు ఎవరు అనేది ప్రధానమని తన కార్మిక దృక్పథాన్ని చాటుకోవడంతో పాటు పెత్తందారీ విధానాన్ని విమర్శించాడు తన సాహిత్యంలో. షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ ప్రపంచంలోనే చారిత్రాత్మక కట్టడం అని ప్రపంచమంతా కొనియాడుతుంటే ఆ రూపురేఖలు సంతరించుకోవడానికి కారకులైనటువంటి "తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లు ఎత్తిన కూలీలు ఎవరు?" అని ప్రశ్నించి కూలీలకు బాసటగా నిలబడినాడు శ్రీశ్రీ . బలవంతుల పన్నాగాలు, ధనవంతుల దౌర్జన్యాలు, ఇంకానా ఇకపై సాగవు అంటూ హెచ్చరిస్తూనే హీనులను దీనులను ఓదార్చి నేనున్నా మీకంటూ భరోసా ఇచ్చినటువంటి బ్రతుకు చూపిన బాటసారి . ఇంతేలే పేదల బతుకులు అంటూ కన్నీరు కార్చుతూనే పాతబడిన భావాలను లోతుగా పాతర వేయగా, దౌర్జన్యాలను దోపిడీని ప్రశ్నించగా సమస్త లోకం మహిళలతో సహా కదిలి రావాలని పిలిపివ్వడం ఆయనకే చెల్లింది.
"వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం" అని తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా ప్రకటించి ఆధిపత్యం చెలాయించి అహంకారాన్ని ప్రదర్శించే పెట్టుబడిదారులు రాజకీయ నాయకులు నేరస్తులకు హెచ్చరిక చేయడం పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుందని చట్టబద్ధం చేసిన తీరు ఇవ్వాళ మన బోటి వాళ్లకు నేరస్తులను దోపిడీదారులను ప్రశ్నించడానికి పెద్ద అవకాశం ఇచ్చినట్లయినది . యువతను పోరాటానికి కదంతొక్కాలని, అవినీతి అకృత్యాల పైన ప్రశ్నించాలని స్వాగతించిన తీరు అదే సందర్భంలో కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అంటూ కొంతమంది వృద్ధులు ఆచరణలో యువకులంటూ యువతను రెచ్చగొట్టి కార్యోన్ముఖులను చేసిన తీరు చరిత్రాత్మకం. ఆ మహాకవి రాయనిది , పాడనిది, ఆశించనిది, శ్వాసించనిది, స్పృశించని అంశం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన 20వ శతాబ్దపు వైతాళికుడు. ప్రపంచపు బాధనంతా తన బాధగా చెప్పుకున్న రచయితగా నవయుగ వైతాళికుడు యువకర్త దార్శనికుడు అని పేరు తెచ్చుకున్నాడు అంటే ఎంతో కృషి ఉంటేనే కదా సాధ్యమయ్యేది.
సినిమా రంగంలో ప్రవేశించిన కొంతకాలం అనేక జీవిత లోతుపాతులను సామాజిక రాజకీయ ఉద్యమాలకు సంబంధించి రాసిన అనేక గేయాలు ఇప్పటికీ ప్రజలను ఆలోచింప చేస్తూనే ఉన్నవి. ఆయన నుండి స్ఫూర్తి పొందడం, సమాజాన్ని పరిశీలించి అధ్యయనం చేసి స్పృశించగల లక్షణాన్ని నింపుకోవడం ద్వారా ఆయనకు ఈ సమాజం నిండు మనసుతో నివాళి అర్పించవలసి ఉన్నది . సామాజిక సమానతలు, అంతరాలు, వివక్షత లేనటువంటి సమ సమాజాన్ని స్థాపించే క్రమంలో సాగుతున్న ఉద్యమాలు, కొనసాగుతున్న ప్రతిఘటనలు, ప్రజా పోరాటాలకు వారి పిలుపు ఎప్పటికీ బాసట గా ఉంటుందని ఉండాలని ఆశిద్దాం. ఆ పిలుపులో శ్వాసలో మనం ధ్యాస నుంచి కర్తవ్యాన్ని సామాజిక బాధ్యతను చిత్తశుద్ధిగా నిర్వర్తించినప్పుడు ఒక రచయిత మహాకవి ప్రపంచాన్ని మార్చగలడు అనే దృష్టాంతం తెలుగు నేలపై చిరస్థాయిగా నిలబడుతుంది .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)