రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి సిఐ
తిరుమలగిరి 14 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోవడమే ఎక్కువ ప్రమాదాలకు ప్రధాన కారణమని నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం తిరుమలగిరి పోలీస్ వారి ఆధ్వర్యంలో శుభమస్తు ఫంక్షన్ హాల్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ వినియోగించటం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. అధిక వేగంతో వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకమని హెచ్చరించారు.ప్రతి వాహనదారుడు బాధ్యతతో వ్యవహరించినప్పుడే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యం కూడా ఎలా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందో ఉదాహరణలతో వివరించారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎదురయ్యే వైద్య ఖర్చులు, శారీరక ఇబ్బందులు, కుటుంబాలపై పడే మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. సురక్షిత డ్రైవింగ్ పద్ధతులు, ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలు, అత్యవసర సేవలను ఎలా వినియోగించుకోవాలో కూడా వివరించారు. ఈ సమావేశంలో ఆటో డ్రైవర్లు, రోడ్డు ప్రమాద బాధితులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని, రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకట్ రెడ్డి సైదులు సైదులు అంతయ్య వాహనదారులు ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు