వైద్యరంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలి
వైద్య సౌకర్యాలకు ఎంత ఖర్చు చేస్తే అంత ప్రజల కొనుగోలు శక్తిని పెంచినట్లు లెక్క .
ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం కంటే ప్రభుత్వానికి వేరే లక్ష్యం ఉందా?
ఉచిత, నాణ్యమైన వైద్యం మన జన్మ హక్కు.
__ వడ్డేపల్లి మల్లేశం
భారతదేశ వ్యాప్తంగా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి పాలకులకు మనసొప్పని కారణంగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా లేరు కానీ పెట్టుబడిదారుల పన్నులను తగ్గించడానికి ,అప్పులను మాఫీ చేయడానికి , రాయితీలను ప్రకటించడానికి మాత్రం పాలకులు వెనుకాడడం లేదు . ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ఒక ఎత్తు అయితే ముఖ్యంగా విద్యా వైద్యం వంటి సామాజిక వ్యక్తిగత అవకాశాలు అవసరాలను ప్రభుత్వ రంగంలో నాణ్యమైన స్థితిలో అందించడం ప్రధానమైనటువంటి అంశం . విద్యా వైద్యానికి పేద ప్రజల ఆదాయంలో సుమారు 70 శాతం కోల్పోతున్నట్లు తద్వారా కొనుగోలు శక్తి తగ్గి పేదరికం మరింత పెరిగి అప్పుల ఊబిలో కూరుకు పోతున్నట్లు గణాంకాలు తెలియ చేస్తుంటే పాలకులకు పేద వర్గాల పైన శ్రద్ధ లేదంటే సిగ్గుచేటు కాదా ? విద్యా వైద్య రంగాలకు సుమారు 10% చొ " బడ్జెట్ లో కేటాయించడం వల్ల కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వహించే అవకాశం ఉంటుంది కానీ ఒకటి రెండు శాతం కూడా దాటడం లేదంటే ఇక విద్యకు వైద్యానికి కేంద్రం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు . అదే పద్ధతిలో రాష్ట్రాలు కూడా విద్యకు ఢిల్లీ కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు 25 ,24% కేటాయిస్తుంటే అనేక రాష్ట్రాలు కూడా 10 నుండి ఐదు శాతం వరకు మాత్రమే ఇస్తున్నట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి అది కొఠారి కమిషన్ సూచనకు విరుద్ధమే కాదు పాలకుల బాధ్యతారాహిత్యం కూడా.
ఉచిత నాణ్యమైన వైద్యం మనందరి జన్మహక్కు:-
వైద్య రంగాన్ని పూర్తిగా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోగలిగే సత్తా ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర పాలకులకు ఉందా? ఇది సామాన్య ప్రజలు వేస్తున్న మొదటి ప్రశ్న .పెట్టుబడిదారులు సంపన్న వర్గాలకు భూమి, సౌకర్యాలు, భవన నిర్మాణానికి రాయితీలు, పర్మిషన్ వంటి సౌకర్యాలను కల్పించడం ద్వారా ప్రైవేట్ రంగంలో ఆసుపత్రుల నిర్మాణానికి కృషి చేస్తూ ప్రైవేటు ఆసుపత్రులను ప్రారంభించడానికి చూపుతున్న శ్రద్ధ ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించడంలో చూపకపోవడం విడ్డూరం మాత్రమే కాదు ప్రజాస్వామ్యానికి అవమానకరం కూడా. రాజ్యాంగబద్ధంగా ఉచితమైన నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వరంగంలో అందించడం పాలకుల బాధ్యత అయితే దానిని అనుభవించడం ప్రజలందరి యొక్క జన్మహక్కు అని పాలకులు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.
సంపన్న వర్గాలకు ఊడిగం చేసే ప్రభుత్వాలు ఈ దేశంలో అవసరం లేదు పేద ప్రజలకు సేవ చేసే సేవకులుగా మాత్రమే పాలకులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది .అలాంటి పాలకులని మనం ఎన్నుకోవాల్సిన అవసరం మనందరి మీద ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా వైద్యరంగం మొత్తాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా సిబ్బందిని గణనీయంగా పెంచడంతోపాటు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మించడం అన్ని రకాల నిపుణులను నియామకం చేయడంతో పాటు ఫిజియోథెరపీ ఆయుర్వేద రంగంలో ఆసుపత్రిని కూడా నిర్మించడం చాలా అవసరం .ఎట్లయితే వెల్నెస్ సెంటర్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు పోలీసులు జర్నలిస్టులకు సమున్నతమైన వైద్య సౌకర్యాలు అందిస్తున్నారో అదే మాదిరిగా ప్రతి ప్రాథమిక కేంద్రం లోపల కూడా పరీక్షల నిర్వహణతో పాటు అన్ని రకాల సేవలను ఉచితంగా అందించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించాలి వారి యొక్క కొనుగోలు శక్తిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అది పాలకుల యొక్క తపన ఆరాటం సామాజిక స్పృహ సామాజిక బాధ్యత పైన ఆధారపడి ఉంటుంది . స్పెషలిస్ట్ డాక్టర్ల నియమించడంతోపాటు నాణ్యమైన మందులను ప్రతి ఆసుపత్రికి సరఫరా చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యతగా గుర్తించాలి, అంతేకాదు ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు పారిశుభ్రతను కట్టుదిట్టం చేయడం, సిబ్బందిని నియమించడం అవసరం. ప్రతి నియోజకవర్గంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్కానింగ్, ఎక్స్రే ,ఈసీజీ, ఎమ్మారై అన్ని రకాల పరీక్షలను ఉచితంగా అవసరమైన పేషెంట్లకు అందించడానికి వైద్య బృందం ఆసుపత్రి యాజమాన్య వర్గాలు సిద్ధంగా ఉండాలి. వైద్య సిబ్బంది కి పూర్తిస్థాయిలో వేతనాలను ఇవ్వాలి కానీ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలిక వేతనాలను ఇవ్వడం సిగ్గుచేటు. అవసరమైతే రాత్రి పగలు కూడా కష్టపడి పనిచేయవలసినటువంటి వైద్య సిబ్బందికి హెచ్చు వేతనాలను సమకూర్చడం ద్వారా పూర్తిస్థాయిలో వైద్య సేవలను ప్రభుత్వం తీసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది . అనేక రాయితీలు ఉచితాలు వాగ్దానాలు హామీలను ప్రకటించి సొమ్ము చేసుకోవడం కంటే విద్యను వైద్యాన్ని పూర్తిస్థాయిలో పేద వర్గాలకు లేదా కోరిన వర్గాలకు ఉచితంగా నాణ్యమైన స్థాయిలో అందించడం ద్వారా వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ముఖ్యంగా పేద వర్గాలు పాలకులను గుర్తించడం వారి సేవలను జ్ఞప్తికి తెచ్చుకోవడం ప్రభుత్వ పనితీరును ప్రశంసించడం ద్వారా ప్రజా జీవితంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం ద్వారా ఎంత ఖర్చైనా బడ్జెట్లో కేటాయించడం ద్వారా ప్రజల యొక్క ఆదరాభిమానాలను చూరగొనడమే తమ బాధ్యతగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది . ఎందుకంటే కొన్ని పరికరాలు యంత్రాలు సామాగ్రి సౌకర్యాలు కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకుని ఉంటాయి కనుక వ్యక్తిగతంగా సమకూర్చు కోలేరు, ప్రైవేట్ రంగంలో పెట్టుబడి పెట్టలేరు, కనుక ప్రభుత్వ వైద్యశాలలో ఇలాంటి సౌకర్యాలను కల్పించడం వల్ల పేద ప్రజలకు మరియు ముఖ్యంగా ప్రయోజనం చేకూరుతుంది తద్వారా మాత్రమే నిజమైనటువంటి పాలన ప్రజలకు అందినట్లు లెక్క కానీ సంపన్న వర్గాలకు మాత్రమే ఊడిగం చేసే పనులను పాలకులు విరమించుకోవడం చాలా అవసరం.
ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలంటే వారి ఆదాయాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను కల్పించడం, ఉద్యోగ సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రభుత్వాలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలి. తమ బడ్జెట్ లోపల సుమారు 10% గనుక కేటాయించినట్లయితే ఊహించని స్థాయిలో వైద్య సౌకర్యాలు మెరుగుపడి ప్రైవేటు రంగం ప్రభుత్వం రంగంతో పోటీ పడడమే విధి లేని పరిస్థితిలో ప్రభుత్వానికి స్వాధీనం చేసే అవకాశం కూడా ఉంటుంది తద్వారా ఒకే యాజమాన్యంలో వైద్యం కొనసాగినట్లయితే ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడానికి మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించడానికి అరుదైనటువంటి ఆపరేషన్ శస్త్ర చికిత్సలను చేయడానికి అవకాశం ఉంటుంది .అప్పుడప్పుడు పత్రికలలో కోటి రూపాయలు కావాలి, 10 లక్షల రూపాయలు కావాలి ,లక్షల రూపాయలు అయితేనే అరుదైన చికిత్స ,దయచేసి ఆదాయం లేదు కనుక పేద వర్గాలు గనుక వారికి మీరు సహాయం చేయండి, దానం చేయండి, గూగుల్ పే కు పంపండి అని ప్రకటన చేస్తారు. ప్రభుత్వ రంగంలోనే వైద్య సౌకర్యాలు మెరుగ్గా ఉన్నప్పుడు ఈ రకంగా పేద ప్రజలు బిచ్చమెత్తుకోవలసిన అవసరం ఉంటుందా? ఆ సోయి సామాజిక బాధ్యత ప్రభుత్వాలకు గనుక ఉన్నట్లయితే ఎంతటి ఖర్చుతో కూడుకున్న చికిత్స అయినా ప్రభుత్వము భరించడం ద్వారా తన సామాజికతను చిత్తశుద్ధిని నైతికతను చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెల్నెస్ సెంటర్లో ఓ మోస్తరు నాణ్యత కలిగిన వైద్య సౌకర్యాలు మందులు ఉచితంగా అందచేస్తున్నారు అదే మాదిరిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్య ఉప కేంద్రాలు లేదా బస్తీ దావకానల్లో కూడా విలువైన అరుదైన నాణ్యమైన మందులను ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి .అదే మాదిరిగా పట్టణాలలో బస్తీ దవాఖానలు చాలా దూరంగా ఉండటం కారణంగా ప్రభుత్వ దవాఖానలు అందుబాటులో లేకపోవడంతో పేద వర్గాల వాళ్ళు విధిలేని పరిస్థితిలో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి వైద్య పరీక్షలు చేసుకోవడం చికిత్స పొందడం జరుగుతున్నది .దీనిని నివారించాలంటే పట్టణాలలో అడుగడుగునా బస్తీ దవాఖాలను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షలు చికిత్స వైద్య సిబ్బందిని నియమించడం ద్వారా పేద ప్రజల యొక్క అవసరాలను కష్టాన్ని ఇబ్బందులను అధిగమించడానికి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బాధ్యతను విస్మరించి వాగ్దానాలు హామీలు ఇవ్వడం ద్వారా పెద్ద రికాన్నీ చాటుకోవడానికి ప్రయత్నం చేస్తే లక్షలు రూపాయలు ఖర్చుపెట్టి పెద్ద మొత్తంలో ప్రకటనలు గుప్పించి పత్రికల లో ప్రచారానికి పాల్పడితే ప్రయోజనం లేదు ప్రచారం ముఖ్యం కాదు ప్రజల ప్రయోజనమే పాలకులకు ముఖ్యం ఆ వైపుగా ముఖ్యంగా వైద్య రంగాన్ని విప్లవాత్మకంగా తీర్చిదిద్దడానికి కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది .ఆ విషయంలో ప్రభుత్వము తప్పటడుగు వేస్తే నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రజలే పాలకుల పైన తిరుగుబాటు చేస్తారు జాగ్రత్త సుమా !
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయి తల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)