ఫీజు కట్టలేక కష్టమైతాంది పోలగాండ్ల చదువు బందుచెత్త.* తల్లి ఆవేదనలో ఎంతో అర్థముంది కాదా?

Mar 8, 2025 - 11:31
 0  1

ఫీజు కట్టలేక కష్టమైతాంది పోలగాండ్ల చదువు బందుచెత్త.* తల్లి ఆవేదనలో ఎంతో అర్థముంది కాదా?సర్కారు బడికి పంపబుద్ది కాక ప్రైవేటు బడికి పైసలు లేక అప్పుల మీద అప్పులైనందుకు బాధపడకపోతే ఏం చేస్తరు?* "ఉచితంగా నాణ్యమైన చదువు చెప్పిస్తాం " అన్న భరోసా ఇచ్చిన పార్టీ దేశంలో లేదు. సిగ్గు సిగ్గు .!

**************************************

---వడ్డేపల్లి మల్లేశం 9014206412 

---29...11...2024*****************-***-

సంవత్సరాల తరబడిగా భూమి కోసం పోరాటం చేసి ఎంతోమంది అసువులు బాసినా, పాలకులు తప్పుదారి పట్టినప్పుడు రాజ్యాంగపలాలకోసం ఉద్యమాలు లేవదీసిన వారు ప్రభుత్వ నిర్బంధం అణచివేతతో బుద్ధి జీవులు కూడా నేలకొరిగినారు. అయినా ప్రభుత్వాలు మాత్రం తమ పంతాన్ని వదిలిపెట్టలేదు. పేదలకు భూములు పంచలేదు, కనీసంఅర గుంట ఇళ్ల స్థలాల కోసం కూడా ఎంతోమంది రక్త తర్పణ చేయవలసి వచ్చింది.

దేశ సంపద ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయవలసిన బదులు ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో 40 శాతం బందీ అయినప్పటికీ కూడా రాజ్యాంగ ఆమోదం లేకపోయినా పాలకుల మద్దతు కారణంగా అది అమలవుతూనే ఉన్నది. పేదలు దశాబ్దాలుగా మరింత పేదరికంలోకి కూరుకుపోతూనే ఉన్నారు.90శాతమున్నసామాన్య ప్రజలకోసం బడ్జెట్లో 10%కూడా కేటాయించిన దాఖలా లేదు.

జీవించే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం ఆమోదించబడిన భావ ప్రకటన స్వేచ్ఛ చట్టబద్ధమే అయినా ప్రశ్నించిన పాపానికి ప్రభుత్వాలు గడువు బెట్టి తూటాలకు బలి చేస్తున్నది తెలువదా?

       సగటు ప్రజలు తమ కనీస అవసరాలు తీరాలని విద్యా వైద్యం ఉచితంగా నాణ్యమైన స్థాయిలో అందాలని కోరుకోవడం అత్యాశ కాదు కదా! కానీ ఇవాళ విద్యా రెండు రంగాలలో కొనసాగుతూ ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగాన్ని వెక్కిరిస్తుంటే దానికి ప్రభుత్వాలు మద్దతు పలికి ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలను కూడా అనుమతించిన దౌర్భాగ్యులు ఉన్న దేశం మనది. నిరంతరం ఫీజులను పెంచుతూ పేదలను జలగల పీల్చుతూ ప్రభుత్వ ప్రమేయం లేకుండా విద్య ఈ దేశంలో కొనసాగడం సిగ్గుచేటు కాదా ?ఇంకా ఈ పరిస్థితులలో ఫీజులను తగ్గించడానికి ప్రభుత్వాలు కమిటీలను వేస్తే ఆ కమిటీలు కూడా ఏటా కొంత పెంచుకోవచ్చు అని సిఫారస్ చేయడం అంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం ఎంత ఉన్నదో అర్థమవుతున్నది. ప్రజలను కంటికి రెప్పవలె కాపాడవలసిన పాలకులు వాళ్ల ఆలనా పాలనా చూడకుండా స్వప్రయోజనాలకు పాల్పడుతూ విద్య వైద్యాన్ని గాలికి వదిలితే ఈ దేశంలో ఎంత దుర్గతి ఉన్నది అర్థం చేసుకుంటే కన్నీరు కాలువలై పారాల్సిందే.

        ఈ పరిస్థితులలో సగటు తల్లిదండ్రులు "పొలగాండ్ల ఫీజులు కట్టడానికి కష్టమైతాంది పని లేక పైసలు లేక ఎల్లుతలేవు. చదువు బంధు చేస్తాo " అని నిర్వేదంతో మాట్లాడుతుంటే గుండె చెరువు కాకమరేమవుతుంది.

తల్లి,దండ్రి ఆవేదనలో ఎంతో అర్థముంది, నిట్టూర్పుకు ఎంతో పెద్ద చరిత్ర ఉన్నది. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా నాణ్యమైన ఉచిత విద్య వైద్యం అందిస్తామని కనీసం మాట వరసకు కూడా చెప్పలేదు. కానీ రాజ్యాంగంలో మాత్రం స్వర్ణాక్షరాలతో పొందుపరచబడినది. " పాలకులు అవకాశవాదులు ఈ రెండింటిని ప్రజలకు ఉచితంగా సమకూర్చరు" అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అనేక సందర్భాలలో చేసిన హెచ్చరిక రాజకీయ అవినీతికి అద్దం పడుతున్నది. ప్రభుత్వాలకు సామాన్యులు ఒక సవాలు విసురుతున్నారు " మా పిల్లలకు నాణ్యమైన విద్య కావాలి, మా అందరికీ ఉచిత వైద్యం కావాలి, ఈ రెండు అందించలేక పోతే ప్రభుత్వం నడిపే అధికారం మీ కు లేదు గద్దె దిగు" అని సవాల్ చేస్తున్న వేళ ఈ సవాలను స్వీకరించవలసిన ది పోయి చట్టసభల్లోనూ బయట ఉద్యమాలలో ప్రజా పోరాటాలలో టార్గెట్ గా తీసుకొని ఉద్యమకారులను మేధావులను అంతం చేస్తున్న ఈ ప్రభుత్వాలకు మాట్లాడే అర్హత ఎక్కడిది? "సత్తా ఉంటే, బాధ్యత, ధైర్యం ఉంటే ఇప్పటికైనా విద్యను ప్రభుత్వ రంగంలో కొనసాగించు, ప్రైవేట్ రంగంలో విద్యా వైద్యాన్ని నిర్మూలించు, .ఒకే రకమైన విద్య వైద్యం దేశ ప్రజలందరికీ ఉన్ననాడు అందరూ సమానమే అనే భావన వస్తుంది" అని సామాన్యులు అభిప్రాయపడుతుంటే ఆమాత్రం కూడా సోయి లేని పాలకులు 58 సంవత్సరాల కింద కొఠారి చేసిన కామన్ స్కూల్ ఉచిత విద్యను అమలు చేయలేకపోవడం సిగ్గుచేటు కాదా! "దాని ప్రభావం పేద వర్గాల పైన పడుతుంది డబ్బు ఉన్నోళ్లు కార్లలో ప్రైవేట్ స్కూళ్లకు పోతూ లక్షల రూపాయల ఫీజులు కడుతూ అదే పెద్దరికమని గొప్పగా చెప్పుకుంటూ ఉంటే లేనివాళ్లు పల్లెటూర్లలోనూ పట్టణాలలోనూ అల్పాదాయ వర్గాలు అప్పులు చేసి ప్రభుత్వ బడుల మీద నమ్మకం లేక లేదా తోటి వాళ్ళ లాగా మా పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో ఎందుకు చదువుకోవద్దు అనేటువంటి ఆలోచనతో ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తే అప్పు కుప్పలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్లకు అంతే లేదు. ప్రభుత్వాలకు కేవలం రైతులు మాత్రమే కనిపిస్తున్నారు కానీ గ్రామ పట్టణ ప్రాంతాలలోని పేదలు విద్యకు, వైద్యానికి ఖర్చులు పెట్టలేక అరిగోసపడుతుంటే ఈ దేశాన్ని పాలించే నైతిక హక్కు మీకు ఎక్కడిది?"అని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు శాపనార్థాలు పెడుతున్నారు. ఢిల్లీ కేరళ రాష్ట్రాలలో ప్రభుత్వ రంగంలో విద్య పైన 25, 24 శాతం బడ్జెట్ ని కేటాయించి కొంత ప్రత్యేక శ్రద్ధ కనబరిచినప్పటికీ అక్కడ కూడా ప్రైవేట్ వ్యవస్థ కొనసాగుతూనే ఉన్నది ఇక ఆమాత్రం కాదు కదా నామమాత్రపు బడ్జెట్ తో కొనసాగుతున్నటువంటి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలల పట్ల సవతి తల్లి ప్రేమ చూపితే అవి ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన పేద పిల్లల బడులుగానే మిగిలిపోయినవి. డబ్బున్నోళ్ళు సంపన్న వర్గాలు ఆధిపత్య కులాలు తమ పిల్లలను ప్రైవేటుకు పంపుతూ ఉంటే ఈ వివక్షత ఎంత కాలం కొనసాగుతుంది? వివక్షత కొనసాగినటువంటి ఈ వ్యవస్థను పాలకులు ఏ రకంగా సమర్థించుకుంటారు? అర్థం కావడం లేదు .అందుకే ఈనాడు సంపద,భూములు, ఇళ్ల స్థలాలతో పాటు ఉచిత విద్య వైద్యం కోసం కూడా గ్రామస్థాయి నుండి పోరాటాన్ని ముమ్మరం చేయాలి. ప్రైవేటు విద్యా వ్యవస్థను నిర్మూలించాలి, ప్రైవేట్ రంగంలో వైద్యశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు పాలకులను విడిచిపెట్టకుండా వెంటాడాలి, ఆ రకమైన పోరాటమే సకల సమస్యలకు పరిష్కారం అవుతుంది. ఎకరాలకొద్దీ మిగులు భూములు గుర్తించలేదు, పంచలేదు. కనీస సౌకర్యాలతో కూడిన మానవాభివృద్ధి ప్రజలందరికీ సాకారం కాలేదు. కనీసమైన విద్య వైద్యాన్ని కోరితే కూడా పట్టించుకోని పాలకులకు ఈ దేశాన్ని పాలించే నైతిక హక్కు లేదు. అని ఎలిగెత్తి చాటకుండా భయపడితే మరింత భయపెడుతూనే ఉంటారు. సగటు తల్లిదండ్రుల శాపనార్థాలు, ఆవేదన, ఆందోళన, అప్పులు, ఆత్మహత్యలు రగిలి ఆ మంటల సెగ ప్రభుత్వాలకి తాకి నప్పుడు మాత్రమే ఈ దేశంలో ఉచిత విద్య వైద్యం చట్టబద్ధమవుతుందేమో!

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అ రసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333