ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తేనే పేదరిక నిర్మూలన సాధ్యం
భారత ఆహార సంస్థను కాపాడుకోవడం పేద వర్గాలకే ప్రభుత్వ ఫలాలను
పకడ్బందీగా అమలు చేయడం కొంత పరిష్కారం.
కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా అమలు చేస్తేనే అసమానతలు, అంతరాలను
నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది .
-- వడ్డేపల్లి మల్లేశం
అసమానతలు అంతరాలు వివక్షత కారణంగా మిగతా ప్రజలతో పోటీ పడలేక నాణ్యమైన జీవితం విద్య వైద్యం సామాజిక న్యాయాన్ని పొందలేక ఆకలితో అలమటిస్తూ పేదరికంలో కొట్టుమిట్టాడుతూ అనారోగ్యం బారిన పడుతున్నటువంటి కోట్లాది పీడిత ప్రజానీకానికి ప్రణాళికాబద్ధంగా తగు న్యాయం చేయడానికి ఉద్దేశించినదే ప్రజా పంపిణీ వ్యవస్థ. అనేక పథకాల ద్వారా ఈ వర్గాలను ఆర్థికంగా సాంఘికంగా అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఒకవైపు కృషి చేస్తూనే ఆహార ధాన్యాలను, నాణ్యమైనటువంటి తిను బండారాలను, పోషకాహారాన్ని పేద వర్గాలకు అందించవలసిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ప్రధానంగా ఉన్నది.
కరోనా సమయములో రోగ నిరోధక శక్తి లోపించిన కారణంగానే ఈ వ్యాధి సోకుతున్నదని అనేక నివేదికలు వెల్లడించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం టీకాలు రేషన్ బియ్యం తోనే సరిపెట్టి పిడికెడు మెతుకులు రెండు పూటలా తినలేనటువంటి వారి కోసం ఏ రకమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు అనేది పెద్ద విమర్శ. అంతే కాదు కరోనా సమయములో పేదలు చిరు వ్యాపారులు కూలీలు కార్మికులు కర్షకుల యొక్క ఆదాయం గణనీయంగా తగ్గిపోతే పనులు లేక పస్తులుండి ఇబ్బందులకు గురైతే పెట్టుబడిదారుల ఆదాయం మాత్రం రెట్టింపు అయినట్లు ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తుంటే కరోనా సమయములో ఆనాడు ఉన్నటువంటి సంక్షోభాన్ని పెట్టుబడిదారి వర్గాలు అవకాశంగా వాడుకున్నట్లే కదా!
ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యంగా చితికిపోయినటువంటి పేద వర్గాలకు ఇప్పటికైనా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైనటువంటి తినుబండారాలు ఆహార పదార్థాలు పోషకాహారాన్ని సరఫరా చేయడానికి కేంద్రం చొరవ తీసుకుంటేనే అర్థం ఉంటుంది .కానీ మొక్కుబడిగా 81 కోట్ల మంది ప్రజానీకానికి రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నట్లు మరొక్క నాలుగు సంవత్సరాల పాటు కొనసాగిస్తామని కేంద్రం ప్రకటించినంత మాత్రాన ఆ వర్గాలకు పిడికెడు మెతుకులు తప్ప నాణ్యమైనటువంటి విద్యా వైద్యం కానీ కొనుగోలు శక్తి గాని అందే ఆస్కారం లేదు కదా!
మొదట్లో దారిద్రలేక దిగు వనున్న ప్రజలకు ఆదుకునేందుకు చౌక ధరలకు ఆహార ఉత్పత్తులు అందించే ప్రజా పంపిణీ వ్యవస్థ ఏర్పడితే ప్రస్తుతము కుటుంబ సభ్యులకి ఐదు కిలోల చొప్పున కేంద్రం బియ్యాన్ని సరఫరా చేస్తూ ఇతర అన్ని రకాల ఉత్పత్తులను ఆపివేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ దేశంలో 30 నుండి 40 శాతం పేదరికంలో ఉంటే దారిద్రరే క దిగునని జీవిస్తున్న వాళ్లు 15% గా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి . ఇక వలస కార్మికులు కోట్లాదిమంది తమకు నివాసమంటూ లేకుండా పని కోసం దేశమంతా పర్యటిస్తూ ఎలాంటి ఖచ్చితమైన ఆదాయము అవకాశాలు లేకుండా దుర్భర పరిస్థితులు గడుపుతున్న విషయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాద్యత వహించవలసిన అవసరం లేదా ? 1929 లో వచ్చినటువంటి ఆర్థిక మాo ద్యం ,రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిన సందర్భంగా రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడం స్వతంత్ర భారతదేశంలో 1960లో పేద మధ్యతరగతి ప్రజల కోసం దేశవ్యాప్తంగా 50 వేల రేషన్ షాపులను ఏర్పాటు చేసినట్లు అవి 1991 నాటికి 30 లక్షల 50 వేలకు పెరిగినట్లు తెలుస్తున్నది.
పేద వర్గాలను దారిద్రలేక దిగువన ఉన్న వాళ్ళు, ఎగువన ఉన్నవాళ్లు అని రెండు వర్గాలుగా విభజించడంతోపాటు 2000 సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంత్యోదయ పథకం ద్వారా కోటి నుంచి రెండు కోట్ల కుటుంబాలకు వర్తింపజేసినట్లు ఈ ఈ పథకం కింద కుటుంబానికి 25 కిలోల బియ్యం లేదా గోధుమలను ప్రకటించడం జరిగినప్పటికీ దక్షిణ భారతదేశంలో గోధుమల ప్రస్తావన లేదు. అత్యంత సంపన్నులైన కుటుంబాలలో కూడా 20 నుండి 25% వరకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారంటే కార్డుల జారీ లోపల ఎంత అవినీతి జరిగిందో నిజమైన లబ్ధిదారుల ఎంపిక ఎంత లోపభోయి ష్టమో మనం అర్థం చేసుకోవచ్చు . ఇక మరొకవైపు 2020 నాటికి బిలో పవర్ టి లైన్ కు అర్హత ఉన్న కుటుంబాలలో కేవలం 59 శాతం మందికి మాత్రమే రేషన్ కార్డులు ఉన్నట్లు తెలుస్తుంటే ఇవి కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం గా అమలు చేస్తున్న కారణంగా గత 13 సంవత్సరాలుగా జనాభా లెక్కలు లేక పోవడంతో పాటు ఇతర కారణాల వలన సుమారు 40 శాతం మందికి రేషన్ కార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతుల నుండి దాన్య సేకరణతో పాటు అవసరమైన వర్గాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసే గురుతరమైన బాధ్యతలు కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కోతల కారణంగా ఎఫ్సీఐకి ఇస్తున్న నిధులు చాలా తగ్గిపోయినట్లు కేంద్రం ఇవ్వవలసిన బకాయిలు చెల్లించకపోవడంతో ఎఫ్సీఐ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టినట్లు తద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థకు తీవ్రమైన అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తుంది. మరొక్క వైపు కేంద్రం నిధులను కేటాయించకుండా ప్రజలు చెల్లించిన జాతీయ పొదుపు మొత్తాల నుండి 2019 -20 సంవత్సరాల మధ్యన 2,54,600 కోట్ల విలువైన రుణాలు ఈ సంస్థకు కేంద్రం చెల్లించింది అంటే ప్రజల సొమ్ము ఏ విధంగా మళ్ళించబడుతున్నదో అర్థం చేసుకోవచ్చు .
ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు :-
అర్హులైన వారికి కార్డులు జారీ చేయడంతో పాటు కేవలం బియ్యాన్ని మాత్రమే కాకుండా గోధుమలు ఇతర పప్పులు, చిరుధాన్యాలు నూనెలు వంటి వాటిని చౌక ధరలకు పేద వర్గాలకు అందించినప్పుడు మాత్రమే ప్రజాపంపిణీ వ్యవస్థకు అర్థం ఉంటుంది. కేవలం ఐదు కిలోల బియ్యంతో సరిపెట్టి దానినే పెద్దగా ప్రచారం చేసుకుంటే ప్రయోజనం లేదు . భవిష్యత్తులో పేదవర్గాలు అనారోగ్యం బారిన పడకుండా ఉండడానికి పౌష్టికాహారాన్ని ఇతర రోగ నిరోధక ఫుడ్ సప్లమెంటూ సరఫరా చేయవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది . ఇప్పటికీ విద్యకు వైద్యానికి కేంద్రం తన బడ్జెట్లో సుమారు రెండు శాతం కూడా దాటడం లేదంటే ఆ వర్గాలకు ప్రయోజనం లేనట్లే కదా! భారత ఆహార సంస్థ తన కార్యకలాపాలను స్వతంత్రంగా నిర్ణయించడానికి నిధులను పెద్ద మొత్తంలో బడ్జెట్లో కేటాయించాలి . దేశవ్యాప్తంగా ధాన్య సేకరణ బాద్య తను ఆ సంస్థకి అప్పగించాలి . ప్రత్యేక పథకాల ద్వారా బిపిఎల్ కుటుంబాలకు ఆర్థిక సామాజిక ప్రయోజనాలను అందించడంతోపాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలలో ప్రాధాన్యత కల్పించడం ద్వారా దారిద్ర రేఖ ఏ గువకు తీసుకురావాలి .
కూలీలుగా శ్రమను నమ్ముకుని బతికే కోట్లాది ప్రజానీకానికి ఈ దేశంలో ఉన్నటువంటి మిగులు భూములను సరఫరా చేసి అలాగే 40 శాతం సంపద కేవలం ఒక శాతం సంపన్న వర్గాల చేతిలో పోగుపడిన విధానాన్ని ఎండగట్టాలి .ఆ సంపదను ఇతర దేశాలలోని నల్లధనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేద కుటుంబాలకు ప్రాధాన్యత క్రమంలో అందించడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే కేవలం బియ్యం సరఫరా అనే కాదు నిధుల మళ్లింపు, ఆర్థిక సామాజిక ప్రయోజనాలను సమకూర్చడం, పోషకాహారాన్ని అందించడం, అసమానతలు అంతరాలను నిర్మూలించడానికి ఒక వేదికగా ప్రజా పంపిణీ వ్యవస్థ ఉపయోగపడగలగాలి. అర్హులైన వాళ్లందరికీ కార్డులు జారీ చేయడంతో పాటు అనర్హులను జాబితా నుండి తొలగించడం ద్వారా నిజమైనటువంటి పేదలకు కొంతవరకైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)