మధ్యపానంతో అనర్ధాలు అన్ని ఇన్ని కావు.

Mar 8, 2025 - 11:33
 0  2

మధ్యపానంతో అనర్ధాలు అన్ని ఇన్ని కావు.* ప్రభుత్వ ప్రోత్సాహం, వినియోగదారుల ఉత్సాహం ముందు ఓడిపోయి సమాజం అనారోగ్య బారిన పడుతున్నది.*ఆరోగ్యసమాజ ఆవిష్కరణ ప్రభుత్వాల బాధ్యత కాదా?ఇంత నిర్లిప్తత పాలకులకు తగదు.*

*********************************

--- వడ్డేపల్లి మల్లేశం 9014206412 

---28...11...2024*****************

సమాజంలో జరుగుతున్న అనేక అనర్థాలకు సమాజం నుండే అంతో ఇంతో మద్దతు కొనసాగుతున్న కారణంగానే ఆదర్శ సమాజం ఏర్పాటు కోసం కొందరు చేస్తున్న ప్రయత్నం నీరు గారి పోతున్నది .అదే సందర్భంలో ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా వ్యవహరించడం, కొన్ని ప్రైవేటు వర్గాల ప్రయోజనాల కోసం మౌనంగా ఉండడం వలన అనర్థాలు కోకొల్లలు జరిగిపోతున్నాయి. అత్యాచారాలు హత్యలు సమాజంలోని కొద్దిమంది చేస్తున్నవే. మద్యపానo ధూమపానం క్లబ్బులు పబ్బులు ఈవెంట్లను పరిరక్షించేది వాటిని పోషించేది కూడా ప్రజలే. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నది కూడా ప్రజల్లో భాగమైన కొద్దిమంది మాత్రమే. అంటే మనలో నుండే అనేక అనర్థాలకు అంకురార్పణ జరుగుతున్నందున మనకు మనం ప్రక్షాళన చేసుకోవడంతో పాటు చైతన్య కార్యక్రమాలు, అవగాహన వ్యూహాలతో పాటు ప్రభుత్వ కఠిన చర్యలు ముమ్మరం చేసినప్పుడు మాత్రమే ఇలాంటి అనర్థాలు సామాజిక రుగ్మతలు సద్దుమణిగిపోతాయి." మూలాలు తెలుసు, కారణాలు పరిష్కారాలు వీటి వెనుక దాగి ఉన్న శక్తులు కూడా మనకు తెలుసు, అయినా మనం సమాజంలో జరుగుతున్న అనేక సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నాం? ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం? ఆలోచిస్తే గాని పరిష్కారం దొరకదు. కొందరు సహకరించాలి, మరికొందరు అవగాహనను పెంచుకోవాలి, ఇంకొందరు చైతన్యాన్ని అందుకోవాలి, చాలామంది తమను తాము ప్రక్షాళన చేసుకుని మార్పును స్వాగతించాలి, వీటన్నింటికీ తోడు ప్రభుత్వాలు కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తించి తగిన ఏర్పాట్లు కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే పరిష్కారం దొరుకుతుంది."

    2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు మద్యపానం వల్ల ప్రభుత్వానికి 10,000 కోట్ల ఆదాయము ఏటా వస్తే 9న్నర సంవత్సరాల తర్వాత బి ఆర్ ఎస్ ప్రభుత్వం దిగిపోయిన నాడు 40 వేల కోట్లకు చేరుకున్నదంటే ప్రభుత్వాలు ఆదాయానికి ఇచ్చిన ప్రాధాన్యత అడ్డుకట్ట వేయడానికి ఇవ్వలేదని అర్థం అవుతుంది కదా! ఇంకా గమ్మత్తయిన విషయం ఏమిటంటే మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తమ ప్రభుత్వ హయాములోనే అనుభవించడానికి కాబోలు ప్రతి ఏటా డిసెంబర్ లో జరిగే మద్యం వేలం పాటలను2023లో ముందుగానే ముగించుకొని తన చతురతను కనబరిచిన విషయం మనకు తెలుసు. ఎంతసేపు మద్యం షాపులను ఎలా కొనసాగించాలి? అమ్మకాలను పెంచడం ఎలా? జనవరి ఫస్ట్ రోజు పత్రి కల్లో పెద్ద మొత్తంలో అమ్మకాలు జరిగినట్లు రాకపోతే ఎలా? అనే ధ్యాసే.... మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో మాత్రమే ప్రభుత్వాన్ని నడపడానికి ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వాలకు దానిని పూర్తిగా రద్దు చేసే దమ్ము ధైర్యం ఉంటుందా? అంతే కాదు చిత్తశుద్ధి అసలే లేక ఆరోగ్య సమాజాన్ని ఆవిష్కరించడానికి ఏనాడు ఆలోచించని కారణంగా మూడు నాలుగు రాష్ట్రాలు మినహాయిస్తే ఈనాడు దేశవ్యాప్తంగా మద్యం మత్తులో దాని బారిన పడి లక్షలాది ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే అనేక కుటుంబాలు వీధిపాలు కా వడాన్ని మనం అందరమూ గుర్తించకపోతే ఎలా ?"మద్యం మత్తులో ఆత్మహత్యలు చేసుకోవడం, మత్తులో భార్యను చంపడం, మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని తండ్రిని నరికి వేయడం, తాగిన మైకంలో ఏం మాట్లాడుతున్నామో తెలవక కుటుంబ సభ్యులను హత్య చేయడం, క్షణకాలపు మత్తులో ఆవేశంలో కుటుంబాలను బలి తీసుకోవడం, తగాదాలు వివాదాలలో చిక్కి ప్రాణాలు కోల్పోవడం, ఇతరుల ప్రాణాలను తీయడం వల్ల ఆ కుటుంబాలు కోర్టుకు ఎక్కి జైలు పాలు కావడం వంటి అనేక అనర్థాలను మనం చూస్తున్నాం. ఇంకా దీని కారణంగా అనారోగ్యం పాడిన పడుతున్నటువంటి కుటుంబాలకు అంతే లేదు. లివర్ కిడ్నీస్ డ్యామేజ్, నాడీ వ్యవస్థ దెబ్బ తినడం, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాల బారిన పడుతూ తమ ప్రాణాలను కోల్పోవడం కాకుండా కుటుంబ సభ్యులను కూడా అనాధలు చేస్తున్నటువంటి దయనీయ చరిత్ర పాలకులకు సమాజానికి మేధావులకు తెలియదా ?ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకోవలసినటువంటి పాలకులు పెట్టుబడిదారుల లాభాల కోసం అనారోగ్యం అని తెలిసి కూడా ఈ ఉత్పత్తులకు ధూమపానము ఇతర అనారోగ్య ప్రజా వ్యతిరేక అలవాట్లకు కొమ్ముకాస్తుంటే ఇక ప్రజలను రక్షించేది ఎవరు? " ఒకవైపు ఆదాయం లేక విద్య వైద్యం ఉచితంగా నాణ్యమైన స్థాయిలో అందకపోవడంతో తమ సంపాదన యావత్తు ఖర్చు చేస్తూ బికారీలుగా యాచకులుగా మారిపోతుంటే ఏనాడు కూడా ఉచిత విద్య వైద్యానికి హామీ ఇవ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అంతకుమించి కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోని పరిస్థితిలో సమాజం మద్యపానం చేతిలో ఓడిపోవలసిందేనా? ఆ అలవాటును పడి బానిసలవుతున్నటువంటి వాళ్లను అవగాహన చేయించి ఆ వైపు కన్నెత్తి చూడకుండా చేయవలసినది పోయి ప్రభుత్వమే మద్యం షాపులకు అనుమతి ఇచ్చి పోషించడం ప్రోత్సహించడం అంటే ఇంతకంటే హీనమైనటువంటి పనిలేదు.

       పేరుకు దాదాపుగా అన్ని జిల్లా కేంద్రాలలో మద్యం త్రాగడానికి అలవాటు పడిన వాళ్లను మాన్పించే ఉద్దేశంతో చికిత్స పేరున డి అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి కానీ అక్కడ ఉండవలసినటువంటి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మానసిక నిపుణులు, నర్సులు సహచరులు, సహాయకులు సిబ్బంది లేకపోవడంతో ఈ కేంద్రాలు నామ మాత్రంగా పనిచేస్తున్నట్టు తెలుస్తున్నది. మరొకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26, 000 మద్యం దుకాణాలు, 12 000 బార్లతో నిత్యం రాష్ట్రమంతా మద్యం ఏరులై పారుతూ జనాన్ని రంజింప చేస్తుంటే ఇక బెల్టు షాపులకు పట్టణాలు పల్లెటూర్లలో అంతే లేకుండా పోయినప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు అలవాటుకు బానిసలు కాకుండా జనం ఉంటారా? "అలవాటు చేసేది ప్రభుత్వమే, డి అడిక్షన్ కేంద్రాల ద్వారా మాన్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు నటించేది కూడా ప్రభుత్వమే అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పద్ధతులు పాలకుల కను సన్నల్లో నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ దురవస్థ నుండి రాష్ట్ర ప్రజానీకాన్ని మాన్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి దేశ మొత్తాన్ని మాన్పించి ప్రజలందరినీ ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా తన సొంత రాష్ట్రంలో మాదిరిగా దేశమంతా నిషేధాన్ని విధించగలిగితే దీనిని కట్టుదిట్టంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక రాష్ట్రంలో ఉండి ఒక రాష్ట్రంలో లేనప్పుడు దొంగ చాటుగా అక్రమ రవాణాకు అవకాశం ఉంటుoధి దొంగ చాటుగా తాగడానికి కూడా వీలు కలుగుతుంది. బహిరంగంగా, దొంగ చాటుగా ఏ రకంగాను అందుబాటులో లేకుండా చేయగలిగే నిబద్ధత ఈ దేశాల్లో ఉన్నఎంత మంది పాలకులకు ఉందొ ముందుగా ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. ప్రజల మానసిక బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రభుత్వాలు ఆదాయం కోసం వీటిని నడిపితే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి ఉండదు. ఆ వైపుగా కేంద్రం రాష్ట్రాలు దృష్టి సారించాలి తమ ఆరోగ్యం గురించి కుటుంబాల యొక్క ఇబ్బందుల గూర్చి తాగుబోతులుగా చలామనవుతున్నటువంటి మద్యం ప్రియులు తాగుడు మానడానికి కృషి చేస్తే అంతకుమించిన ఆనందం ఈ దేశంలో మరొకటి ఉండదు. ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యంగా పిల్ల పాపల తో సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది కదా!

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333